Site icon Sanchika

పిసినిగొట్టు రామయ్య

[dropcap]పి[/dropcap]సినిగొట్టు వాడికి ఏమీ మిగలదు. ప్రతి దమ్మిడీ కోసం పాకులాడుతూ వుంటాడు. ఏమీ తినకుండా నోరు కట్టుకొని డబ్బు పోగు చేయాలనుకుంటాడు.

ఒక ఊళ్లో పరమ లోభి వుండేవాడు. అతని తాత, తండ్రి కూడా పిసినారితనంతోనే జీవించారు. ఊర్లోని పేద రైతులకు అప్పులిచ్చేవారు. ఎక్కువ వడ్డీ గుంజుకొని వాళ్లని బికారుల్ని చేసేవాళ్ళు. వీళ్లది పిసినిగొట్టు వంశం అని అనుకోసాగారు.

ఇప్పుడు మన పిసినిగొట్టు పేరు రామయ్య. తల్లిదండ్రులిచ్చిన ఆస్తిపాస్తులతో పాటు వారి పిసినిగొట్టుతనాన్ని వారసత్వంగా తీసుకున్నాడు. ప్రాణం పోయినా సరే ఒక్క దమ్మిడి కూడా పోకూడదు అనుకునేవాడు. రామయ్య దగ్గర చాలా సంపద ఉన్నది. పొరపాటున కూడా ఏ పేదవానికి కానీ, అనాథ పిల్లలక్కానీ ఎంగిలి చేత్తో కూడా ఒక్క మెతుకు విదిలించేవాడు కాదు. తన భార్యకి కూడా ఏనాడు ఒక్క రూపాయి ఇచ్చి ఎరుగడు.

రామయ్య భార్య చాలా అందంగా వుండేది. పొదుపుగానే ఇంటిని గడిపేది. భర్తను ఒక కొత్త చీర కొనిపెట్టమనీ, ఒక నగ చేయించి పెట్టమనీ అడిగేది కాదు. అతను కొని తెచ్చిన ముతకవి, చౌకవి యిన బట్టల్నే కట్టుకునేది.

రామయ్య దంపతులకు ఒక కొడుకు. ఇప్పుడిప్పుడే పాకటం నేర్చుకుంటున్నాడు. వాడికి కూడా ఒంటిమీద సరైన బట్టలు వుండేవి కావు. ఎప్పుడు మట్టిలో ఆడుకుంటూనే వుండేవాడు. మధ్యమధ్యలో ఆ మట్టిని నోట్లో వేసుకుంటూ వుండేవాడు. వాడి పరిస్థితి చూసి ఊరిలోని మిగతా పిల్లలు కూడా జాలి పడుతుండేవారు. తండ్రి రాతి గుండెకి మాత్రం పిల్లవాడి ఒంటినిండా సరియైన బట్టలు కప్పుదామన్న ధ్యాస వుండేది కాదు. ఏమాత్రం కష్టపడకుండా ధనాన్ని వడ్డీలకు ఇచ్చి సంపద పెంచుకోవాలనే తపన పడేవాడు రామయ్య. తాను కడుపునిండా తినేవాడు కాదు, భార్యకూ పిల్లవాడికి కడుపునిండా తిండి పెట్టేవాడు కాదు. పండగ పూటైనా ఒక్క పిండి వంట అయినా చేయనిచ్చేవారు కాదు. తన ఇంటికి ఏ చుట్టాన్ని రానిచ్చేవాడు కాదు. తాను మాత్రం ఊళ్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఏ శుభకార్యం చేసుకొని పిలుస్తారా, వెళ్లి కడుపునిండా తిని వద్దామని ఎదురు చూస్తూ వుండేవాడు.

