ఫోటోగ్రాఫర్ 2

1
3

(డా. ఆర్. ఉమాశర్మ రచించిన ఫోటోగ్రాఫర్ అనే కథకి ఇది రెండవ భాగం. మొదటి భాగం ఇక్కడ)

~

[dropcap]ఫో[/dropcap]టోగ్రాఫర్‌గా తన వృత్తిలో మంచి పేరు, ప్రఖ్యాతులను సంపాదించే పనిలో బిజీగా ఉన్నాడు రఘు. తెల్లవారింది మొదలు తన పనిని మరింత సమర్థవంతంగా ఎలా చేయాలో ఆలోచిస్తూ ఉండేవాడు. ఆ రోజు మాఘ శుద్ధ పౌర్ణమి, రఘు పుట్టినరోజు. తను ఇరవై ఐదు సంవత్సరాలు నిండి ఇరవై ఆరవ ఏట ప్రవేశించాడు. అమ్మ కమలమ్మ పెందలాడే రఘును నిద్ర లేపి అతని చేతిలో కొత్త బట్టలు పెట్టి ఆశీర్వదించింది. రఘును త్వరగా ఒక ఇంటివాణ్ణి చేయాలన్నది ఆమె తాపత్రయం. “ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు?” అని అమ్మ అడిగినప్పుడల్లా “ఇప్పుడే నా పెళ్ళికి తొందర ఏముంది అమ్మా?” అంటూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. రఘు ప్రస్తుతానికి కేవలం తన వృత్తిపరమైన మెళకువలు మీద మాత్రమే దృష్టి సారిస్తున్నారు. యథావిధిగా రఘు స్నానం చేసి, దేవుడికి ఒక దండం పెట్టి, త్వరగా టిఫిన్ కానిచ్చి, తన స్టూడియో వెళ్లడానికి బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా అమ్మ పిలిచింది. “రఘు, కొంచెం ఆగు, నీతో కొంచెం మాట్లాడాలి” అన్న అమ్మ కేక విని మరలా ఇంటిలోకి వచ్చాడు రఘు. అమ్మ ఒక పెళ్లి ఆహ్వాన పత్రిక రఘు చేతిలో పెట్టి, “ఈ పెళ్లికి మనం వెళుతున్నాము” అంది. “పైగా నువ్వు ఈ పెళ్ళి ఫోటోలు కూడా తీయాలి” అని అంది. – “అయ్యో ఆ డేట్‌కి నేను వేరే పెళ్లి ఒప్పుకున్నా, వెళ్ళలేను” అన్నాడు రఘు. అంతే, అమ్మ కళ్ళు చెమ్మగిల్లటం చూసి రఘు “సరేలే, ఇంతకూ ఎవరు వారు?” అని అడిగాడు.

అమ్మ చెప్పసాగింది – “నేను నిన్ను ఏనాడు ఈ పని చేయి అని బలవంత పెట్టింది లేదు. కానీ ఈ సారి నువ్వు నా మాట దక్కించవలసిందే. నిన్న సాయంత్రం నా చిన్ననాటి స్నేహితురాలు అనసూయ వచ్చింది. తన భర్తను కోల్పోయి ఉన్న ఒక్కగానొక్క కూతురుతో జీవిస్తోంది. ఆ అమ్మాయి వివాహానికి మనల్ని ఆహ్వానిస్తూ ఈ పెళ్లి కార్డు నా చేతిలో పెట్టింది. నిన్ను ఫోటోలు తీయడానికి ఎలాగైనా ఒప్పించి తీసుకొని రావాలని ప్రాధేయపడింది. ఇప్పుడు ఉన్న ఆర్థిక స్థితికి మరలా లక్షల కొలది ఫోటోగ్రాఫర్‌కు ఇచ్చే స్తొమత తనకు లేదని బాధ పడింది. సరే, చిన్ననాటి స్నేహితురాలు, పైగా నా అనేవారు లేని మన జీవితాలకు స్నేహితులే పెద్ద ఆస్తి అని నేను నమ్ముతాను” అంది కమలమ్మ. ఎవరైనా కష్టం అంటే ఆమె గుండె అట్టే కరిగిపోయేది. “నువ్వు నా మాట నిలబెట్టు. ఈ రోజు సాయంకాలం మనం గొరవనపల్లె కు వెళ్తున్నాము. నువ్వు తొందరగా నీ పనులు ముగించి ఇంటికి రా రఘు” అంది. “నువ్వు ఒకవైపు ఆ పెళ్లి పనులు చూసుకుంటూ, ఫోటోలు కూడా తీయాలి” అని అంది కమలమ్మ.

