పెంటయ్య బాబాయి

0
2

[dropcap]ప[/dropcap]న్నెండు గంటల ప్రాంతంలో ఫోన్ మోగడంతో “యింత రాత్రి ఎవరబ్బా…” అనుకుంటూ ఫోన్ ఎత్తిన నాకు అవతలి నుంచి వచ్చింది ఎస్.టి.డి కాల్ ఆదిలాబాద్ నుండి అని తెలియగానే అంతవరకున్న నిద్ర మత్తు వదిలిపోయింది. అవతలి నుంచి మాట్లాడుతుంది పరశురాముడు. పరశురాముడు పెంటయ్య బాబాయి నమ్మకమైన నౌకరు.

“అయ్యగారికి ఆరోగ్యం బాగాలేదు. పెద్దాసుపత్రిలో చేర్చిండ్రు. మీరు బేగి.. రావాల. అయ్యగారు మీ మీదే మనాద పెట్టుకున్నారు. మీరు బేగి బైలెల్లి రావాల బాబు” అంటుంటే పరశురాముడు గొంతు బాధ, దు:ఖంలో కూడుకుపోవడం, వాటిని ఆపుకోలేక బోరుమని ఏడ్చేయడం ఫోన్లో స్పష్టంగా వినిపిస్తూంది.

ఏడుపు మధ్య ఫోన్ కాల్ కట్ అయింది.

పెంటయ్య బాబాయికి ఎలా ఉందో… అసలు ఏమయి ఉంటుంది. వారం రోజుల క్రితమే అన్ని యోగ క్షేమాలు తెలుపుతూ ఉత్తరం వ్రాసాడు. ఇంతలోనే ఏమయి ఉంటుంది.

పరశురాముడి ఏడుపు, అదీ చూస్తుంటే మనసు ఏదో కీడు శంకించి, గుండె వేగంగా కొట్టుకొన్నట్లనిపించింది. వెంటనే బయలుదేరిపోవాలి. ప్రయాణానికి ఎంతలేదన్న హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్లాలంటే ఆరు గంటలు పడుతుంది. వెంటనే బయలుదేరితే ఉదయం ఆరు గంటలకు అక్కడ ఉండొచ్చు. నిద్రపోతున్న శ్రీదేవిని లేపి విషయం చెప్పాలి.

“అంత నింపాదిగా చెప్తారేమిటండీ… ఫోన్లో మాట్లాడేటపుడే నన్ను లేపాల్సింది. బాబాయికి ఏమయిందో ఏమో! ఇప్పుడెలాగున్నారో… తొందరగా బయలుదేరండి. మీరు వెంటనే కారు తీయండి. యిలోగా నేను అన్ని సర్దిపెడతాను” అంటూ ప్రయాణ ఏర్పాట్లు చూడసాగింది.

కారు అర గంటలో ఏడవ నంబరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకపోతున్నది. ఇద్దరి పిల్లల్ని స్నేహితుడి ఇంట్లో అప్పజెప్పి, భార్యాభర్తలం ఇద్దరం బయలుదేరాం.

కారు నడుపుతున్నాడన్న మాటేగాని నా మనసు పరి పరి విధాల ఆలోచిస్తున్నది. పది పన్నెండేళ్ల కింది గతం నిన్న మొన్న జరిగినట్టు గుర్తొస్తుంది.

శ్రీదేవికి కారు డ్రైవ్ చేస్తుంటే వరసగా మాట్లాడడం ఇష్టం ఉండదు. అందుకే సీట్లో కాస్త జారగిలబడి కళ్లు మూసుకుంది. కారు మెత్తగా, మౌనంగా తారురోడ్డుపై పాదరసంలా, వేగంగా గమ్యంవైపు జారిపోతుంది.

కారు డ్రైవింగ్ యాంత్రికంగా సాగిపోతుంది. పెంటయ్య బాబాయ్ పరిచయం, తన స్థితి, బాబాయ్ అండ, అతడి సిద్ధాంతాలు, అన్నీ ఒక్కటొక్కటే గుర్తుకురాసాగాయి.

***

అవి తను ఇంటర్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రోజులు.

పెంటయ్య బాబాయి పిల్లలు రవీంద్ర, తిలక్, భవిష్య ముగ్గురు నాతోనే కాలేజిలో చదువుతున్నారు. తిలక్ నా క్లాస్‌మేట్, రవీంద్ర ఇంటర్ తప్పి ప్రైవేట్‌‍గా పరీక్షలు వ్రాస్తున్నాడు. .

పెంటయ్య బాబాయి వృత్తిరీత్యా డాక్టర్. ఎం.డి. డాక్టర్‌గా ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులున్నవాడు. ఊర్లో అందరి డాక్టర్లకన్నా తక్కువ ఫీజులో వైద్యం చేస్తాడని, హస్తవాసి మంచిదని, తక్కువ ఖర్చులో రోగం నయం చేస్తాడని అతడికి చాలా పేరుంది. డాక్టర్ డబ్బు మనిషి కాదని, ఇస్తేనే తీసుకుంటాడని, డబ్బు విషయంలో ఎలాంటి కక్కుర్తి పనులు వృత్తిలో చేయడని అతడికి మంచి పేరుంది. శత్రువు సైతం తప్పుపట్టలేని మనిషి డాక్టర్ బాబాయి.

