Site icon Sanchika

పిచ్చుకలు

[dropcap]మా[/dropcap]ర్గశిర మాసం. అసలే చలికాలం. మంచు కురుస్తున్న రోజులు. మా అబ్బాయి ఇంటికి వచ్చిన నేను, బాల్కనీలో ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఎత్తయిన అపార్టుమెంటుల సందుల్లోనుండి దూసుకు వస్తున్న లేలేత కిరణాలు నా మీద పడుతున్నాయి. ఆహ్లాదకరమైన ఆ ఉదయకాలంలో ప్రకృతి ఆరాధకుడయిన నేను తన్మయత్వంతో పరిసరాలను పరికిస్తున్నాను.

ఆ ఎత్తైన అపార్ట్మెంట్లకి ఉన్న ఆర్చీలను, గూళ్ళని ఆసరాగా చేసుకొని నివాసం ఉంటున్న పావురాలు టపటపమని ఎగురుతున్న శబ్దాలు, పిచ్చుకల కిచకిచలు నన్ను మిక్కిలి ఆనందానికి గురిచేస్తున్నాయి. అవి నేలమీద వాలి పురుగుల్ని, గింజల్ని ఏరుకొని తింటున్నాయి. బాల్కనీ నుండి క్రిందకి తొంగి చూసిన నాకు అదొక అద్భుత దృశ్యం అనిపించింది.

వేలూరులో ఉన్న గోల్డెన్ టెంపుల్‌లో పిచ్చుకలను చూశాను. ఇన్నాళ్ళకి ఇక్కడ పిచ్చుకల్ని చూస్తున్నాను. మా ఊరిలో వాటిని చూద్దామన్నా ఆ అవకాశమే లేకపోయింది. పిచ్చుకల అస్తిత్వమే లేదు. ‘ఒక్క పిచ్చుకలు ఏంటి? ఈ నాగరిక ప్రపంచంలో పక్షి జాతి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది’ బాధగా అనుకున్నాను.

అంతెందుకు, నేటి మనిషి సమాజ సంబంధాలు, మానవతా విలువలు, ప్రకృతి జీవవైవిధ్యం అన్నింటినీ విస్మరిస్తున్నాడు. పక్షి జాతి ఉంటేనే ప్రకృతి. అవి లేకపోతే వికృతే. ఒక విధంగా నేడు వికృతిలో జీవిస్తున్నాం అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అపార్టుమెంట్ల సంస్కృతి వచ్చినది మొదలు హరిత వనాలు అంతరించిపోయాయి. పరిశ్రమలు వెదజల్లుతున్న విషవాయువులు, వ్యర్థ పదార్థాలతో భూమి కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం పెరిగిపోయాయి. ఉష్ణోగ్రతలు పెరిగి రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. భూమి మీద ఈ పెరిగిన ఉష్ణోగ్రత వలన సముద్రాలు, నదులు ఉప్పొంగి వరదలు, సునామీలు వస్తున్నాయి. కరువు కాటకాలు కూడా. భూమిలో నీటి శాతం తగ్గిపోయి త్రాగునీటికి ఇబ్బంది కలుగుతోంది.

‘పిచ్చుకల గురించి ఆలోచిస్తూ నేను ఇవన్నీ ఆలోచిస్తున్నాం ఏంటి’ అనుకున్న నేను, నా ఆలోచనలని సమర్థించుకున్నాను. పిచ్చుకలు కూడా పక్షి జాతికి చెందినవే కదా! పక్షులు చెట్లపై ఎగిరే పురుగుల్ని, పాదులకు పట్టిన క్రిమికీటకాలను తిని వాటి నుంచి మనల్ని రక్షిస్తాయి. అంతేకాదు పక్షి జాతిలో రాబందులు చనిపోయిన జంతు కళేబరాలను తిని వాతావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుతాయి. మనం రోగాల బారిన పడకుండా చూస్తాయి. పిచ్చుక లాగే ఆ రాబందులు కూడా కనుమరుగయ్యాయి.

దానికి కారణం వివిధ రసాయనాలు గల ఆహారాన్ని పశువులు తింటున్నాయి. అవి చనిపోయిన తరువాత వాటి కళేబరాలను తిన్న రాబందులు మృత్యువాత పడుతున్నాయి. ఇక పిచ్చుకల విషయం తీసుకుంటే వాతావరణ కాలుష్యం, సెల్ టవర్ల నిర్మాణం వలన, ఆ రేడియేషన్‌కు గురై ఈ జాతి అంతరించిపోతోందని పరిశోధకులు గుర్తించారు.

