Site icon Sanchika

పెండ్లి కానుక

[box type=’note’ fontsize=’16’] భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మాయనిమచ్చ అత్యయిక పరిస్థితి. ప్రజాస్వామ్యం గొంతు నొక్కి దేశానికి 18నెలలపాటు నిరంకుశపాలన బలవంతాన రుచి చూపిన ఒక దుర్ఘట్టం అది. ఆనాటి ఎమర్జెన్సీ ఇద్దరు అమాయకుల జీవితాలతో ఆడిన ఒక విషాదకరమయిన ఆటను ప్రదర్శిస్తుంది, తెలుగులో ఎమర్జెన్సీ నేపథ్యంగా వచ్చిన అరుదయిన కథ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రకాశరావు రచించిన “పెండ్లి కానుక“.[/box]

[dropcap]నా[/dropcap]కు ఇంకా బాగా గుర్తుంది.

మా వూళ్ళో అదే… కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో వెంకటేశు బొగ్గుబావిలో బదిలీ వర్కరుగా పని చేస్తున్నాడు. రోజువారి జీతం. అంటే తాను ఎన్ని టబ్బుల బొగ్గు నింపితే టబ్బుకి ఇంత అని లెక్క కట్టి నెల ఆఖరున ఎంత మొత్తం సంపాదించాడో చెప్పే జీతం చీటి రైటర్ ఇస్తాడు. పిదప ఆ నెల 7వ తారీకు నాడు తప్పితే 8వ తారీకు నాడు రైటర్ తన కిటికి కాడ పనోళ్ళు లైన్ కడితే ఒక్కోడికి బట్వాడా చేసి తన పుస్తకంలో వేలిముద్ర వేయించుకునేవాడు. లెక్క తప్పి తేడా పాడా వస్తే వెల్ఫేరు ఆఫీసరు కాడ చూపిస్తే మళ్ళీ సమంగా డబ్బులు ఇప్పించేవారు. జీతంలో ఖర్చులు అన్నీ పోయి వందా, రెండొందలు మిగిల్తే అమ్మకి ఇచ్చేవాడు.

తల్లి ‘నూకాలు’ భజన మందిరంలో పూజారిగార్ని పిల్లాడికి పెళ్ళి చేయడానికి మంచి రోజులు చూడమని కోరడంతో జ్యేష్ఠ మాసంలో పెళ్ళిళ్ళకు ఓ చక్కని, మంచి ముహూర్తం వుందని చెప్పి కాయితం మీద గుర్తుగా రాసి ఇచ్చాడు. ఇంకేముంది, నూకాలమ్మకు తన కొడుకు పెళ్ళి సంబరంలో ఇల్లందు పోయి తమ్ముడు కూతురు రమణమ్మని అప్పటికే అనుకున్న ఇంట్లో సంబంధం కనుక పెళ్ళికి తొందరపెట్టి ఆ ముహూర్తం కాయితం కొసలకు పసుపు రాసి ఇచ్చింది.

అక్క మాటలకు ఎదురుచెప్పక ఓ రెండు అరటిపళ్ళు తాంబూలంగా తమలపాకులతో ఓ జత గుడ్డలు అబ్బాయికి పెట్టి ముహూర్తం ఖాయం చేసుకున్నారు. కతికితే అతకదంటారని ఏమీ ఎంగిలి పడకుండా ‘నూకాలు’  కొత్తగూడెం చేరింది. ఇంట్లో మగదిక్కు లేని సంసారం. నూకాలు ఒంటరి ఆడది. పెళ్ళి తంతు నిర్వహణ అంతా తన ఒక్క చేతి మీద కావాలంటే కష్టం. అందుచేత కాకినాడ దగ్గర ‘అన్నవరం’కి కాబోయే దంపతుల్ని పంపించి ఆ మూడుముళ్ళూ వేయిస్తే ఇటు ఖర్చు తగ్గుతుంది, తమ్ముడికి పెళ్ళిలో సాయం చేసినట్టు వుంటుందని నూకాలు ఈ విషయాన్ని తమ్ముడిని పిలిపించి చెప్పింది. అక్క మాట తమ్ముడికి వేదవాక్కు. సరేనని పిల్లని, పిల్లాణ్ణి ఇంట్లో పెళ్ళికూతురు/పెండ్లికొడుకుని చేసి ముహూర్తం రోజుకి అన్నవరం చేరేలా డోర్నకల్‌లో విశాఖపట్నం రైలు ఎక్కించారు. పెళ్ళివారు ఎవ్వరూ వెళ్ళలేదు.