ఇంటర్ ఫైనలియర్ చదివే రోజుల్లో- తిలక్ ఇంట్లోనే రాత్రుళ్లు చదివేవాడు తను. తిలక్‌కు చదువుపట్ల ఆసక్తి లేదు. ఎప్పుడు, సినిమాలు, షికార్లు… విలాసాలు, పార్టీలు, పోకిరి పనులు, ఇదే అతడి కాలక్షేపం. తాను వాళ్లింట్లో డాబాపై గదిలో దినం రాత్రి చదువుతుంటే తిలక్ హేళన చేసేవాడు.

“ఒరేయ్! పంతులు, బాగా చదువు లేకపోతే నీకు పై చదువులకు సీటు దొరకడం మహా కష్టం. నీకేం కావాలన్నా మా చెల్లాయి భవిష్యనడుగు. దాని దగ్గర బోలేడన్ని రిఫరెన్స్ బుక్స్ ఉన్నాయి. అదీ నీలాగే పుస్తకాల పురుగనుకో. నీ వెనక నా నంబర్ కాబట్టి నీవు బాగా చదువు, లేకపోతే నాకు కష్టమవుతుంది” అంటూ జాగ్రత్తలు చెప్పిపోయేవాడు.

పరీక్ష రోజున కూడా రెండవ ఆట సినిమా చూడగలిగిన ధీశాలి తిలక్. తిలక్ లోని నిర్లక్ష్యం, అహంకారం… బాధ్యతారహితం, యివన్నీ పెంటయ్య బాబాయి డబ్బు, హెూదా, పలుకుబడి అన్నింటకిమించి, జన్మరీత్యా సంక్రమించిన హక్కు అతడి నిర్లక్ష్యానికి మూల కారణం.

జన్మరీత్యా అగ్ర కులంలో పుట్టిన నాకు, అనుక్షణం పోటీపడితేగాని, ఈ పోటీ ప్రపంచంలో నిలబడలేనని తెలుసు నాకు. ఏనాటికైనా ప్రజలకుపయోగపడే సేవ చేసే భాగ్యం సంపాదించాలని అందుకు కలెక్టరో, డాక్టరో, సైంటిస్టో కావాలని నా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే చదివేవాడిని. కాని తిలక్ లాంటి వాళ్లు నన్ను దాటేస్తారేమోనన్న భయంతో యింకా బాగా, యింకా బాగా చదవటానికి ప్రయత్నించేవాడిని.

మా పరీక్షలయిపోయాయి. ఫలితాలొచ్చాయి. తిలక్ అత్తెసరు మార్కులతో నా నా పైరవీలు, డబ్బులు గుప్పించి పాసయినాననిపించాడు. నాకు మంచి మార్కులే వచ్చాయి.

పై చదువులకు ఇద్దరం అప్లయి చేసాం. తిలక్ తన ఫాంలో ఎస్.సి అని రాసాడు. నేను ఎఫ్.సి అని రాసాను. ఎంట్రన్స్ పరీక్షకు నేను దినం-రాత్రి ఒకటి చేసి చదువుతున్నాను. తిలక్‌లో మార్పులేదు. అదే పాత పద్ధతి.

తిలక్ పరీక్షకు తయారుకాకుండా జులాయిగా తిరుగుతుంటే ఒక రోజు బాబాయి తిలక్‌ను తీవ్రంగా మందలించారు నా ముందే. అప్పటికి పరీక్షలకు యింకా రెండు నెలల సమయముంది.

“చూడు తిలక్. ఇది తిరిగే సమయం కాదు. ఈ నాలుగు రోజలు ప్రకాశంలా కష్టపడు. పరీక్షలో సీటోస్తేకాని నీకు భవిష్యత్తు లేదు. మనకేం భూములు, స్థిర చరాస్థులు లేవు. నేడు కష్టపడితే రేపు నీ భవిష్యత్తే ఉజ్వలంగా ఉంటుంది. నేడు నిర్లక్ష్యం చేసి రేపు మళ్లీ బాధపడి లాభం లేదు. పెద్దవాణ్ణి… నా మాట విను బాబు…” అని ఎదిగిన కొడుకని చూడకుండా ఎంతో ప్రేమగా లాలించి చెప్పేవాడు బాబాయి.

“నువ్వూరుకో డాడీ. ఎంట్రన్స్‌లో సీటు రావటానికి నాకొచ్చింది చాలు. రిజర్వేషన్‌లో నాకీ సీటు ఖాయం. అదీగాక సీటు ఎలా సంపాదించాలో నాకు బాగా తెలుసు. నీవు అనవసరంగా వర్రీ అవకు”. సీటు కోసం అక్రమ మార్గాలెన్నో ఉన్నాయి. తనకు ఆ దారిలోనే సీటు అదీ రిజర్వేషన్ కోటాలో వస్తుందనే ధీమా ధ్వనించింది.