పిచ్చుకల గురించి ఆలోచిస్తూ ఉంటే మా బాల్యం రోజులు ఒక్కసారిగా కళ్లెదుట కదలాడుతున్నాయి. బాల్యం ఎవరికైనా మధుర జ్ఞాపకమే. అయితే అందరి బాల్యాలు అలా ఉండవు. కొందరి బాల్యాలు ఆనందాన్ని కలిగిస్తే, మరి కొందరి బాల్యాలు, నాటి జ్ఞాపకాలు గుండెను బరువెక్కిస్తాయి. ఒకచోట బాల్యం ఆనందంతో ఉరకలెత్తే సాగర ప్రవాహం అయితే, మరోచోట ఎండిపోయిన సాగర గర్భం. కొంతమందికి జీవితం వడ్డించిన విస్తరయితే, మరికొందరిని వాళ్లు కళ్లు తెరిచీ తెరవకముందే మృత్యువు వెంటాడుతుంది.

బాల్యం అద్భుతమైన వరం. పెద్దలకి బాల్యం గుర్తుకొస్తే, భారమైన మనసు తేలిక అవుతుంది. అలాంటి జ్ఞాపకాలను మరోమారు మనసులోనే బాల్యం ఆవిష్కరింపచేస్తుంది. జీవితంలో ఒక్కసారైనా బాల్యాన్ని తలచుకోని మనిషి ఉండడు. తిరిగి జీవితంలో బాల్యం రోజులు వస్తే ఎంత బాగుండును అని భావోద్వేగంతో అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను నేను.

తిరిగి పిచ్చుకల వైపు చూశాను. బాల్యం ఒక్కసారి కళ్లెదుట నిలబడింది. మా చిన్నప్పుడు ఇంటి చూరులో పిచ్చుకలు గడ్డి, చెత్త చెదారంతో గూడు నిర్మించుకునేవి. గుడ్లు పెట్టిన తరువాత పిచ్చుకల జంట కిచకిచలాడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే మా పిల్లలకి ఎంతో ఆనందంగా ఉండేది. వింతగా వాటి చర్యలని గమనించే వాళ్ళమి మా పిల్లలందరం.

పిచ్చుక పిల్లలు వింతగా అరుస్తూ ఉంటే ఆ అరుపులని కూడా ఆస్వాదించే వాళ్ళమి మా పిల్లలందరం. పిచ్చుకల గూడు క్రింద చుక్కలు త్రాగుతాయని ఓ పళ్లెంలో నీరు పోసి ఉంచేవాళ్ళమి.

పిచ్చుక పిల్లలు కర్మ కాలి గూటిలో నుండి క్రింద పడితే ఆ పిచ్చుకల జంట ఆవేదనతో అరిచే అరుపులు మమ్మల్ని ఆవేదనకు గురిచేసేవి. ఆ కింద పడ్డ పిచ్చుక పిల్లల్ని నెమ్మదిగా తీసి ఎత్తయిన స్టూలు మీద ఉంచేవాళ్ళమి. పిచ్చుకలు ఆ పిల్లల చుట్టూ తిరిగి తిరిగి సున్నితంగా ముక్కున కరచుకొని పిల్లల్ని తిరిగి గూటికి చేర్చేవి. వాటి జీవన చర్యను గమనిస్తూ వాటికి ఏ ఇబ్బంది కలగకుండా చూడడమే మా దినచర్య.

“పిల్లలూ చదువు సంధ్య లేకుండా ఆ పిచ్చుకల్ని గమనించడమేనా మీ పని” అని పెద్దవాళ్లు ఒక్కో పర్యాయం మా మీద కసురుకునే వారు కూడా. అయినా మా పని మేము మానేవాళ్ళమి కాదు. ఆ పిచ్చుకల అరుపులు వింటూ ఉంటే మా పిల్లలకి అదో ఆనందం. కర్మ కాలి పిచ్చుక పిల్ల ఏదైనా చనిపోతే వాటి రోదనతో కూడిన అరుపులు మమ్మల్ని కలచివేసేవి.

” ఆ పిచ్చుకలను చూసి నాన్నగారు భావోద్వేగంతో ఆలోచిస్తున్నారు” మా అబ్బాయి వాళ్ళమ్మతో అంటున్నాడు.

