‘పికూ’ – సత్యజిత్‌ రాయ్ గారి చిన్న చిత్రం

0
2

[dropcap]ఇ[/dropcap]టీవల కుర్రాళ్ళకి చిన్న చిత్రాలను ఎలా పడితే అలా నిర్మించేసి వాళ్ళ ఆలోచనలకు ఒక స్వరూపాన్ని ఇచ్చేసామనిపించుకొని కాలర్ ఎగరేసుకోవటం పరిపాటి అయిపోయింది! చాలామంది ఒక విషయాన్ని మరిచిపోతారు – తలలోనిది తెర మీదకి రావాలంటే ఇరవై నాలుగు క్రాఫ్టులూ కావలసినవే!

చిన్న చిత్రాలకి స్క్రిప్ట్ ఎలా ఉండాలి, లేదా యానిమేషన్ చిత్రాలకీ, మామూలు చలన చిత్రాలకీ వ్రాసే స్క్రిప్ట్‌లకీ ఏంటి తేడా అని ఒకసారి డిస్నీ కార్పోరేషన్ వైస్ ఛైర్మన్ మాక్స్ హోవర్డ్‌ని ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కొందరు అడిగారు. తేడా ఏమీ ఉండదని చిన్న సమాధానం చెప్పాడాయన. కాకపోతే ఆస్కార్ గ్రహీత రెసూల్ పూకుట్టి ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు. యానిమేషన్, చిన్న చిత్రాలలో ధ్వనిని జాగ్రత్తగా వాడుకుంటే కొన్ని అద్భుతాలు చెయ్యవచ్చన్నాడు.

చిన్న చిత్రాలు చేయాలనుకునేవారు చాలామంది చిన్న కథలు – షార్ట్ స్టోరీస్‌ని ఎంచుకుని స్క్రిప్టులు తయారు చేస్తూ ఉంటారు. పెద్ద చిత్రం అనగానే నవల లేదా సీరియల్, చిన్న చిత్రం అనగానే కథ అనుకోవడం కుడా ఎంత సరైనది అన్నది కూడా ఆలోచించాలి. గోవింద నిహలాని నిర్మించిన ‘అర్ధసత్య’ చిత్రం ‘సూరజ్’ అనే ఒక కథ నుంచి నిర్మించినది. ‘సూరజ్’ చిత్రం కూడా అటువంటిదే!

తెలుగులో చిత్రాలు నిర్మించే దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా చేసిన ఒక పురానా ఖిలాడీ ఆ మధ్య ఒక మాట అన్నాడు. ఒక చిన్న చిత్రం గురించి మాట్లాడుతూ “ఒకే లొకేషన్‌లో అంత సేపు సీను ఎలా, బాగుండదు కదా?” అన్నాడు. “సత్యజిత్‌ రాయ్ ‘ఆగంతుక్’ చూసావా?” అన్నాను.

అదోలా చూసాడు. మన వాళ్ళు లాభం లేదు, వేరే వాళ్ళు గొప్పవాళ్ళు అని ఇక్కడ చెప్పదలచుకోలేదు. అది నిజం కూడా కాదు. స్వతంత్రంగా ఆలోచించటం, స్వతంత్రంగా సృజనను స్వాగతించటం ఏ కళారంగానికైనా ఎంతో అవసరం. రవీంద్రభారతిలో ఒక సంస్థ నిర్వహించిన నాటక పోటీలకు విచ్చేసిన కీ.శే. ఎ.ఎన్.ఆర్. గారు స్టేజ్ మీద నుండే ఒక మాట అన్నారు:

“పుట్టినప్పటి నుండి ఇదే చూస్తున్నాను. ఇతర భాషలలో వస్తున్న నాటకాలు, సమకాలీనమైన ప్రయోగాలు, ఇలాంటివి చూడము, స్వాగతించము అనుకున్నంత సేపు ఈ రంగం ఇలాగే ఉంటుంది.” ఈ మాటలలో వాస్తవం లేకపోలేదు.

చిన్న చిత్రం కవిత్వం లాంటిది. పది పేజీల ఒక వ్యాసాన్ని రెండు పంక్తుల ఓ కవితలో నింపగలిగే నైపుణ్యంతో కూడినది. ఆలోచన రామబాణంలా దూసుకెళ్ళి సాగకుండా, ఆగకుండా సాగిపోయి అయిపోయిన తరువాత తిరిగి అదే ఆలోచన ప్రేక్షకుని వద్దకే వచ్చి కూర్చోవాలి. చలన చిత్ర కళలో సెమియాటిక్స్, డయజెసిస్ అనే సాంకేతికాలు అరచేతిలో ఉన్నవారికి ఇది కరతలామలకం! ఇమేజరీ అనేది, ఒక ట్రాజెక్టరీని ఒకరి దృక్కోణంలో తీసుకుని వెళ్ళే పద్ధతిలో ఇమిడినప్పుడు ఇది అందంగా తీర్చిదిద్దుకుంటుంది. ఇవన్నీ కొద్దిగా అనుభవంలోకి రావాలంటే 1980లో ఓ ఫ్రెంచ్ టీ.వీ.ఛానెల్ కోసం సత్యజిత్ రాయ్ తీసిన ‘పికూ’ చిన్న చిత్రం ఒకసారి చూడవచ్చు.

