Site icon Sanchika

ఫోటో

[శ్రీ ఎం.ఆర్.వి. సత్యనారాయణ మూర్తి రచించిన ‘ఫోటో’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘ఇ[/dropcap]క్కడ స్కూల్ ఉండాలిగా, ఎక్కడకి మారింది?’ సైగలు చేసి అడిగింది ఓ పెద్దావిడ అక్కడున్న కుర్రాడిని.

ఆ సైగలు అర్థం కాక ‘ఆ..’ అన్నాడు ఆ కుర్రాడు. ఆవిడ మళ్ళీ సైగలు చేసింది. ‘నాకేం తెలియదు’ అని వెళ్ళిపోయాడు ఆ కుర్రాడు. చుట్టూ చూసింది. అన్నీ షాపులే కనిపించాయి. ఒక షాప్ దగ్గరకు వెళ్లి హ్యాండ్ బాగ్ లోంచి రైటింగ్ పాడ్ తీసి ‘ఇక్కడ హై స్కూల్ ఉండేది. ఎక్కడకు మారింది?’ అని రాసి షాప్ అతనికి చూపించింది. సరుకులు కొనుక్కోవడానికి వచ్చిన మంగారెడ్డి అది చూసి ‘స్కూల్ మూసేశారు అమ్మా’ అని చెప్పాడు. ‘ఎందుకు?’ అని సైగ చేసి అడిగింది ఆవిడ.

మంగారెడ్డి తను కూర్చున్న స్టూల్ మీంచి లేచి ‘మీరు ఇలా కూర్చోండి. నేను చెబుతాను’ అని అన్నాడు. ఆవిడ స్టూల్ మీద కూర్చున్నారు. “ఊళ్ళో, బయటా కాన్వెంట్లు పెరిగిపోయాయి. అందరికీ ఇంగ్లీష్ మీద మోజు పెరిగింది. ఏటా పిల్లలు తగ్గిపోవడంతో స్కూల్ మూసేశారు. మాస్టర్లని తలో ఊరుకి బదిలీ చేసేసారు” చెప్పాడు మంగారెడ్డి. ఆ మాటలు వినగానే ఆవిడ హతాశురాలు అయ్యింది. నెమ్మదిగా బాగ్ తీసి అందులోంచి వాటర్ బాటిల్ తీసి మంచినీళ్ళు తాగింది. ఆవిడని అలా చూడగానే మంగారెడ్డికి బాధ కలిగింది.

“మీరు ఈ స్కూల్‍లో ఎప్పుడు చదువుకున్నారు?” అడిగాడు మంగారెడ్డి.

‘పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది, పదవ తరగతి బ్యాచ్ మాది’ పాడ్ మీద రాసింది ఆవిడ.

“అబ్బో అప్పటికి నేను పుట్టనే లేదు” నవ్వుతూ అన్నాడు మంగారెడ్డి. ‘మరి నాకు అప్పటి వాళ్ళ గురించి సమాచారం ఎలా తెలుస్తుంది?’ పాడ్ మీద రాసింది ఆవిడ. “అంటే నలభై ఐదు సంవత్సరాల క్రితం చదువుకున్న వాళ్ళు దొరకాలి..” దీర్ఘంగా ఆలోచిస్తూ అన్నాడు మంగారెడ్డి. ‘అవును’ అన్నట్టు తలూపింది ఆవిడ.

“మా ఇంటి పక్కన షావుకారు ఒకాయన ఉన్నాడు. పెద్దాయనే. ఆయన్ని అడిగితే మీకు ఏమైనా చెప్పగలడు. రండి మా ఇంటికి వెళ్దాం” అని ఆవిడ్ని స్కూటర్ ఎక్కించుకుని కాకిలేరు రోడ్డులో ఉన్న తన ఇంటికి తీసుకువచ్చాడు. మంగారెడ్డి ఇంటి పక్కనే ఉన్న పెంకుటిల్లు దగ్గరకు వెళ్లి “భూషణం గారూ” అని గట్టిగా పిలిచాడు మంగారెడ్డి. కొద్దిసేపటికి ఒక పెద్దాయన బయటకు వచ్చాడు. “మంగారెడ్డీ, నువ్వా! అక్కడే నిలబడి పోయావే, లోపలకు రా” అని ఆహ్వానించాడు. ఇద్దరూ గేటు తీసుకుని లోపలకు వచ్చారు.

