Site icon Sanchika

పెంపుడు కొడుకునే అయినా!

[భానుశ్రీ తిరుమల గారు రచించిన ‘పెంపుడు కొడుకునే అయినా!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]మ్మానాన్నల మీద కోపంతో ఇంటి నుండి అయితే బయటకు వచ్చేసాను. కానీ, ఇప్పుడు ఎక్కడికెల్లాలో అర్థం కావటం లేదు. రోడ్డు మీద అందరూ నన్నే విచిత్రంగా చూస్తున్నారు. మరీ తల్లి చాటు బిడ్డలా పెరిగానేమో, ట్రాఫిక్ లోకి ఒంటరిగా రావడం ఇదే ప్రధమం కదా, ఇటు వైపు నుండి రోడ్డు దాటి అటు వెళ్లాలంటే తల ప్రాణం తోకకొస్తున్నట్టుంది. అటూ ఇటూ ఝయ్, ఝయ్మంటూ పేద్ద రాకాసుల్లాంటి వాహనాలు. పొరపాటున దేని కిందైనా పడ్డానో.. పాపం! అమ్మా, నాన్న తట్టుకోలేరు!

హహహ.. అమ్మానాన్నల మీద కోపంతో వాళ్లని కాదనుకుని ఇలా బయటకు వచ్చి, ఇప్పుడు వాళ్లు నా గురించి బాధ పడతారానే ఆలోచన రావటం.. నా ఆలోచనకి నాకే నవ్వొచ్చింది.

వేకువ జామున ఎవ్వరూ లేవక ముందే ఆ ఇంటి నుండి బయట పడి రోడ్డున పడ్డాను. ఇప్పుడు నడి మధ్యాహ్నం అయ్యింది. ఉదయం నుండి పచ్చి మంచి నీళ్లు ముట్టుకోలేదు, అనే బదులు ఏమీ దొరకలేదు అనడం సబబేమో!

ఇంకా నడిచే ఓపిక లేక నీరసమొచ్చి ఓ పేద్ద ఇంటి కాంపౌండ్ గోడకి ఆనుకుని ఉన్న కాలి మార్గం పక్కన నడుము వాల్చాను. కడుపు నకనకలాడుతోంది.. పక్కనే గోడకి ఆనించి ఉన్న ఓ విరిగిన అద్దంలో మొహం చూసుకున్నాను. కళ్లు పీక్కుపోయి ఉన్నాయి. అప్పుడనిపించింది నాకు, దేనికీ పనికిరాని ఈ ఉక్రోషంతో ఇలా ఇంటి నుండి బయటకు రావడం తప్పని.

కానీ ఏం చేస్తాను.. ఇది ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదు. బహుశా ఓ ఆరేడు నెలల నుండి పడుతున్న సంఘర్షణకి పరకాష్ట నా ఈ ప్రయత్నం.

రోజు రోజుకి అమ్మానాన్నలు నా పట్ల చూపిస్తున్న నిరాదరణ నాలో బాధని పెంచుతునే ఉంది.

ఆ రోజు ఇంకా నాకు బాగా గుర్తు. ఆ రోజు నా తొలి అమ్మానాన్నల ఇంటికి చూడ ముచ్చటగా ఉన్న ఓ యువ జంట వచ్చారు. అతిథి మర్యాదలన్నీ అయిన తరువాత వాళ్లలో వాళ్లు ఏదో మాట్లాడుకుంటున్నారు. బహుశా మేము ఎక్కువ మంది సంతానం అవటం వలన , మాలోని ఒకరికి వారికిచ్చేయడానికి ప్రతిపాదన వచ్చినట్టుంది. వాళ్లకి ఇంకా పిల్లలు లేరు అనుకుంటా. మొత్తం మీద వాళ్లు నన్ను ఎంపిక చేసుకుని తీసుకున్నారు. నేనైతే భయం భయంగానే వాళ్లతో బయలుదేరాను.