” మీ నాన్నగారి స్వభావమే అంత, ప్రతి చిన్న విషయానికి అలా స్పందించి ఆలోచిస్తారు” అంది శ్రీమతి.

వారి మాటలకి ఆలోచన ప్రపంచం నుండి బయట పడ్డాను. వాళ్ళకేం తెలుసు ఆ పిచ్చుకల్ని చూస్తూ ఉంటే మధురమైన బంగారు బాల్యం నా కళ్ళెదుట నిలబడిందని. నేను ఇంటికి తిరిగి వెడితే ఇలాంటి అపురూపమైన దృశ్యం మళ్లీ నాకు అగుపించదని అనుకుంటున్నాను నేను.

“ఈ అపార్టుమెంటులో ఈ పిచ్చుకలు పగలంతా ఎక్కడ ఉంటాయో, ఎక్కడికి పోతాయో తెలియదు కానీ ఉదయం అయ్యేసరికి ఇలా కిచకిచ శబ్దాలు చేస్తూ తిరుగుతాయి” పిచ్చుకల్ని చూస్తున్న నా వైపు చూస్తూ అన్నాడు మా అబ్బాయి.

” ఇది అద్భుతమైన దృశ్యమే. వాటిని ఇలా చూస్తానని నేను అనుకోలేదు” మా అబ్బాయితో అన్నాను. తిరిగి నాలో ఆలోచనలు ప్రవేశిస్తున్నాయి.

మనిషికీ పక్షి జాతికీ ఎంత తేడా? మనిషికి మెదడు ఉంది. ఆలోచనా శక్తి ఉంది. కార్యకుశలత ఉంది. శక్తి ఉంది. సామర్థ్యం ఉంది. ఈ ఆధునిక మనిషికి అన్నీ ఉన్నా అవన్నీ ఈ పక్షి జంతు జాతి ముందు దిగదుడుపే. ఈ పక్షి జాతి కేవలం తమ లైంగికానందం చూసుకోకుండా ఆ పక్షి జంట పిల్లల్ని కనిన తరువాత, మగ పక్షి బయటకు వెళ్లి ఆహారం తీసుకువస్తే ఆడ పక్షి గుడ్డు లోంచి పిల్ల వెలువడినప్పటి నుండి అవి పెరిగి పెద్దయ్యే వరకు పిల్లల్ని సాకుతాయి. జంతువుల విషయమూ అంతే!

అయితే ఈ ఆధునిక మనిషి విషయం అలా కాదు. నాగరికత వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి పెళ్ళీ, పిల్లల్ని కనడం బాదరబందీ అనీ, ముందరి కాళ్ళకు బంధం అని అనుకొని లైంగికానందం కోసం పెళ్ళి చేసుకోకుండా సహజీవనం వేపు మొగ్గుతున్నాడు. ‘పెళ్ళి ఎందుకు చేసుకుంటారు? లైంగికానందం కోసమే కదా! సహజీవనంలో ఆ ఆనందం లభిస్తున్నప్పుడు పెళ్ళి ఎందుకు’ అని ఆలోచిస్తున్నారు.

ఈ సహజీవనంలో మగ ఆడ ఏ బాదరబందీ లేకుండా ఒకరికి మరొకరు తోడుగా మోజు ఉండేవరకు, ఆకర్షణ తీరేవరకు కలిసి ఉంటారు. అవి తీరగానే వేరే వ్యక్తులను వెతుక్కుని విడిపోతారు. ఇది ఒక విధంగా వ్యభిచారమే అని నేను అనుకుంటాను. ఈ సహజీవనంలో కేవలం లైంగికానందానికే ప్రాముఖ్యత ఇస్తున్నారు. అంతేకానీ పిల్లల్ని కనడానికి, వారి ఆలనా పాలనా చూడ్డానికి కాదు. కర్మ కాలి గర్భం ధరిస్తే అబార్షను చేయించుకుంటారు. లేకపోతే పుట్టిన పిల్లల్ని పెంట కుప్పల పాల్జేస్తున్నారు.

భానుమతి గారు ఏనాడో చెప్పినట్లు నేటి యువత ‘నాగరికత మోజులో నవ్వుల పాలవుతున్నారు. దోర వయస్సు జోరులో దారి తప్పుతున్నారు’. ఇలా సాగిపోతున్నాయి నా ఆలోచనలు.

కిచకిచలాడుతూ తిరుగుతున్న పిచ్చుకల వేపు మరో పర్యాయం చూస్తూ అక్కడినుండి లేచాను నేను.

Exit mobile version