Site icon Sanchika

పిల్లల కోడి

[dropcap]తి[/dropcap]రుగుతున్నావు నీవు భూగోళం మీద పిల్లల్తో –
అకాశాంలో – నక్షత్రమండలాన వున్న ‘పిల్లల కోడి!’లా
భూమ్మీద నీవు పిల్లల్తో గుమిగూడి వున్నావు
ఆకాశంలో – నక్షత్రమండలాన ‘ముచ్చట గుంపు’లా
వెలుస్తున్నావు నీవు గ్రహాలావరించి వున్న సూర్యుడిలా
పిల్లలావరించి వున్న తల్లిలా.

పిల్లలు – తెల్లని మబ్బులు గుంపులు గుంపులు.
తెల్ల మబ్బులాకాశం విడిచి నేల నడుస్తున్నాయా?
పిల్లల నడక సొబగులు, ఒడల మెరుగులు
పిడికిలంత లేరు పిల్లౌ – కీచులాడుతున్నారు
ఒక పక్క వురికించి యుద్ధ భేరీలు…
తల్లిని  మురిపించాలని
తల్లిని – మురిపించును వేడుకలై
సతికి సుతులు గలిగి సౌఖ్యంబు నీయరా!
పత్తికాయ చిత్రపుటములు పుట్టదా!
ఎండి పగిలిన పత్తికాయల్నించి బైటపడిన పింజలుత్
తప్పటడుగులే ముందు ముందు నడకలౌతాయి.

పిల్ల – అల్లంత దూరం ఒక్కతే పరుగెత్తుకుపోయి
తిరిగి వచ్చి చేరుతుంది తల్లిని
తల్లి నెరిగివచ్చు దాని కొదమ
తల్లి పిల్లలకు తర్ఫీదునిస్తోంది
గురువు విద్య లేక గురుతర ద్విజ్యుడగునె?
చేపల్ని పట్తి తినిపించేకన్నా, గాలాల్ని చేతికందిస్తోంది.
పెంటను తోడి – చెదలును పిల్లల కళ్ళ కాన్పిస్తోంది
పిల్లల ఆకలి – ఆటలు కలిసే సాగుతాయి
పంట చేలల్లోని అతివల పనీ – పాటల్లా
గిన్నెలోని నీటిని, ఓ చుక్కను పీల్చి ఆకాశాన్ని చూస్తోంది
నీటి చుక్కను గొంతు నాళికా నాళాన్ని దించడానికి –
మ్యూజియంలోని పక్షి బొమ్మలా
మెడను వంచుతోంది, నీటి బొట్టును పీలుస్తోంది –
తలను ఆకాశానికెత్తుతోంది – తిరిగి ముక్కును నీటిలోకి…

తల్లి – పిల్లల్ని రెక్కల మాటున పొదుక్కుంది – గంప కిందలా
పొదుక్కున పిల్లలు – నీ ఒడిలో మము నిదురించనీ అన్నట్టుగా
పిల్లలు తల్లి వెంట పెంటకుప్పల మీద –
ఆకాశంలో వలయాలు చుట్టుతున్న యమధర్మరాజు…
దగా జేసెటోల్లంతా – నిఘా వేసి చుస్తుంటరు…
కరవనున్న పాము నెరదాగి యున్నట్లు…
కాలం మాటేసింది…
గ్రద్ద తన్నుకుపోతోంది ఓ పిల్లను…
పిల్ల – పేగు బంధం తెగిపోతుంటే –
గండుకు బదులుగా గుండెను నిలిపి –
తల్లి – తెగించి అల్లంత పైకి లేచి వెన్నాడుతుంది గ్రద్దను
శక్తి చాలదు – దుఃఖాన్ని దిగమింగుకోవడం తప్ప –
దోపిడీకి గురి అవుతున్న బడుగు జీవుల్లాగా…
కుకుకుకు… పరాకుగా ఎవరినో పదే పదే పిలిచేను.
గుండెలు పగిలి, నిప్పులు మింగి….
నువు మోసిన పొత్తికడుపు తల్లడిల్లుచుండగా…
అలసి వుంటావో, మనసు చెదిరి వుంటావో…
ఇంకా నిన్ను నమ్ముకున్న వారున్నారే…
మరుపే దానికి వరం, మిగిలిన పిల్లల బ్రతుకులకు ప్రసాదం
నీ పిల్లలకై – శక్తి చాలినంతంగా – గ్రద్దను వెంబడిస్తావు నీవు –
తమ శక్తి కొలదీ – బడుగుల బ్రతుకుల్ని ఉన్న వాళ్ళ కొరకు –
బలిదానం చేస్తారు మన పాలకులు…

Exit mobile version