Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-45: పెళ్ళిళ్ళలో సందళ్ళు..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap]ఘమాసం.. ఎక్కడ చూసినా పెళ్ళిసందళ్ళే.. బోల్డు పెళ్ళిళ్ళకి వెళ్ళొచ్చాను. అందులో కొన్ని కబుర్లు భలే తమాషాగా కనిపించేయి. అవేంటంటే….

ఒక పెళ్ళిలో ఒక నలభైయేళ్ళాయన మహా సందడిగా తిరిగేస్తున్నాడు. ఆయన తిరగడమే కాదు తనతోపాటు భార్యని కూడా తిప్పుతూ, అందరినీ పలకరిస్తూ, మర్చిపోయిన చుట్టరికాలు తిరగేస్తూ, కొత్తగా పరిచయాలు పెంచుకుంటూ హాల్లో ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నాడు. పాపం వాళ్ళావిడ అలా పరిచయం లేని వాళ్ళతో ఏం మాట్లాడాలో తెలీక, మొగుడి మాటని కాదనలేక తెగ మొహమాటపడిపోతోంది.

“ఏవే పిల్లా, నువ్వు పెద్దబ్బులుగాడి కూతురివి కదే..” అనడుగుతున్న ఆయనకి “కాదండీ.. మా నాన్నగారిపేరు యాజులుగారు” అంది మొహమాటంతో ఓ అమ్మాయి.

“ఓహ్.. యాజులు కూతురివా.. ఇదివరకు కాకినాట్లో హెడ్‌మాస్టర్‌గా ఉండేవాడు. ఇప్పుడెక్కడుంటున్నాడూ..”

“మా నాన్నగారు హెడ్‌మాస్టర్ కాదండీ.. బాంక్ ఆఫీసరు..”

“ఓహ్.. ఇప్పుడు బాంక్‌కి మారిపోయేడన్నమాట..”

ఇంక ఆ అమ్మాయి అక్కడినుంచి నెమ్మదిగా పక్కకి తప్పుకుంది.

ఇంకో విశేషం..

ఆ హాల్లో ఒక అందమైన అమ్మాయి చురుగ్గా తిరుగుతోంది. నా పక్కన కూర్చున్న నడివయసాయన అటుపక్కనున్న భార్యతో నెమ్మదిగా “ఆ పిల్ల బాగుంది.. చురుగ్గా కూడా ఉంది.. ఎవరమ్మాయో కనుక్కో.. మన గోత్రం కాపోతే మనవాడికోసం కబురెడదాం..” అన్నాడు.

వాళ్ళావిడ “నేనడగలేను బాబూ అలాగ..” అంటూ మొగుడి మాట వినపడనట్టు మొహం పక్కకి తిప్పేసుకుంది.

“ఎప్పుడు విన్నావు కనక నా మాట.. ఏదో మనవాడికి మంచిపిల్లని చూడాలని కానీ… సర్లే.. నువు తప్పించుకున్నా నాకు తప్పదుగా..” అంటూ ఆ అమ్మాయిని పిలిచేడు. ఈయన పిలవగానే మర్యాదగా వచ్చి నిలబడిందా అమ్మాయి.

“ఎవరమ్మాయివమ్మా నువ్వూ… మీ నాన్నగారి పేరేవిటీ!” ఒకేలాంటి ప్రశ్నని మెలితిప్పి మరీ అడిగేడాయన తన తెలివికి మురిసిపోతూ..

ఈయన్ని మించినదనుకుంటాను ఆ అమ్మాయి, తండ్రిపేరు ఎందుకడిగారో తెలిసిపోయిందన్నట్టుగా చిన్న నవ్వు నవ్వుతూ, “నాకు పెళ్ళి కుదిరిపోయిందండీ.” అని చెప్పేసి, ఇంకక్కణ్ణించి వెళ్ళిపోయింది.

నా పక్కన కూర్చున్న దంపతుల తెల్లబోయిన మొహాలు చూసి  ‘వామ్మో.. అసాధ్యురాలే’ అనుకున్నాను అన్నీ వింటున్న నేను.

మరో విశేషం..

ముందు రిసెప్షన్, తర్వాత పెళ్ళిముహూర్తం. అప్పటికి రెండుగంటలనుంచీ స్టేజి మీద సింహాసనాల్లాంటి కుర్చీల్లో కూర్చుని వచ్చినవారందరితో ఫొటోలు తీయించుకున్న పెళ్ళికొడుకూ, పెళ్ళికూతురూ అప్పుడే దిగి లోపలికెళ్ళేరు. వాళ్ళు స్టేజి దిగీ దిగగానే  ఒక యాభయేళ్ళ పెద్దమనిషి ఇంకో ఆడమనిషి చెయ్యి పట్టుకుని స్టేజెక్కేసేడు.  ఫొటోగ్రాఫర్‌ని చూస్తూ, “బాబూ, మా ఫొటోలు తియ్యీ..” అంటూ ఆ సింహాసనాల్లాంటి కుర్చీల్లో కూర్చున్నాడు. అదయ్యాక పక్కనున్న పూలబొకే పట్టుకుని భార్య చేతికందిస్తూ ఫోజిచ్చేడు. తర్వాత ఆవిడ భుజాలచుట్టూ చేతులు వేసి నించున్నాడు. ఆ తర్వాత అంతకుముందు కాబోయే భార్యాభర్తల్ని ఫొటోగ్రాఫర్ పెట్టమన్న ఫోజులన్నీ తనూ భార్యా పెడుతూ ఒకటి తర్వాత ఒకటిగా బోల్డు ఫొటోలు తీయించేసుకున్నాడు. పాపం పక్కన వాళ్ళావిడ తెగ ఇబ్బంది పడిపోతూ, ఎంత తప్పించుకుందావని చూసినా ఆ మహానుభావుడు గ్రహించడే.. ఆయన ధోరణే ఆయనది.

“ఇంక చాలు మావయ్యా, దిగూ..” అంటూ కిందనించి ఓ కుర్రాడు కేకేసేడు..

అప్పుడు ఇంక తప్పదురా బాబూ అని దిగుతూ, “హూ, ఈ కాలంలో కుర్రాళ్ళు అదృష్టవంతుల్రా.. ఎంచక్క పెళ్ళికి ముందే కాబోయే భార్యతో వీడియోలు కూడా తీయించేసుకుంటున్నారు. మా రోజుల్లో అయితే పెళ్ళయేక కూడా నలుగురిముందూ ఇద్దరూ మాట్లాడుకోవడమే తప్పు.. ఇంక ఫొటోలు కూడానా!” అంటున్న ఆయన మాటలకి వింటున్న వాళ్లందరం నాతో సహా గొల్లున నవ్వాం..

Exit mobile version