[శ్రీ వల్లీశ్వర్ గారి ‘పెను ప్రమాదం ముంచుకొస్తోంది! – వంగూరి చిట్టెన్ రాజు’ అనే రచనని అందిస్తున్నాము.]
వాళ్ళు హిమాలయాల మీద కూర్చున్నారు. క్రిందకి చూడరు. వాళ్ళవల్ల హాని ఉంది. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది…
‘ఇలా’ అంటే ‘ఎలా’?
తెలుగు సాహిత్యంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ అధ్యక్షులు శ్రీ చిట్టెన్ రాజు మార్చి 9,10 తేదీల్లో కాకినాడలో జాతీయ తెలుగు సదస్సు నిర్వహించి, రెండు రోజుల్లో రకరకాల సాహితీ ప్రక్రియల్లో 80 మంది ఔత్సాహిక రచయితలను, లబ్ధ ప్రతిష్ఠులనూ పాల్గొనేలా చేశారు. తమ ఫౌండేషన్ పేరు మీద గత 30 ఏళ్ళలో అమెరికాలో జాతీయ స్థాయిలో తెలుగు 13 సదస్సులు, ఐదు ఖండాలలోని వివిధ దేశాలలో 8 ప్రపంచ తెలుగు సదస్సులు నిర్వహించారు. రాబోయే 2024 నవంబర్‌లో డోహా, ఖతార్‌లో 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించే సన్నాహాలు చేస్తున్నారు.
ఎందుకు ఇంత కష్టపడటం?
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకొని, అమెరికా వెళ్ళి హ్యూస్టన్‌లో సుఖంగా స్థిరపడ్డాక ప్రశాంతంగా ఉండక, ఇన్ని దేశాలు తిరగడం ఎందుకు? ఈ సదస్సులు జరపడం ఎందుకు? ఎవరడిగారు ఇవన్నీ చేయమని? చేస్తే ఏమొస్తుంది? ఇలా చాలా ప్రశ్నలు అడిగాను ఒక బాతాఖానీలో.
అప్పుడు..
చిట్టెన్ రాజు ఒక రహస్యం బయట పెట్టారు:
ఒక కసి పుట్టింది
నాకు కాకినాడ నుంచి బొంబాయిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి వెళ్ళేనాటికి ఈ సాహిత్యం, కథలు, కాకరకాయలు ఏమీ తెలీదు. అక్కడికి 1966వ సంవత్సరంలో వెళ్ళాను. అక్కడ ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నాకు ఆసక్తికరమైన విషయం ఒకటి కనబడింది. తమిళియన్లు, బెంగాలీలు, మళయాళీలు… ఇలా చాలా ఇతర భాషల వాళ్ళల్లో గొప్ప భాషాభిమానం పెల్లుబుకుతోంది. వాళ్ళు చీటికీ మాటికీ ఏవేవో భాషా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఆ భాషల వాళ్ళు ఏ ఇద్దరు ఎదురుపడినా వాళ్ల భాషే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు నాకు మనసులో ఒక ప్రశ్న పుట్టింది. మనం – తెలుగు వాళ్ళం ఎందుకు ఇలా లేం!
ఆ ప్రశ్న నుంచి ఒక కసి పుట్టింది. మిత్రుల ప్రోద్బలంతో అప్పుడు మొదటిసారిగా నేను రాయటం మొదలుపెట్టాను. నా మొదటి రచన ‘బామ్మాయణం అను సీతా కల్యాణం’ అనే హాస్య నాటిక.
ఆ తర్వాత 1974లో అమెరికా వెళ్ళాక నా మొదటి కథ రాశాను. నాటకాలు చాలా రాశాను… దానికి స్ఫూర్తి హ్యూస్టన్‌లో మేము స్థాపించిన తెలుగు సాంస్కృతిక సమితి సభ్యుల ఆర్తి. వాళ్ల ఆనందించడం కోసం నాటకాలు, నేను వ్యవస్థాపక సంపాదకుడిగా మొదలు పెట్టిన ‘మధుర వాణి’ పత్రిక కోసం కథలు… ఇలా నా రచనా వ్యాసంగం కొనసాగింది.
హిమాలయాలెక్కి కూర్చున్నారే!
కాని కాలక్రమేణా అప్పటికే అమెరికాలో మహా రచయితలుగా ముద్ర పడిన కొంత మంది ఉన్నారు. సాహిత్యమంటే తాము రాసిన స్థాయిలోదే అని గాఠిగా నమ్మేసి, హిమాలయాలెక్కి కూర్చున్నారు. అంటే, ఆ స్థాయిలో రాయగలిగితేనే సాహిత్యం, లేకపోతే కాదా! అలా చిన్న చూపు చూస్తే ఇంక కొత్త రచయితలు ఎలా పుట్టుకొస్తారు?
