[ఆగస్టు 8 అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం సందర్భంగా శ్రీ జూకంటి జగన్నాథం రచించిన ‘పిల్లులు జిందాబాద్!!’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము]
[dropcap]వీ[/dropcap]డు ఎప్పుడు సంకలో
పిల్లిన పెట్టుకుని
ఊరంతా తిరుగుతుంటాడు
ఏ వైపు దుంకాలో
మోకా కోసం చూస్తూ
ఒక రాజకీయ పిల్లి
గోడమీద కూర్చుంటుంది
ఎందుకో ఏమో ఎల్లప్పుడూ
పేద ప్రజల కాళ్లల్లో
పిల్లి తిరగాడుతుంది
తెలిసి తెలిసీ
దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు
ఐదేళ్లకోసారి నాసుపెట్టిన పిల్లికి
రొయ్యల మొలతాడు కడుతుంటాం
ఓటు హక్కు
మన చేతిలో పెట్టుకొని
ఏడిండ్ల పిల్లి కూన లెక్క
గోస గోసోలే తిరుగుతుంటాం
పిల్లి ఎడమ నుంచి కుడికి పోయినా
సిరిసిల్లకు పోయేటోల్లకు
వడ్ల ఎడ్డి రామయ్య ఎదురుపడినా
ఇక ఆరోజు పని కాదని
మా ఊరి వాళ్ళు
మనుసులనే గులుక్కుంటూ
తిరుగు ఇంటి దారి పట్టేవారు
మేల్కొల్పాల్సిన మేధావి
పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాడు
ఎలుకల బాధకు పిల్లిని పెంచుకుంటే
ఇక ఇప్పుడు మార్జాలం వేటకు
దేశాన్ని కాల పెట్టుకునేటట్టు వుంది
ఎవరూ చూడడం లేదని
నాయకుడు కళ్ళు మూసుకొని
పిల్లిలా పాలు తాగుతూ ఉంటాడు
ఇన్ని తరీఖల పిలువబడే
పిల్లి పెంపుడు జంతువు
ఎప్పుడు ఎలా అయ్యిందో కానీ
దీపం చేతుల పట్టుకుని
బాయిల పడ్డట్టు
అయ్యింది కదా తండ్రీ!
పిల్లీ వచ్చే
ఎలుకా భద్రం
అంతా గప్ చుప్