పెనుగొండ.. పురాతన ఆలయాలు, కోట సందర్శన

0
2

[ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా లోని పెనుగొండ వెళ్ళిన సందర్భంగా అక్కడి ఆలయాలను, కోటను దర్శించి ఆ వివరాలు అందిస్తున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]‘క[/dropcap]వి కాకి’ కోగిర జై సీతారామ్ గారు రాయలసీమలోని ప్రముఖ అభ్యుదయ కవి. వారి శత జయంతి సందర్భంగా ‘సాహితీస్రవంతి’ అన్న సంస్థ రాయలసీమ జిల్లాల ‘జల కవనం’ అన్న సాహితీ సభను నిర్వహించింది (3 మార్చి 2024న). దానిలో నా పద్య ప్రసంగం చేయవలసినదిగా, సంస్థ శ్రీ సత్యసాయి జిల్లా కన్వీనర్ శ్రీ వి. హరి నన్ను సగౌరవంగా ఆహ్వానించారు. సాహితీ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కెంగార మోహన్ నాకు ఆత్మీయ మిత్రుడు.

నేను పెనుగొండకు వస్తున్నానని తెలిసి, ముందు రోజు, అనంతపురం శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో నా మోటివేషనల్ స్పీచ్, వారి విద్యార్థుల కొరకు, డా॥ గొల్లాపిన్ని సీతారామశాస్త్రి గారు (కళాశాల అకడమిక్ అడ్వైజర్, విశ్రాంత ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పెనుగొండ) ఏర్పాటు చేశారు.

నేను మార్చి ఒకటిన గరీబ్‌రథ్‌లో బయలుదేరి, రెండు తెల్లవారుజామున అనంతపురంలో దిగాను. నా మిత్రుడు యోగానంద ప్యాపిలిలో వాళ్ళ చెల్లి ఇంటికి వచ్చిఉన్నాడు. విషయం తెలిసి, వాడూ 10 గంటలకు శ్రీ చైతన్య కళాశాలకు వచ్చేశాడు. అక్కడ నా ప్రసంగం మధ్యాహ్నం 2 గంటలకల్లా ముగించుకొని, ఇద్దరం పెనుగొండకు పయనమయ్యాము. అనంతపురం నుంచి పెనుగొండ 73 కి.మీ. బెంగుళూర్ హైవే మీద ఉంటుంది. ఆర్‌టిసి బస్సులో అక్కడికి చేరుకోన్నాం.

హరి గారు నాకు, అక్కడి అంబేద్కర్ సర్కిల్‌కు దగ్గరగా ‘మౌర్య రెసిడెన్సీ’ లో ఒక ఎ.సి. రూం బుక్ చేసి ఉన్నారు. ఆ హోటల్ యజమాని శ్రీ నారాయణ స్వామి కూడా సాహితీస్రవంతి సభ్యుడే. ఆయన నన్ను, మా యోగాను సాదరంగా అహ్వానించి, రూముకు తీసుకొని వెళ్లారు. రూం చాలా బాగుంది.

స్నానాలు చేసి 8 గంటలకు క్రిందికి వెళ్లి, ఎదురుగ్గా మురళి టిఫిన్ సెంటర్‌లో రాగి దోసె, రాగి యిడ్లీ తిని, మజ్జిగ త్రాగి, బ్రేవ్‌మని త్రేన్చాము.

ఈ త్రేన్పు శబ్దాన్ని ‘బ్రేవ్’మని అనడం, ఇంగ్లీషులో ‘అనమటోపియా’ అంటారని మా యోగా గాడితో చెప్పాను.

“ప్రతిదానికీ ఏదో ఒక శాస్త్రం చెబుతావేమిరా, శర్మా!” అని విసుక్కున్నాడు వాడు. ఎండలో ఎర్రబస్సులో వచ్చాం మరి. అలసట, చిరాకు! అదంతా నా మీద చూపిస్తున్నాడు వెధవ!

“ఎందుకురా విసుగు?” అన్నా నవ్వుతూ.