అమ్మ కళ్ళలో కన్నీరు చూసి రఘు ఏమీ చెప్పలేక పోయాడు. తాను ఇది వరకే ఒప్పుకున్న పనులను తన మిత్రుడికి అప్పగించి అమ్మ కోరిక తీర్చడమే కరెక్ట్ అనుకున్నాడు రఘు. “సరే అమ్మా, నేను ఇలా స్టూడియో కు వెళ్లి సాయంకాలానికి తిరిగి వస్తాను. నువ్వు బట్టలు అవి సర్ది రెడీగా ఉండు” అంటూ బైక్ కీ తీసుకొని బయట పడ్డాడు. సాయంకాలానికి పెళ్లి ఫోటోలు తీయడానికి కావలసిన కెమెరా, వెలుగు గొడుగులు, తదితర సరంజామా మరియు ఒక అసిస్టెంట్‌తో పాటు ఇంటికి వచ్చాడు రఘు. అమ్మ అప్పుడే చక్కగ అన్ని సర్ది సిద్దమై కొడుకు కొరకు వేచి ఉంది. కమలమ్మకు దాదాపు యాభై ఏళ్ళు ఉంటాయి. రఘు చిన్న వయసులోనే ఉండగానే తన తండ్రిని కోల్పోయాడు. కమలమ్మలో ఇంకా జీవనోత్సాహం ఏమాత్రం తగ్గలేదు. తన భర్త చనిపోయాక తానే రఘును పెంచి ఇంతటి వాడ్ని చేసింది. రఘుకు, అతని అసిస్టెంట్ కు వేడిగా ఫిల్టర్ కాఫీ అందించింది కమలమ్మ. ఇంటి తాళాలు వేసి పక్క ఇంటి వారికి ఇచ్చి ఇంటి వైపు కాస్త చూస్తూ ఉండమని చెబుతూ నవ్వుతూ కార్‌లో కూర్చుంది కమలమ్మ.

కార్ వేగంగా నగరపు పొలిమేర దాటుతూ ఉంది. సూర్యాస్త వేళ అయింది. సూర్యుడు తన పని ముగించి వడి వడిగా ఇంటికి వెళుతున్నట్టు అనిపించింది రఘుకి. రఘు మంచి డ్రైవర్. రఘును ఫ్రెండ్స్ అందరూ ‘గజ డ్రైవర్’ అని పిలుస్తారు కూడా. లాంగ్ డ్రైవ్‌కి వెళ్ళాలి అంటే వారు రఘుని మాత్రమే డ్రైవ్ చేయమని అడుగుతూ ఉంటారు. రఘు కూడా దూరంగా ఉండే ప్రదేశాలకు అవలీలగా డ్రైవ్ చేస్తూ నవ్వుతూ, జోక్స్ వేస్తూ ప్రయాణానికి కొత్త అందం ఇవ్వగల నేర్పరి. సుమారు 250 కిలోమీటర్ల ప్రయాణాన్ని హాయిగా నవ్వుతూ రెండున్నర గంటలలో ముగించాడు. అంతలో గొరవనపల్లె అనే బోర్డు తారసపడింది. అమ్మ వైపు చూస్తూ అన్నాడు – “ఇదిగో మనం పల్లె లోకి అయితే వచ్చాము. ఇపుడు చెప్పు ఎక్కడికి, ఎలా వెళ్ళాలి అనేది?“. కమలమ్మకు ఎన్నో సంవత్సరాల తరువాత తన పుట్టిన ఊరికి వచ్చింది. అనసూయ మాత్రం పుట్టిన ఊరిలోనే జీవితం మొత్తం గడుపుతూ ఉంది. తన పుట్టింటి నుంచి మూడో ఇల్లు తన స్నేహితురాలు అనసూయది. పుట్టిన ఊరికి వస్తున్న సంతోషం ఒక వైపు, మారిన వీధులు ఒక వైపు, దిక్కు తోచలేదు కమలమ్మకు కొంత సేపు. అంతలో ఏదో గుర్తు చేసుకొని అంది- “అలాగే ఇంకొక ఫర్లాంగు ముందుకు వెళ్తే కుడివైపు ఉండే వీధిలో మూడవ ఇల్లు నా స్నేహితురాలిది” అని.

