కాజాల్లాంటి బాజాలు-86: పెళ్ళికానుక

4
1

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఏ[/dropcap]విటో ఈ వదినని ఏవనుకోవాలో అర్థం కావట్లేదు. ఇవాళ సరిగ్గా పదకొండు అయ్యేసరికల్లా మా ఇంటి కొచ్చేసింది. అప్పుడే పనులన్నీ ముగించుకుని సినిమా చూద్దామా..  లేక సీరియల్ చూద్దామా.. అదీకాక వాటన్నింటికన్నా నవ్వొచ్చే న్యూస్ చానల్స్ లోని చర్చాకార్యక్రమాలు చూద్దామా అని ఆలోచిస్తూ టీవీ రిమోట్ చేతిలోకి తీసుకున్న నాకు వదిన రాక చాలా ఆశ్చర్యం కలిగించింది.

“ఏంటి వదినా.. అంతర్జంటు పనేంటీ..” అన్నాను మంచి నీళ్లందిస్తూ.

“రేపు మనవాళ్ళింట్లో పెళ్ళుందికదా..ఆ కొత్తజంట కివ్వడానికి ఒక గిఫ్ట్ చేసేను. అది నీకు చూపిద్దావ నొచ్చేను..” అంది హాండ్ బేగ్ లోంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీస్తూ.

నేను కుతూహలంగా ఆ కవరందుకుని లోపలున్నవి బైటకి తీసి ఆశ్చర్యపోయేను. అవి 1,2,3 అంటూ నంబర్లేసి వాటి పక్కన ఏవో రాసున్న రెండుకాగితాలు. అవేంటన్నట్టు వదినవైపు చూసేను.

“ముందు చదువు..” అంది.

మొదటి కాగితం తీసేను.

  1. ‘నేను’ అని ఇప్పటిదాకా అనుకుంటున్న నీవు ఇక ముందునుంచీ ‘మేము’ అనుకోవాలి.
  2. నీకేం కావాలో తెల్సుకోడంతోబాటు అతనికేం కావాలో కూడా ఆలోచించగలగాలి.
  3. సంసారం మీ ఇద్దరిదీ.. పూర్తిగా మీ ఇద్దరిదీ మాత్రమే.. ఏ సమస్య వచ్చినా మంచైనా… చెడైనా… కష్టమైనా, సుఖమైనా మీ ఇద్దరూ మాత్రమే చర్చిచుకుని పరిష్కరించుకోవాలి.
  4. అహంకారాలకి పోకుండా సామరస్యంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి.
  5. ‘ఆఖరిమాట నాదే అవాలి’ అనుకుంటేనే చిన్న చిన్న తగాదాలు పెద్ద పెద్ద గొడవ లవుతాయి. అటువంటప్పుడు మౌనం వహించడం వల్ల సమస్య దానికదే తొలగిపోతుంది.
  6. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మానాన్నల సలహాలు పాటించకండి. మీ ఇంటిని మీరే చక్కబెట్టుకోండి.

వరసగా చదువుతున్న నాకు ఆ నాలుగూ చదివేసరికే విసుగులాంటిది వచ్చేసింది. ఇంక మిగిలినవి చదవకుండా

“శుభమా అంటూ వాళ్ళు పెళ్ళి చేసుకుంటూంటే ఈ సూక్తిముక్తావళేంటీ..” అన్నాను.

నా విసుగు చూసి వదిన కోపం తెచ్చుకోలేదు. నవ్వింది.

ఆ తర్వాత మా ఇద్దరిమధ్యా సంభాషణ ఇదిగో ఇలా సాగింది.

వదిన – ఇది సూక్తిముక్తావళికాదు. రేపు పెళ్ళి చేసుకోబోయే కొత్తజంట తెల్సుకోవాల్సిన విషయాలు..