పుట్టుకొచ్చేలా చేయాలి. లేకపోతే ఈ హిమాలయాలెక్కి కూర్చున్నవాళ్ళ చూపులవల్ల కొత్తవాళ్ళల్లో ఆత్మ న్యూనత ఏర్పడి, కొత్త సాహిత్యానికి హాని జరుగుతోంది కదా!
ఇప్పుడు ఏం చేయాలి?
సరే, అదలా ఉంచి మళ్ళీ మొదటికొస్తాను.
ఒక అయిడియా
నేను అమెరికా వెళ్ళిన కొత్తలో – 1994లో – ఇతర భాషీయుల వైభవం మరింతగా చూశాను. అప్పుడు మన వాళ్ళకి కూడా భాష పట్ల – ముఖ్యంగా సాహిత్యం పట్ల ఆసక్తి కలిగించాలంటే ఏం చేయాలి అన్న ఆలోచన మొదలైంది.
అప్పుడు ఒక అయిడియా వచ్చింది.
అదేమిటో చెప్పేముందు ఇంకో విషయం చెప్పాలి. మన వాళ్ళల్లో చాలా మంది అమెరికా వచ్చాక తెలుగు మర్చిపోతున్నారు. దీనికి ఒక కారణం – బయటకు వెళ్తే తెలుగు మాట్లాడకపోయినా పని జరిగిపోతూండటం. మరో కారణం – పిల్లల చదువులు ఆంగ్లంలో ఉండటంవల్ల తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పడిపోతారేమోనని ముందే ఆ అమ్మానాన్నలు పిల్లలతో ఆంగ్లంలో మాట్లాడటం. తెలుగులో మాట్లాడటానికి తల్లిదండ్రులే సిగ్గుపడిపోతుంటే…?
ఇలాంటి నేపథ్యంలో వచ్చిన అయిడియా ఏమిటంటే – కథలు, కవితలు, నవలలు, వ్యాసాలు వంటి వాటిల్లో పోటీలు పెట్టామనుకోండి. ఏమవుతుంది? తెలుగు మాట్లాడటం మర్చిపోతున్న తెలుగువాళ్ళు సయితం (వాళ్ళల్లో ఏమాత్రం పూర్వ వాసం నాటి సాహిత్య వాసనలున్నా) పోటీల్లో పాల్గొనాలని అనిపిస్తుంది. అంటే, తెలుగులో రచనలను ప్రోత్సహించటం ద్వారా వాళ్ళల్లో తెలుగు భాషతో అనుబంధాన్ని పెంచుతున్నాం. వచ్చిన భాష మర్చిపోకుండా, పిల్లల దగ్గర కూడా సిగ్గుపడకుండా తెలుగు మాట్లాడేలా చేయగలుగుతాం.
అవునా కాదా?
అంటే వాళ్ళల్లో నిబిడీకృతమైవున్న తెలుగు సాహిత్య పరిచయాన్ని మనం కెలుకుతున్నామన్నమాట.
ఇప్పుడు నేను మొదట చెప్పిన విషయానికి వద్దాం.
వాళ్లని కొండ దించాలా!
హిమాలయాలెక్కి కూర్చున్న వాళ్ళు కూడా కావాలి కదా భాషను కాపాడుకోవడానికి! సాహిత్యం ఒక పరికరంగా వాడి భాషను విస్తృతంగా వాడకంలోకి తీసుకురావాలంటే ఆ సాహితీవేత్తల్ని ఉపేక్షించలేం గదా!
మరి వాళ్ళు ‘మా సాహిత్యమే సాహిత్యం’ అంటుంటే…!
కాబట్టి వాళ్ళని కూడా కలుపుకు వెళ్ళేలా ప్రయత్నం జరగాలి. అంటే, ఏముంది – “మా ప్రయత్నం ఇది, మీరు కూడా కొంచెం కొండ దిగి రండి. కొత్త సాహితీవేత్తల్ని తయారు చేద్దాం. కుర్రకారులో. అలా చేయటం వల్ల కుర్రకారులో భాష పట్ల ఆసక్తి పెంచగలుగుతాం.”
అమెరికా తెలుగు వారిగా ఒక ప్రయత్నం చేశాం. ఊహు. లాభం లేదు.
ఏమిటా ప్రయత్నం! ‘తానా’ వారి సభల సందర్భాలలో ప్రత్యేక సంచికలు ప్రచురించటం, వాటిల్లో ఈ కథలు, కవితలు కూడా ప్రచురించటం.
దాంతో ఆ మహాసభలకి వచ్చిన వాళ్ళే, ఆ సావనీర్ అందిన వాళ్ళే చదువుతున్నారు. కొంతమంది అక్కడే పేజీలు తిరగేసి వదిలేస్తున్నారు.
