కాజాల్లాంటి బాజాలు-27: పిల్లలు కాదు… పిడుగులే.

2
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] పక్కింట్లో అమ్మాయి అర్జెంట్ పనుందని బైటికి వెడుతూ తన ఎనిమిదేళ్ళ కొడుకుని మా యింట్లో వదిలి వెళ్ళింది. ఆ పిల్లాడు కాసేపు టీవీ చూసేడు. కాసేపు యిల్లంతా పరిశీలించేడు. మీ యింట్లో అవి లేవా.. యివి లేవా అంటూ మా యింట్లో యేవి లేవో నాకు కూడా తెలీనివి చెప్పేడు. ఇంక వీణ్ణిలా వదిల్తే లాభం లేదని నేనేదో పెద్ద తెలివైనదానిలా “నీకు మంచి కథ చెప్తాను. వింటావా?” అనడిగేను.

“ఓ” అంటూ బుధ్ధిగా కూర్చున్నాడు.

ఏం కథ చెప్పాలా అని ఆలోచిస్తే అ వయసు పిల్లలకి మన రామాయణ, భారతాలు తెలియడం మంచిదనిపించి రామాయణం కథలా చెపుదామనుకున్నాను. వాళ్ళ అమ్మానాన్నలకి ఇవి చెప్పే సమయమూ, ఓపికా రెండూ ఉండవని ఏదో ఘనకార్యం చేస్తున్నట్లు ఫీలైపోతూ చిన్న చిన్న మాటల్లో రామాయణం చెప్పడం మొదలుపెట్టేను.

“అయోధ్యా నగరాన్ని పరిపాలించే దశరథమహారాజుకి ముగ్గురు భార్యలు, నలుగురు కొడుకులు..” అని మొదలు పెట్టగానే, “అంతమంది భార్యలేంటాంటీ అసయ్యంగా.. అయినా ఎక్కడైనా ఒకళ్ళో ఇద్దరో పిల్లలుంటారు కానీ యేకంగా నలుగురు పిల్లలేంటీ?” అనడిగేడు ఆ దుండగీడు. వాడి స్పందనకి తెల్లబోయేను. ఆ వయసులో వాళ్లకి త్రేతాయుగంనాటి ధర్మాలు చెప్పలేక మాట మార్చేసేను. ఇలాంటి పిల్లాడికి రామాయణాలు, పంచతంత్రాలు చెప్పి వాడి ప్రశ్నలకి జవాబులు చెప్పలేననుకుని సిండ్రెల్లా కథ చెప్పడం మొదలుపెట్టేను.

సిండ్రెల్లా చక్కటి డ్రెస్ వేసుకుని, అందమైన రథంగా మారిన గుమ్మడిపండులో రాజకుమారుడితో డాన్స్ చేయడం, సరిగ్గా పన్నెండుగంటలు కొడుతుండగా హడావిడిగా రాజభవనంనుంచి పరిగెత్తుకుని వెళ్ళిపోవడం, మధ్యదారిలోనే రథం కాస్తా మళ్ళీ గుమ్మడిపండుగా మారిపోవడం, సిండ్రెల్లా పరిగెత్తుకుని యింటికి వచ్చెయ్యడం అన్నీ చెప్పాను. వాడు శ్రధ్ధగా వినడం చూసి మరింత ఉత్సాహంగా చెప్పడం మొదలుపెట్టేను. రాజభవనంనుంచి వస్తుంటే ఆ కంగారులో సిండ్రెల్లా కాలికున్న అందమైన గాజుతో చేసిన స్లిప్పర్ అక్కడే జారి పడిపోతుందనీ, అది పట్టుకుని రాకుమారుడు ఆ స్లిప్పర్ యే అందమైన అమ్మాయి కాలికి పడుతుందోననినుకుంటూ నగరమంతా వెతికిస్తాడు అనీ చెప్తుంటే ఆ కుర్రాడు హఠాత్తుగా “అలా యెలా అవుతుందాంటీ?” అనడిగేడు. నాకర్థం కాలేదు. “ఎందుకవదు? రాకుమారుడు కదా! బోల్డంతమంది భటులుంటారు. రాజ్యమంతా వెదకొచ్చు..” అన్నాను.

దానికి వాడు “అది కాదాంటీ, మరి పన్నెండుగంటలవగానే రథం గుమ్మడిపండులా మారిపోయింది. గుర్రాలు మైస్ గా మారిపోయాయి. రథం నడిపేవాడు రాట్ గా మారిపోయాడు. అన్నీ మారిపోయినప్పుడు ఆ స్లిప్పర్ మటుకు మారకుండా అలాగే ఎందుకుంటుందీ?” అనడిగేడు..

నాకప్పుడు లైట్ వెలిగింది. అవున్నిజవే కదా! ఆ స్లిప్పర్ మటుకు మారకుండా అలాగే ఎందుకుంటుందీ.. ఆ కుర్రాడి కొచ్చిన అనుమానం యిన్నేళ్ళూ నాకెందుకు రాలేదు. అందుకేనేమో ఈ రోజుల్లో పిల్లలు పిల్లలు కాదు.. పిడుగులే అని అంటుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here