పితలాటకం

0
2

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘పితలాటకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

(గమనిక: ఈ కథ ఎవరినీ ఉద్దేశించినది కాదు. కేవలం హాస్యం కోసమే కల్పిత పాత్రలతో రచించబడింది)

[dropcap]“ఇం[/dropcap]దూ! రాత్రి ఓ కల..! అందులో ఓ అందాల భామ కనిపించి ఒకే మురిపించింది. అబ్బో! ఎంత ముద్దొచ్చిందో చెప్పలేను..!”

“అహాఁ! అంటే అబ్బాయిగారు ఎవతెనో వూహించుకొని పిచ్చి.. పిచ్చి కలలు కంటున్నారన్నమాట! సో.. ఐ హేట్‌ యూ.. బావా!”

“అంతొద్దులే డియర్‌! ఆ ఎవతి ఎవరో కాదు.. అది.. ముమ్మాటికి నా మరదలు ఇందూనే! అమ్మ తోడు..!”

“అంటే.. మా అత్త తోడేగా!”

“ఆహాఁ! వందకు.. వంద శాతం!”

“బావా! కాలేజ్‌ టూర్‌లో ఓ గార్డెన్‌కు చేరాం! ఆ అందాల ప్రకృతిలో జల జల జాలువారే నీటి ప్రవాహం ప్రక్కన కూర్చుంటే నువ్వే గుర్తొచ్చావ్‌!”

“ఓహోఁ!.. ఎందుకో?”

“ఎందుకా.. కొరుక్కు తింటానికి!”

“అందుకు కాస్త ఆగాలండీ అమ్మాయిగారు!”

“చిత్తమండీ అబ్బాయిగారు!”

“ఇందూ! ఇవ్వాళ ఓ ఫంక్షన్లో అచ్చు.. నీ లాంటి అమ్మాయి కనిపించింది!”

“అయితే.. వెంట పడ్డావా?”

“నీ బావ అంత.. వీక్‌ కాదమ్మా!”

“అది నాకు తెలుసు లేవోయ్‌!”

“మరెందుకు తప్పు కూశావ్‌?”

“సారీ.. బావా!”

“నో లారీ టూ క్యారీ యువర్‌ సారీ!”

“ఇది.. నా చిన్నప్పటి జోక్‌ లేవోయ్‌!”

“మంచిదమ్మాయ్‌! ఆఫీస్‌ టైమైంది! బై బై!”

“ఓకే.. గుడ్‌ డే.. బావా!”

***

“బావా! నీకో మంచి మాట చెప్పాలి! ఇటీజ్‌ సో యింట్రెస్టింగ్‌!”

“అయితే.. ఆలశ్యమెందుకు?.. కానియ్‌!”

“మొన్న సాయంత్రం పుస్తకంలో దాచుకున్న నీ ఫోటో చూసి.. ఈ గ్రీక్‌ వీరుడెవడని నా ఫ్రెండ్స్‌ ఒకటే ఉడికించారు!”

“మరి.. చెప్పలేక పోయావ్‌?”

“ఏమనో?”

“అదే! రోమ్‌ సుందరి లాంటి ఇందూకు కాబోయే మొగుడని!”

“అబ్బా! ఆశ.. దోశ అదంతా.. నేనొప్పుకుంటే కదా డియర్‌!”

“అలా కాకుంటే.. మిగిలింది రాక్షసమే! ఏదో ముహూర్తం చూసి అమాంతం లేపుకుపోతా! ఆపై ఎవడడ్డొస్తాడో చూస్తా!”

“అంతొద్దులే బావా! రేపో.. ఎల్లుండో మా అమ్మానాన్నలు.. పెద్దనాన్నవాళ్ళను తీసుకొని.. మీ వాళ్ళ వద్దకొచ్చి మన పెళ్ళి ప్రస్తావన తెస్తారట!”

“ఓకే.. ఓకే! వెరీ స్వీట్‌ న్యూస్‌ డియర్‌!”

***

అలా.. అలా.. బావ, మరదళ్ళయిన రమణ, ఇందిరల ప్రేమాయణం మాటలతోను అప్పుడప్పుడు చేతలతోను ముదిరి పాకాన పడింది.

ఇక ఇందిర తల్లిదండ్రులైన గీత, రాంబాబులు ఆమె పెళ్ళి విషయం మాట్లాడాలని రంగారావు, అమలల యింటికొచ్చారు.