“నా విసుగు నీ మీద కాకపోతే ఎవరి మీద చూపిస్తా మరి?” అన్నాడు వాడు. “ఈ ‘అనమటోపియా’ మీద ‘దత్తవాక్కు’ కాలమ్ కూడ రాసినట్టున్నావ్ కదా!”

“అవును రా!”

“ఒకసారి దాని గురించి మళ్లీ అఘోరించు!”

అందరూ నన్ను సాహితీవేత్తగా గౌరవిస్తారు! వీడేమో ఇట్లా!

“ఒక ధ్వనియే పదంగా ఏర్పడటం ఈ ప్రక్రియ. త్రేన్చినపుడు వచ్చే శబ్దం ‘బ్రేవ్’ను పోలి ఉంటుంది. నాకేమో ఇది ‘బి బ్రేవ్!’ అన్న ఇంగ్లీషు వాక్యాన్ని గుర్తుకు తెస్తుంది. ‘ధైర్యంగా ఉండు!’ అని దాని అర్థం!”

“బోడిగుండుకూ మోకాలుకూ ముడి పెట్టినట్లుంది!” అన్నాడు వాడు. నన్ను ఉడికించటానికి అలా మాట్లాడతాడు గాని, నేనంటే వాడికీ మా యల్లమందకూ పిచ్చిప్రేమ. యల్లమందను తల్చుకున్నాం. ఆయన కూడా ఉంటే బాగుండేది అనుకున్నాం.

పెనుగొండ చారిత్రాత్మకమైన ఊరు. శ్రీకృష్ణదేవరాయల రెండవ రాజధానిగా ఉండేదంటారు. కాదని కొందరు విభేదిస్తారు. హిస్టరీ ఈజ్ ఆల్వేస్ కాంట్రోవర్షియల్!.

రూం చేరి విశ్రమించాము. జలకవనం సభ ఉదయం 10.30కి. అంటే భారతీయ కాలమానం ప్రకారం 11 దాటుతుంది. అదేమిటి? అనుకుంటున్నారా! ఇండియన్ పంక్చువాలిటీ గురించి వ్యంగ్యంగా అలా అన్నా.

నారాయణస్వామికి ఫోన్ చేశాను. “బ్రదర్, రేపు ఉదయం పెనుగొండ కోట, పట్టణం లోని పురాతన ఆలయాలు అన్నీ చూసి, సభకు వస్తాము. మాకొక ఆటో ఏర్పాటు చెయ్యండి ప్లీజ్.” అన్నా.

“తప్పకుండా సార్! ఇక్కడ చూసేకి (చూడడానికి) చానా దేవళాలున్నా యి. చానా పురాతనం. కోట అంతా ఇండ్లయినాయి. తిమ్మరుసు జైలు, ఆ యప్ప సమాధి, జైనమందిరం.. వీరు ఎనిమిదికి టిఫన్ చేసి బయలుదేరితే, పదకొండు కల్లా గగన్ మహల్ కాడికొచ్చేయొచ్చు. మావాడు గంగయ్య అని వుండాడు. వాన్ని పంపిస్తా. అన్నీ చూపిచ్చుకొని వస్తాడు. మంచోడులే.” అన్నాడు.

సరేనన్నాను.

“పెనుగొండ గురించి ఏమైనా చెప్పరా, శర్మా!” అన్నాడు జిజ్ఞాస యోగి.

“పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పేరు విన్నావా?”

“వినడమేమిటి? ఆయన ‘శివతాండవం’ లోని కొన్ని ద్విపదలు మనకు ‘టెన్త్‌’లో తెలుగులో ఉండె కదా!”

“సెభాష్! నా మిత్రుడివనిపించుకొన్నావురా! ఆయన ‘సరస్వతీపుత్ర’ అన్న బిరుదు పొందారు. మా నాన్నగారు బ్రహ్మశ్రీ. శతావధాని, శ్రీ పాణ్యం లక్ష్మీనరసింహ శాస్త్రిగారికి ఎంతో అనుంగుమిత్రులు. ఆయన ‘పెనుగొండ లక్ష్మి’ అనే కావ్యాన్ని కేవలం తన పన్నెండేళ్ల వయసులోనే రాశారు.