“ఈవిడ ఎవరూ? చుట్టాలా?” అడిగాడు భూషణం.

“కాదండి. మన చెరువుగట్టు దగ్గర ఉండే హై స్కూల్‍లో నలభై ఐదేళ్ళ క్రితం పదవ తరగతి చదువుకున్నారట. అప్పటి వాళ్ళు ఎవరైనా మీకు తెలుసునేమోనని మీ దగ్గరకు తీసుకువచ్చాను.”

“అబ్బే, నేను పదో తరగతి వరకూ వెళ్ళలేదు. ఎనిమిదితో మానేసాను. తర్వాత వ్యాపారంలోకి దిగాను. కానీ నా తర్వాత మా చెల్లెలు పదవతరగతి చదివింది.. ఎప్పుడంటే..” అని ఆగి ఒక నిముషం ఆలోచించి “ఆ. పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో. ఎందుకంటే అప్పడే మా అమ్మ పోయింది. మా చెల్లాయి పరీక్షలకు వెళ్ళనంటే మా నాన్న బతిమాలి పంపాడు. నువ్వు పరీక్షలు రాసి పాస్ అయితే అమ్మ సంతోషిస్తుందని. అందుకని వెళ్లి పరీక్షలు రాసి పాస్ అయింది” దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు భూషణం.

ఆవిడ ‘మీ చెల్లాయి పేరు ఏమిటి?’అని పాడ్ మీద రాసి భూషణంకి చూపించింది.

“నాగమణి అమ్మా” అన్నాడు భూషణం.ఆ మాట వినగానే ఆవిడ కళ్ళు ఆనందంగా మెరిసాయి. అది చూసాడు మంగారెడ్డి. “భూషణం గారూ, మీ చెల్లాయి గారికి ఓ సారి ఫోన్ చేయండి. ఈ మేడంతో మాట్లాడతారు” అన్నాడు మంగారెడ్డి.

“అది కుదరదు మంగారెడ్డి. మా చెల్లాయికి రెండేళ్ళ క్రితం పక్షవాతం వచ్చి కాలూ, చెయ్యితో పాటు నోరు కూడా పడిపోయింది. హైదరాబాద్‍లో కొడుకు దగ్గర ఉంటోంది” బాధగా అన్నాడు భూషణం. ఉన్న కొద్దిపాటి ఆశ నీరుగారిపోవడంతో ఆవిడ చాలా దిగులుపడింది. రెండు నిముషాలు గడిచాయి.

“ఆ.. మంగారెడ్డి, ఓ విషయం గుర్తుకువచ్చింది. మన ఊళ్ళో జోశ్యుల వెంకన్న పంతులు గారు పౌరోహిత్యం చేసేవారు. ఆయన కూతురు మా చెల్లాయితో చదువుకుంది. నాలుగేళ్ల క్రితం మా చెల్లాయి తనని చూడాలంటే, నా మోపెడ్ మీద పాలకొల్లు తీసుకెళ్ళాను. బ్రాడీపేట మొదటివీధిలో, కుళాయిల చెరువు ఎదురుగా ఉన్న మేడలో ఉంటున్నారు. ఆయన లెక్చరర్ చేసి అప్పుడే రిటైర్ అయ్యారంట. ఆయన పేరు శాస్త్రి గారు. వెంకన్న గారి అమ్మాయి పేరు జయలక్ష్మి. ఆవిడని కలిస్తే విషయాలు తెలుస్తాయి” అన్నాడు భూషణం.

“ఆళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఉందా?” అడిగాడు మంగారెడ్డి. లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు భూషణం. ‘సరే’నని ఆవిడని తీసుకుని తన ఇంటికి వచ్చాడు మంగారెడ్డి. అప్పటికి పన్నెండు గంటలు అయ్యింది. “మేడం గారు, మా శివపురంలో భోజనం హోటల్లో మీ వంటి వాళ్ళు తినలేరు. మా ఇంట్లో భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోండి. నేను నా స్కూటర్ మీద మిమ్మల్ని పాలకొల్లు తీసుకెళ్తాను” అన్నాడు మంగారెడ్డి. అతని మాట కాదనలేక వాళ్ళింట్లోనే భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకుంది. తర్వాత ఇద్దరూ స్కూటర్ మీద పాలకొల్లు వెళ్ళారు. భూషణం చెప్పినట్టుగా అడ్రస్ తేలికగా దొరికింది. గేటు తీసుకుని లోపలకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టగానే జయలక్ష్మి వచ్చి తలుపు తీసింది.

“మాది శివపురం. సూర్రెడ్డి గారి అబ్బాయి మంగారెడ్డిని. ఈ మేడం మీతో పదవతరగతి చదివారట. మిమ్మల్ని చూడాలని వచ్చారు చాలా దూరం నుంచి” అన్నాడు మంగారెడ్డి. ఇద్దర్నీ లోపలకు ఆహ్వానించింది జయలక్ష్మి. ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. “మీరు..” అంటూ ఆగింది జయలక్ష్మి ఆవిడకేసి తిరిగి. ఆవిడ హ్యాండ్‌బాగ్ లోంచి తన విజిటింగ్ కార్డు తీసి చూపించింది. “ఓ.. నువ్వా. గుర్తు పట్టలేకపోయాను సునందా. ఏమనుకోకు. నువ్వు లెక్కలు బాగా చేసేదానివి” అంది జయలక్ష్మి.

సునంద పాడ్ మీద ‘మన పదవతరగతి గ్రూప్ ఫోటో ఉందా నీ దగ్గర? ఒకసారి ఇస్తే ఫోన్‌లో ఫోటో తీసుకుంటాను’ అని రాసి జయలక్ష్మికి చూపించింది. “ఈయనది గవర్నమెంట్ కాలేజీలో ఉద్యోగం. బదిలీల వలన సామాన్లు తరలించడంలో ఎక్కడో మిస్ అయ్యింది” దిగులుగా చెప్పింది జయలక్ష్మి. ఆమె మాటలకు సునంద చాలా నిరాశకు లోనయ్యింది. ఒక నిముషం గడిచాకా ‘వెంకటలక్ష్మి గురించి తెలుసా?ఆమె ఎక్కడ ఉంది?’ పాడ్ మీద రాసి చూపించింది. తల అడ్డంగా ఊపింది జయలక్ష్మి.

“నీలాగే తను కూడా పదవతరగతి పూర్తి కాగానే శివపురం నుండి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్నగారు బ్యాంకులో పనిచేసేవారు కదా. ఆయనకి బదిలీ అవడంతో తనూ వెళ్ళిపోయింది. ఆ.. నువ్వొక పని చెయ్యి. తణుకు పెద్ద హై స్కూల్ ఎదురుగా ఉన్న ఫోటో స్టూడియో ఆయనే మన గ్రూప్ ఫోటో తీసారు. వాళ్ళు ఒక కాపీ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు పబ్లిసిటీ కోసం. నువ్వు అక్కడ ట్రై చేస్తే ఫోటో దొరకవచ్చు” అంది జయలక్ష్మి . ఆమెకి థాంక్స్ చెప్పి ఇద్దరూ తిరిగి శివపురంబస్సు స్టాండ్‌కి వచ్చారు. ‘చాలా థాంక్స్’ అన్నట్టు, మంగారెడ్డి రెండు చేతులూ పట్టుకుంది సునంద. “భలే వారండి. మీరు మా అక్క లాంటి వారు” అన్నాడు మంగారెడ్డి.

ఈలోగా తణుకు వెళ్ళే బస్సు వచ్చింది. సునందని బస్సు ఎక్కించి “కండక్టర్ గారూ, ఈ మేడం గారిని తణుకు పెద్ద హై స్కూల్ దగ్గర దింపండి” అని చెప్పాడు మంగారెడ్డి. సునంద బస్సులో కూర్చున్నదన్న మాటే గానీ ఆమె మనస్సు చాలా గజి బిజీగా ఉంది. ఎన్నో ఆశలతో ఇక్కడికి వచ్చింది. తను చదువుకున్న స్కూల్‌ని తనివితీరా చూడాలని, తన స్నేహితుల్ని ఒకరిద్దరి నైనా కలవాలని అనుకుంది. కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదు.

