పిండి బొమ్మలు

0
1

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘పిండి బొమ్మలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మా[/dropcap] చిన్నతనంలో శనగపిండి బొమ్మలు అని ఒక కథను పెద్దవాళ్ళు చెప్పేవారు. చాలా సరదాగా ఉంటుంది. పిల్లలం మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు అని అడిగేవాళ్ళం. తల్లి శనగ పిండిలో మనిషి బొమ్మల్లాగా మలిచేది. వాటిని నూనెలో వేయించి పిల్లలకు పెడితే పిల్లలు నాకు తల కావాలి, నాకు కాళ్ళు కావాలి అని అడుగుతూ అనేవారు. ఇంటికి వచ్చిన చుట్టాలు ఈ మాటలు విని పారిపోయేవారు. చుట్టాలను సాగనంపడానికే తల్లి ఇలా చేసేది. శనగ పిండి బొమ్మలు అనే కథ చెపుతాననగానే పిల్లలు వినడానికి రెడీ అయిపోయేవారు. అంత సరదాగా ఉండేది కథ.

నేను గోధుమ పిండితో, మైదా పిండితో బొమ్మలు చేస్తున్నాను. చపాతీలు, పూరీలు చేసుకునేటపుడు కొద్దిగా పిండి పక్కన పెట్టుకొని మన క్రియేటివిటీని చూపించవచ్చు. బంక మట్టితో చేసుకున్నట్లే గోధుమ పిండి ముద్దతో కూడా చేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకుంటే బొమ్మలు కొద్దిగా రంగుగా కనిపిస్తాయి. అదే మైదా పిండితో గనుక బొమ్మలు చేస్తే తెల్లగా ఉంటాయి. ఈ పిండ్లలో జిగురు ఉంటుంది కాబట్టి చక్కగా నిలబడతాయి.

వరి, గోధుమ పంటలు మానవులకు ప్రధాన ఆహార వనరులు. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరిని ఆహారంగా తీసుకుంటారు. ఉత్తర భారతదేశంలో గోధుమను ఎక్కువగా పండిస్తారు. అక్కడ గోధుమ పిండితో తయారైన రొట్టెలు చపాతీలే వారి ప్రధాన ఆహారం. గోధుమ గడ్డి కూడా ఉపయోగపడుతుంది. గోధుమ గడ్డిని పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. అంతే కాకుండా ఇళ్ళ పైకప్పులకు గడ్డిగా వాడుకోవచ్చు. గోధుమ పిండిని చపాతీలు చేసుకోవడానికి కలిపిన ముద్దను తీసుకుని బొమ్మలు చేయవచ్చు. ఇది పిల్లలకు చూపించడానికి చాలా సరదాగా ఉంటుంది.

చపాతి పిండి ముద్దతో నేనొక బల్లిని చేశాను. ఎన్నో రకాల జంతువులను తయారుచేశాను. కానీ బల్లుల్నీ, తొండల్ని చెయ్యలేదు. మా ఇంటి గోడల మీద బల్లులు ఎప్పుడూ పాకుతూ ఉంటాయి. అందుకే తల, శరీరం, తోకను పెట్టి బల్లిలా తయారు చేశాను. నాకు చిన్నప్పటి నుండి బంకమట్టి బొమ్మలు చేసే అలవాటు ఉన్నది. అందుకని ఇవి చేయడం సులభమైంది. దీనికి పెద్ద నైపుణ్యం అవసరం లేదు. బల్లికి శరీరం మీద నొక్కులు పెట్టాను. ఆ తర్వాత దీనిని నూనెలో వేయించి టేబుల్ మీద పెట్టాను. మా ఇంట్లో చిన్న పిల్లలు లేరు గానీ చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు వంట చేస్తూ ఏదో ఒక ఆకారాన్ని సృష్టిస్తే పిల్లలు సరదాపడతారు. చపాతి పిండితో బల్లి బొమ్మ తయారయింది.

ఒక రోజు మైదా పిండితో స్వీట్లు చేద్దామని పిండి కలిపాను. ఏదైనా బొమ్మ చెద్దామనుకున్నాను. అయితే ఊరికే బొమ్మలు చేసి పెట్టుకోవడం ఎందుకు అనిపించి ఏదో ఒక ప్రయోజనం ఉంటే బాగుంటుందనిపించింది. వర్షాకాలంలో ఈగలు ఎక్కువగా వస్తాయి. ఆహార పదార్థాల మీద ఈగలు ముసురుతుంటాయి. అటువంటి ఆహార పదార్థాలు తిని జబ్బుల పాలవుతుంటారు. ఈ విషయాల్ని తెలియజేద్దామనిపించింది. అందుకే ఈగల బొమ్మలు చేశాను. వీటిని మైదా పిండితో చేయడం వలన తెల్లగా వచ్చాయి. తెల్లని ఈగలు అందంగా ఉన్నాయి. ఈ ఈగల్ని మా హాస్పిటల్లో పెట్టాను.