అది 1975 జూన్ 26వ తారీకు. ఉదయం 7 గంటల వార్తలను రైల్లో ఎవరో ట్రాన్సిస్టర్‌లో వింటున్నారు. అందరూ చాలా హడావిడిగా, గందరగోళంగా గుమిగూడి వార్తలు వింటున్నారు. ‘భారత రాష్ట్రపతి శ్రీ ఫక్రూద్దీన్ ఆలీ అహ్మద్ గారు దేశంలో ఆంతరంగిక భద్రత దృష్ట్యా ఎమర్జెన్సీ విధించార’ని తెలుపుతూ ప్రజలు ఆచరించవలసిన విధివిధానాలను పూర్తి వివరాలను రేడియోలో చెప్తున్నారు.

న్యూస్ పేపర్‌లో ఈ వార్తలైనా ప్రభుత్వాధికారుల అంగీకారంతోనే ప్రచురించాలి. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు సంక్రమించే హక్కులను తాత్కాలికంగా రద్దు చేయబడినవనీ, ప్రభుత్వంపై తిరుగుబాటుకి అణచివేత, ఎదిరించినవారినెల్ల ఖైదీలుగా చేయబడగలరని, చివరకు న్యాయాధికారులు సయితం ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని శాసనం చేయడం వల్ల దేశంలో అశాంతి. అలజడి. జైళ్ళు ప్రజలతో నిండిపోయాయని, అతిరథ మహారథ సారథులు సైతం చట్టానికి చుట్టాలు లేరని శిక్షింపబడ్డారని ఏవేవో వార్తలు ఒకదానివెంట మరోటి ఏకధాటిగా పెద్ద సౌండుతో వినబడసాగింది. ఆ రైల్లో ఓ మూల సీట్లో కూర్చున్న వెంకటేశు, రమణమ్మా అంతా వింటూ ఏమీ తెలియకపోవడం వల్ల పక్కన కూర్చున్న సూటూబూటూ వేసుకుని విశాఖపట్నం వెళ్తున్న రాధాక్రిష్ణ గారిని అడిగారు, ఇది అంతా ఏమిటని. “పనివాళ్ళు స్ట్రయిక్‌లు చేయకూడదు. అనుమతి లేనిదే సెలవలు పెట్టరాదు. రైళ్ళలో ఎవరికి కేటాయించిన సీట్లలో వారే కూర్చోవాలి. టికెట్లు లేకుండా ప్రయాణం నేరం” అని ఏవేవే తనకు తెలిసిన రూల్స్ అన్నీ వర్ణిస్తున్నాడు.

వెంటనే వెంకటేశుకు గుర్తొచ్చింది… తాను కూర్చున్నది ఆడవాళ్ళ రైలు పెట్టె అని. తనతో పాటు ఇంకా మగాళ్ళు ఆ పెట్టెలో ప్రయాణిస్తున్నారు. వాళ్ళంతా రైల్వే పోలీసు వస్తాడేమోనని భయం భయంగా రైలు దిగి పక్కపెట్టెలో ఎక్కవచ్చని రెడీగా గేటు దగ్గర నిలబడ్డారు. ఇంకేముంది? అనుకున్నదంతా అయ్యింది. రైలు సామర్లకోట జంక్షన్‌లో ఆగగానే ఆడవాళ్ళ పెట్టెలోంచి జనం దిగి పరుగులు పెట్టడం ఇద్దరు తుపాకులతో వున్న పోలీసులు గమనించి పరుగు పరుగున ఆ పెట్టెలో చెకింగ్‌కి ఎక్కారు. దొంగలు దొరకక పోగా ఈ పెండ్లి కొడుకు వెంకటేశు ఏం చెయ్యాలో తోచక పోలీసుల ముందు నిలబడ్డాడు. ‘ఇది ఆడవాళ్ళ పెట్టె. మగాళ్ళు ఎక్కకూడదు. నిన్ను శిక్షించాల్సి వస్తుంది’ అని గదమాయించి బలవంతంగా కదులుతున్న రైలు లోంచి వెంకటేశుని దించేశారు. పాపం రమణమ్మకు ఏం చెయ్యాలో తోచక ఆ సీట్లో అలాగే కుప్పకూలిపోయింది. అప్పుడు ‘ఇదే కాబోసు ఎమర్జెన్సీ అంటే’ అనుకుని విస్తుబోయింది.