“నీకిక్కడ చదవటం ఇష్టం లేకపోతే ఏదయినా మంచి కోచింగ్ సెంటర్లో చేరు. డబ్బుకేం కొదువ లేదు. నేడు మనపాటి స్థితి ఎంత మందికుంటుంది. హాస్టల్లో ఉండి సరిగా తిని, తినక, గాలి-వెలుతురు, సరియైన వసతులు లేక, ఆర్థికపరమైన, కుటుంబపరమైన ఎన్నో యిబ్బందులతో ఎందరో పిల్లలు చదువుకుంటున్నారు. నీకు అవేం లేవు. నీకు ఏ సౌకర్యం కావాలంటే అది ఏర్పరుస్తా, నీవు పోటీపడి కష్టపడి చదువు. రిజర్వేషన్లో కాకుండా మామూలు కోటాలో సీటు సంపాదించుకో”.

“ఊరుకో డాడీ నీదంతా చాదస్తం. ప్రకాశ్‌కు నాకు పోలికేంటి? ఎంత చదివినా, ఇంటర్‌లో డిస్టింక్ట్ ర్యాంక్ వచ్చినా… ఈ ఎంట్రన్స్‌లో ప్రకాశ్ నాతో పోటీ చేయలేడు. సీటు నాకే ఖాయం”.

“నో. కష్టపడి చదవకుంటే నీకు సీటు దొరకదు. ఇక ప్రకాశం సంగతి వదిలెయ్. అది అతడి అదృష్టం, కృషిపై ఆధారపడి ఉంది”.

“నాకు సీటు రాకపోవడేమిటి? ఆర్థికంగా కూడా వెనకబడి ఉన్నట్లు సంవత్సరాదాయ సర్టిఫికేట్ కూడా పెట్టాను”.

“తెలుసు, నీ సంవత్సరాదాయం నేను మార్చివేసాను. నీ ఎంట్రన్స్ ఫాంలో నేను సంతకం పెడుతున్నపుడు నీ పేరు, నా పేరు తర్వాత ఉండే కులం కాలమ్ లో ఎఫ్.సి అని మార్చి సంతకం చేసాను”.

“డాడీ నీకేమన్నా పిచ్చి పట్టిందా..!” అరిచినంత పనిచేసాడు. తిలక్ కేకకు వంటింట్లోంచి బాబాయి భార్య సుమతి, మిగతా పిల్లలు హాల్లోకి వచ్చారు.

“అవును. నీవు, నేను వెనకబడిన కులంలో పుట్టాం. అప్పుడు మనం ఆర్థికంగా, సాంస్కృతికంగా, సాంఘికంగా వెనుకబడి ఉన్నాం. మరి యిప్పుడో…” అని అంటుంటే డ్రైవరు వచ్చి “కారు రెడీ సార్” అనడంతో మెడికల్ కిట్ తీసుకొని ఇంకా చర్చించడం అనవసరం అన్నట్లు హాల్లోంచి కారువైపు నడిచాడు బాబాయి.

తెల్లవారేసరికి బాబాయివాళ్ల బావ భూషణంగారు నాగపూరు నుంచి దిగారు. ఉదయం డైనింగ్ టేబుల్ పై మళ్లీ నిన్నటి విషయమే ప్రస్తావనకు వచ్చింది.

“ఏంటి బావా! వాడి ఎంట్రన్స్ ఫాంలో ఎస్.సి చోట ఎఫ్.సి అని రాసావట. వాడికి రేపు ఏ డాక్టర్ గానో, ఇంజనీరుగానో సీటు రావాలా. వద్దా? అలా మార్చి రాస్తే వాడి భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా?”

“ఆలోచించానయ్యా! ఆలోచించే అలా చేసాను. నేనంటే ఏమిటో వాడికి తెలియకపోయినా నీకు తెలుసుగా, ఏలాంటి పరిస్థితిలోంచి నేను యీ స్థితికి వచ్చానో. ఆ రోజుల్లో కేవలం నన్ను మాత్రం చూసే సుమతిని నాకిచ్చావ్. అవునా!”

“అవుననుకో అయినా అవన్నీ ఎప్పుడెందుకు చెప్పు. నీతో వాడికి పోలికేంటి. నీ డబ్బు, పలుకుబడి, హెూదాకు మన రిజర్వేషన్ తోడయితే వాడి భవిష్యత్తు బంగారు బాటవుతుంది. తండ్రివై ఉండి నీవే వాడి తలరాత చెరిపేస్తావంటే ఎలా బావ. ఆనాడు నిన్ను, నీ తెలివిని చూసి నా చెల్లెల్ని కులం తక్కువైనా నీకిచ్చాను. ఇపుడు మళ్లీ నాబిడ్డను నీ కొడుక్కీయాలని అనుకుంటున్నాను. మన యిద్దరి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనైనా నీ నిర్ణయం మార్చుకో బావా”.

