[dropcap]వి[/dropcap]జయుడు విద్యాపతి గురుకులంలో అనేక యుద్ధ విద్యలతో పాటు మూలికా శాస్త్రం, వైద్యశాస్త్రం వంటి విద్యల మీద కూడా మంచి పట్టు సాధించాడు.
విద్యాపతి పెట్టిన అనేక పరీక్షలలో నెగ్గిన తరువాత ఆయనకు తగిన గురుదక్షిణ చెల్లించాడు.
“నాయనా నీవు నేర్చుకున్న నీ విద్యలు కేవలం నీ సంపాదన కోసమే కాకుండా ఇతరులకు మేలు చేయగలగాలి, కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవాలి, అది గుర్తు పెట్టుకో చాలు. నీవు ఎవరికైనా చేసే మేలే నాకు నిజమైన గురుదక్షిణ” అని చెప్పి ఆశీర్వదించి పంపాడు.
గురువుకు నమస్కరించి విజయుడు తన గుర్రం మీద వెళ్ళాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో బయలుదేరాడు. అలా కొండలు, గుట్టలు, అడవులు దాటుకుంటూ వెళుతుండగా దూరంగా ఒక కోట కనిపించింది. ఆ కోట విశేషాలు తెలుసుకుందామని అక్కడికి వెళ్ళి ద్వారపాలకుడిని ఆ కోట వివరాలు అడిగాడు.
“ఇది వీరసింహ మహారాజు కోట, ఆయన ఉత్తమ పరిపాలకుడు. కానీ ఆ తూర్పు కొండలలో పురుగు జాతినుండి ఉద్భవించిన కీటకధనుడు అనే వాడు ఈ కోటను ఆక్రమించాలని, రాజు గారి కూతురిని పెళ్ళి చేసుకోవాలని ఎత్తులు వేస్తూ వీరసింహమహారాజుకి కష్టాలు కలిగిస్తున్నాడు. మా రాజుగారికి యుద్ధ విద్యలు తెలిసినా ఆ విద్యలు ఆ కీటకధనుణ్ణి ఏమీ చేయలేక పోతున్నాయి” అని వివరించాడు ద్వారపాలకుడు.
“అయితే నన్ను మీ వీరసింహమహారాజు వద్దకు తీసుక వెళ్ళు. నేను విద్యాపతి గురుకులంలో అనేక విద్యలు నేర్చుకున్నాను. నా విద్యలు ఆయనకు సంభవించిన కష్టాన్నుండి గట్టెక్కించ గలవని నా విశ్వాసం. కలసి చర్చిస్తేనే కదా విషయం తెలుస్తుంది” చెప్పాడు విజయుడు.
విషయం విన్న తరువాత విజయుణ్ణి ద్వారపాలకుడు వీరసింహుని వద్దకు తీసుక వెళ్ళాడు.
వీరసింహునికి తనను తాను పరిచయం చేసుకుని తనకు వచ్చిన అనేక విద్యల గురించి ఆయనతో చర్చించాడు.
“విజయుడా, నాకు కూడా అనేక విద్యలు వచ్చు. కానీ ఆ కీటకధనుడు అటవికరాజు. నా కోట మీద పడి సంపదను దోచుకోవడమే కాక నా కూతుర్నిచ్చి పెళ్ళి చేయమని వేధిస్తున్నాడు. నేను ఎన్ని శస్త్ర, అస్త్రాలు ప్రయోగించినా వాడిని ఓడించలేక పోతున్నాను. దానికి కారణం వాడు మానవమాత్రుడుకాదు, ఒక పురుగు అంశగా జన్మించిన వాడు. వాడికి శరీరం అంతా కవచం లాటి పొలుసులు పుట్టుకతో వచ్చినవి ఉంటాయి! వాటిని ఏ అస్త్రం మట్టుపెట్ట లేకపోతోంది” చెప్పాడు వీరసింహుడు.
“నన్ను ఒక్కరోజు ఆలోచించుకోనివ్వండి, వాడిని ఏవిధంగా అంతమొందించాలో నా శాస్త్రాలను ఆకళింపు చేసుకుని రేపే నా ప్రణాళిక చెబుతాను” చెప్పాడు విజయుడు.
