ఆలోచింపజేసే ‘పిల్లిమొగ్గ శతకము’

0
2

[dropcap]’వె[/dropcap]ర్రి వేయి విధాలు – పిచ్చి పలు రకాలు’ అన్న నానుడికి నూటికి నూరుపాళ్ళు నేటి ఆధునిక సమాజం ఒక నిలువెత్తు దర్పణం.

ప్రపంచంలోనే భారతీయ నాగరికత, సాంప్రదాయం, ధర్మం ఎన్నో విధాలుగా గుర్తించబడి, కీర్తింపబడుతున్న దేశం మన భారతదేశం.

మన సత్సంప్రదాయాలను, ఆచారాలను, వ్యవహారాలను ‘కాలం మారింది’ అనే ఒక వంకతో, పూర్తి అవగాహన లేని ప్రతీ విషయానికి శాస్త్రీయతను అనువర్తింప చేసి వాటన్నింటిని ఛాందస భావాలుగా, ఈనాటి సమాజానికి పనికిరాని విషయాలని పదిమందికి ప్రచారం చేస్తూ ముందుకు దూసుకుపోతున్న సభ్యులున్న సభ్య సమాజం మనది.

మన ‘భగవద్గీత’ను ‘గీతా మాత’గా ఆరాధిస్తూ మనం వదిలేస్తున్న సాంప్రదాయ వస్త్రధారణను ఫ్యాషన్ పేరుతో అంగాంగ ప్రదర్శనగా మార్చుకుని, ఆ పై జరిగే సన్నివేశాలకు కారణభూతమవుతూ, మానసిక బలం, నిబ్బరం లేని పాలకుల పాలనలో న్యాయం జరగక సమాజ చరిత్రలో ఒక చిన్న మచ్చగా మిగిలిపోతున్నాం.

వాటిని ప్రపంఛంలోని ఎన్నో దేశాల ప్రజలు తమ జీవన విధానంగా మలచుకుని అనుసరిస్తూ, అనుకరిస్తూ వాటి మూలాలను పరిశోధిస్తున్న ఎందరెందరో విదేశీయులు నేడు మనకు అంతర్జాలంలో కనిపిస్తూనే ఉన్నారు.

మన యీ ప్రస్తుత సమాజంలో ధనపిచ్చి, పదవి పిచ్చి, కుల పిచ్చి, మత పిచ్చి, మగువ పిచ్చి, మందు పిచ్చి, పరువు పిచ్చి, పలుకుబడి పిచ్చి… ఇలా రోజు రోజుకి మనిషికి పిచ్చి ముదిరి పిల్లి మొగ్గ లేస్తోంది.

ఈనాటి సమాజంలో కవి లేదా రచయిత అయిన ప్రతీ ఒక్కరు తమవంతు ఈ సామాజిక రుగ్మతలపై దృష్టి సారించి తమ కలాలకు పదును పెడుతూ ఈ రుగ్మతలకు మూల కారణాలను విశ్లేషిస్తూ, తద్వార వాటి పర్యవసానాన్ని వివరిస్తూ, అవసరమైన చోట నిరసిస్తూ, తమ గళాలను విప్పుతూనే ఉన్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీదో, సమయానుకూలంగా అంతకన్నా ఎక్కువ సమస్యల మీదో రాసి ఉంటారు.

కానీ నూటొక్క సామాజిక అంశాల మీద (10,201) నూటొక్క శతకాలుగా రచించి, వాటిని ఎంతో వ్యయప్రయాసలకోర్చి ముద్రించి, ఒకే వేదికపై ఒకేసారి ఆవిష్కరణ చేయడమే కాక, 101 వేదికలపై ఒక్కొక్క శతకం చొప్పున 101 శతకాలు ఆవిష్కరించడం ఎవరికైనా సాధ్యమయ్యే పనేనా?

‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’ అన్న వేటూరి వారి అక్షరాలను అచ్చమైన అర్థాన్ని కల్పిస్తూ, తెలుగు భాషా వైభవం ప్రపంచానికి చాటడం, తద్వారా భావితరాలకు తెలుగు భాషా స్ఫూర్తిని కలిగించడం ఎవరి వల్ల అవుతుంది?