పందిరి ఉన్న ఇంటి ముందు కార్ ఆగింది. కార్‌లో నుంచి కమలమ్మ, కొడుకు అసిస్టెంట్ దిగారు. వారిని చూసి అనసూయ ఆదరంగా ఆహ్వానించింది. మధుసూదన్ అనసూయ భర్త కండక్టర్‌గా పనిచేసే వాడు. ఆక్సిడెంట్‌లో ఆయన పోయాక వచ్చిన కాస్త కూస్తో డబ్బును కూతురు చదువుకు పెట్టింది అనసూయ. ఒక్కగానొక్క అమ్మాయి. చక్కని చుక్కలా ఉంటుంది. అరవింద అనే పేరుకు న్యాయం చేసే పెద్ద కళ్ళు, బాపు బొమ్మ లాంటి అందం, పెద్ద వాలు జడతో చూడ ముచ్చటగా ఉంది అరవింద. కమలమ్మ ఒకసారి అరవిందని చూసి మనసులో ఇంత చక్కని అమ్మాయి నా ఇంటి కోడలు అయితే ఎంత బాగుండు కదా అనుకుంది. కానీ పదవ తరగతి కూడా పాస్ అవని తన కొడుకు ఆ అమ్మాయికి నచ్చడులే అనుకుంది. పెళ్లి కొడుకు అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడని అనసూయ చెప్పగా విని తన మనసులోని ఆశలకు తనలోనే ఆనకట్ట వేసింది. అమ్మ మనసులోని ఆలోచనలు ఏ మాత్రం తెలియని రఘు పెళ్లి మంటపం వైపు వెళ్లి తనకు ఫోటోలు తీయటానికి కావసిన లైటింగ్, సరంజామా సర్దుకుంటూ ఉన్నాడు.

పెళ్లి పందిరిని చక్కగా పూలతో అలంకరించారు. సంప్రదాయబద్ధమైన రీతిలోపెళ్లి మంటపం అలంకరించారు. పందిట్లో ఎటు చూసిన నవ్వులు, పిల్లల కేరింతలు, కన్నెపిల్లల వయ్యారాలు, ముసలి వారి నవ్వులు, చిన్న పిల్లల ఆటలు, టీనేజ్ కుర్రాళ్ళ చూపులు, వీటన్నిటిని రఘు ఎప్పటికప్పుడు తన కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. కాండీడ్ ఫోటోల పేరిట ప్రత్యేకంగా ఫోటో తీస్తున్నాం అని చెప్పకుండా వారి ఫోటోలు తీయటంలో రఘు నేర్పరి. పనిలో మునిగి పోయే తత్వం ఉన్న రఘును కూడా ఒక్కసారిగా కదిలించింది పెళ్లి కూతురు అరవింద అందం. అమ్మ స్నేహితురాలు అనసూయ ఆంటీ అప్పుడప్పుడూ ఇంటికి వచ్చేది కానీ తనకు ఇంత అందమైన కూతురు ఉంది అని ఎప్పుడూ అమ్మ తనకి కూడా చెప్పలేదు అని అనుకున్నాడు రఘు.

తెల్లవారుఝామున నాలుగు గంటలకే గౌరీ పూజ మొదలు అయింది. గౌరీ పూజ ఫోటోలు తీయటం కోసం రఘు అరవింద రూమ్ కు వెళ్ళాడు. అరవింద చక్కగా అలంకరించబడి ఉంది. పెళ్లి కూతురి నుదుటిన కళ్యాణ తిలకం మరింత అందాన్ని పెంచుతున్నట్టు ఉంది. ఇంత చక్కని అమ్మాయిని తన కెమెరాలో మరింత అందంగా చూపించాలని అనుకున్నాడు రఘు. కెమెరా లోనుంచి అరవిందను దగ్గరగా చూసాడు. అపుడు ఒకసారి అరవింద రఘు ను చూసింది. పలకరింపుగా మీరు కమలమ్మ గారి కొడుకు కదా అని అడిగింది. అవును అన్నట్టు కెమెరా లో నుంచి తల ఊపాడు రఘు.

అటు గౌరీ పూజ ముగించి బయటకు వచ్చేలోపు ఒక పెద్ద తుఫాను వారి జీవితాలలకి వస్తుంది వారిద్దరికి ఆ సమయంలో తెలియదు. హాయిగా అరవింద చక్కగా పూజ చేస్తూ ఉండగా, పెద్ద ముత్తైదువ తల్లి బొట్టు కడుతూ ఉండగా, గౌరీ వాయినాలు ఇస్తూ అందంగా ఫోటోలు తీసాడు రఘు. అమ్మకు ఈ విధంగా తానూ సంతోషాన్ని ఇస్తున్నాను అని సంబరపడసాగాడు రఘునందన్.