ఇక్కడ ఒక చమత్కారం జరిగిందంటారు. పుట్టపర్తివారు విద్యాన్ పరీక్ష వ్రాశారు. దాని సిలబస్‍లో ఆయన కావ్యమే (పెనుగొండ లక్ష్మి) ఉంది! ఇది చరిత్ర లోనే అత్యంత అరుదైన విషయం. ఆ కావ్యం నుండి ఒక రెండు మార్కుల ప్రశ్న ఇచ్చారు. దానికి ఈ పండితోత్తముడు 40 పేజీల సమాధానం రాస్తూ కూర్చున్నారు. దానికి రెండు మారులు వచ్చినా, మిగతా ప్రశ్నలు రాయకపోతే ఎలా? దాని వల్ల ఆయన ఫెయిల్ అయ్యారని చెబుతారు.”

“ఓర్నీ! ఎంత విచిత్రం! అలాంటి గొప్పవారికి పరీక్షలెందుకురా?” అన్నాడు యోగా. ఒక్కోసారి చాలా గొప్పగా ఆలోచిస్తాడు వాడు.

నేను కొనసాగించాను. “ఒకప్పుడు అత్యంత వైభవంగా అలరారిన పెనుగొండ దుర్గం, శిధిలావస్థలో ఉండడం చూసి, పుట్టపర్తివారి హృదయం ద్రవించింది. ఫలితమే ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం.

ఉ:
కాలొక చోట నిల్వక, ముఖమ్మున నిప్పు కలుప్పతిల్ల, బో
నాలకు నాల్క జాచి, యనయంబును గజ్బెలు గట్టియాడు, నీ
కాలపిశాచి కేమిటికి గట్టితి పట్టము? దీని గర్భమున్
భీతిచి చూడు మెందరి వజీరుల యాత్మలు మూల్గుచున్నవో!
-పెనుగొండ లక్ష్మి 1935.

కాలం ఎంత నిర్దయ గలదో! ఇక్కడ, వజీరుల యాత్మలు.. అన్నాడాయన వంటే మహమంత్రి తిమ్మరుసు లాంటి వారు. ఆయన సమాధి, ఆయనను బంధించిన జైలు, రేపు చూడబోతున్నాము”

మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకే రెడీ అయ్యాము. గంగయ్య ఆటోతో వచ్చేశాడు. మా రాయలసీమ ఫేమస్ టిఫిన్ ‘ఉగ్గాణి బజ్జీ’ ఎక్కడ దొరుకుతుందని అడిగాము. ఒక టిఫిన్ బండి దగ్గరకు తీసుకొని వెళ్లాడు. మా బ్రేక్‌ఫాస్ట్ సుసంపన్నం.

మొదటగా పెనుగొండ కోట మొదటి ద్వారం దగ్గరికి వెళ్లాము. అక్కడ తొమ్మిదడుగుల ఆంజనేయస్వామి వారి విగ్రహం దర్శించాము. పక్కనే గోడమీద పసుపురంగులో శ్రీ చక్రయంత్రం చెక్కిఉంది.

పెనుగొండ కోట లోని హనుమంతుడు

అక్కడనుంచి పురాతన ఆలయాలు దర్శించసాగాము. మొదట శ్రీ ఆయ ముక్తేశ్వరాలయం. ఆయ ముక్తేశ్వరుడు అచట కొలువై ఉన్నాడు. క్రీ.శ 1406 లోని ఒక శాసనాన్ని బట్టి, ఇది పదిహేనవ శతాబ్దానికి చెందినదని తెలుస్తుంది.

అనంతప్ప, నాగప్ప అనే అమాత్యులు బుక్కరాయల కాలమున దీనిలోని రంగమంటపమును నిర్మించినారు. పెనుగొండ దుర్గ నిర్మాణం సమయంలో, మాటిమాటికి అంతరాయాలు కలుగుతుండెడివట. దానికి కారణం భూగర్భంలోని శివలింగమని తెలుసుకొని, దానిని వెలికి తీసి, ఈ దేవాలయమును నిర్మించిన తర్వాత, కోట నిర్మాణం నిర్విఘ్నంగా కొనసాగిందని జనబాహుళ్యం లోని మాట. కోట ఐ (ఆయ) మూల యగుటచే, వాస్తు దోషపరిహరార్థం, ఈ దేవాలయం నిర్మించబదినదని కూడ ప్రతీతి.