“మారదు. మన నిర్లక్ష్యానికి, బాధ్యతారాహిత్యానికి, అజ్ఞానానికి పనికివస్తుంది ఆ రిజర్వేషన్. ఆ మినహాయింపు యింకా ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా వెనకబడిన మనవాళ్ల కోసం. మన పవిత్ర రాజ్యాంగం కల్పించిన అద్భుతమైన అవకాశం ఏదీ నా పిల్లలకు అవసరం లేదు. వాళ్ల అవసరాలు అనుకున్నట్లు తీర్చే డబ్బు ఉంది. సంఘంలో నేడు వాళ్లకు మంచి గుర్తింపు ఉంది. ఈ ఇల్లు, ఈ తిండి, ఈ డైనింగ్ టేబుల్, ఈ పూజా గది, ఆ బెడ్ రూం, ఆ డ్రాయింగ్ రూం, ఈ వంటిల్లు ఇవేవి కూడా మనం వెనకపడిలేమని సూచించడం లేదా? ఈ నైట్ డ్రెస్, ఈ బెడ్ కాఫీ, ఈ ఆంగ్ల పత్రిక , ఈ స్టార్ టీవి, టెలిఫోన్, కూలర్, ఎ.సి. బెడ్ రూం ఏవి చెప్తాయి మనం వెనకబడ్డామని. ఇదంతా ట్రాష్. మోసం. అందుకే కొట్టేశా. ఇప్పటికీ మించిపోయింది లేదు. కష్టపడి చదవమను. యీ సంవత్సరం కాకపోతే మరో సంవత్సరం వస్తుంది సీటు”.

“మన నేతలకన్న, సంఘ సంస్కర్తలకన్న, నీవే మేధావివన్నమాట. అంతేనా బావా! ఎవరికీ రాని ఆలోచన, ఆచరణలో చూపే వరకు నీకే వచ్చింది. అయినా మన ప్రభుత్వం రాజ్యాంగం ఏర్పడ్చిన ఒక గొప్ప సదుపాయాన్ని, అవకాశాన్ని కాదనటానికి నీవెవరు?”

“వాడి కన్న తండ్రిని” అంటూ మెడికల్ కిట్లోంచి సిరెంజ్ తీసి రెండు మూడు ద్రవాలు ఇంజక్షన్ సిరెంట్లో లోడ్ చేసి “నీ సూది మందు వేసుకో భూషణం. చాలా నీరసంగా, ఆనారోగ్యంగా కనిపిస్తున్నావ్” అన్నాడు పెంటయ్య బాబాయి.

ఈ హఠాత్ సంఘటనకు హాల్లోని వారందరు ఇదేమిటని చూస్తున్నారు.

“నాకేమైంది బావా! నేను ఆరోగ్యంగా, కులాసాగా ఉన్నాను. నాకు ఇంజక్షన్ ఏమిటి?” అంటూ పెంటయ్య వైపు అనుమానంగా చూసాడు.

“పరవా లేదు బామ్మర్తి ఉండనీ ఇది బలానికే తీసుకో. ఇంకా హుషారుగా.. కులాసాగా ఉంటుంది కాదనకు”.

“ఆరోగ్యంగా, కులాసాగా, సరదాగా, కండబట్టి, నిగనిగలాడుతూ ఉంటే మందులు ఇంజక్షన్లు తీసుకోవద్దా!” అంటూ ప్రశ్నించాడు.

“ఇంకా నయం ఈ మందులు మ్రింగి, ఈ సూది మందేసుకొని, కర్ర పట్టుకొని నడువ్ పడిపోకుండా ఉంటావ్ అనలేదు. బావ భలే మూడ్లో ఉన్నాడే నేడు. పెళ్లయిన కొత్తలో కూడ ఇలా పరాచికాలాడలేదు. ఏంటి సంగతి బావా!”

“శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న మనిషికి మందులు, ఇంజక్షన్లు అవసరం లేనపుడు సమాజంలో అన్నిటా ఉన్నతంగా ఉన్న మనిషికి రిజర్వేషన్ ఎందుకు బామ్మర్ది. రిజర్వేషన్ ఒక చేతికర్రలాంటిది వికలాంగుడికి. మంచివాళ్లందరూ కర్రలు పట్టుకుంటే నిజమైన వికలాంగులకు కర్రలెక్కడి నుంచి వస్తాయి. ఉక్కడ ఉన్నవి కొన్ని కర్రలే… అర్థమైందా బామ్మర్ది” అంటూ సిరెంజ్‌లో లోడ్ చేసిన మందులను వాష్ బేసిన్లో చిమ్మాడు.

అందరూ అవాక్కయి చూస్తున్నారు. బాబాయి ప్రాక్టికల్ మనిషి. జోకులు కూడా ప్రాక్టికల్ గా వేస్తాడని విన్నా. ఇపుడు ప్రత్యక్షంగా చూశాను.

కాసేపటికి ప్రాక్టికల్ జోక్ లోంచి తేరుకున్నాక భూషణం “ఇప్పటికి మించిపోయింది లేదు బావా. నీవు ఒప్పుకుంటే… నీవు కొట్టేసి రాసింది చెల్లదని నేను ఎలాగో తంటాలు పడి, పొరపాటున ఎస్.సికి బదులు ఎఫ్.సి రాసాడని నేను ఎలాగో మేనేజ్ చేస్తా”.

