పిల్లల కోసం మైసూరు ప్యాలెస్

0
2

[dropcap]పి[/dropcap]ల్లలూ! మైసూరు ప్యాలెస్ గురించి ఎప్పుడైనా విన్నారా? రంగురంగుల విద్యుద్దీపాలతో కళ్ళు చెదిరే అలంకారాలతో, నయనానందకరంగా శోభను కలిగించే కోట బహుశ ఇదొక్కటేనేమో. మైసూరు సిల్క్ చీరలు, మైసూరు శాండల్ సబ్బులు, మైసూరు పాక్ ఇవీ మైసూరుతో సంబంధమున్నవని వినే ఉంటారు. ఈ రోజు మైసూరు పట్టణం గురించీ, మైసూరు ప్యాలెస్ గురించీ తెలుసుకుందామా!

 

మైసూరు కర్ణాటక రాష్ట్రంలోని రెండవ పెద్ద పట్టణం. ఇది బెంగుళూరుకు 140 కి.మీ. దూరంలో, సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్నది. ఇక్కడ ఏటా జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచం నలుమూలల నుండి యాత్రికులు హాజరౌతారు. మహిషాసుర ఊరు అనే పదం నుంచి మైసూరు అనే పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతాన్ని మహిషాసురుడనే రాక్షసుడు పరిపాలించేవాడు. ఆ రాక్షసుని అరాచకాలు భరించలేక దేవతలు పార్వతీదేవిని ప్రార్థిస్తే ఆ అమ్మ చాముండేశ్వరిగా అవతరించి, మహిషాసురుణ్ణి సంహరించి కొండపై వెలసిందట. అప్పటి నుంచి ఆ కొండకు చాముండి హిల్స్ అని, ఆ ప్రాంతానికి మహిషాసుర అని పేరు ఏర్పడింది. అదే కాలక్రమేణా మైసూరుగా రూపాంతరం చెందింది.

మైసూరు పట్టణం నడిబొడ్డున మీర్జా రోడ్‌లో మైసూరు మహారాజుల అద్భుతమైన కట్టడం రాజసంగా నిలబడి ఉంది. వడయార్ రాజులు ఈ ప్యాలెస్‌ను మొదట చెక్కతో నిర్మించారు. 1897లో అగ్నిప్రమాదం కారణంగా ఈ ప్యాలెస్ నేలమట్టమైంది. తరువాతి వడయార్ రాజులు దీనిని పునర్నిర్మించారు. క్రీ.శ. 1699 తరువాత చామరాజ వడయార్ మైసూరు పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. అప్పటి వరకు శ్రీ రంగపట్టణము రాజధానిగా ఉండేది. 1761లో హైదర్ అలీ మైసూరు రాజ్యానికి సేనాధిపతిగా ఉండేవాడు. ఆయన మరణానంతరం ఆయన కొడుకు టిప్పు మైసూరు రాజును పారద్రోలి తానే సుల్తాను అయ్యాడు. 1799లో టిప్పు మరణించిన తరువాత మరలా ఈ ప్యాలెస్ వడయార్ రాజుల వశమైంది. అప్పటికి కృష్ణరాజ వడయార్ ఐదు సంవత్సరాల బాలుడు. ఆయన పట్టాభిషేక మహోత్సవ తైలవర్ణ చిత్రం మైసూరులోని ఆర్ట్ గ్యాలరీలో ఉన్నది. ఆ ఉత్సవానికి బన్సాద్ మహారాజు, వారి యువరాజులు హాజరైనారు.

మూడవ కృష్ణరాజ వడయార్ మైసూరును బాగా అభివృద్ధి చేశాడు. వెడల్పైన రోడ్లు, కాలేజీలు, పెయింటింగ్ స్కూల్స్, కోట చుట్టూరా ప్రాకారాలు, కోట ముందున్న సింహద్వారాన్ని నిర్మించాడు. వీటన్నింటినీ చక్కని ప్రణాళికతో మైసూరును అందమైన పట్టణంగా అభివృద్ధి చేశాడు. ఈ కార్యక్రమాల్లో రాజుకు శేషాద్రి అయ్యర్, విశ్వేశ్వరయ్య సహకరించారు. ఈ ప్యాలెస్ ఇండో సరాసెనిక్ స్టైల్‌లో కట్టబడింది. అద్భుతమైన నగిషీ చెక్కడాలతో సుందరమైన ఆకృతితో మైసూరు ప్యాలెస్ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నది. చందనపు చెక్కల నగిషీలతో తయారైన కళారూపాలు, శిల్పకళ, జానపద కళలు, సంప్రదాయ చిత్రాలకు పెట్టింది పేరు మైసూరు. అందుకేనేమో మైసూరును కర్ణాటక రాష్ట్రానికి సాంస్కృతిక రాజధాని అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here