ముక్తే శ్వర సన్నిధిలో, నందీశ్వరునితో

లోపల నల్లని శివలింగం అడుగు ఎత్తున ఉంది. స్వామి వెనుకనే అమ్మవారిని ప్రతిష్ఠించడం విశేషం. ముఖమంటపం నల్ల రాతిస్తంభాలతో నిర్మించారు.

అక్కడి నుండి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించాము. స్వామివారు కేవలం రెండడుగుల ఎత్తు ఉన్న నల్ల రాతి విగ్రహం. ధ్వజస్తంభం కేవలం మూడడుగుల ఎత్తే ఉంది. మా కోరికపై మా గోత్రనామాదులు చెప్పి, అర్చకులు స్వామికి అర్చన చేశారు.

కోట అంతా శిధిలం అయింది. అందులోనే ఇళ్ళు కట్టుకొన్నారు. ఒక చోట భారతీయ స్టేట్ బ్యాంక్ వారు పెట్టిన బోర్డును చూశాము. దానిపై ఇలా రాసి ఉంది:

“ఎటుల పై కెత్తిరో ఏన్గు గున్నెల కైన
తలభార మొదవించు శిలల బరువు”

“పెద్ద పెద్ద చతురస్రాకార శిలలచే నిర్మించబడిన పెనుగొండ కోట చూపరులకు ఆశ్చర్యము గొలుపును. నాలుగు దిశలలో నాలుగు సింహ ద్వారములు, చుట్టూ కందకము, రామబురుజు, లక్ష్మణ బురుజు, సీత బురుజులు, కావలి భట నిలయాలతో, ఈ కోట, సప్తప్రాకారములు కలది. ఈ కోట వైశాల్యం ఎనిమిది నుండి పది చదరపు కి.మీ. వైశాల్యములో నిర్మించబడింది.”

పెనుగొండ కేటను ‘ఘనగిరి’ అని కూడా శాసనాల్లో పేర్కొన్నారు.

తర్వాత జైన మందిరం. అక్కడ పార్శ్వనాథుని నగ్న విగ్రహాలు కొలువు తీరాయి. అత్యంత పురాతనమైన జైనమత సంబంధ కళాకృతులను పోలీసుల భద్రపరచారు. జైన గురువుల స్త్రీలను ‘యక్షిణి’ అంటారట. పార్శ్వనాథుని యక్షిణి పద్మావతి అట. వేంకటేశ్వరుని భార్యకూ ఈమెకూ ఏ సంబంధం లేదు.

జైన మందిరం పెనుగొండ

జైనమందిరం చాలా పెద్దది. ప్రధానాలయం ఎదుట వంద అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం ఉంది. ఆలయ అర్చకులు శ్రీ అజిత్ కుమార్ జైన్ మాకు ఎన్నోవిషయాలు చెప్పారు. ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట ఈ ఆలయాన్ని కట్టారట.

జైన మందిర పూజారి శ్రీ అజిత్ జైన్ తో.

అక్కడ బోర్డులన్నీ, గోడమీద రాతలన్నీ, కన్నడ భాషలో ఉన్నాయి. అజిత్ కుమార్ గారి తెలుగు కూడ ‘బెంగుళూరు తెలుగే’! వర్ధమాన మహావీరుడు జైనమత స్థాపకుడు కాదని, ఆయనకు ముందు పన్నెండు మంది జైనగురువులున్నారనీ ఆయన చెప్పారు. శతాబ్దాల క్రిందటి చక్రాలను, యంత్రమంత్రాలను, ద్వాదశ లోహ ప్రతిమలను మాకు చూపారు.