నేను – వాళ్ళమ్మానాన్నలు ఎలాగూ చెప్తారు కదా ఇవన్నీ.. మనం కొత్తగా చెప్పడ మెందుకూ.

వదిన – అదే అసలు సమస్య.. ఇంట్లో ఏవైనా చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు ఎవరి అమ్మానాన్నా వాళ్ల పిల్లల్నే పై చేయిగా వుండమని ప్రోత్సహిస్తారు. దానివల్ల గొడవలు ఇంకా ఎక్కువైపోతాయ్. ఈమధ్య ఆడపిల్లల అమ్మలు వాళ్ళమ్మాయిల్ని బాగా వెనకేసుకొస్తున్నారని, అందుకని చాలామంది పెళ్ళై నాలుగైదేళ్ళు కాకుండానే విడాకులకోసం కోర్టు మెట్లెక్కుతున్నారని అంటున్నారు.

నేను – కావచ్చు.. ఈ సమాజం పెట్టిన కట్టుబాట్లకి లోబడి తన తరంలో మొగుడేవన్నా పడుండాల్సొచ్చిందనీ, తన కూతురికి అలాంటి గతి పట్టకూడదనీ ఆడపిల్లని కన్న అమ్మలు అనుకోడం తప్పంటావా..

వదిన – సరిగ్గా చెప్పేవ్. అదే జరుగుతోందిప్పుడు. ఆ రోజుల్లో ఆర్థిక స్వాతంత్ర్యం లేక చాలామంది ఇల్లాళ్ళు భర్త, అత్తామావల అధికారానికి లొంగి వుండేవాళ్ళు. ఒకవేళ వేణ్ణీళ్ళకి చన్నీళ్ళన్నట్టు ఏదో ఉద్యోగం చేసినాకూడా ఆ తెచ్చిన జీతమంతా ఒద్దికగా భర్త చేతిలో పెట్టి, బస్ ఛార్జీలకి మటుకు అందులోంచి తీసుకునే ఇల్లాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఇంట్లో నిర్ణయాలన్నీ భర్త తీసుకుంటుంటే తనకి నచ్చినా నచ్చకపోయినా నోరు మూసుకుని పడివుండేవాళ్ళు ఆ తరం ఇల్లాళ్ళు. అలాగ తమలాగే తమ కూతుళ్ళు కూడా స్వతంత్రం లేకుండా అత్తారింటివారి అడుగులకి మడుగులొత్తకూడదని ఆ అమ్మలు ఇప్పుడు అశిస్తున్నారు.

నేను – మరింకేం. అలా స్వతంత్రంగా ఉండమనడంలో నాకేమీ తప్పు కనిపించట్లేదే..

వదిన – అంతవరకూ అయితే పరవాలేదు. కానీ ఆ అమ్మల ఆలోచన ఎంతవరకూ వెళ్ళిందంటే ఆ స్వతంత్ర మన్నది కూతురికి మొగుడూ, కాపరం లేకపోయినా పరవాలే దన్నంతవరకూ వెళ్ళింది. అల్లుడితో సమానంగా కూతురు సంపాదన ఉండడంతో ఆ సంపాదన, అల్లుడిచ్చే భరణంతో కూతురు హాయిగా బతికేస్తుందనుకుంటున్నారు. అలాంటి మాటలు చెప్పే కూతుళ్లని రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్లకి ఒక విషయం అర్థం కావటం లేదు. బతకడానికి డబ్బొకటీ వుంటే చాలనుకుంటున్నారు.. పాపం..

నేను – డబ్బే కదా కావాలీ..

వదిన – డబ్బు కూడా కావాలి.. అంతేకానీ డబ్బొకటే కాదు.. డబ్బు గమ్యానికి చేర్చే మార్గమే కానీ డబ్బే గమ్యం కాదు. రేప్పొద్దున్న తనకి తోడంటూ ఎవరూ లేక ఆ కూతురు పడే బాధ ఇప్పటి ఈ తల్లికి అర్ధం కావట్లేదు.