అమల గీతకు స్వయాన అక్క. రాంబాబు, రంగారావులు తోడళ్ళుళ్ళు. ఆపై రమణ వాళ్ళ ఏకైక బామ్మర్దయిన బంగారయ్యకు ఒకే ఒక సంతానం. అతను ఎత్తుగా, బలంగా, చామన ఛాయలో హీ.. మాన్‌ లాగుంటాడు. చదువు ఎమ్‌.టెక్‌. ఉద్యోగం సాఫ్ట్‌వేర్‌. జీతం ఎక్కువే.

ఇందిర కూడా వాళ్ళమ్మా నాన్నలకు ఏకైక సంతానమే. ఆర్ట్స్‌ డిగ్రీ చేసింది. ఓ మోస్తరు ఎత్తుగా, బొద్దుగా, ముద్దుగా.. ముద్ద మందారం లాగుంటుంది.

మొత్తానికి పిల్లల్దిరు చూడముచ్చటైన జంట.

కాకుంటే రంగారావుకు బంగారయ్య దంపతులపై అంత సదాభిప్రాయం లేదు. అందుకే అతను “చూడు గీతా! మీ అన్నయ్య పేరుకే బంగారు గాని ఆయన్లో వున్నదంతా కంగారే!.. పోతే మీ వదిన బంగారమ్మ.. పరమ పిసినారి! పైగా వాళ్ళ ఫైనాన్షియల్‌ స్టేటస్‌.. దరిశిలో వున్న ఆ చిల్లరంగడే! మరి.. ఆ యింట మన ఇందూ యిమడ గలదా!” అంటూ మనస్సులోని మాట మరదలుకు చెప్పాడు.

అమల, రాంబాబులు అందుకు వంత పాడారు.

అయితే గీత “మీరంతా భలే వాళ్ళేనండీ! అమ్మాయి కాపురం చేసేది రమణతో! అదీ.. బెంగుళూర్లో.. ఇక అన్నయ్య, వదిన్లు ఎలాగుంటే మనకేంటి? నాకు తెలిసినంతవరకు.. అబ్బాయి మంచివాడు! పైగా పిల్లలిద్దరు పరస్పరం బాగా యిష్టపడుతున్నారు! సో.. నథింగ్‌.. టూ.. వర్రీ! ఏదైనా ఆలశ్యం అమృతం విషం!” అనే వాదనతో అందర్నీ ఒప్పించింది.

అలా విషయం తేలిపోవటంతో చక చకా పావులు కదిలాయి. దాని ఫలితమే ఇందిరా రమణల నిశ్చితార్థం.. అదీ.. రేపే.. అందుగ్గాను రంగారావు, అమల, బంగారయ్య, బంగారమ్మ, రమణలు ఓ స్కార్పియోలో దరిశి నుండి ఉదయాన్నే ఒంగోలులో వుండే రాంబాబు యింటికి బయల్దేరారు.

వాళ్ళు గమ్యం చేసేసరికి మధ్యాహ్నం పదకొండైంది. అప్పటికే చుట్టపక్కాలు చాలామంది అక్కడ చేరుకున్నారు. అందరు వాళ్ళకు ఆత్రంగా స్వాగతం పలికారు.

ముందుగా అమల, రంగారావులు, ఆపై బంగారమ్మ, రమణలు ఒకరి తర్వాత ఒకరుగా బండి దిగారు.

ఇక రుబ్బుడు రోలును తలపించే బంగారయ్య వంతు.

“అమ్మా.. అబ్బా.. దేవుడా!” ఎలాగైతేనేం ఆయనగారు సదరు భారీకాయాన్ని సీటు నుండి క్రిందకు నెట్టాడు. అప్పుడు తూలి పడబోయిన ఆయన మెల్లగా నిలదొక్కుకొని బెరుగ్గా చుట్టూ చూశాడు.

“ఏం దొరా! మరీ.. సన్నబడ్డావ్‌! కొంపదీసి గాలి కెగిరి పోయేవ్‌! అసలే.. మీ వూర్లో వాయుపీడనం ఎక్కువ!” రాంబాబు బామ్మర్దిని ఎత్తి పొడవటంతో అందరూ నవ్వారు.

“అప్పటికీ.. ఒక పూటే తింటున్నా బావా!” ఎదుట వారి ఎగతాళి ధోరణి పెద్దగా పట్టించుకోని బంగారయ్య సిన్సియర్‌గా అన్నాడు.

“అయినా.. బరువు తగ్గటం లేదా! అయితే.. విషయం ఆలోచించాల్సిందే!” రాంబాబు, తోడల్లుడి వైపు నర్మగర్భంగా చూశాడు.