క్రిందకు దిగిన పోలీసులు తిన్నగా రైల్వే హాస్పిటల్‌కి వెంకటేశుని తీసుకెళ్ళి డాక్టర్ గారికి జనరల్ చెకప్ చేయడానికి అప్పజెప్పగా; ఏదో చెకప్ చేయాలని వెంకటేశుని స్ట్రెచర్‌పై ఐ.సి.యు.కి తీసుకెళ్ళారు.  రైల్వే డాక్టర్లకి నెలకి 50 కు.ని. ఆపరేషన్లు నిర్వహించాలని, లేకుంటే ఇంక్రిమెంటు ఆపేయడంతో బాటు అనేక ఇబ్బందుకు గురి చేస్తారని రూలు రావడం వల్ల డాక్టరులో మానవత్వం నశించి వివాహం అయినా కాకపోయినా, పిల్లలున్నా లేకపోయినా వారి జీవనభృతి కోసం ఈ అక్రమ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి ఇదే శిక్షగా పంపించడం పరిపాటి. అదే విధంగా వెంకటేశుకి కూడా వాడు ఎంత వద్దని వారించినా వదలకుండా బలవంతంగా అమానుషుంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు.

ఇంకేముంది, తనతో బాటే చైను గుంజి రైలు దిగిన రమణమ్మ ఆపరేషన్ అద్దాల గదిలోంచి తన బావను చూసి ‘ఈ రైలు ఎక్కిన పాపానికి జీవితాంతం ఈ శిక్ష అనుభవించాల్సిందేనా’ అని వాపోతూ వాళ్ళ బావను చేరి దీనంగా హత్తుకుంది.

వెంకటేశు ఆపుకోలేని బాధతో, “రమణి! ఇంక మన పెళ్ళి ఆసుపత్రిలోనే చేశారు. ఇలా అన్నవరం కొండకు వెల్దామా లేక వెనక్కే వెళ్దామా” అన్నాడు. “ప్రభుత్వం మనకి అన్యాయం చేసినా, బావా నేను మాత్రం నీకు అన్యాయం చెయ్యలేను” అంటూ బావ కాళ్ళమీద పడి రమణమ్మ రోదించింది. వెంటనే ఎక్కడ లేని శక్తిని కూడగట్టుకుని డాక్టరు దగ్గరికి వెళ్ళి జరిగిన అన్యాయాన్ని మొరబెట్టుకున్నాడు. ఆ డాక్టరు కూడా ఏమీ చెయ్యలేక ఓ వంద రూపాయలు, ఓ స్టీలుబింది తన పెళ్ళి కానుకగా రమణమ్మకి ఇచ్చాడు.

ఓటేసి గెలిపించినందుకు ప్రభుత్వమిచ్చే సంక్షేమ పథకం ఇదేననుకుని తిరిగి బస్సెక్కి అన్నవరం చేరుకుని ఆ దేవుడి సమక్షంలో పురోహితుల మంత్రోచ్చారణలతో వెంకటేశు, రమణమ్మ ఒక్కటై భార్యాభర్తలయ్యారు.

తిరిగి ఇంటికి వచ్చాక వెంకటేశుకి డాక్టర్ ఇచ్చిన ఆపరేషన్ సర్టిఫికెట్‌ని వెల్ఫేర్ ఆఫీసరుకి చూపిస్తే ఓ ఇంక్రిమెంటు, పది రోజుల సెలవు ప్రకటించాడు.

తనకు జరిగిన అన్యాయానికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు వెంకటేశుకి. అప్పటి నుంచి ఓటు వెయ్యాలంటేనే భయపడేవాడు. పెళ్ళికి తాను కొన్న రేడియోలోంచి సన్నగా ఓ పాట వినిపిస్తోంది. అది కవి తన కోసమే రాశాడని శ్రద్ధగా వినసాగాడు.

ఎవరో జ్వాలను రగిలించారు! వేరెవరో దానికి బలి అయినారు! వేరెవరో దానికి బలి అయినారు!!

ఇలా వెంకటేశు, రమణమ్మలు ఈనాటికీ… అనగా 43 సంవత్సరాల క్రితం ఈ ఘటన జరిగినా… మరచిపోలేని ఓ విషాదపు గాథగా వారి మనస్సులో మిగిలిపోయింది.

Exit mobile version