అరె, ఇదేంటి? పైగా సినీ నటులకీ, రాజకీయ నాయకులకీ, స్వామీజీలకీ, నగల దుకాణాలకీ ప్రాధాన్యత, ఆరాధన పెరిగిపోయి సాహితీవేత్తలని చిన్న చూపు చూడడం మొదలయింది…
అలా మొదలైంది వరద
ఈ నేపథ్యంలో కేవలం తెలుగు సాహిత్యానికే పెద్ద పీట వేసి 1994లో ‘వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా’ సంస్థ స్థాపించబడింది. అక్కడ్నుంచి, సాహిత్యాభిలాషుల జాబితాలు తయారు చేసి, వాళ్ళ చిరునామాలకు మేం ప్రచురించిన కథల లేదా కవితల సంకలనాలు పంపటం ప్రారంభించాం. ఉచితంగానే. విరాళాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లేని వాళ్ళు లేదు. కాని, అమెరికా తెలుగు కథ సంకలనాల ప్రచురణ ప్రయోగం అద్భుతంగా పని చేసింది.
‘నేనెందుకు రాయకూడదు అంటే నేనెందుకు రాయకూడదు’ – అనుకుంటూ తెలుగువారు ఉత్సాహంగా ముందుకు వచ్చారు. అయిదారేళ్ళపాటు ఏటా రెండు మూడు సంకలనాల పుస్తకాలు వేశాం. ఏమి స్పందన వచ్చిందండీ! దాంతో మాక్కూడా ఉత్సాహం వచ్చింది.
అదే పంథాలో సాహిత్య ప్రయోగాల పరిధి పెంచేశాం. ప్రతి ఉగాదికి అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నీ కలిపి జాతీయ స్థాయిలో పోటీలు జరిపాం. అలా సాహిత్య పోటీలు పెట్టుకుంటూ పోతే, మీరు నమ్ముతారో లేదో – 60 మందికి పైగా కొత్త రచయితలు అమెరికాలో పుట్టుకొచ్చారు. అప్పటిదాకా ఆయా నగరాల్లోని స్థానిక పత్రికల్లో అడపాదడపా కథలు, కవితలు రాసి సంతృప్తి పడుతున్న ఈ కొత్త తరం సాహితీ వేత్తల్లో ఉత్సాహం పరవళ్ళు త్రొక్కింది.
ఇది ఏటా చేస్తున్నాం. రెండేళ్లకోసారి జరిగే తానా మహా సభల సావనీర్ దాకా ఏ రచయితా నిరీక్షించనవసరం లేదు అని అని మా వార్షిక జాతీయ స్థాయి పోటీల ద్వారా స్పష్టం అయింది.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూడండి. ఇలా మేం పెట్టిన జాతీయ పోటీల ద్వారా కథలు, కవితలు రాసి బహుమతులు పొందిన కొత్తా, పాతా రచయితలు – నేను చెప్పిన నిర్వచనంలో – కొత్తవాళ్ళు 60 మందికి పైగా ఉన్నారు.
మళ్లా మరో ప్రయోగం
ఇందులోనే ఇంకో ప్రయోగం చేశాం. ఎక్కడా ఎప్పుడూ తమ కథ ప్రచురితం కానివాళ్ళకోసం ‘నా మొట్టమొదటి కథ’, ‘నా మొట్టమొదటి కవిత’ పోటీలు కూడా పెట్టాం. ఇప్పుడు ఏటా పెడుతూ ఉన్నాం. మీకు తెలుసా! ఈ ప్రయోగంతో మొదటిసారిగా కలం పట్టి (కంప్యూటర్ ముందు కూర్చుని) కథలు, కవితలు రాసే వాళ్ళు ఈ ప్రయోగం ద్వారా ఏటా పదిమంది దాకా దూసుకొచ్చేస్తున్నారు.
వారెవ్వా! ఏం స్పందనండీ అది! అంటే తెలుగు వాళ్ళ రక్తంలో ఉంది సాహితీ ప్రియత్వం. మా వంగూరి ఫౌండేషన్ చేసిందల్లా – దాన్ని వెతికి కెలికి అవకాశం, ప్రోత్సాహం ఇచ్చి బయటకి తెచ్చింది.
అమెరికాలో నారాయణస్వామి (తుపాకి), భాస్కర్ పులికల్, శర్మ దంతుర్తి, శ్యామల దశిక తదితరులు ఇలా వెలుగులోకి వచ్చినవాళ్ళే.