“అది కాదులే బ్రదర్‌! ఆయన ఒకపూట తినేది మనకు.. రెండు పూటలకయిద్దీ!” రంగారావు మాటలకు మళ్ళా నవ్వులు విరిసాయి.

“అప్పటికి తమరేం తక్కువా? మీరు.. బాగానే లాగుతారు. కాకుంటే… మీవి పాము పొట్టలు. కనిపించవంతే!” అమల అన్నయ్యకు వత్తాసుగంది.

“బాగా చెప్పావ్‌ అక్కా!” గీత అమలకు వంత పలికింది.

“అదేముందిలేమ్మా! బావలు కడు స్వతంత్రులు! వాళ్లేమన్నా.. మనం పడాలి! హీ.. హీ.. హీ!” బంగారయ్య తెలివిగా విషయాన్ని దాటేసి పంచలో అడుగుపెట్టి “అబ్బా కరిచింది!” అంటూ దగ్గరున్న సోఫాలో గబాల్న కూలబడ్డాడు.

“ఏంటి స్వామి? తేలు కాదు గదా?” రంగారావు, అతనితో పాటు మిగిలినవాళ్ళు ఆత్రంగా చూశారు.

“కాదు బావా! షూస్‌!” అంటూ బంగారయ్య బూట్లు కష్టంగా లాగి సోఫా ప్రక్కనపెట్టాడు. అవి నిగ.. నిగ లాడుతున్నాయి.

“ఏంటి బంగారయ్యా! బూట్లు మాంచి తళ తళలగున్నాయి!.. యింతకు అవి దుకాణంలో కొన్నవా? లేక ఏ గుడిమెట్ల దగ్గర..” అంటూ రంగారావు నసిగాడు.

“అట్లాంటిదేమి లేదు బావా! మొన్ననే గుంటూరు బాటాలో కొన్నా!” బంగారయ్య వివరణ నమ్రతగుంది.

“ఓహోఁ! రౌతు మెత్తనయితే.. గుర్రం మూడు కాళ్ళతో నడిచిందట! మా అన్నయ్యను అమాయకుడ్ని చేసి.. మరీ ఎగతాళి చేస్తున్నారే! ఆ మాటకొస్తే అలాంటి అలవాట్లు మాకంటే మీ అన్నదమ్ములకే ఎక్కువనుకుంటా!” అమల రంగారావు, రాంబాబులకు ఉమ్మడిగా చురకేసింది.

“సత్యం పలికావే అక్కా!” గీత వత్తాసుగా అంది.

“అంతొద్దులే డియర్‌.. ఏదో.. బామ్మర్దని కాస్త సరదా పడి సరసమాడాము! ఆయన గారికి యింత దన్నుందని తెలిస్తే.. ఆ జోలికే వెళ్లేవాళ్ళమే కాదు..”  గీత నుద్దేశించి  రాంబాబు అన్న మాటలతో అందరు మరోసారి హృద్యంగా నవ్వుకున్నారు.

ఇక ఆ యింట్లో బంగారమ్మ హోదా వదిన నుండి సాక్షాత్తు కాబోయే అల్లుడి తల్లిగా ఎదిగింది. అందుకే గీత, అమలలు ఆమెకు ఒకటే మర్యాదలు చేస్తున్నారు. ఆమె సన్నగా, ఎర్రగా, ఎత్తుగా బద్దలా వంగుంటుంది. పదే పదే వంటిపై నున్న నగల్ని తడుముకుంటూ బంగారంపై గల మక్కువను చాటుకుంటుంది.

చుట్టపక్కాల ఛలోక్తులతో మధ్యాహ్నపు భోజనాలు ముగిశాయి. ఇక రాత్రికి బంగారయ్య ఏమి తిననని భీష్మించుక కూర్చున్నాడు.

“బా.. బ్బా.. బ్బు! ఏదో కొంచెం ఎంగిలి పడు! కాబోయే వియ్యంకుడు పస్తుండటం యింటికంత శుభం కాదు!” రంగారావు సరిహాసమాడాడు. అటుపై అమల గీతలు కూడ బ్రతిమాలారు.

ఫలితంగా అయ్యగారు అల్పాహారానికి అంగీకరించాడు.

“ఓకే అన్నయ్యా.. నిమిషాల్లో!” ఎగిరి గంతేసి గీతా అమలలు ఆగమేఘాలపై అరకేజి ఉప్మా తయారు చేసి, పావుకిలో జీడిపప్పు దట్టించారు. దాన్ని వుండలుండలుగా బంగారయ్య లోనికి సాగనంపాడు. ఆపై అర లీటరు నీళ్ళు సేవించాడు.