ప్రధానాలయం లోని పార్శ్వనాథుని విగ్రహం లేత ఆకుపచ్చ రంగులో ఉంది. దానిని కర్నాటక లోని హుబ్బళ్లి నుండి తెప్పించారట. అది మరకత పచ్చ కాదు. మరకతం రంగు డార్క్‌గా ఉంటుంది. ఇది లేత రంగు.

తర్వాత వేంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాము. స్వామి వారి వైభవం ఎక్కడైనా అసామాన్యమే. మూల విరాట్టు నాలుగడుగుల ఎత్తు విగ్రహం. తిరుపతి వేంకటేశ్వరుని నమూనా. ముఖ మంటపం పురాతన స్తంభాలతో అలరారుతూంది. స్వామివారి ధ్వజ స్తంభం సమున్నతంగా ఉంది.

తర్వాత కోట వెలుపల మూడు కిలోమీటర్ల దూరంలో, కొండలమధ్య, ఒక ప్రదేశంలో ఉన్న మహమంత్రి తిమ్మరుసు సమాధిని దర్శించాము. అది పూర్తి శిధిలావస్థలో ఉంది. నాకెందుకో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు గుర్తొచ్చారు. తిమ్మరుసు పాత్రలో జీవించారా మహానటుడు.

అక్కడ నుండి, తిమ్మరుసు బందిఖానాకు వెళ్లాము. ఆయనను, రాయలవారి కుమారుని హత్యానేరం క్రింద, కళ్లు పెకలించి, అక్కడ జైలులో ఉంచారు. అది ఒక కళాత్మక గోపురం కలిగి, నాలుగు వైపులా నాలుకు కిటికీల లాంటివి ఉన్నాయి. అవి నేల మీద నుంచి మూడడుగుల ఎత్తున్నాయి. ద్వారం లేదు. ఒక్క కిటికీ మాత్రం తెరచి ఉంది. లోపలికి తొంగి చూశాము. ఒక చిన్న గది (8X8). చీకటిగా ఉంది. చుట్టూ విశాలమైన ఆవరణ. శుభ్రంగా ఉంది. చుట్టూ ప్రహరీ గోడ. అది పురాతనం కాదు.

ఒక మహాసామ్రాజ్యాన్ని శాసించిన మహమంత్రి చివరి రోజులు తల్చుకొని విచారించాము. తనను పెంచి, యుద్ధ, రాజనీతి విద్యలు నేర్పి, రాజును చేసిన తిమ్మరుసునీ, శ్రీకృష్ణదేవరాయలు అనుమానించి, క్రూరమైన శిక్ష విధించాడు. తర్వాత తన తప్పు తెలుసుకొని దుఃఖించాడనుకోండి! రాజులకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టం. అందుకే

“రాజుల్ మత్తులు వారి సేవ నరకప్రాయంబు వారిచ్చునం
భోజాక్షీచతురంతయానతురగీ భూషాదు లాత్మవ్యధా
బీజంబుల్ తదపేక్ష చాలు మరితృప్తిం బొందితిన్ జ్ఞానల
క్ష్మీజాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా!”

అన్నారు ధూర్జటి మహాకవి.

అక్కడినుండి సభాస్థలికి చేరుకున్నాము. అది కోటలోని ‘గగన్ మహాల్’ అనే పురాతన, కళాత్మక, చారిత్రిక భవనం. రాయలవారు వేసవి విడిదిగా దానిని ఉపయోగించుకొనేవారంటారు. లోపలంతా పెద్ద హాలు, మధ్యన తీర్చిదిద్దిన స్తంభాలు క్రింద గచ్చు నేల. లోపల చల్లగా ఉంది. మెట్లకి పైకి వెళ్లాము. పైన టెర్రెస్ నలువైపులా సందులు గల బురుజులు. అక్కడ నుంచి చూస్తే విశాలంగా పరచుకున్న కొండలు. పచ్చదనం అసలు లేదు!

గగన్ మహాల్ (Photo courtesy: Internet)

గగన్ మహల్ ఉన్నప్రాంతాన్ని అజిత్ దుర్గం అంటారు. ఇది 16వ శతాబ్దపు ప్యాలస్. 3 అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తు మధ్యన గదులున్నాయి. కాని అవి మూసి ఉన్నాయి. ప్యాలెస్ నిర్మాణం హంపీలోని నిర్మాణాలను పోలి ఉంది.

