Site icon Sanchika

పిచ్చుకల్ని ప్రేమించండి

[మార్చి 20వ తారీఖు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం (World Sparrow Day) సందర్భంగా డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన ‘పిచ్చుకల్ని ప్రేమించండి’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]వ[/dropcap]రి చేలలో గింజలేరుకుంటూ; అద్దంలో అందం చూసుకుంటూ; ఇంటి చూరులో సంసారం కిచకిచలాడుతూ విహారం; అంటూ ‘మిఠాయి పొట్లం’ పొడుపు కథల పుస్తకంలో పిచ్చుకల కోసం పొడుపుకథను రాశాను. అలాగే “పిచ్చుకా మా ఇంటి కొస్తావా” అంటూ ‘సీతాకోకచిలుక’ అనే గేయాల పుస్తకంలో మాయమై పోతున్న పిచ్చుకల కోసం “వరికంకులు లేవుగాని, పిజ్జాలు పెడతాను వస్తావా” అంటూ నేటి పరిస్థితికి అద్దం పట్టే కవితను రాశాను. సెల్ ఫోనుతో ఆటలాడే పిచ్చుక పిల్లను పాత్రధారిగా చేసి “మనల్ని దారుణంగా చంపేసి ప్రమాద స్థితిలోకి నెట్టివేసే సెల్ ఫోనుల తోనే ఆడతావా” అంటూ పిచ్చిక తల్లితో సెల్ ఫోన్ టవర్లే పిచ్చుకల పాలిటి యమ దూతలు” అని చెప్పిస్తూ ‘పిచ్చుక పిల్లల తప్పు’ అనే కథలో చెప్పాను. మానవులతో సహజీవనం చేసే కాకులు, పిచ్చుకలు, కోళ్ళు వంటి మామూలు పక్షుల్ని ‘పక్షుల అభయారణ్యాల’లో చూడవలసిన పరిస్థితి ఏర్పడుతుందని వివరిస్తూ ‘సైన్స్ వరల్డ్’ పుస్తకంలో సైన్స్ వ్యాసాన్ని రాశాను.

పిచ్చుకల దినోత్సవాన్ని పురస్కరించుకుని పిచ్చుకల బొమ్మల్ని తయారుచేసి ఎగ్జిబిషన్లు పెట్టాను. వంటింట్లో ఉండే ధాన్యపు గింజలతో పిచ్చుక బొమ్మల్ని తయారు చేశాను. ఈ రోజు మనం పిచ్చుకల దినోత్సవం గురించి తెలుసుకుందాం!

ప్రతి సంవత్సరం మార్చి 20వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు. మానవ ఆవాసాల్లో తిరిగే పక్షులకు వాటి జీవనానికి ఏర్పడుతున్న ముప్పు గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్నది. బియ్యం చేట పట్టుకుని ఇల్లాలు ఇంటి బయటికొస్తే చుట్టుపక్కల ఉన్న పిచ్చికలన్నీ ఎదురుగా వాలేవి. బియ్యం చెరిగేటపుడు జారిపోయే ధాన్యం గింజల కోసం ఎదురు చూస్తుండేవి. ఈనాడు బియ్యం చేట పట్టుకుని బియ్యం చెరిగే ఇల్లాలూ లేదు. వాటికై ఎదురు చూసే పిచ్చుకలు లేవు. పూర్వ కాలపు ఉదయాలు పక్షుల కిలకిలారావాల తోనే మొదలయ్యేది. ఈనాడు అలారం మోతలలో ఫోన్ చేసే రింగ్ టోన్లతో మేలుకుంటున్నారు. అలా మనతో పాటు సహజీవనం చేస్తూ మనం పెట్టినవి తింటూ, మన ఇంటి చూరుల్లో గూళ్ళు కట్టుకుని పిల్లల్ని కంటూ తిరిగే పిచ్చుకలు నేడు కనిపించకపోవటానికి గల కారణాల్లో మానవ తప్పిదాలే ఎక్కవగా ఉన్నాయి. ఆ అవగాహన కొరకే ప్రపంచ పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటున్నారు.

పక్షుల మనుగడకు ఏర్పడుతున్న అనేక ఆటంకాలు, వస్తున్న ముప్పుల గురించి ఒకరితో ఒకరు చర్చించుకునేందుకు ఒక రోజు అవసరం అయినందున పిచ్చుకల దినోత్సవానికి ఒక రోజును ఏర్పాటు చేయాలని పర్యావరణవేత్తలు అనుకున్నారు. పక్షుల పరిరక్షణకు ఒక వేదిక కావాలని, ఒకరి అభిప్రాయాలు మరొకరితో పంచుకునే ఉమ్మడి వేదిక అవసరమని పక్షి శాస్రవేత్తలు భావించారు. దీనికి అందరూ ఆమోదయోగ్యం తెలిపారు. ఫలితంగా తొలిసారిగా 2010వ సంవత్సరంలో ‘పిచ్చుకల దినోత్సవాలు’ ప్రపంచంలో అనేక చోట్ల జరిగాయి. ఆ రోజన పిచ్చుకల జీవన విధానం గురించి సదస్సులూ, వాటికి ఉన్న అనుకూల వాతావరణం, అననుకూల పరిస్థితులు, పిచ్చుకలు చనిపోవడానికి కారణమవుతున్న సెల్ ఫోన్ టవర్ల గురించి అనేక అవగాహనా కార్యక్రమాలు జరుగుతాయి. కళలకు సంబంధించిన పోటీలు ఉపన్యాసాలు, పిచ్చుక బొమ్మల ఊరేగింపులు రకరకాలుగా ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నాలు జరుగుతాయి. హైదరాబాదు లోని కెబిఆర్ పార్కులోనూ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతారు. పిచ్చుకల ఫోటోలను చెట్లకు కట్టి పిచుకమ్మలపై పాటలు పాడుతూ ఉత్సవాల్ని జనరంజరంగా నిర్వహిస్తారు. ఇంకా స్కూళ్ళలో వీటి గురించి తెలియజేస్తూ విద్యార్థులతో సైతం అనేక బొమ్మలు, వ్యాసాలు రాయిస్తూ అందరి మనస్సుల్లోకీ చొప్పించేలా ప్రయత్నంచాలి.

