Site icon Sanchika

పిడికెడు మట్టి

[dropcap]నే[/dropcap]నంటే.. నేనే
తుంచుతున్న.. కొద్దీ
పెరిగే కలుపు మొక్కలా
చిగురించే కోరికల చెట్టును!
ఎప్పటికీ చేరలేని దిగంతంలాటి
మమతల గట్టును!
అంతరిక్షపు విస్ఫోటనలతో
పోటీపడే ఆలోచనల ఎగసివేతలు,
ఉల్కాపాతాల్లాటి
మెరుపులు అపుడో.. ఇపుడో..
కొన్ని,
నన్ను నేను తెలుసుకున్నాననే
హిమాలయమంతటి
గర్వం,
తీరా చూస్తే.. నువ్వెవడంటాడో వేదాంతి,
కళవళపడిపోయాను
సిద్ధాంతపు దస్త్రాలు దట్టించాను,
కాదంటే
గొంతు చించుకున్నాను,
అయినా.. కాదంటూ ఆ మందస్మితం
నన్ను గాలిలా తరుముతుంటే..,
కదిలాను
త్రికాలాల్లో,
త్రిసంధ్యల్లో,
నేనెవరంటూ వెతుక్కుంటూ
తిరుగుతుంటే
ఓ చోట కాలం నన్ను కౌగిలించుకుంది,
అగ్ని ఒడిలోకి చేర్చింది
ఇదిగో
ఇప్పుడు తెలిసింది
*నేనంతా కలిపి పిడికెడు మట్టని*!
హరిః ఓం!

Exit mobile version