“నీ పిచ్చికాకపోతే… ఏమిటి నీ ఆదర్శం డాడీ. పిచ్చి పట్టినవాడు కూడా కన్న కొడుకుకింత అన్యాయం చేయడు. నిజంగా నీకు పిచ్చి పట్టింది. అదే సంగతి ప్రవేశ పరీక్ష విభాగానికి రాస్తా. మా నాన్నకు పిచ్చి ఆ సంతకం చెల్లదని”.

తర్వాత ఎవరెంత నచ్చజెప్పినా బాబాయి వినలేదు.

ఒక వ్యక్తి రాజ్యాంగబద్దంగా కల్పించబడిన అవకాశాన్ని వినియోగించుకొని ఆర్ధికంగా బాగుపడ్డప్పుడు ప్రభుత్వం నుండి ఆర్థికపరమైన సహాయాన్ని తనకు తానుగా తిరస్కరించాలి. ఏ వ్యక్తి ఆర్థికంగా, సాంఘికంగా, సాంస్కృతికంగా అన్నింటా బాగుపడ్డాడో అతడి సంతానానికి ఇక ఆ అవకాశం ఉండొద్దు. స్వచ్ఛందంగానే అతడు దాన్ని తిరస్కరించాలి. ప్రభుత్వం ఆర్థికపరమైన చేయూతను అందించాలి. అవసరమనుకుంటే వయసు పరిమితిలో కూడా సడలింపు ఇయ్యాలి గాని, తక్కువ అవగాహనకు, తక్కువ జ్ఞానానికి, నైపుణ్యానికి సీటు ఇయ్యవద్దంటాడు బాబాయి.

ప్రవేశ పరీక్ష అయిపోయింది. బాబాయి మాటలు నాకు ఒక కొత్త ఉత్తేజాన్నిచ్చాయి. చాలా కష్టపడి చదివాను. పరీక్ష కూడా అనుకున్నదానికంటే బాగా రాసాను.

ఫలితాలొచ్చాయి. నేను మంచి ర్యాంకునే సాధించాను. తిలక్ పరీక్ష పోయింది. అది ముందే అందరు అనుకున్నది. ఎవరూ ఆశ్చర్యపోలేదు. తిలకు పరీక్షలో సీటు రాకపోవడంతో బాబాయి అందరికి ‘చెడు’ అయిపోయాడు.

ఆ సంఘటన తర్వాత బాబాయి కుటుంబ జీవనంలో అశాంతి చోటు చేసుకుంది. ఎక్కువ కాలం బయట పేషంట్లతో గడపడం అలవాటు చేసుకున్నాడు.

ఏవేవో కాలేజీలో అప్లై చేద్దామనుకున్న నాకు అన్నింటా చుక్కెదురే. ఈ ఆర్థిక స్థితితో సీటు వచ్చినా దాన్ని చివరికంటూ నెట్టుకరాగలనన్న అపనమ్మకం నన్ను కృంగదీసాయి.

మెడికల్ కాలేజీలో సీటు కోసం అప్లై చేయటానికి యింకా కొద్ది రోజుల గడువుంది. అప్లై చేయకలేకపోతున్నందుకు మనసులో అశాంతి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో మనసుని బలవంతంగా మరల్చుకొని ఎన్నాళ్లనుంచో చెప్తున్న అమ్మ మాటను పాటిస్తూ నారాయణ సిద్ధాంతి ఇంటికి వెళ్లడం మొదలుపెట్టాను. ఆయన పౌరోహిత్యం నెరపడం, నేర్పడంలో దిట్ట. అమ్మకు దూరపు వరసకు అన్నకూడా. మా స్థితి తెలిసినవాడై “పిల్లాడ్ని నా దగ్గరకు పంపు పౌరోహిత్యం నేర్పుతూ, వేదం చెప్తా, పురాణాలు చదివిస్తా, నేడు డొక్క శుద్ధి గల బ్రాహ్మడే కరువైపోయాడు. సంపాందించింది రెండుపూటలా గడపడానికి పురోహిత్యం సరిపోతుంది. నేడు రేపు పై చదువులు, ఉద్యోగాలు మనలాంటివారికి ఎక్కడ దొరుకుతాయి. వాటికి పెట్టి పుట్టాలి” అంటూ నన్ను తన దగ్గర శిష్యరికానికి పిలిపించుకున్నాడు.

అలా మూడు రోజులు వెళ్లానో లేదో ఒక రోజు, పెంటయ్య బాబాయి స్వయంగా నన్ను వెతుక్కుంటూ, నారాయణ సిద్ధాంతిగారి ఇంటికి వచ్చాడు.

నారాయణ సిద్ధాంతి ద్వారా మా ఆర్థిక స్థితి- అవీ తెలుసుకొని పెంటయ్య బాబాయి చాలా బాధపడ్డాడు-నొచ్చుకున్నాడు కూడా.

“చూడు ప్రకాష్ నిన్నటి వరకు నీ గురించి పూర్తిగా తెలియదు నాకు. తెలివైన కుర్రవాడివి, శ్రద్ధ, పట్టుదల ఉన్నాయని మాత్రమే తెలుసు. నీకు ఎంట్రన్స్‌లో ర్యాంకు వచ్చిందని తెలుసు. నీవు మెడిసిను అప్లై చేశావనే నేను అనుకున్నా. విషయం నిన్ననే తెలిసింది. ఇదిగో ఫాం, అప్లయి చేయ్. డబ్బుల గురించి చింత నీకనవసరం-నీకు చదవాలనిపించినంత చదువు. ఇది నేను ఊరకే చేయడం లేదు”. అని పెంటయ్య బాబాయి ఆర్తిగా చెప్పసాగాడు.