కేవలం అమ్మ భాష పట్ల నిజమైన, నిఖార్సయిన, స్వచ్ఛమైన ప్రేమ గల తెలుగుభాషా ప్రేమికునికే సాధ్యమవుతుంది.

భావితరాలకు నైతిక విలువలు, సామాజిక స్పృహ, విశ్వశాంతి కాముకత, దేశభక్తి, ప్రకృతి పట్ల అవ్యాజమైన ప్రేమ, బాధ్యతాయుతమైన ప్రవర్తన వంటి ఉన్నత లక్ష్యాల సాధన కోసం పద్య రూపంలో విస్తృత కవితా రచన చేపట్టిన ఆ కవి పేరు శత శతక కవి శ్రీ చిగురుమళ్ల శ్రీనివాస్.

తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న 47 సంవత్సరాల వయసు గల శ్రీ చిగురుమళ్ల శ్రీనివాస్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్, బి.ఎ., విద్యార్హతలను డా. బి.ఆర్. అంబేద్కర్ యూనివర్సిటీ నుంచి, బి.ఎడ్, ఎం.ఎ. తెలుగు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి స్వీకరించిన ఉత్తమ విద్యావేత్త.

తన నూటొక్క శతకములకు 237 కవి పండితులతో ముందుమాటలు రాయించడం అరుదైన అత్యంత విశేషం.

ఒక పుస్తక సమీక్షకు రచయిత పరిచయం ఇంత అవసరమా అనిపించవచ్చు. కాని అనితర సాధ్యమైన కార్యక్రమాన్ని చేపట్టి, విజయవంతగా నిర్వహించిన ఆ తెలుగు భాషా ప్రేమికుని కొందరైనా పాఠకులు అనుసరించాలనే సదుద్దేశంతో యీ ప్రస్తావన అవసరమనిపించింది.

వారి శతకాలలో ‘పిల్లిమొగ్గ శతకం’నకు ప్రముఖ పరిశోధకులు ఆచార్య మసన చెన్నప్పగారు, ఈ సమీక్ష రచయితనైన నేను ముందుమాట రాయడం జరిగింది.

యిక ‘పిల్లిమొగ్గ శతకము’ను పరిశీలిస్తే – ఈ శతక కర్త చెప్పినట్టు మనిషి ప్రవర్తన సాధారణ స్థాయి నుంచి విపరీత ధోరణికి, ఆ స్థాయి నుంచి ఉన్మాద స్థాయికి, అక్కడి నుంచి పిచ్చి స్థితికి చేరించి. ఆ పిచ్చి పరాకాష్ఠకు చేరిన కొద్ది శాతం మంది ఫలితాన్ని అనుభవిస్తున్నారు. తన మీద ఆధారపడినవారికి ఆ ఫలితము అనుభవింప చేసేలా చేస్తున్నారు. వారి అతి ప్రవర్తన సమాజాన్ని ఎలా చెడగొడుతుందో తెలిపే ఈ శతకానికి ‘పిచ్చి ముదిరి వేయ పిల్లిమొగ్గ’ అన్న మకుటాన్ని నిర్ణయించడం సర్వదా సమంజసం.

సెల్‌ఫోన్ అత్యధికంగా వాడుతున్న ‘యువత’ సెల్ఫీ చర్యలని వివరిస్తూ –

“పందితోడ సెల్ఫి, పరుగెత్తుతూ సెల్ఫి
బురదగుంట యందు బొరలి సెల్ఫి,
రోమియోల మాయ రోగ మాయర సెల్ఫి,
పిచ్చి ముదిరి వేయ పిల్లిమొగ్గ!”

అన్న ఈ కవి రాసిన 10,201 పద్యాలు ‘ఆటవెలది’ వృత్తంలోనే అంటే ఆశ్చర్యం కలుగక మానదు.

చదువు, సంస్కారం, సిగ్గు ఎగ్గు, శీలము అన్నింటిని విడిచిపెట్టి ‘లవ్’ అంటూ ఒంటరిగా స్త్రీ కనబడితే చాలు, వావి వరస మరచి జంట కట్టమని కామ పిశాచాల వలే వెంటబడుతున్న మగాడి మృగతత్వాన్ని ఎండగడుతూ ‘తమ’ మాట వినని స్త్రీని వెంటాడి, వేధించి, కొట్టి, అవసరమైతే హత్య చేసి కాల యముడిని మించిపోయిన కామ యముని వికృత చేష్టలను తన పద్యాలలో తేటతెల్లం చేసారాయన.