ఇంతలో రఘు అసిస్టెంట్ వచ్చి రఘును కాశీయాత్రకు వెళుతున్న వరుడి ఫోటోలు తీయడానికి రావాలి అంటూ పిలిచాడు. కెమెరా సర్దుకొని కాశీయాత్ర వైపు వెడుతున్న రఘు ఒక్కసారిగా వెనుదిరిగి అరవిందను చూసాడు. రెప్పపాటు కాలంలో అరవిందను అంత దగ్గరగా రఘు చూసాడు. గుండెలో ఏదో కొత్త కలవరం అయినట్టు అనిపించింది. వెంటనే తన కర్తవ్యం గుర్తు వచ్చి పందిరి వైపుగా అడుగులు వేసాడు. ఆ నిమిషంలో రఘు ఏదో కొత్త అనుభూతికి లోనయ్యాడు.

కళ్యాణ మంటపం ప్రాంగణంలో గుంపుగా అందరూ నిలబడి ఉన్నారు. మధ్యలో పెళ్లి కొడుకును కుర్చీలో కూర్చోబెట్టారు. చుట్టూ ఉన్న జనం ఒక్కసారిగా ఫోటోగ్రాఫర్ కొరకు వేచి ఉన్నట్టు అనిపిస్తుంది. అంతలో రఘు వచ్చి తన కెమెరా లెన్స్ సరి చేసుకుని పెళ్ళికొడుకు ఫోటో తీయబోయాడు. కెమెరాలో ఒక పెద్ద భూకంపం వచ్చినట్టు అదిరిపడ్డాడు రఘు. పెళ్ళికొడుకు ముఖం బాగా తెలిసినట్టు, ఎక్కడో చూసినట్టు అనిపించింది. రఘుకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టు అయింది. త్వరగా ఫోటోలు తీసి ఇప్పుడు వస్తా అంటూ కెమెరాను అసిస్టెంట్‌కు ఇచ్చి పక్కన ఉన్న కుర్చీలో కూర్చొని మొబైల్ ఫోటోలను చూడసాగాడు.. సరిగ్గా మూడు నెలల కిందట తాను తీసిన పెళ్లి ఫోటోలు ఒక్కసారిగా చూడసాగాడు రఘు. ఆ ఫోటోలో ఉన్న వరుడు, ఇప్పుడు కాశీయాత్రలో తానూ ఫోటో తీసిన వరుడు వేరు- వేరు కాదు అని తెలిసి తల తిరిగినట్లు అనిపించింది. ఒక్క ఉదుటున తన అమ్మ కమలమ్మ దగ్గరకు పోయి ఉన్న విషయం చెప్పాడు. ఆమె ఉత్తర క్షణం తన స్నేహితురాలు అనసూయకు కు విషయాన్ని చెప్పింది. అరవింద జీవితం పాడు కాకుండా సరి అయిన నిర్ణయం తీసుకోవాలని అంది. అనసూయకు దిక్కు తోచలేదు. మగదిక్కు లేని సంసారం నాది. ఇపుడు ఏమి చేసేది అంటూ ఒక్కసారిగా ఏడవసాగింది.

అరవింద తల్లి అనసూయ ఉన్న ఒక్కగానొక్క బిడ్డని అపురూపంగా, గారంగా పెంచింది. తన లాగా తన కూతురు కష్ట పడరాదు అని అనుకోని తన కూతురిని ఇంజనీరింగ్ చదివించింది. పెళ్ళికొడుకు అమెరికాలో ఇంజనీర్‌గా ఉన్నాడు అని ఈ సంబంధాన్ని ఒప్పుకొంది.. బిడ్డ మరింత సుఖంగా ఉంటుంది అని ఆశపడింది. కానీ అతను ఒక మోసగాడు అని తెలిసి అనసూయ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