ఒకరోజున పొరుగూర్లో వున్న తన బంధువుల ఇంట్లో పెళ్లి జరగబోతున్నదని తెలిసింది. వాళ్ళు ఇంకా పెళ్లికి పిలువలేదు. పెండ్లి వారికి పనుల్లో సాయంగా వుంటానన్న వంకతో పదిహేను రోజుల ముందుగానే కొడుకును భార్యను తీసుకొని పెళ్లి వారి ఇంటికి బయలుదేరాడు. ఇంట్లో ఉంచితే దొంగలు దోచుకుంటారని భయంతో తన దగ్గరున్న డబ్బు, దస్తావేజులు, నోట్లు మొత్తం అన్ని ఒక పెట్టెలో సర్దుకున్నాడు. ఉన్న కొద్ది బట్టలు ఒక సంచిలో కుక్కుకున్నాడు. ఒకళ్ళు సంచీని, ఒకళ్ళు పిల్లవాడిని మోసుకుంటూ నడుస్తున్నారు. ఏదైనా బండి మాట్లాడుకొని వెళ్ళవచ్చు. కానీ బండి బాడుగ ఇవ్వాల్సి వస్తుందని అలాగే భార్యను నడిపిస్తూ తీసుకెళ్లసాగాడు.

పెండ్లివారి ఊరు చేరాలంటే ఒక పెద్ద కాలవను దాటాలి. మామూలుగా ఆ కాలవ ఎండిపోయి వుంటుంది. కానీ వర్షాకాలంలో ఆ కాలవలో చాలా నీరు ఉంటుంది. పైగా ఎప్పుడు వరద వస్తుందో ఎవరికీ తెలియదు.

నీరు ఎక్కువగా ఉన్నప్పుడు కాలవ చాలా పెద్దదిగా ప్రవహిస్తూ వుంటుంది. దాన్ని దాటి అవతల వైపుకు వెళ్ళటానికి పడవలు నడుపుతూ వుంటారు. పడవలు అక్కడే నిలిపి వుంచుతారు. రామయ్య ఎప్పుడూ ఆ కాలవ దాటవలసి వచ్చిన పడవ ఎక్కడు. దేవుడికి ఓ దండం పెట్టుకుని కాలవలో నడుచుకుంటూ అవతలివైపుకు పోతూ వుండేవాడు. రామయ్య ఈరోజు ఒంటరిగా లేడు. భార్యతోనూ, కొడుకుతోనూ, పెట్టె తోను ఉన్నాడు. వీళ్లను పడవ నడిపేవాడు చూశాడు. ‘ఈయన ఎప్పుడూ పడవ ఎక్కడు. ఈరోజు కుటుంబాన్ని పడవ ఎక్కించి డబ్బులు వసూలు చేయాల’ని ఆలోచించాడు.

“బాబయ్యా! పడవ ఎక్కండి. ఒక్కొక్కళ్ళకి పావలా ఇవ్వండి. రండి పడవలో కూర్చోండి. అవతలి వైపు తీసుకు వెళ్తా” అన్నాడు.

రామయ్యకు ఆ మాట ఇష్టంగా లేదు. “అరే పావలా అడుగుతున్నావేంటి? ఒక అణా బాడుగ తీసుకో. నాలుగు అణాలు చాలా ఎక్కువ. పైగా నా కొడుకు పసిపిల్లవాడు. వాడికి బాడుగ ఏం తీసుకోకూడదు” అన్నాడు.

“నాకు బాడుగ ఇస్తానన్న రెండు అణాలు నువ్వే ఉంచుకో. పొగాకు కొనుక్కుందూ గాని” అంటూ పడవ వాడు తన పడవతో సహా వెళ్ళిపోయాడు.

రామయ్య ఏమన్నా తక్కువవాడా? పెట్టెను నెత్తిన పెట్టుకొని, మూటను సంకలో ఇరికించుకున్నాడు. భార్య భయపడుతుంటే పిల్లవాడిని కూడా తన రెండవ సంక నేసుకున్నాడు.

“నా వెనకాలే రా. నన్ను పట్టుకొని నీళ్లలో నడు. నీకేం భయం లేదు” అని భార్యతో చెప్పి నెమ్మదిగా నీటిలో దిగాడు. కాలవలో నీరు బాగా ఉన్నది.