కానీ నాకా కొత్త వాతావరణం బాగా నచ్చింది. నన్ను అమ్మానాన్న బాగానే చూసుకుంటున్నారు. నాకో మంచి పేరు కూడా పెట్టారు. భైరవా అని. నిజం చెప్పొద్దూ, ఆ పేరు నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు ఆ పేరు విలువ తెలియలేదు కానీ పెద్దవాడినవుతున్న కొద్దీ గొప్పగా కాల భైరవుడిలా ఫీలవుతూ ఉండేవాడిని. ఆ ఇంట్లో నేనొక్కడినే ముద్దు బిడ్డనన్నట్టు. అన్నీ టైమ్‌కి సమకూరేవి. నా కోసమని మంచి బట్టలు కొనేవారు. ఎప్పుడూ కిందికి దించేవారు కాదు, ఇద్దరిలో ఎవరో ఒకరు ఒడిలో కూర్చోబెట్టుకునే వారు. నాకు సమయానికి జరగాల్సిన సౌకర్యాలలో ఏ కొంచెం ఆలస్యం జరిగినా, దానికి కారణమైన వాళ్ల మీద నాన్న అరవడం జరిగేది. నా దర్జా చూసి వచ్చి పోయే బంధువులు కూడా కుళ్లుకునే వారేమో! వీడికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం అవసరమా అని అనుకునే వారేమో!

ఎవరైనా సరే నన్ను పేరు పెట్టే ముద్దుగా పిలవాలి.. మరొలా పిలిస్తే మా అమ్మానాన్నలకి చాలా కోపం వచ్చేది. అది చూసి నాకు చాలా ఆనందంగా,గర్వంగానూ ఉండేది.

అమ్మా‌నాన్నలకి పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు కలగలేదు. నన్ను పెంచుకున్నా వాళ్లకు తమకంటూ పిల్లలు కావాలనుకున్నారేమో.. చాలా ప్రయత్నాలు చేసారు. కానీ ప్రయోజనం లేకపోయింది. చివరి ప్రయత్నంగా ఓ సంతాన సాఫల్య కేంద్రం సహాయ, సలహాల వలన అమ్మానాన్నల ఆశ ఫలించింది. అయితే ఆ సాఫల్య విధానం అంత సునాయసమైనదేమీ కాదు. పాపం అమ్మ ఆ తొమ్మిది నెలలు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందుల పడింది. ఎక్కడికి కదలకుండా ఒకే చోట అలానే పడుకుని ఉండేది. ఓ రకంగా చెప్పాలంటే తనకది జీవన మరణ సమస్య.

ఆ పరిస్థితిలో అమ్మ, వాళ్ల కన్నవారింటిలో ఉండేది. నేనూ తనతోనే వెళ్లాను. తనతోనే,తన పక్కనే ఉండేవాన్ని. ఆ పరిస్థితులలో కూడా వాళ్లు నాకు ఏ లోటు రానివ్వలేదు. అన్నీ సమయానికి సమకూరేవి.

పాపం! మూలిగే నక్క మీద తాటి పండు పడిన చందాన, నాన్నకి హార్ట్‌లో ఏదో పెద్ద సమస్య ఉందని బైపాస్ సర్జరీ అవసరముందని డాక్టర్లు చెప్పారు. పాపం.. దెబ్బ మీద దెబ్బ. ఏం చేయలేని నిస్సహయత. పరిస్థితులకు ఎదురీదాల్సిందే. కానీ ఆ చిన్న వయసులో వాళ్లకి వచ్చిన సమస్యలు అగ్ని పరీక్షల సమూహమే! ఆర్థికంగా, మానసికంగా తీవ్ర క్షోభను కలిగించాయి ఆ పరిస్థితులు.

మొత్తం మీద ఆ సంక్షోభం నుండి వాళ్లిద్దరూ బయటపడ్డారు. అమ్మకు మరో జన్మనే చెప్పాలి. అమ్మ పండంటి కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ బాబులే. చూడ ముచ్చటైన కవలలు. అదే సమయంలో నాన్నకి హార్ట్ బైపాస్ సర్జరీ కూడా దిగ్విజయంగా పూర్తయింది. వాళ్ల సుదీర్ఘమైన సంఘర్షణలకి సంతోషకరమైన ముగింపులు. వారి కధ సుఖాంతమైంది.

రత్నాలాంటి తన బిడ్డలను చూసి అమ్మ తెగ మురిసిపోయేది. రానురాను ఆ ఇంటిలో నా ప్రాధాన్యత తగ్గుతున్నటనిపించింది. నా గురించి పట్టించుకోవటం తగ్గిందనిపించింది. ఏవీ నాకు సమయానికి సమకూరడం లేదు. బహుశా అమ్మకి వాళ్లిద్దరితోనే సరిపోతునట్టుంది. ఇంకా నన్నేమి పట్టించుకుంటుంది!