అరగంట గడిచేసరికి బస్సు తణుకు పెద్ద హై స్కూల్ దగ్గర ఆగింది. సునంద బస్సు దిగింది. రోడ్ అవతల ఉన్న శ్రీ జయ డిజిటల్ స్టూడియోకి వెళ్ళింది. కౌంటర్‌లో ఉన్న యువకుడికి తన విజిటింగ్ కార్డు చూపించింది. “ఏం కావాలి మేడం” ఆదరంగా అడిగాడు అతను. ‘1978లో శివపురం హై స్కూల్ గ్రూప్ ఫోటో మీరు తీసారని చెప్పారు. అది కాపీ కావాలి’ పాడ్ మీద రాసి చూపించింది. ఒక్క నిముషం ఆమె కేసి చూసాడు. ఈ ఫోటో కోసం ఆవిడ చాలా శ్రమపడుతోందని గ్రహించాడు.

“మేడం ఈ ఫోటో మా నాన్నగారు తీసారు. ఆయన చనిపోయారు. నాలుగేళ్ల క్రితం ఆ స్కూల్‌లో పనిచేసిన గుమాస్తా రామనాధం గారు వచ్చి ఆ ఫోటో పట్టుకెళ్ళారు. ఆయన మాకు దూరపు బంధువు” చెప్పాడు అతను. ‘ఆయన అడ్రస్, ఫోన్ నెంబర్ కావాలి’ పాడ్ మీద రాసింది సునంద. అతను అడ్రస్ రాసి ఇచ్చాడు. అది చెన్నై అడ్రస్. “ఆయన రిటైర్ అయ్యాకా చెన్నైలో కొడుకు దగ్గర ఉంటున్నారు” చెప్పాడు అతను. సునంద అతనికి థాంక్స్ చెప్పి బస్సు స్టాండ్‌కి వచ్చి విజయవాడ బస్సు ఎక్కింది. తనకి ఆ ఫోటో చాలా ముఖ్యం. రామనాధం గారికి ఫోన్ చేసి పంపమని అడిగినా చాలా టైం పడుతుంది. కానీ తనకి ఇంకా రెండు రోజులే టైం ఉంది. ఈలోగా ఆ ఫోటో సంపాదించాలి. ఆమె ఆలోచనలలో ఉండగానే బస్సు విజయవాడ వచ్చింది. టిఫిన్ తినేసి రెడీ గా ఉన్న చెన్నై ఎ.సి. బస్సు ఎక్కింది సునంద.

మర్నాడు ఉదయం చెన్నైకి చేరుకొని రామనాధం గారి ఇంటికి వెళ్ళింది. ఆయన కుర్చీలో కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు.. ఆయనకీ నమస్కరించి తన విజిటింగ్ కార్డు చూపించింది. కూర్చోమని చెప్పి “ఏం కావాలి” అని అడిగారు. తను శివపురం హై స్కూల్‌లో పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో పదవ తరగతి చదువుకున్నానని, అప్పటి గ్రూప్ ఫోటో కోసం వచ్చానని, తణుకు ఫోటో స్టూడియో అతను మీ అడ్రస్ ఇచ్చారని పాడ్ మీద రాసి చూపించింది సునంద. రామనాధం గారు భార్యని కేకేసి ‘కాఫీ తెమ్మనమని’ చెప్పారు. సునంద కేసి తిరిగారు.

“నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగంలోకి వచ్చావు. స్కూల్ పెట్టాకా మీది పదవ తరగతి మొట్టమొదటి బాచ్. అప్పుడు మీరు ఇరవై మందే ఉన్నారు. బంగారం లాంటి స్కూల్ అలా మూతబడిపోయింది. మొన్నామధ్యే తణుకు వెళ్లి ఆ ఫోటో తెచ్చాను” అని లేచి అలమారలో ఉన్న ఆ గ్రూప్ ఫోటో తెచ్చారు. “నేను ఈ ఫోటోలో లేకపోయినా మన స్కూల్ మీది అభిమానంతో, తీపి జ్ఞాపకంగా ఉంటుందని నా దగ్గర ఉంచుకున్నాను” అని ఆ ఫోటో సునందకి ఇచ్చారు రామనాధం. వణుకుతున్న చేతులతో ఆ ఫోటో తీసుకుని చూసింది. తనూ, తన ప్రియ నేస్తం వెంకటలక్ష్మి పట్టు పరికిణీలు కట్టుకుని పక్క పక్కనే ఉన్నారు. ఆమె కళ్ళనుండి ఆనంద భాష్పాలు జల జలా రాలాయి. ఒక నిముషం గడిచాకా చీర కొంగుతో కళ్ళు తుడుచుకుని, తన ఫోన్‌లో ఆ గ్రూప్ ఫోటో ని నాలుగు స్నాప్‌లు తీసుకుంది సునంద.

ఆమె భావోద్విగ్నతను మౌనంగా గమనించారు రామనాధం. ‘ఇది ఒక కాపీ తీయించి ఇవ్వగలరా?’ అడిగింది ఆమె. ఆయన వెంటనే కొడుకుని కేకేసి, ఫోటో ఇచ్చి “దీనిని రెండు కాపీలు తీయించి పట్టుకురా” అని పురమాయించారు. చాలా సేపు స్కూల్ విషయాలు మాట్లాడాక వెంకటలక్ష్మి గురించి అడిగింది సునంద. “నీలాగే ఆమె కూడా పెద్ద ఉద్యోగమే చేస్తోంది కాకినాడలో. రేపే రిటైర్‌మెంట్ రమ్మనమంది” అన్నారు రామనాధం. ఆయన బలవంతం మీదే వాళ్ళ ఇంట్లో భోజనం చేసి, గ్రూప్ ఫోటోలు రెండు తీసుకుని రైలు ఎక్కింది సునంద. గ్రూప్ ఫోటో మరోసారి చూసుకుని మురిసిపోయింది. ఫోటో తీసే రోజున తనకి మంచి బట్టలు లేకపోతే, వెంకటలక్ష్మే తన పట్టు పరికిణీ, జాకెట్టు ఇచ్చింది. తనకి మాటలు రావని ఎవరైనా హేళన చేసినప్పుడు, తన పక్షాన నిలబడి వారితో దెబ్బలాడేది. “సునందా, నువ్వు మే, ముప్పైన పుట్టావు. నేను ఏప్రిల్ ముప్పైన పుట్టాను. నీకంటే నెల పెద్దదానిని” అనేది. మర్నాడు ఉదయం కాకినాడ చేరుకుంది సునంద.

ఉదయం పదిగంటలకు ఫంక్షన్ హాలుకు చేరుకొని నిర్వాహకులకు తన విజిటింగ్ కార్డు ఇచ్చి సభలో తను మాట్లాడతానని చెప్పింది. కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు వెంకటలక్ష్మి సేవలు కొనియాడి ఆమెని ఘనంగా సత్కరించారు. తర్వాత “శ్రీమతి సునంద, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిణి, చిత్తూరు వారు ఇప్పుడు ప్రసంగిస్తారు” అని అనౌన్స్‌మెంట్ రాగానే, వెంకటలక్ష్మి ఆశ్చర్యపోయింది. నెమ్మదిగా వేదిక మీదకు వచ్చిన చిన్ననాటి స్నేహితురాలిని చూసి ఆనందంగా లేచి కౌగలించుకుంది. బంగారురంగు ఫ్రేము కట్టిన తమ గ్రూప్ ఫోటోని వెంకటలక్ష్మికి ఇచ్చింది సునంద. ఆ ఫోటో చూసి చాలా ఆనందించింది వెంకటలక్ష్మి.

“నా జీవితంలో మరిచిపోలేని కానుక ఇచ్చావు” అని సునందని అక్కున చేర్చుకుంది వెంకటలక్ష్మి.

Exit mobile version