[box type=’note’ fontsize=’16’] “కథ అంటూ యెక్కువగా చెప్పుకోవడానికి లేదు గాని ఇద్దరు ప్రధాన పాత్రధారుల మనస్సులను వారి జీవిత, పరిసరాల చిత్రణ ద్వారా ఆవిష్కరించిన సినిమా” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘ఫొటోగ్రాఫ్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
[dropcap]త[/dropcap]న మొదటి చిత్రంతోనే (లంచ్ బాక్స్) ప్రజలను, విమర్శకులను ఆకర్షించిన రితేష్ బత్రా ఈ సారి “ఫొటోగ్రాఫ్”తో మనముందుకొచ్చాడు. ఈ రెంటి మధ్య వో లఘు చిత్రమూ, రెండు ఆంగ్ల చిత్రాలూ తీశాడు. కాని లంచ్ బాక్స్ చూసి వొక పెద్ద ఆపేక్షతో మనం ఈ చిత్రం చూస్తే కాస్త భంగపడతాము.
కథ అంటూ యెక్కువగా చెప్పుకోవడానికి లేదు గాని ఇద్దరు ప్రధాన పాత్రధారుల మనస్సులను వారి జీవిత, పరిసరాల చిత్రణ ద్వారా ఆవిష్కరిస్తాడు. లంచ్ బాక్స్ లో లాగా ఈ కథ కూడా ముబైలోనే జరుగుతుంది. తోసుకుంటూ పరిగెడుతూ వుండే నగరంలో, జనసమ్మర్ధం యెక్కువ వున్న నగరంలో, మనిషి యేకాకి గా కూడా మిగులుతాడు కొన్నిసారులు. ఇందులో రఫీ, మిలోని లలా. రఫీ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చి ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గర ఫొటోలు తీస్తుంటాడు. బీహార్, తదితర ప్రాంతాలనుంచి వలస వచ్చిన మరో నలుగురితో కలిసి వో గదిలో వుంటాడు. వూళ్ళో ముసలి నానమ్మ. రఫి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతే, తనే ఇంటి బాధ్యత తీసుకుని ఇద్దరు అక్కల పెళ్ళిళ్ళూ బాగా జరిపిస్తాడు. తండ్రి కట్టిన ఇల్లు కుదువ పెట్టబడి వుంది. ఆ అప్పు తీర్చేందుకు కష్ట పడుతూ వుంటాడు, పెళ్ళిని వాయిదా వేస్తూ వుంటాడు. చేసుకొమ్మని పోరే నానమ్మ మాటలను పట్టించుకోడు. ఆమె అలిగి మందులు వేసుకోవడం మానేస్తుంది. మరో పక్క వో కాస్తో కూస్తో బాగున్న గుజరాతీ కుటుంబంలో రెండో కూతురు మిలోని. చిన్నప్పడు నాటకాలలో అవార్డులు గెలుచుకొస్తే, ఇప్పుడు CA foundation లో తెచ్చుకుని, finals కోసం కష్ట పడుతూ వుంటుంది. యెక్కువగా మాట్లాడదు. అంతర్ముఖి. మొదటి సన్నివేశంలోనే ఆమె పరిస్థితి వివరిస్తాడు దర్శకుడు. ఆమెకోసం బట్టలు కొనడానికి వెళ్ళినపుడు ఆమె ఇష్టం అడగకుండానే తల్లి, అక్కా నిర్ణయించేసుకుని వో పింక్ సల్వార్ కొంటారు. ఆమె మౌనంగా తీసుకుంటుంది. చిన్నప్పుడు ఇష్టమైన నటనాశక్తిని ఇంట్లో వాళ్ళ కారణంగా అణచుకుని చదువు మీద దృష్టి పెడుతుంది. ఆమెతో సభ్యులు యెక్కువగా మాట్లాడుతూ వున్నట్టు కూడా కనబడరు. ఆమెది స్వయంగా కప్పుకున్న దుప్పటి లాంటి యేకాంతమైతే, రఫీ ది ఆర్థిక సమస్యలు, బాధ్యతల కారణంగా యేర్పడిన యేకాంతం.
ఇది చదవడానికి బాగానే వుంది కదూ. కాని తెరపై చూడాలంటే చాలా సహనం కావాలి. నాయికానాయకుల పెదాలపై చిరునవ్వు కనబడదు, చాలా దృశ్యాలే లైటింగ్ తగ్గి వో మెలంకలీ లోకి తీసుకెళ్తాయి. వాళ్ళ మధ్య మాటలు కూడా మరీ తక్కువ. ఇక నవ్వు, మాటలూ అంటూ వినబడితే రఫీ స్నేహితులనుంచి, అతని నానమ్మ నించి. వారి వొంటరితనం అర్థం చేసుకోగలను కాని తెర మీదది మరీ గ్లూమీ గా అనిపించింది. సంభాషణలు నిరాశ పరిచాయి. ఇలాంటి చిత్రాలలో కనీసం మాటలద్వారానైనా కొంత అందించ వచ్చు. టిం జిల్లిస్, బెన్ కచిన్స్ చాయాగ్రహణం సాంకేతికంగా బాగుంది, కాని ఆ చీకటి మరీ చిక్కగా, నిస్పృహ కలిగించేదిలా అనిపించింది. నవాజుద్దిన్ షేక్ రఫీగా బాగా చేశాడు. అలాగే సాన్యా మలహోత్రా మిలోనిగా. కాని బాగా గుర్తుండిపోయేది మాత్రం ఆ లొడలొడా మాట్లాడే జీవమున్న నానమ్మ పాత్రలో ఫారూఖ్ జఫార్. ఆమె వొక చోట రఫీ తో అంటుంది, యెందుకు గతాన్ని అలా మోసుకుని, నవ్వడం కూడా మరచిపోయి, తిరుగుతావు. యేం కాదులె, నవ్వుతూ బతుకాలి అని. పాపం ఈ ముక్క మిలోనితో చెప్పే వాళ్ళుండరు. రఫీ వాళ్ళుంటున్న గదిలోనే ఇదివరలో వొకతను (విజయ్ రాజ్) అర్ధరాత్రి ఉచ్చ పోసుకుందామని లేచి ఫేన్ కు ఉరితీసుకున్నాడు. చనిపోయినా మనశ్శాంతినివ్వని నగరం ముంబై.
కొన్ని కొన్ని చోట్ల మెరిసే ఈ చిత్రం చూడాలంటే సహనం బాగా వున్నవాళ్ళు ప్రయత్నించవచ్చు. నాకైతే మరో లంచ్ బాక్స్ కోసం నిరీక్షణే.