పెనుగొండ గగన్ మహల్ లోపల!

అంతా చూసి మా యోగా అన్నాడు.

“ఒరేయ్ శర్మా! ఇదంత గొప్పగా అనిపించడంలేదు. అంతటి మహారాజు రాయలవారు ఎండాకాలమంతా ఇక్కడ ఎలా ఉండేవాడో కదా!”

“ఏమో! అప్పుడు ఆయన కోసం సకల సౌకర్యాలూ అమర్చేవారేమో? నీవు రాజస్థాన్ లోని ప్యాలెస్‍లను చూసి, ఇది నీ కంటికి ఆనడం లేదు రోయ్! ప్రశాంతంగా ఉంది కదా!” అన్నాను.

“ఏమో మరి? అంత గ్రాండ్‌గా లేదు!”

సభ ప్రారంభానికి ఇంకా సమయం ఉంది. లోటస్ మహాల్ (హంపి) లా ఉంది గగన్ మహల్. టెర్రెస్ నుండి ఉత్తరం వైపున రామస్వామి దేవాలయం, విశ్వనాథాలయం కనిపిస్తాయి.

బయటి గోడకు పెద్ద (4×6) సైజు శ్రీకృష్ణదేవరాయల తైలవర్ణ చిత్రపటం ఉంది. దానిని 2014లో ఆయన 504వ పట్టాభిషేక మహోత్సవ సందర్భంగా ఆవిష్కరించారు.

గగన్ మహల్ లో రాయల వారి చిత్ర పటం. వారి 504 వ పట్టాభిషేక వార్షికోత్సవ సందర్భంగా ఆవిష్కరించా రు.

[గగన్ మహల్ (outer view) ను ఫోటో తీయలేకపోయాము. ఎందుకంటే సాహితీ స్రవంతి వారి జలకవనం సభ కోసం ముందు భాగమంతా పెద్ద పెద్ద షామియానాలు వేశారు.]

ఈ భవనం నిర్మాణశైలి ఇండో-సార్సెనిక్ శైలికి చెందినది. క్రీ.శ 1575లో నిర్మించబడిందంటారు. చూస్తే అంత పురాతనమైనదిగా కనబడదు. ఎందుకంటే గోడలకు గారతో ప్లాస్టరింగ్ చేశారు.

సభలో పద్య ప్రసంగం చేశాను. సాహితీమిత్రులు చాలామంది వచ్చారు.

శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి విగ్రహం, పెనుగొండ.

మధ్యాహ్నం హైవే మీద ఒక దాభాలో భోజనం చేశాము. మా యోగాను పెనుగొండ బస్టాండ్‌లో బస్ ఎక్కించాను. వాడు సాయంత్రానికి ప్యాపిలి చేరతాడు. నేను రూముకు వెళ్లి విశ్రాంతి తీసుకోని, ఐదుగంటలకు తయారై, పెనుగొండ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఆరు గంటలకు ఎలహంక – కాచిగూడ ఎక్స్‌ప్రెస్ వచ్చింది. అక్కడ కోచ్ డిస్‌ప్లే సౌకర్యం లేదు. రైల్ యాత్రి యాప్‌లో రేక్ పొజిషన్ చూసి ఒక చోట నిలబడ్డాను. ఎస్.8 నాది. ధర్మవరంలో వేడి వేడి అలసంద మసాలా వడలు, నంచుకోవడానికి పచ్చిమిర్చి వచ్చాయి. అవి అక్కడ చాలా ఫేమస్. ఆరు వడలు కొనుక్కొని, తినేశాను. అది నా డిన్నరన్నమాట. ఉదయం ఐదు గంటలకు కాచిగూడ చేరాను. బయట ‘పరివార్ ఫుడ్ కోర్ట్’ లో ఇరానీ చాయ్ తాగి, ఆరు గంటలకు ఇల్లు చేరాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here