పిచ్చికా ఓ పిచ్చికా

0
1

[శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం రచించిన ‘పిచ్చికా ఓ పిచ్చికా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పి[/dropcap]చ్చికా ఓ పిచ్చికా!
ఎక్కడున్నావమ్మా నీవు.
కనబడవేవమ్మా నాకు.
వింటున్నాను రోజూ, మా ముంగిట
చెట్టుకొమ్మల కూర్చొని, తోటి పిచ్చికలతో నీవు
ముచ్చటగా చేసే,
కిల కిల రావాల మధుర ధ్వనులు.
ఆహా! ఏమని పొగడుదు మీ కంఠస్వరాలను.
అవి,
అంతులేని ఆనందాన్ని అందిస్తున్నాయమ్మా.
నిత్యం మైమరచి ఆ గానాలను వింటూ,
మరచిపోతున్నాను సమయ గమనాన్ని.

పిచ్చికా ఓ పిచ్చికా!
చక్కని గూడు కట్టడం
ఎక్కడ ఏ బడిలో నేర్చేవు నీవు.
పుణ్యముంటుంది నీకు,
చెప్పమ్మా మాకు, ఆ వాస్తు శిల్పకళా నైపుణ్యం.
ఎందుకంటావా,
కొందరు మాలో నిరుపేదలు
మదుపులు లేక సదుపాయాలను మరచి,
పాడిపశువుల చెంత పండుకొంటున్నారమ్మా.
‘పతితులార! భ్రష్టులార!
బాధాసర్పదష్టులార!
దగాపడిన తమ్ములార!’
అని ఆనాడే అన్నాడు శ్రీ శ్రీ.
దశాబ్దాలు మారినా,
మారలేదు వారి దశ.
మిగులుతోంది, వారికి నిరాశ.
అరచేతిలో మోక్షం చూపిస్తారు మా నాయకులు.
వారి మాటలు నీటి మూటలేనమ్మా.

పిచ్చికా ఓ పిచ్చికా!
నీ గూడు ప్రణాళికా పటం
నీ మదిలోనే ఉంటుందా.
బ్రతికిపోయేవు, దానికి నీకక్కరలేదు ఎవ్వరి ఆమోదం.
మెచ్చుకోదగును నీ సామర్థ్యం.
బలహీనురాలనని బద్ధకించవు నీవు.
వేరొకరి సాయం అర్థించవు.
ఓపికగా చేకూరుస్తావు, ఒక్కొక్క పుల్లను.
నీ ఏకాగ్రత, స్వయంకృషి, కార్యదీక్ష,
మాకవి పాఠాలమ్మా.
కర్రపుల్ల కాదుసుమీ వ్యర్థం
అని దానికి చూపించేవు ఒక అర్థం.
నీకు నచ్చిన చోట కట్టగలవు
నీ గుడ్లకు గూడు.
సుఖబడ్డావమ్మా నీవు
ఇంటిపన్ను, ఆస్తిపన్ను లేవమ్మా, నీ గూడుకు.

పిచ్చికా ఓ పిచ్చికా!
మీలో కులాలు లేవు, మతాలు లేవు.
గొప్పా బీదా తేడాలు లేవు.
తర తమ బేధాలు లేవు.
మీలో దాసులు లేరు, బాసులు లేరు.
సర్వసమానత్వానికి మీరొక ప్రతీక.

పిచ్చికా ఓ పిచ్చికా!
ఎచ్చటికి పోదలిచినా
టిక్కట్ల ఇక్కట్లు లేవు నీకు.
తలచినంతలో తుర్రున ఎగరగలవు నీవు.
పనిలేదు నీకు పెట్రోలు ధరలతో .
నీ శక్తే నీ ఇంధనం.
రద్దీ రోడ్లు అడ్డు రాలేవు నీకు.
ఎర్ర దీపాలు ఆపలేవు నిన్ను.
గగనతలంలో స్వేచ్చావిహారివి నీవు.
ఎంత ఎగిరినా
కలుషితము చేయవు, వాతావరణాన్ని.
‘పిట్ట కొంచము కూత ఘనము’ అంటారు.
పిచ్చుకవని తక్కువజేయుట కాదది.
మెచ్చుకొంటున్నాను నీ గుణగణాలను.
పిచ్చికలారా!
ఇలలో కలకాలం నిలవాలి
మీ పిచ్చికలని
ప్రార్థిస్తాను ఆ పరమేశుని.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here