ఈలోగా రమణ “ఆ కాస్త ఉప్మా ఏ మూలకు.. నాన్నా.. యివన్నా తిను!” అంటూ రెండు చిన్నసైజు రూళ్ళకర్ర లాంటి అరటి పండ్లను తండ్రి కందించాడు.

“అబ్బా! వద్దంటే.. చంపుతార్రాఁ!” బంగారయ్య అయిష్టంగానే వాటిని స్వాహా చేశాడు. క్షణాల్లో అరటి తొక్కలు నేల కొరిగాయి. అప్పటికి గాని అయ్యగారి .. ‘బ్రేవ్‌!’ వెలువడలేదు.

“యింతకు.. దొర సేవించిన ఆహారం.. అల్పమా… అధికమా?” లోలోనే నవ్వుకున్న రంగారావు ఆ ఆలోచనల్ని పెదవి దాటనివ్వలేదు. కారణం.. కాబోయే వియ్యంకుడ్ని ఆట్టే ఆటపట్టించటం.. వ్యవహారానికి చేటని అనుకోవటమే.

మరి కాసేపటికి అందరి రాత్రి భోజనాలు ముగిశాయి.

ఇక నిద్రకు గాను బంగారయ్య, రమణలు మేడపైన బెడ్‌ రూంలో చేరారు. రాంబాబు, రంగారావులు ప్రక్క వరండాలో మడత మంచాలెక్కారు. మిగిలిన మగవాళ్ళందరు క్రిందున్న రెండు పడగ్గదులు ఆక్రమించారు. పోతే ఆడవాళ్ళందరు హాల్లో నేలపై పడకలేసారు.

చాలా పొద్దు దాక పిచ్చాపాటి సాగింది.

ఈలోగా బంగారయ్య ఒకసారి మేడ దిగి క్రిందకెళ్ళొచ్చాడు. అంతటితో ఆగక మరో పది నిమిషాలకు రెండోసారి మెట్లు దిగుతూ కనిపించాడు.

“ఏంటయ్యా! అలా.. కిందకు పైకి తిరుగుతున్నావ్‌! కొంపదీసి కడుపులో గుడబెడా?” రంగారావు వుండబట్టలేక అడిగాడు.

“ఆఁ! ఏం లేదు.. బావా! ఏం లేదు!” అంటూ బంగారయ్య హడావిడిగా దిగి క్రిందకెళ్ళి పోయాడు.

“ఏం లేదంటాడు! మళ్ళీ.. మళ్ళీ వెళ్తోన్నాడు! ఏమై వుంటుంది?” రంగారావు కుతూహలంగా క్రిందకు చూశాడు. అక్కడ బంగారయ్య ఆఫీస్‌ రూంలోకెళ్ళి కాసేపటికి బయటికొచ్చి, మెట్లెక్కుతూ కనిపించాడు. అయితే అప్పటికే బాగా పొద్దు పోయున్నందున అతను అంతటితో సంగతి వదిలేసి నిద్రలోకి జారుకున్నాడు.

“గొంతు తెగిందిరో దేవుడా! గొంతు.. తెగింది!” రాత్రి మూడు గంటలకు బంగారమ్మ గావు కేకలకు పరిసరాలు దద్దరిల్లాయి. ఇంటి కప్పు కంపించినట్లయింది.

అందరూ తృళ్ళిపడి లేచారు.

చుట్టూ చీకటి.. ‘దబ్‌.. దబ్‌!’ అనే అడుగుల సవ్వడి. “దొంగ.. దొంగ!” అనే అరుపులు భయం గొల్పుతున్నాయి.

రాంబాబు లైటేసేదాక.. అంతా అయోమయంగుంది. ఆపై రంగారావు కళ్లు నలుపుకొని చుట్టూ చూశాడు.

బంగారయ్య వడి వడిగా మెట్లు దిగుతూ కనిపించాడు. అతని నడక దూకుడ్ని తలపిస్తోంది. అచ్ఛాదన లేని పైభాగం చెమటలు కారుతుంటే.. బొజ్జ, గంగడోలులా వూగుతుంది. కొద్దిలో.. అయ్యగారి అడ్డ పంచె వూడేదే! ఎలాగో దాన్ని వడిసి పట్టి సరి చేసుకున్నాడు. అదృష్టం! లేకుంటే.. దివ్య దర్శనమే.