మనుషుల మనసుల మధ్య మాయ తెరలు పెరిగి, మమత తరిగిపోయి, కల్మషము, కఠినత్వము పెరిగాయని వగస్తూ –

“కల్మషమ్ము పెరిగె, కఠినత్వము పెరిగె
మధురమైన మనిషి మమత తరిగె
మనసు మనసు మధ్య మాయ తెరలు పెరిగె
పిచ్చి ముదిరి వేయ పిల్లిమొగ్గ!” అని వాపోతాడు కవి.

యిక యువతను భ్రష్టు పట్టిస్తున్న అధిక శాతపు నేటి చిత్రాలందిస్తున్న వినోదాన్ని వ్యంగ్యంగా తెలుపుతూ –

“చిత్రసీమ కథల చిత్రమే కద ప్రేమ
భామ ప్రేమ చిత్రసీమ ప్రేమ
నీతి గోరెండంత బూతు బోలెడు సంత” అంటాడు ఈ పద్యంలో.

‘డబ్బుకు లోకం దాసోహం’ అన్న చందాన విద్యావ్యవస్థలో సీట్లను కొనుక్కుని చదవడం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తూ –

“వైద్యసీటు నేడు మద్యసీసా తీరు
సంత యందు దొరుకు పాత సరుకు
చకట విసుర డబ్బు – చదువు ఎటుల అబ్బు” అని వ్యవస్థను ప్రశ్నిస్తున్నాడు.

కుటుంబ వ్యవస్థలో తల్లి, తండ్రి, పిల్లలు ఒకే చోట కూర్చుని భోజనము చేసే రోజు లేకుండా పోయిందే – అని బాధ పడుతూ –

“తల్లిదండ్రి బిడ్డ దరిజేరి ఒకచోట
భోజనమ్మా చేయు రోజు లేదు –
మనసు మనసు మధ్య మరి టీవీ చేరెరా!” అంటూ టీవీ కుటుంబ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతోందో తెలియజేస్తాడు కవి.

ఒంటిని కప్పుకోవడానికి సరియైన వస్త్రం లేని బిచ్చగత్తెలని సమాజంలో ఎంతోమందిని చూస్తూనే ఉంటాం. కాని డబ్బున్న ఓ మారాజు చేసిన పనిని ఎత్తిపొడుస్తూ –

“సిగ్గు దాచుటకు చీర ముక్కయు లేక,
అక్క చెల్లెలిచట అలమటించ
కోట్లు పెట్టి నొకడు కోటు కుట్టించెను
పాయిఖానా కొకడు పసిడి పూతలు పూసె” అంటాడు ఈ కవి.

చివరగా ఈ పిచ్చిలన్నీ మాని మన జతి గౌరవమును, సంప్రాదాయాలను అనుసరిస్తూ భావితరాలకు ఆదర్శమై నిలవాలని పరోక్షంగా ఉద్బోధిస్తూ –

“భరతజాతి కన్న భవ్య జాతియు లేదు
సాంప్రదాయము లవి సంపదలగు
జాతి ఘనత వీడి జపమేల పరులకై
పిచ్చి ముదిరి వేయ పిల్లిమొగ్గ!”

అంటున్న ఈ కవి విరచితమైన ఈ శతకమే కాదు, నూటొక్క శతకాలను చదివి ఆకళింపు చేసుకుని, కొందరైనా చక్కని ఆచరణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిననాడు రాబోయే తరాలకు ఈ రచనలు ఆదర్శవంతమవుతాయని, అవ్వాలని కోరుకుంటూ – యింతటి బృహద్ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ చిగురుమళ్ల శ్రీనివాస్ గారిని అభినందిస్తూ – “మా తెలుగు తల్లికి మల్లెపూడండ – మా కన్న తల్లికి మంగళారతులూ”.

***

పిల్లిమొగ్గ శతకము
రచన: చిగురుమళ్ల శ్రీనివాస్,
పేజీలు: 40
వెల: రూ.40/-
ప్రతులకు: చిగురుమళ్ల ఉషారాణి, రాజుపేట కాలనీ,
భద్రాచలం-507111, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
తెలంగాణ.
ఫోన్: 9121081595

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here