మళ్లీ బాబాయే నారాయణ సిద్ధాంతితో… “సిద్ధాంతిగారు- నన్ను ప్రభుత్వం చదివించి ఇంతవాణ్ణి చేసింది. నేను ఈ స్థితిలో ఉండడానికి నా దేశం నాకెంతో చేసింది. తిరిగి ఆ రుణాన్ని ప్రకాష్ లాంటి పదిమందికి చదువు చెప్పించి తీర్చుకుందామని వచ్చాను. ప్రకాష్ లాంటి కుర్రవాళ్లకు కొంత ఆర్థిక చేయీతనిస్తే ఎంత ఎత్తుకైనా ఎదిగిపోగలరు. ఏమంటారు”

“పెద్దలు మీ మాటకు ఎదురేంది. ఎందరో బీదసాదలకు మందులిచ్చి, ప్రాణ దానం చేసారని విన్నాను. నేడు ఈ కుర్రాడికి విద్యా దానం చేస్తామంటున్నారు. సరే కానీయండి. అంతా సర్వేశుడే ఇచ్ఛ”.

“ప్రకాష్! ఫాం నింపి పంపించు నేడే. కాలేజిలో చేరేవరకు, ఇక్కడే సిద్ధాంతిగారి దగ్గర ఉండి చదువుకో. కుల వృత్తి ఎప్పుడు మరవద్దు. చదివిన చదువు, నేర్చిన విద్య ఎప్పటికైనా పనికొస్తాయి” అంటూ కొంత డబ్బు నాచేతిలో పెడ్తూ.

“దీన్ని రుణంగా భావించు. రేపు గొప్పవాడివైనా, నేటి ఈ స్థితిని మరిచిపోక, నీలాంటి మరో మనిషికి చేయూతనిచ్చి ముందుకు నడిపించు చాలు. నేటి ఈ రుణం అప్పుడు తీరిపోతుంది” అంటూ నా భుజంతట్టి సిద్ధాంతి గారి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయాడు.

పెంటయ్య బాబాయిగారికి-నాకు ఏ జన్మ బంధమో-వారి చల్లని హస్తం అందుకున్నాక, ఏ విషయానికి నేను కొరతపడలేదు. అమృత హృదయుడి చేయూత నాకు అన్నింటా విజయాన్నే చేకూర్చింది. అలాంటిది బాబాయికి ఏమయి ఉంటుంది.

పెంటయ్య బాబాయికి జరగకూడనిది ఏమైనా జరుగుతుందా? మనసు ఎందుకో కీడును శంకిస్తుంది. అందుకేనా అతని జ్ఞాపకాల దొంతర్లు ఇలా వరుసపెట్టి దొర్లిపోతున్నాయి.

***

కిటికీలోంచి గాలి చల్లగా వీస్తోంది. కారు ఆర్మూర్, నిర్మల్ దాటి మహబూబ్ ఘాట్ రోడ్ కు చేరుకుంది.

సమయం నాలుగు గంటలు దాటింది. అడవి ప్రాంతం కావడంతో చలికాస్త ఎక్కువయినట్లనిపించింది. శ్రీదేవి చలికి కాస్త ముడుచుకొని పడుకున్నట్లనిపించి, కారు అద్దాలు పైకి ఎత్తాను. కాసేపట్లో లోపల వెచ్చబడి, హాయిగా ఉంది.

ఘాట్ రోడ్ దాటాక, కారు మళ్లీ స్పీడందుకుంది.

ఆదిలాబాదు చేరుకునే సరికి అప్పుడప్పుడే తెల్లవారుతున్నది. ఊరి పొలిమేరలు చేరుకొనే ముందే శ్రీదేవి మేలుకుంది. కారు బాబాయి ఇంటి ముందు ఆగి ఆగడంతో పరశురాముడు గేటు తీసుకొని ఉరికి వచ్చాడు.

“వచ్చారా! బాబు” అంటూ మొహం చేటంత చేసుకొని, “అయ్యగారు గవర్నమెంట్ దవాఖానలో ఉన్నారు. అయ్యగారి ఆరోగ్యం బాగా లేదు. సుమతమ్మగారు, పిల్లలు ఏదో ఫంక్షనుందని నాగపూర్ వెళ్లారు. రెండుసార్లు ఫోన్ చేసినా ఎవరూ రాలేదు. అయ్యగారు మీకు ఫోన్ చేయమన్నారు. ఇప్పుడు మీరొచ్చారు. నాకు నిశ్చింతగా ఉన్నది” అంటుంటే వాడి ముఖంలో యజమానిపట్ల గల ప్రేమ, ఆపేక్ష ఆ కళ్లలో చూడాల్సిందే కాని చెప్పాల్సింది కాదు.

“అసలు బాబాయికేమైంది? ఆసుపత్రిలో ఎందుకు చేర్చారు?”

