[మాయా ఏంజిలో రచించిన Poor Girl అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు ప్రసిద్ధ కవయిత్రి హిమజ గారు.]
~
[dropcap]అ[/dropcap]చ్చంగా నాలాగే
నిన్నారాధించే
ఇంకొకరి వలపులో
నువు చిక్కుకున్నావని
తెలుసు నాకు
నీ పసిడి ప్రేమపలుకులకు
లోలకంలా వేళ్ళాడుతూ
తనేదో నీ హృదయాన్ని
పూర్తిగా అర్థం చేసుకున్నానని
అనుకుంటుంది
పిచ్చిపిల్ల
అచ్చం నాలాగే
నాకు తెలుసు
నువ్వు ఇంకో మనసునీ
ముక్కలు చేస్తావని
నేను చెయ్యగలిగేదీ
ఏమీ లేదనీ తెలుసు
ఆమెకేదైనా చెప్పబోతే
అర్థం చేసుకోకపోగా
వెళ్ళగొడుతుందేమో నన్ను
పిచ్చిపిల్ల
అచ్చం నాలాగే
నాకు తెలుసు
ఒకరోజు నువ్వు
తననూ విడిచి వెళ్ళిపోతావని
తెలియనిదల్లా ఆమెకే
నువ్వెందుకు దూరంగా వెళ్ళావని
తన తప్పేమిటో తెలియక
ఆమె పిచ్చిగా తిరుగుతుంది
నీకై ఆక్రోశిస్తుంది
కొన్నాళ్ళకి
ఆమె కూడా
ఇదే పాట
ఆలపించడం మొదలెడుతుంది!!
~
మూలం: మాయా ఏంజిలో
అనువాదం: హిమజ
‘Maya Angelou’ అమెరికన్ కవయిత్రి, సామాజిక కార్యకర్త, మానవ హక్కులకై పని చేసారు. ఆనాటి అమెరికన్ సమాజం, ఆఫ్రికన్ అమెరికన్ వేశ్యా వాటికల పట్ల చూపిన వివక్ష, నిరసన, ఏహ్య భావాన్ని నిలదీస్తూ, ధిక్కరిస్తూ, బాధితుల పక్షం వహించి Maya Angelou అనేక కవిత్వం వెలువరించారు.
ఏప్రిల్ 4, 1928 న Marguerite Annie Johnson గా జన్మించిన ఆమె, తన సోదరుడు ముద్దుగా పిలిచే ‘మాయ’ అనే పేరుకు ‘ఏంజిలో’ ని జత చేసి ‘మాయా ఏంజిలో’గా ప్రపంచ ప్రసిద్ధ రచయిత్రిగా రూపొందారు.
బాల్యంలో తాను అత్యాచారానికి గురైన విషయం, పేదరికం కారణంగా కొంతకాలం సెక్స్ వర్కర్‍గా పని చేసిన విషయం నిస్సంకోచంగా, నిర్భీతిగా తన రచనల ద్వారా తెలిపిన మాయా ఏంజిలో రచనలు – దార్శనిక ఆత్మకథా శైలిలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ఈమె కవిత్వం సంభాషణా సరళిలో ఉండటం విశేషం.
రచయిత్రి, కవయిత్రి, నర్తకి, గాయని, ఉద్యమకారిణి, కథకురాలు, దర్శకురాలు ప్రతిభావంతమైన పాత్ర పోషించిన మాయా 2014లో మరణించారు.