నేను – అంటే.. తప్పంతా ఆడవాళ్లదే నంటావా.. మగాళ్లంతా మంచివాళ్ళేనంటావా..

వదిన(నవ్వుతూ) – ఊహు.. అనను. దుర్మార్గులైన మొగుడితో కాపరం చెయ్యమనీ ఎవ్వరూ చెప్పరు. అలాంటివాళ్ళు తప్పక విడిపోవలసిందే.. కానీ ఈ రోజుల్లో చాలామంది లాయర్లూ, కౌన్సిలర్లూ చెప్పేదేవిటంటే…ఇప్పటి పిల్లలు కాస్త సద్దుకుపోతే పోయేదానికి అహంకారాలకి పోయి విడిపోయేదాకా తెచ్చుకుంటున్నారని. అలా చెయ్యకూడదనే నేనిలా చేస్తున్నాను.

నేను – ఇవన్నీ ఏ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళినా చెప్తారు..

వదిన – నిజవే.. కానీ వాళ్ళు ఆ కౌన్సిలర్ దగ్గరికి ఎప్పుడెళ్తారూ.. ఏదో గొడవ జరిగేకే కదా.. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అన్నట్టు ఆ గొడవ జరగకుండా వుండాలనే పెళ్ళి టైములో ఇదివ్వడం.. ప్రజల దగ్గరకే పాలనలాగా పెళ్ళిపీటల దగ్గరికే పది సూత్రాలన్న మాట.

నేను – కానీ.. దీన్ని వాళ్ళేమైనా చదువుతారా.. ఈ కాగితాలు ఓ మూలకి విసిరి పడేస్తారు..

వదిన – అందుకే నీ దగ్గర కొచ్చేను..

నేను – నేనేం చేస్తానూ..

వదిన – ఇప్పటి పిల్లలు చాలామందికి తెలుగు చదవడం రాదు. అందుకని ఈ కాగితాల్లో వున్న తెలుగు వాక్యాలని నీ ఫ్రెండ్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ వుంది కదా.. ఆవిడ చేత ఇంగ్లీషులోకి పైన తెలుగువాక్యాలు కింద ఇంగ్లీషు వాక్యాలు వుండేటట్టు రాయించు. తెలుగులో ఉంటే చదవడానికి ఇబ్బంది పడతారు కానీ ఇంగ్లీష్ అయితే ఇట్టే చదివేస్తారు.

ఆ వాక్యాలకి పైన పెళ్ళికొడుకు, పెళ్ళికూతుర్ల ఫొటో పెట్టు. దాని చుట్టూ పువ్వులు, లతలు వున్న బోర్డర్ వేయించి, ప్రింట్ తీయించు. తర్వాత దాన్నిమంచి ఫ్రేమ్ కట్టించు. అప్పుడు దాన్ని అందంగా గిఫ్ట్ ప్యాక్ చెయ్యి. గిఫ్ట్ ప్యాక్‌లో ఏముందోననే కుతూహలంతోనైనా దానిని విప్పుతారు కదా. విప్పేక అందులో వాళ్ల ఫొటోలు కనపడితే అవతల పారెయ్యరు కదా.. ఓ పక్కన పెడతారు. ఆ మర్నాడో మరో మూడ్రోజులకో ఆ ఫొటో కోసమైనా దానిని చూస్తారు. అప్పుడు హడావిడులన్నీ అయిపోతాయి కనక కింద ఏమి రాసుందా అని చదువుతారు. ఒకసారి చదివేక దాని గురించి ఆలోచించకుండా ఉండరు కదా.. అందుకే ఈ గిఫ్ట్ వాళ్ళకి పెళ్ళిలో అందిద్దాం..

ఎంత ముందుచూపు! ఎంత గొప్ప పెళ్ళికానుక! ఆరాధనగా వదినని చూస్తూండిపోయేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here