వీరు కాలవ మధ్యలోకి వెళ్లారు. ఎగువ నుంచి అకస్మాత్తుగా వరద నీరు రాసాగింది అంతకంతకు నీరు ఎక్కువ అవుతున్నది. వెనక్కు వెళ్లలేకపోతున్నారు, ముందుకు పోలేక పోతున్నారు. నాలుగణాల కోసం చూసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. నీళ్లు పెరుగుతున్నాయి.

పెట్టె బరువు, పిల్లవాడి బరువు ఎక్కువయ్యాయనిపిస్తున్నది. చంకలోని మూట జారి జారి పోతున్నది. ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. ‘చెట్టనేది ఉంటే, పండ్లు తరువాత అయినా కాస్తాయి గదా’ అనుకుని పిల్లవాని నీటిలో వదిలేశాడు. కొంచెం బరువు తగ్గినట్లు అనిపించింది. నాలుగు అడుగులు ముందుకు వేయగలిగాడు.

కానీ అవతలి వైపుకు చేరాలంటే ఎక్కువ సమయమే పట్టేటట్లు ఉన్నది. అంతకంతకూ నీరు ఎక్కువగా వస్తున్నది. మరలా ఆలోచించాడు. తన చెయ్యి పట్టుకుని భార్య ఒకటే గుంజుతుంది. ఆమె తనకి బరువు అనిపించసాగింది. ‘చేతిలో డబ్బు దస్కం దండిగా ఉంటే ఎన్నిసార్లయినా పెళ్లిళ్లు చేసుకోవచ్చు’ అనుకొని భార్యను నీళ్లలోకి  తోసివేశాడు. ఆమెకు ఏమో ఈదడం తెలియదు. ‘అయ్యో అయ్యో’ అనుకుంటూ మునిగిపోయింది.

రామయ్య ఇంకా సగం దూరం కూడా రాలేదు. నీరేమో అంతకంతకు ఎక్కువ వస్తున్నది. అప్పటికప్పుడు మేఘాలు కమ్ముకొచ్చాయి. వర్షం బాగా కురవసాగింది. నెత్తిన పెట్టి బరువుతో పైనుంచి, పక్కనుంచి వచ్చిపడే నీటి ప్రవాహంతో రామయ్య అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతున్నాడు. ‘ప్రాణం అంటూ ఉంటే జీవితంలో ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ఇప్పుడు నేను బతకటం ముఖ్యం’ అనుకుంటూ నెత్తిమీదున్న పెట్టెను కూడా నీళ్లలో వదిలిపెట్టాడు. లోభత్వంతో భార్యా బిడ్డను, ఇప్పుడు జీవితాంతం కష్టపడి తినీ తినక సంపాదించినదంతా నీటిపాలు చేసేశాడు.

జీవితం అందరికీ ఎంతో ఇష్టమైనది. పిసినారి రామయ్యకు కూడా తన బతుకు పట్ల ఎంతో ప్రేమ ఉన్నది. అందుకని “కాపాడు రామా… నన్ను బతికించు రామయ్య తండ్రీ” అంటూ వేడుకో్సాగాడు. రాముడు తనను కొలిచే వారిని, మంచి వారిని ఆదుకుంటాడు. ఇలాంటి పిసినారి వాళ్ళ మొర వింటాడా?

‘అమ్మయ్య, ఇంకా నాలుగు అడుగులు వేస్తే అవతలివైపుకు చేరుకుంటాను’ అని రామయ్య అనుకో్సాగాడు. ఇంతలోనే నీటి ప్రవాహం మరింత ఎక్కువై రామయ్య కొట్టుకుపోసాగాడు. నీటి ఉరవడికి తట్టుకోలేక మునిగిపోయాడు. ఊపిరి అందక చనిపోయాడు.

ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు. అలాగని పిసినారితనంగా ఉండడం కూడా బుద్ధిమంతుల లక్షణం కాదు.

హిందీ మూలం: శ్రీ అరిగెపూడి రమేష్ చౌదరి

తెలుగు సేత – దాసరి శివకుమారి

Exit mobile version