నా పక్క కూడా ఆ ఇద్దరి బాబులకి దూరంగా మార్చడం జరిగింది. నన్ను దగ్గరకు తీసుకోవటం తగ్గింది.

మనసులో నాకొక అపోహో లేక గర్వమో ఉండేది, అది ఏమిటంటే ఆ ఇంటికి నేనొచ్చిన తరువాతే వాళ్లకి మంచి జరిగిందని, రత్నాల్లాంటి పిల్లలు కలిగారనేది. కానీ వాళ్లకి ఆ స్పృహ ఉన్నట్టేలేదు. ఇదీ, అదీ ఒక్కటేమిటి అన్ని నాకు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. నాలో అసంతృప్తి రోజు రోజుకు పెరుగిపోతూనే ఉంది. అది కాస్తా మా తమ్ముళ్ల మొదటి పుట్టిన రోజు నాటికి పరాకాష్ఠకి చేరింది. పిల్లలకది మొదటి పుట్టిన రోజు అవటం వలన చాలా ఘనంగా జరపాలనుకున్నారు వాళ్లు. ఓ మాంచి పార్టీ హాల్ బుక్ చేసి, వాళ్ల బంధువులని, స్నేహితులని అందరినీ పిలిచారు. నిజం చెప్పొద్దూ, నేనూ లోలోన చాలా ఆనంద పడ్డాను. నా తమ్ముళ్ల పుట్టినరోజు సంబరాలలో నేనూ పాల్గొనొచ్చని. నాకూ కొత్త బట్టలు కొంటారని. కానీ నా ఆశ అడియసే అయ్యింది. నా కోసమని కొత్త బట్టలూ కొనలేదు, నన్ను ఆ ఫంక్షన్‌కీ తీసుకుపోలేదు. ఎందుకో తెలియదు? చాలా బాధపడ్డాను.

నాకు చాలా కోపం కూడా వచ్చింది. ఆ రాత్రి భోజనం సహించలేదు. అందరికి దూరంగా పోయి పడుకున్నాను. వాళ్లెప్పుడో అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చారు. ఫంక్షన్ ఎంత బాగా జరిగిందో చర్చించుకుంటున్నారు. కనీసం నేను తిన్నానో లేదో కూడా పట్టించుకోలేదు. పార్టీనుండి ఓ కేకు ముక్కైనా తెస్తారని ఆశించాను. ప్చ్. తేలేదు. నిద్రపోదామని చాలా ప్రయత్నించాను. నిద్ర వస్తేగా! అప్పుడే నా పుర్రెలోకి ఓ బుద్ధి పుట్టింది. ఎలాగైనా సరే ఈ ఇంటి నుండి బయటకు వెళ్లిపోవాలని. ఇప్పుడే వెళ్లిపోతే ఎలా ఉంటుంది అనుకుని బయటకు చూస్తే బయటంతా కారు చీకటి. బయట పెద్ద పెద్ద కుక్కల అరుపులు.. అదంతా చూసి భయపడి ఆ రాత్రికి నా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాను. ఏది ఏమైనా, ఎలాగైనా సరే వేకువ జామున చెక్కేద్దామని నిర్ణయించుకుని నిద్ర లోకి జారుకున్నాను. ఆ నిర్ణయపు పర్యవసనమే ఇప్పటి నా ఈ ఫుట్‌పాత్ బతుకు.

అప్పుడే అటువైపు కుక్కలను లాక్కుని పోయే ఓ వాన్ రయ్యిన వచ్చింది. ఎందుకో నాకు చిన్నప్పటి నుండి ఆ బండంటే భయం. అందుకే పక్కకి పోయి దాక్కున్నాను.

అప్పుడు చూసాను ఓ ఇంటి ముందు ఓ కుక్కపిల్లని కట్టి ఉంచారు. ఇంటికి దూరంగా. పాపం అది గింజుకుంటోంది, బహుశా అది బయట తిరగాలనుకుంటునట్టుంది. పాపం! దానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. కటిక నేల మీద పడుకుంది. ఆ సన్నివేశం చూస్తూ ఉంటే నాకు కొంచెం కొంచెం జ్ఞానోదయమవుతున్నటనిపిస్తుంది. నేనేమిటో, నేనెలా ఉండాలో అవగతమయ్యింది.