“బాబుగారు అయ్యగారికి గుండెపోటంట. అదీగాక గుండె పోటచ్చి, మెట్లపై నుండి జారి కిందపడ్డారు. తుంటి ఎముక విరిగింది. గుండె నొప్పి సర్దుకుంది. కాని, తుంటి ఎముకతోనే చాలా బాధపడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.

కారును గవర్నమెంటు హాస్పిటల్ వైపు తిప్పాను.

ఐదు నిమిషాల్లో కారు హాస్పిటల్ ముందుంది. బాబాయి మంచం చుట్టూ అతనికి కావలసిన ఆప్తులెందరో కనిపించారు. ఆయన ఊరి నుండి వచ్చిన బంధువులు, ఆయనతో సేవలు పొందిన వ్యక్తులు ఎందరెందరో ఉన్నారు.

ఒక పండు ముసలి బాబాయి కాళ్ల దగ్గర కూర్చుని, తొలగిపోయిన దుప్పటిని సరిచేస్తూ, ఆపేక్షతో కనిపించాడు. బాబాయి మంచి నిదురలో ఉన్నాడు. బాబాయిని ఇంత ఆపేక్షగా చూసుకుంటున్న ఈ వ్యక్తి ఎవరో? నేను పోల్చుకోలేకపోయాను.

నా మనసులోని మాటను నా మొహం చూసి చదివినవాడిలా, ఆ ముసలాయన అన్నాడు. “నువ్వు మా పెంటయ్య సదివించిన ప్రకాశానివి కదూ! ఎప్పుడూ కలసిన మాకు నీ గురించి చెప్తుండె. అప్పుడెప్పుడో మా ఊరికివస్తివనుకుంట. శానాల్లయింది నువ్వు మా ఊరొచ్చి, మరిసిపోయింటవు. నేను పెంటయ్య సిన్నాయన్ని” అంటూ తన పరిచయం చేసుకున్నాడు.

వెంటనే జ్ఞాపకానికొచ్చింది. అప్పుడెప్పుడో బాబాయితో వాళ్ల ఊరు వెళ్లినుంటిని. బాబాయే స్వయంగా కారులో తీసుకెళ్లాడు. అది టౌను ఇరవై మైళ్ల దూరంలో ఉన్న ఒక గూడెం. బాబాయి కారు వెళ్లి ఊరి చివర్లో, గుడిసెల్లో ఆగింది. ఎటు చూసిన ఆరేసిన జంతువుల చర్మాలు. ఇంటి చూరు కింద – నడవాలో దొంతర్లుగా పేర్చి పెట్టిన ఎండిన చర్మాలు. ఒక రకం చర్మాల వాసనతో, ఆ ప్రదేశం నిండి ఉంది.

కారు దిగి బాబాయి ఒక గుడిసెలోకి దారి తీసాడు. అపరిశుభ్రమైన పరిసరాలు అదో మాదిరి చర్మాల కంపు వాసన. గోడలకు తగిలించిన చర్మంతో అల్లిన పగ్గాలు, చర్మంతో అల్లిన మువ్వలు, చెప్పుల జతలు, గోడకు తగిలించిన డప్పు వాయిద్యాలు. ఈ డప్పు వాయిద్యాలు ప్రతి ఇంటి వరండాలోనూ కనిపించాయి. ఒక ముసలామె వెనక గుడిసె గుమ్మంలో కూర్చుని, కంచు తపాలలో అన్నం తింటున్నది. గిన్నె చేతిలో పట్టుకొని, పెంటయ్య బాబాయి చిన్నాయన గుడిసె వెనక చింత అంబలి, ఉప్పు వేసి చర్మాలను శుభ్రం చేస్తున్నాడు.

“దండాలు చిన్నయ్య” అంటూ పెంటయ్య బాబాయి చిన్నాయనను, చూపు ఆనని తల్లితో… “నేనవ్వ పెంటిగాన్ని” అని చెప్పుకున్నాడు. ఇవ్వన్నీ చూస్తుంటే పెంటయ్య బాబాయి ఎన్ని ఊడలతో ఎదిగినా, తల్లి వేరును మరవని మర్రి చెట్టనిపించింది.

నా మనసులోని భావాలు గ్రహించినట్టు బాబాయి “పదవ తరగతి పాసయి కాలేజీలో చేరే వరకు నేను ఈ పనే చేసాను. నాకూ ఈ పనులన్నీ వచ్చు” అని అంటుంటే, బాబాయి వ్యక్తిత్వం మరో మెట్టు ఎదిగింది.

“మా గూడెంలో మా పెంటయ్యతీరుగా మేం ఎవల్లం చర్మాలు శుభ్రం చేయం, మా పెంటయ్య తీరుగా చెప్పులు కుట్టం. కాలేజీకి పోయ్యేదాకా మా పెంటయ్య చెయ్యిపట్టే మొగోడు మా గూడెంలనే లేకుండె. అంటే అబద్ధం కదయ్యా” అంటూ పెంటయ్య బాబాయి గురించి ఆప్యాయంగా చెప్పుకొచ్చాడు పెంటయ్య బాబాయి చిన్నాయన.