“సరే విజయుడా నీకు కోటలో వసతి ఏర్పాటు చేస్తాను, నీవు విశ్రాంతి తీసుకుని ఆలోచించు” భటుడిని విశ్రాంతి గృహానికి తీసుక పొమ్మని చెప్పాడు.
ఆ రాత్రి విజయుడు తాను చదివిన పురుగు శాస్త్రం, వృక్ష శాస్త్రాలను గురించి లోతుగా మనసులోనే అధ్యయనం చేసుకున్నాడు. వెంటనే ఆ కీటకధనుణ్ణి చంపే ఉపాయం దొరికింది.
రెండోరోజు విజయుడు వీరసంహుణ్ణి కలసి తనకు వాడిని చంపే ఉపాయం దొరికినట్లు చెప్పి ఆ కీటకధనుడు ఎక్కడ ఉంటాడో చూపించమన్నాడు.
“అతను కీటక అంశ ఉన్నవాడు కాబట్టి ఆ కొండల్లో ఎక్కడ ఉంటాడో ఎవ్వరికీ తెలియదు అమావాస్య రోజు నన్ను బెదరించడానికి కోట దగ్గరకు వస్తాడు. అప్పుడు నీకు తెలిసిన యుద్ధ విద్యలు ఉపయోగించు, కానీ జాగ్రత్త, ఒక్కొక్క సారి బాణాలు వాడికి పుట్టుకతోనే ఏర్పడిన కవచాన్ని ఛేదించలేవు” అని హెచ్చరించాడు.
“నా బాణపు ముల్లుకి రాతినుండి తీసిన రసాయనం పూస్తాను, అదిగాక బాణాలకు వేప పసరు పూస్తాను. ఆ కీటకధనుణ్ణి సంహరించడానికి అవి చాలు” అని పూర్తి విశ్వాసంతో చెప్పాడు విజయుడు.
అనుకున్నట్టే అమావాస్య రోజు విజయుడు తాను సిద్ధం చేసిన బాణాలతో కోట బురుజుమీద వాడి రాక కోసం వేచి ఉన్నాడు.
కీటకధనుడు తలపైన రెండు కొమ్ములతో శరీరమంతా ఒక విధమైన పొలుసుల కవచంతో కోట ద్వారం వద్దకు వచ్చాడు. విజయుడు బాగా గురి చూసి వాడి గొంతు మీద తను సిద్ధం చేసిన బాణాలు ప్రయోగించాడు. ఆ శక్తివంతమైన బాణాలు వాడి గొంతుమీద పలుచని కవచాన్ని చీల్చి వేసి వాడి శరీరంలో దిగబడ్డాయి! బాణాల పైన వేప పూత వాడి పాలిట యమపాశం అయింది. వాడు పెద్ద కీచు గొంతుతో అరుస్తూ పడి విజయుణ్ణి చూస్తూ ప్రాణాలు వదిలాడు!
వీరసింహుడు అతని పరివారం కీటకధనుణ్ణి చంపినందుకు హర్షం వెలిబుచ్చారు.
విజయుని జ్ఞానాన్ని ఎంతో మెచ్చుకున్న వారందరూ వీరసింహుని కూతురుకి తగిన జోడీ అని నిర్ణయించారు. ఆ విధంగా విజయుడి వివాహం వైభవంగా వీరసింహుని కూతురు చంద్రావతితో జరిగింది.
అప్పటినుండి వేపకు పురుగులను సంహరించే శక్తి ఉందని అందరూ తెలుసుకుని పంట పొలాలకు పురుగు చీడ తప్పించడానికి కీటకనాశినిగా వేపరసం వాడసాగారు. ఆ ప్రక్రియ ఇప్పటి రైతులు కూడా ఉపయోగిస్తున్నారు అది శాస్త్రానికి ఉన్న శక్తి. ఈ విషయాలన్నీ గురువు విద్యాపతికి తెలిసి తన శిష్యుడు ఒక రాజ్యాన్ని పురుగు జాతినుండి కాపాడినందుకు ఎంతో సంతోషించి అదే పెద్ద గురుదక్షిణగా భావించాడు.
అప్పటినుండి విజయుడు రైతులకు మేలు చేసే ఎన్నో పరిశోధనలు చేస్తూ గొప్ప పేరు తెచ్చుకున్నాడు.