అప్పటికి బాగా చీకటి పడింది. ఇంత వరకు ఏమీ తినలేదు. అయినా, ఇచ్చే వాళ్లు ఎవరున్నారు. బంగారంలాంటి అమ్మానాన్నలను వదిలి, తల బిరుసుతో నేను చేసిన ఈ నిర్వాకానికి సరైన శిక్షే నాకు పడింది. ఆకలి తీవ్ర స్థాయికి చేరుకుంది. కళ్లకు చీకట్లు కమ్ముతున్నాయి. స్పృహ కోల్పోతున్నాను. పాపం! అమ్మా, నాన్న! వాళ్ల మొహాలు దీనంగా నా కళ్లలో తారాడుతున్నాయి. నేను తప్పు చేసాను. నా స్థాయిని మరిచి వాళ్ల ప్రేమను పొందాలనుకున్నాను. ఇప్పుడు పశ్చాత్తాపపడి ఏ లాభం, అంత అయిపోయింది. మళ్లీ జన్మంటూ ఉంటే వాళ్ల కడుపునే పుట్టాలి అనుకుంటూ అలా శాశ్వత నిద్ర లోకి జారుకుంటున్నట్టున్నాను అనిపిస్తోంది.

కొంచెం, కొంచెంగా ఏదో చైతన్యం నన్ను తట్టిలేపుతున్నటిపించింది. భైరవా, భైరవా అంటూ ఏవో చిరపరిచితమైన పిలుపులు నా చెవులకి వినిపిస్తున్నాయి. భారంగా కళ్లు తెరిచి చూసాను. నాకు చిరపరిచితమైన వాతావరణమే.. కానీ గుర్తు పట్టడానికి కొంచెం సమయం తీసుకున్నాను. అవును! అది అమ్మానాన్నలు అప్పుడప్పుడు నన్ను తీసుకు వచ్చే ఆసుపత్రి. అది సరే! నేనేంటి ఇక్కడున్నాను? నన్నిక్కడికి ఎవరు తెచ్చారు అనుకుంటుండగా, ‘భైరవా’ అంటూ గద్గద స్వరంతో అమ్మ పిలుస్తూ నా తల మీద చేయి వేసి నిమురుతోంది. తన కళ్లలో నీటి పొరలను నేను గమనించాను. అమ్మ మొహం తేరిపారా చూడడానికి సాహసించ లేక సిగ్గుతో,పశ్చాతాపంతో నా కనుగుడ్లు కిందకి వాలిపోయాయి.

నాన్నని ఎవరో అడుగుతున్నారు! “మీ బైరవ ఎక్కడికెళ్లాడు, వాడ్ని మీరెలా కనిపెట్టారు” అని.

దానికి నాన్న, “ఓ అదా, వాడు మా ఫ్రెండ్ వాళ్లింటికి ఇలా చెప్పా పెట్టకుండా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాడు. ఈ రోజు కూడా అలానే వెళ్లాడేమో అనుకుని ఊరుకున్నాం, తీరా సాయంకాలానికి కూడా ఇంటికి రాలేదు. అప్పుడు, మా ఫ్రెండ్‌కి కాల్ చేస్తే అక్కడికి వాడు రాలేదని చెప్పాడు.

వాడి మెడలో జిపియస్ ట్రాకింగ్ డివైజ్‌ని నెక్ బెల్టుతో సహా పెట్టి ఉన్నాను. అప్పుడు నా దగ్గర ఉన్న జిపియస్ ట్రాకింగ్ యాప్‌లో చూసి వాడి లొకేషన్ తెలుసుకుని వెళ్లి చూస్తే చీకటిలో ఓ చెట్టు కింద స్పృహ తప్పి పడున్నాడు. పాపం ఉదయం నుండి ఏమీ తిన్నట్టు లేదు. కనీసం మంచినీరు కూడా.”

నాన్న చెబుతున్న ఆ మాటలన్నీ వింటున్న నేను పశ్చాత్తాపంతో కుచించుకు పోయాను. నాపైన ఉన్న అమ్మానాన్నల అక్కర, ప్రేమలను అర్థం చేసుకోలేనందుకు సిగ్గుతో తల దించుకున్నాను. తరాలుగా విశ్వాసానికి మారు పేరుగా కొనియాడబడుతున్న నా జాతికి తలవంపులు తెచ్చాను. ఇక నా కొనఊపిరి వరకూ ఆ(నా) కుటుంబానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదని, విశ్వాసపాత్రునిగా ఉండాలని గట్టి సంకల్పం చెప్పుకుని అమ్మ చేతుల్లో ఒదిగిపోయి ఇంటి దారి పట్టాను.

Exit mobile version