ఈగలలో వచ్చే జబ్బుల గురించి ఒక వ్యాసం రాసిచ్చి మా కాంపౌండర్లకు ఇచ్చి వివరించమని చెప్పాను. నాకు టైముంటే నేనే చెప్తాను. ఆరోజు సమయo లేక మా స్టాఫ్‌కు ఇచ్చాను. డాక్టరు గారి రూములో ఉన్న ఈగల్ని చూసి పేషెంట్లు అందరూ చాలా సంతోషపడ్డారు. ఇలా ఈగలతో వచ్చే వ్యాధులను ‘ఆర్ధ్రోఫోడ్ బార్న్ డిసీజెస్’ అంటారు. వానాకాలంలో విజృంభించి తన సంతానాన్ని అపరిమితంగా పెంచుకుంటుంది ఈగ. ఇల్లును, పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. నా ఈగలు ఇలా ఉపయోగపడ్డాయి.

ఈగల బొమ్మలు చాలా బాగా అందరినీ అలరించడంతో కొన్ని పురుగుల బొమ్మలు చేద్దామనుకున్నాను. నులి పురుగుల వంటివి కడుపులో చేరడం వలన విపరీతంగా కడుపునొప్పి వస్తుంది. ఈ నులి పురుగు మనిషి కడుపులో తన సంతానాన్ని వృద్ధి చేసుకుంటుంది. ఫలితంగా పిల్లల్లో అనేక రకాల వ్యాధులు వస్తాయి. పిల్లలు మట్టిలో ఆడటం వలన వార్మ్స్ యొక్క గుడ్లు చేతి గోళ్ళలో చేరి కడుపులోకి చేరతాయి. అందువలన అన్నం తినేముందు పిల్లల చేతులు బాగా కడిగించాలి. అలాగే టాయిలెట్‌కు వెళ్ళి వచ్చాక శుభ్రంగా చేతులు కడుక్కోమని ట్రెయినింగ్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా నులి పురుగుల పని పట్టేటందుకు స్కూళ్ళకు వెళ్ళి ప్రతి పిల్లవాడికీ టాట్లెట్లు వేస్తుoది. నేనివన్నీ తెలియజేయడానికి ఈ వార్మ్స్‌ను తయారుచేశాను. మనం తయారుచేసే బొమ్మలకు ఏదో ఒక ప్రయోజనం ఉoడాలి.

ఒకరోజు మా చుట్టాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళింట్లో మూడేళ్ళ పాప ఉన్నది. వాళ్ళమ్మ పూరీలు చేయడానికి పిండి కలుపుతున్నది. పాప నేను కూడా చేస్తానని వెంటపడుతోంది. కొంచెం పిండి ముద్ద ఇచ్చి ఆడుకోమని బయటకు పంపింది, బయలు బట్టల దండెం మీద కాకులు ‘కావు కావు’ అంటూ అరుస్తున్నాయి. పాప కాకులతో ఆటలాడుతోంది. పాప చేతిలో పిండి ముద్ద లాక్కుందామని కాకులు ప్రయత్నిస్తున్నాయి. వెంటనే ఐడియా వచ్చింది. “పాపా ! ఇలా రా! నేను కాకి బొమ్మను చేసిస్తా” అని పిలిచాను పాప నా దగ్గరకు వచ్చింది. పిండి ముద్దను ఇవ్వమని అడిగాను. పిండి ముద్దను నాకిచ్చి ఉత్సాహంగా నా వంక చూస్తోంది. నేను పిండి ముద్దతో మెల్లగా కాకి ఆకారాన్ని రూపొందించాను. కాకి ఆకారం బాగానే వచ్చింది. ఇప్పుడు ఈ బొమ్మను పాపకిచ్చి కాకి పద్యం చెప్పాను. కాకీ కాకీ: కడవల కాకీ! కాకి నోట్లో దీపం పెడితే, దీపం తీసుకెల్లి దిబ్బాకిస్తే అంటూ పద్యం పాడుకుంటూ పాప ఆటలో పడిపోయింది.

మా ఇంట్లో ఎప్పుడూ రకరకాల జాతుల కుక్కలు ఉంటాయి. అందుకే ఒక కుక్క బొమ్మను చెద్దామనుకున్నాను. పిండితో కష్టపడి కుక్క బొమ్మను చేశాను. కళ్ళు కోసం మిరియాలు, ఆవాలు పెట్టుకోవచ్చు. కుక్కను గ్రామసింహాం అని అంటారు. కుక్కలు మానవులతో స్నేహం చేస్తాయి. విశ్వాసానికి చిరునామా కుక్క. ఈ విషయాలన్నీ పిల్లలకు తెలియజేస్తూ ఈ కుక్కపిల్లల్ని చూపించాలి.

అలాగే కుక్కల్లో ఎన్నో జాతులంటాయి – గోల్డెన్ రిట్రీవర్, రాట్ వీలర్, టాయ్ పుడిల్, హస్కీ వంటి ఎన్నో రకాల కుక్కల గురించి నేను 1998 ప్రాంతంలో చాలా వ్యాసాలు రాశాను. బొమ్మల్ని చేసి పిల్లలకు పాఠాలు చెపితే బాగా అర్థమవుతాయి. కళ కూడా అబ్బుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here