భారతీయ ప్రకృతి పరిరక్షకుడైన మహమ్మద్ దిలావార్ పిచ్చుకల పరిరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ‘నేచర్ ఫర్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించాడు. తద్వారా అనేక రకాలుగా పిచ్చుకలను రక్షించడానికి వీలైన అవకాశాల్ని అందరితోనూ పంచుకున్నాడు. సొసైటీ కార్యాలయంతో తోటి సభ్యులతో మాట్లాడుతున్నపుడు పిచ్చుకల కోసం ఒక రోజును కేటాయించుకుంటే ఎలా ఉటుంది అనే ఆలోచన వచ్చింది. అలా పిచ్చుకల దినోత్సవం ఏర్పడింది. ఇది కేవలం పిచ్చుకలను రక్షించడమే కాకుండా జీవ వైవిధ్య ఆశయాలను నెరవేర్చడం కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ విధంగా పిచ్చుకల దినోత్సవానికి ఆద్యుడైన మహమ్మద్ దిలావర్‌కు ‘హీరోస్ ఆఫ్ ద ఎన్విరాన్‌మెంట్’ లో ఒకరుగా గుర్తించి, వీరి కృషిని అందరికీ తెలిపింది ‘టైమ్’. ఆ తర్వాత పిచ్చుక పురస్కారాలను కూడా ఇవ్వడం ప్రారంభించారు.

2011 వసంవత్సరం నుంచి పిచ్చుక పురస్కారాలను అందజేయడం ప్రారంభించారు. 2011 లో భవిన్ షా, నరేంద్రసింగ్ చౌదరి, ఎల్. శ్యామల్, ద స్పారో కంపెనీ అనే నలుగురికి ఈ అవార్డు నిచ్చి సత్కరించారు. ఎన్.ఐఫ్.ఎస్ అనే సంస్థ మొదటి సారిగా ప్రజలలో అవగాహన పెంచుట కొరకు పిచ్చుక పురస్కారాలను ఏర్పాటు చేసింది. మొదటిసారిగా గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాద్‌లో మార్చి నెలలో 20 వ తేదీన ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. అప్పుటి నుంచి వరసగా ఈ పురస్కారాలను అందజేస్తూనే ఉన్నారు. మోహన్ గార్గ్, ఎన్. షహజాద్ & ఎం.సౌద్, జల్ గ్రాహన్ కామేటి, ప్లిప్లాంట్రి లకు 2014 వ సంవత్సరానికి గాను పిచ్చుక పురస్కారాలను అoదజేశారు.

గ్రామాలలో పొలాల్లోని గింజలు ఏరుకుని తింటూ కిచకిచమని అరుపులతో ఉదయాన్నే ఆoదర్నీ లేపుతూ మానవులతో పాటు జీవనం సాగించేవి. తల్లి తెచ్చే ఆహారం కోసం తమ బుల్లి నోర్లు తెరుచుకుని ఎదురుచూస్తూ ఉండే పిల్లల్ని మనం చూడలేకపోతున్నాం. ఎండు కొమ్మలు, రెమ్మలు, మెత్తటి గుడ్డ పీలికలు వంటి వాటితో గూడును ఏర్పరచుకుని భద్రంగా తన గుడ్లను పెట్టుకుని పొదుగుతాయి. పిచ్చుకలు ఎర్రటి నోర్లు తెరుచుకుని తల్లి తెచ్చిన గింజల్ని లాక్కోవడానికి తోటి పిచ్చుక సోదరులలో పోటీపడే అద్భుత దృశ్యాల్ని చూసే అదృష్టం ఈనాటి బాల్యానికి లేదు. తొట్టి దగ్గర కాళ్ళు కడుక్కుని వస్తే ఆ నీళ్ళను తాగుతూ తమ దాహాన్ని తీర్చుకునే పక్షులే లేవు. పిచ్చుక పిడకలిల్లు కట్టుకుంది, కాకి కర్రలిల్లు కట్టుకుంది అని కథలు చెప్పే బామ్మలూ లేరు. పిచ్చుకలతో అనుబంధం ఈ నాటి తరానికి పూర్తిగా తెగిపోయింది. పిచ్చుకల ఆత్మ ఘోషను వినిపించడానికే రోబో సినిమాను అద్భుతంగా తెరరెక్కించారు. ఇక ముందు పిచ్చుకలను చంపే ప్రయత్నాలకు అడ్డుగా నిలవాలని, పిచ్చుకలను ప్రేమించి పర్యావరణoలో వాటి పాత్రను అవి పోషించేలా చేయాలని కోరుకుందాం!

Exit mobile version