క్లుప్తంగా చెప్పాలంటే… కొత్త సాహితీకారుల సృష్టికి దారులు వేశాం. ఏమాత్రం అక్షరపరిజ్ఞానం ఉన్న వ్వ్యక్తినయినా ప్రోత్సహించాం. కొత్త కొత్త సాహితీ ప్రయోగాలకు ప్రేరణ ఇచ్చాం. నూతన సాహిత్య సృష్టికి అవకాశాలు కల్పించాం.
ఈ వాతావరణాన్ని కాపాడాలి. విస్తృతం చేయాలి. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నా తనని ప్రోత్సహించే సాహితీ వ్యవస్థ ఒకటుందన్న విశ్వాసాన్ని అతనికి, ఆమెకి కలిగించాలి. అందుకోసమే సదస్సులు నిర్వహిస్తున్నాం.
రచయితలు స్వయంభువులు?
ఎడారిలో పూలు పూస్తాయా? కాబట్టి పచ్చటి విశ్వ సాహితీ వనాన్ని తెలుగు వారికోసం నిర్మించే ప్రయత్నమే ఈ సదస్సుల ద్వారా చేశాం, చేస్తున్నాం.
ఇప్పుడు హిమాలయాల మీదున్న వాళ్ళు కూడా మా వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషిని గుర్తించారు. సాహిత్యాన్ని ప్రోత్సహించటం ద్వారా భాష పట్ల ఆసక్తిని పెంచవచ్చు, భాషను కాపాడుకోవచ్చు – అన్న మా నినాదంతో ఏకీభవిస్తున్నారు.
‘రచయితలు స్వయంభువులు’ అని నేను కాకినాడ సభలో అనటం కొందరికి ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు మేము చేసిన ప్రయోగాల స్ఫూర్తి ఏమిటండి? మేమేమన్నా వర్కుషాపులు పెట్టామా? లేదే! కాని, ఎవరిలో ఆ రచనా లక్షణం అంతర్గతంగా ఉన్నదో వాళ్ళకి మా ఫౌండేషన్
అందుకే ‘స్వయంభువులు’ అంటాను.
మీరు ఓ ప్రశ్న అడిగారు. ఈ కాకినాడ జాతీయ సదస్సుల ప్రభావాన్ని ఎలా కొలుస్తారు అని. ఏముందండి. మేం జాతీయ సదస్సులు జరిపిన ప్రతిచోటా ఇప్పుడు సాహితీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆపుడప్పుడు స్థానికంగా సదస్సులు చేస్తున్నారు. సాహితీ చర్చలు జరుగుతున్నాయి. కొత్త కొత్త సాహితీ ప్రయోగాల గురించి విశ్లేషణలు జరుగుతున్నాయి. ప్రతిసారీ అందరూ ప్రత్యక్షంగా కలవలేకపోయిన చోట్ల జూం ద్వారా జరుగుతున్నాయి. చూసుకోండి – అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా…
మన తెలుగు రాష్ట్రాల్లో అయితే గత 10-12 ఏళ్ళుగా మా ఫౌండేషన్ వంశీ సంస్థ సహకారంతో ‘నెల నెలా వెన్నెల’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది.
ఏమైనా, నేను సదస్సులు జరిపిన ప్రతిచోటా – ఆ తరువాత ఏం చేస్తున్నారు – అని వెంటపడుతూనే ఉన్నాను.
పెనుప్రమాదం వచ్చేస్తోంది!
మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏమిటి అంటే, ఓ పెను ప్రమాదం ముంచుకొస్తోంది!
ప్రభుత్వాల విధానాల వల్ల మరి కొన్ని దశాబ్దాలకి తెలుగు కేవలం వాడుక భాషగా మిగిలిపోతుంది. ఏదో సిలికానాంధ్ర వంటి సంస్థలు నడిపే ప్రయివేటు విద్యలా అయిపోతుంది. సుమతీ శతకాలు, సుభాషితాలు కనుపించవు, వినిపించవు.
ఆ పరిస్థితి రాకుండా చేయాలంటే, ప్రభుత్వాలు భాషకీ, ఉద్యోగానికి చిక్కు ముడి తెగ్గొట్టాలి. ఈ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే దౌర్భాగ్యపు ఆలోచన పోయి, ఏ పాఠ్యాంశం ఏ భాషలో బోధించాలో అ పధ్ధతి రావాలి. ఉదాహరణకి ఉన్నత పాఠశాల స్థాయి వరకూ చరిత్ర, భౌగోళిక, తత్త్వ శాస్త్రాలను తెలుగులో నేర్పితీరాలి. అవి ఇంగ్లీషులో ఎందుకు?
వంగూరి ఫౌండేషన్ వంటి సంస్థలు, వ్యక్తులు మాత్రం తమ పని తాము చేస్తూనే ఉండాలి.
* * * *