తల్లికని భద్రంగా తీసుకెళ్లిన ఆమెకిష్టమైన బి.బి. జర్దా, ఆమె ఎప్పుడూ వాడే జిందా తిలస్మాత్ సీసా, ఆమె చేతికిచ్చాడు.

తల్లి యోగ క్షేమాలు అడిగి, మేము తిరిగి వస్తుంటే, బాబాయి తల్లి రొంటికి చెక్కిన చేతి సంచిలోంచి వెతికి వెతికి తాను దాచుకున్న యాభై రూపాయల నోటుతీసి నాకు ఇస్తూ… “ఏమన్న కొనుక్కో బిడ్డా…” అంది. అప్పుడు నేను మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నట్లు గుర్తు.

వస్తుంటే కొడుకును దయ చేస్తూ, రెండు చేతులతో మొహాన్ని నిమిరి, తన తలకు రెండు వైపుల కణతలకు వేళ్లు ఆన్చి విరిచింది. వేళ్లు బహు ప్రేమతో పట పటమంటూ విరిగాయి. “అన్నీ పల్లెటూరి ఆపేక్షలు” అంటూ సర్ది చెప్పాడు బాబాయి చిన్నాయన.

బాబాయి కాళ్ల దగ్గర కూర్చున్న మనిషి బాబాయి చిన్నాయన అని అప్పుడు తెలుసుకున్నాను.

నేను పల్లెటూరులో చూసివచ్చిన కొన్నాళ్లకు బాబాయివాళ్ల అమ్మగారు, ఒకరోజు ఏ జబ్బు లేకుండానే, హఠాత్తుగా, నిదురలోనే పోయిందని తెలిసింది. అప్పుడు నాకు పరీక్షలని, బాబాయి విషయం చెప్పలేదు.

బాబాయికి మిగిలిన ఒకే ఒక బంధువు వాళ్ల చిన్నాయన. ఎనిమిది గంటల ప్రాంతంలో డాక్టర్ కలిసాడు. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.

“ఆయనకు ఒక పక్క తుంటి ఎముక విరిగింది. ఆపరేషన్ చేసి ఎముకను సరిచేసి స్టీల్ రాడ్ వేయాలి. ఈ పనికి హైదరాబాదయితే మంచిది. మీరు డాక్టరే కాబట్టి అన్ని మీరు చూసుకోగలరు” అని చెప్పడంతో సరేనన్నాను. రాత్రంతా నొప్పితో బాధపడుతుంటే మత్తు మందు ఇంజక్షన్ ఇచ్చారట. అందుకే మత్తుగా పడుకున్నాడని చెప్పారు నర్స్.

నేను పెంటయ్య బాబాయిని తీసుకొని బయలుదేరి వెళ్లే ముందు, నాగపూర్ వెళ్లిన బాబాయి కుటుంబ సభ్యులకు మరోమారు ఫోన్ చేసి విషయం తెలిపాను.

విషయం తెలుసుకున్న బాబాయి బాధపడ్డాడు. అనవసరంగా వారికెందుకు విషయం చెప్పావని.

“నా ఆలోనలు, అభిరుచులు, సిద్ధాంతాలు నా వాళ్లెవరికి నచ్చవు. అందుకే ఇలా ఒంటరిగా…” అంటూ మాటను అర్ధాంతరంగా ఆపేశాడు.

బాబాయి కళ్లలో సన్నని నీటి పొర.

“మీరెం దిగులు పెట్టుకోకండి బాబాయి. వాల్లు నేడో రేపో వచ్చేస్తారు”. అని సర్ది చెప్పింది శ్రీదేవి. అలా అంటుంటే శ్రీదేవి గొంతు కూడా పూడుక పోవడం నేను గమనించాను.

“వాళ్లు రారమ్మా. నాకు తెలుసు. నా జీవితమంతా ఒంటరి పోరాటమే నన్నెవరూ అర్థం చేసుకోరు. మగ పిల్లలకు నేను శత్రువును. నా భార్యకు, నా బిడ్డకుకు కూడా నేను చేదయిపోయాను. వాళ్లూ వాళ్ల పక్షమే”. అని అంటుంటే బాబాయి కళ్లలో నీళ్లు తిరిగాయి.

“ఇంకా మీరేమి మాట్లాడకండి” అంటూ బాబాయిని వారించి, ప్రయాణానికి బయలుదేరాం నేను శ్రీదేవి.

మేం వెళ్లాక సుమతి పిన్ని, భవిష్య వచ్చారు కాని కొడుకులు రవీంద్ర, తిలక్ మాత్రం రాలేదు. బాబాయి మాటల్లో “నేడు రాకపోయినా రేపు తలకొరివి పెట్టటానికి కూడా వారు రారని” అన్నట్లే అయింది. తండ్రి-కొడుకులను కలపాలని నేను “ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమిడియట్లే” అని ఇచ్చిన మెయిల్‌కు కూడా వాళ్లు స్పందించలేదు.

తరువాత చాలా రోజులకు తెలిసింది రవీంద్ర, తిలక్ ఆ మేసేజ్ ముట్టాక కావాలని నాగపూర్ నుండి ఎక్కడికో సైట్ సీయింగు వెళ్లారని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here