అనసూయ తనకు భగవంతుడు అడుగడుగునా దుఃఖం మిగిల్చాడు అని, ఇక తనకు బ్రతికే అవకాశం లేదని ఏడవసాగింది. చిన్న పల్లెలో పెళ్లి ఆగిపోయిన అమ్మాయిని ఎవరూ చేసుకోరు. నా కూతురి జీవితం బుగ్గిపాలు అయినట్లే,అని బాధపడ సాగింది. ఇంతలో ఏదో ఆలోచన వచ్చినట్టు తేరుకొని కమలమ్మ కాళ్ళు గట్టిగా పట్టుకుంది అనసూయ. ఈ పరిస్థితుల్లో కేవలం కమలమ్మ మాత్రమే తన ఇంటి మర్యాదను కాపాడ కలుగుతుంది అని అంది. రఘు తో అరవింద పెళ్లి జరిపించమని అడగాసాగింది. అనుకోని ఈ పరిణామానికి అటు తల్లి ఇటు రఘుల ముఖాలు తెల్లగా పాలిపోయాయి. కమలమ్మ తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పింది. కానీ రఘు మాత్రం తాను పెద్దగా చదువుకోలేదు, తానూ ఇంజనీర్ కాదని, అరవిందను ఒక మాట అడిగి చూడండి అని చెప్పాడు. అరవిందకు ఇష్టం అయితే తనకు ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పాడు. వెంటనే గౌరీ పూజ ముగించి పీట ల వద్దకు రావటానికి సిద్ధంగా ఉన్న అరవింద ముందు జరిగిన విషయాన్ని అమ్మ అనసూయ చెప్పింది. తల్లి దుఃఖాన్ని చూసి అరవిందకు నోట మాట రాలేదు. అమెరికాకు పోయిన తరువాత అతను మోసగాడు అని తెలిస్తే ఏమై ఉండేది అని ఆలోచించింది. అలా జరగనందున సంతోషించాలి అని అమ్మతో అరవింద అంది. తన తల్లి స్నేహితురాలు కొడుకు రఘు ఒక ఫోటోగ్రాఫర్. పెద్దగా చదువుకోలేదు కానీ తనను ప్రేమగా చూసుకోగలడు అని అనిపించింది ఆమెకు. మరుక్షణం పెళ్లి ప్రాంగణం లోని సన్నివేశాలు పూర్తిగా మారిపోయాయి.

అమెరికా పెళ్ళికొడుకు మోసం బయటపడటంతో అతను అతని బంధువర్గం తో పాటు జారుకోబోయాడు. కానీ ఆ పల్లెలో ఉన్న మంచి మనుషులు కొందరు చొరవతిసుకుని పోలీసులకి ఉప్పందించారు. వారు రావటమేమిటి ఆ ఘరానావరుడిని తగిన అత్తగారింటికి తీసుకువెళ్ళటమేమిటి అన్నీ క్షణాలలో జరిగిపోయాయి.

రఘు వెంటనే తన ప్యాంటు షర్ట్ విప్పి పట్టు పంచె, జుబ్బా వేసుకున్నాడు. చక్కగా తలపాగా పెట్టుకున్నాడు. అమ్మ కమలమ్మ తన కొడుకు నుదుటిన కళ్యాణ తిలకం దిద్దింది. (కొత్త పెళ్ళికొడుకు) హుందాగా పీటల వైపు నడిచాడు రఘునందన్.

అనసూయ అత్తగారు చాల చాదస్తపు మనిషి. చెవుడు కూడా. వధూవరులు ఒకరికెదురుగా ఇంకొకరు కూర్చొని జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. ముహూర్తం సమయం సమీపించింది. రఘు అసిస్టెంట్ ఫోటోలు తీయసాగాడు. అంతలో బామ్మగారు గట్టిగా అరిచింది. “అరవిందా, ఆ ఫోటోగ్రాఫర్ వైపు చూడకుండా పెళ్ళికొడుకు కళ్ళలోకి చూడు. అపుడు మీ బంధం కలకాలం నిలబడుతుంది” అని. రఘు వచ్చినపుడు ఫోటోగ్రాఫర్, కానీ ఇపుడు తాను పెళ్ళికొడుకు. బామ్మ మాటకు అక్కడ ఉన్న అందరూ పగలబడి నవ్వసాగారు. ఒక్కసారిగా పెళ్లి మంటపంలో ఉన్న వారి చేతుల మీదుగా అక్షింతల వర్షం పడుతూ ఉంటే రఘు-అరవిందల కళ్ళు కలిసాయి. ముహూర్తపు వాయిద్యాల నడుమ వారిద్దరూ అలా ఒకరిని ఒకరు చూస్తూ ఉండిపోయారు. మంత్ర బలం, ఆశీర్వాద బలం రెండూ చేరి వారిద్దరినీ ఒక కొత్త బంధానికి నాంది పలికాయని కమలమ్మ సంబరపడింది. స్నేహితురాళ్ళు ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకున్నారు. ఇంకేముంది కథ కంచికి మనం ఇంటికి అని వేరే చెప్పాలా? “మీరు కూడా కాస్త పెళ్లి భోజనం చేసి త్వరగా తెమలచండి” అంటూ బామ్మ అందరినీ పురమాయిస్తూ ఉంది.

శుభం – సుఖాంతం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here