[dropcap]ఫి[/dropcap]డేలు అతని వారసత్వ సంపద
అతనికెంతో గర్వకారణం
దాన్ని వాయించేటప్పుడల్లా
రక్తరాగ రంజితమైన తన ముఖాన్నీ
అందులో తాదాత్మ్యాన్నీ మీరు తప్పక గమనిస్తారు
నదుల్లో నౌకలు మునిగిపోయేటప్పుడు
తీరాన గంభీర గానతపస్విని మీరు వీక్షిస్తారు
వేలవేల తుది శ్వాసల్ని సంగతులుగా మార్చుకోవటం
అందరికీ సాధ్యం గాదు
చివరి ఊపిర్లు ఆగిన చోట
అద్భుత దీపక రాగం ఆలపించి
మరణానంతర దీపాలు వెలిగించటం
మామూలు సంగీతకోవిదులకి అలవడే విద్య కాదు
ఫిడేలు మిక్కిలి విశిష్ట వాద్యం
అది తనని పొదువుకున్న నీరోని
అడవుల అలజడినీ సముద్రాల ఉప్పెననీ
భీషణ శంఖ నినాదాల్నీ విస్మరించేలా
పరవశం చేస్తుంది
భయంకర లీనావస్థలో
కమాను చివర రాలే రసబిందువుల్ని
మీరు గమనించారా
కమాను తీగపై తళుకులీనే మంటల వెలుగును చూస్తూ
మోహనరాగం పలికించటం మరెవరికి సాధ్యం?
ఫిడేలు వాయించే ఆ వేళ్లు శాశ్వతం కాకపోయినా
ఫిడేలు శాశ్వతం
ఫిడేలు మిక్కిలి విశిష్ట వాద్యం
అది మహా మకుటధారుల వారసత్వ సంపద
అతని తర్వాత ఇంకొకళ్ల తర్వాత మరొకళ్ల తర్వాత
అలా అలా దాన్ని వాయిస్తూనే ఉంటారు
అన్నీ అంతటా తగలబడుతూనే ఉంటాయి
మంటల వెలుగులు
ఆ మహా సంగీత విద్వాంసుణ్ణి
మురిపిస్తూనే ఉంటాయి