ఓ కుర్రాడి జీవితంలో ఓ రోజు ఎలా గడిచింది అనేది నేపథ్యం. తండ్రి ఆఫీసుకు బయలుదేరి వెళతాడు. వెళ్ళేముందు తల్లితో వాగ్వివాదాలు జరుగుతాయి. ‘నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు కదూ’ అన్న మాట తీసుకుని వస్తాడు. వాకిట్లో కారు శబ్దాలు, ఇతర శబ్దాలు వింటూ పికూ ఆటగా ‘హుష్’ అంటాడు. ఆ శబ్దాలు ఆగిపోతాయి. ప్రక్క ఇంటిలోని కుక్క అరుస్తు ఉంటుంది. ‘హుష్’ అన్నప్పుడు అదీ ఆపేస్తుంది. తల్లి బాయ్‌ప్రెండ్ వస్తాడు. తనకి డ్రాయింగ్ కోసం స్కెచ్ పెన్నుల సెట్ తీసుకుని వస్తాడు. అమ్మ క్రింద గార్డెన్‌లోకి వెళ్ళి అక్కడ డ్రాయింగ్‍లు గీయమంటుంది. బెడ్ రూమ్ కిటికీ లోంచి చూసి అక్కడి పూల బొమ్మలు గీసుకుంటున్న పికూ అప్పుడప్పుడే పైకి రాడని నిర్ధారించుకుని బాయ్‌ఫ్రెండ్‌తో లోపల గడీ పెట్టుకుంటుంది. పికూ రంగు రంగు పూల బొమ్మలు గీస్తూ ఉంటాడు. తోటలో తెల్లని పూలను చూసి తెలుపు రంగు స్కెచ్ పెన్నును వెతుక్కుంటాదు. అక్కడి నుండే అరుస్తాడు ‘తెల్ల పెన్ను లేదు’ అని. ‘నల్ల పెన్ను వాడుకో’ అని ఆవిడ బదులు చెపుతుంది. అలాగే ఓ పూవు బొమ్మ గీస్తాడు. దాని మీద పై నుండి రాలిన ఓ నీటి చుక్క పడి దానిని భిన్నం చేస్తుంది. బెడ్ రూమ్‌లో ఈ ఇద్దరూ వాళ్ళ సంగతి భర్తకు తెలిసిపోవడం మీద ఘర్షణ పడుతూ ఉంటారు. పికూ అక్కడ తలుపు దగ్గర నిలబడి ‘హుష్’ అంటాడు. ఆ మాటలూ ఆగిపోతాయి.

మరో గదిలో తాత గుండె జబ్బుతో బాధ పడుతూ ఉంటాడు. ప్రక్కన బెల్ కొట్టబోతాడు కానీ అప్పటికే స్ట్రోక్ రావడంతో ఆయనలోని ‘శబ్దం’ కూడా ఆగిపోతుంది.

సినిమా అయిపోతుంది!

బేలతనంతో ఆడుకుంటూ ఈశ్వరుని ప్రతిరూపాలైన చిన్నారులకు మనం పంచిపెడుతున్నది ఏమిటి? అనైతికమైన ప్రక్రియలను కృత్రిమమైన చాక్లెట్లలా వారి ముందర పెడుతున్నాం కదా? తేటతెల్లని రంగు వంటి అమాయకత్వాన్ని పూర్తి నల్ల రంగుతో నింపుతున్నాం కదా? మమ్మల్ని కని మాకో ప్రపంచాన్నిచ్చిన మీ గొడవలు ‘హుష్’ అంటే ఆగిపోతాయా?…. ఇలా ఒకటి కాదు, ఎన్నో ప్రశ్నలు, ఆలోచనలు అలా ఈ చిన్ని చిచ్చుబుడ్డి లోంచి సాగిపోతాయి.

‘పికూస్ డైరీ అండ్ అదర్ స్టోరీస్’ అనే సత్యజిత్ రాయ్ పుస్తకంలోంచి ఎంచుకుని రాయ్ ఈ చిన్ని చిత్రాన్ని బుల్లి తెర మీద 1980లో చూపించారు. దీనికి స్క్రీన్ ప్లే, ధ్వని కూడా ఆయనే చేసారు. ఇరవై ఆరు నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో అర్జున్ గుహ, అపర్ణాసేన్, సోలెన్ లాహిరీ, ప్రొమోద్ గాంగూలీ, విక్టర్ బెనర్జీ నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here