“ఈయన వాలకం చూస్తుంటే.. కొంప నిలువునా మునిగినట్లుంది!” అనుకున్న రంగారావు బంగారయ్య వెంట దౌడు తీశాడు. అతగాడు సరాసరి ఆఫీస్‌ రూంకెళ్ళి టేబుల్‌ డ్రాయర్‌ని బర్ర్‌.. న లాగి, దాని లోపలకు చూసి “సేఫ్‌..సేఫ్‌! యిల్లంతా సేఫ్‌! దొంగలేమి ఎత్తుకు పోలేదు!” అని అరవసాగాడు.

ఆయనగారి ముఖం ఆనందంతో వెలిగిపోతూ కనిపించింది.

“ఏ.. పర్సో లేక బంగారపు వస్తువో దాచుంటాడు.. వెర్రి నాగన్న! అందుకే ఆ.. సంతోషం!” అనుకున్న రంగారావు టేబుల్‌ డ్రాయర్లోకి తొంగి చూశాడు.

అంతే! నిముషాల్లో ఆయన మతి పోయింది.

అక్కడ.. బంగారయ్య బూట్లు జతుంది!

“ఓర్ని.. ఇతగాడి తాపత్రాయం యిదా! అంటే… రాత్రి రెండుసార్లు మేడ దిగిందిందుకా! మొదట పెట్టిన చోటు సరి కాదని.. రెండోసారి దిగి బూట్లు టేబుల్‌ డ్రాయర్‌లో కుక్కాడన్న మాట! మొత్తానికి.. గొప్ప శాల్తే!” లోలోనే నవ్వుకున్న రంగారావు, ఆయన వెంట బంగారయ్య హాల్లోకి నడిచారు.

అక్కడ బంగారమ్మ చుట్టూ జనం మూగున్నారు. ఇక ఒరుసుకుపోయిన మెడ, డీలా పడ్డ అవయవాలు, రేగిన జుట్టు, భారమైన శ్వాస, బెదురు చూపులతో వున్న ఆమె యించుమించు షాక్‌లో వుంది. రమణ తల్లి తల నిమురుతూ “ఏమైందో చెప్పమ్మా.. చెప్పు” అంటున్నాడు. ఆపై సంగతి తెలుసుకోవాలనే ఉత్సుకత అందరిలో కనిపిస్తోంది.

ఈలోగా బంగారయ్య హడావిడిగా భార్య వద్దకు చేరి.. కుదురుగా కూర్చొని ఆమె చెవి దగ్గరగా మూతి ఆనించి ఎవరికి వినబడకుండా స్లో మోషన్లో ఏదో గొణిగాడు.

అంతే! ఆమెలో ఒక్కసారిగా చలనం కలిగింది. అంటే.. ఆయన గారు… ఏదో మంత్రం లాంటిది ఉచ్ఛరించి వుంటాడని.. అది పని చేసుంటుందని.. అందరు భావించ సాగారు. అయితే బంగారమ్మ మరు క్షణంలో “ఓర్నాయినో! ఈయన కేదో పిచ్చి పట్టినట్లుంది! మూడు సవర్లు బంగారు గొలుసు పోయి.. నేనేడుస్తుంటే.. బూట్లంటాడు! వాటిని భద్రంగా దాచానంటాడు! దొంగ కాదు గదా.. వాడబ్బయినా.. ఆ స్థలాన్ని కనుక్కో లేడంటాడు! ఇంట్లో ఏమి పోలేదంటాడు! అన్నీ.. క్షేమమే నంటాడు. చూస్తుంటే.. ఆయన కేదో అయింది.. అయినా… అన్నీ అనర్థాలు యిప్పుడే దాపురించాయేంట్రో దేవుడా!” అంటూ పెద్దగా అరిచి మరలా షాక్‌లో కెళ్ళింది.

ఇదేమి పట్టని బంగారయ్య మరలా భార్యకు ఏదో చెప్పటానికి ఆమె చెవి వద్ద చిద్విలాసంగా పొంచబోతున్నాడు.

అయితే.. ఆయన మళ్ళా చెప్పబోయేది బూట్ల సంగతేనని యిట్టే గ్రహించిన రంగారావు “నువ్వు.. కాస్త ఆగు నాయనా.. విషయం.. నే కనుక్కుంటాగా!” అని బంగారయ్యను సుతారంగా వారించి, ముందుకొచ్చి పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించి.. ఓ నిర్ణయానికొచ్చాడు.

“బంగారమ్మ పడక ప్రక్కనున్న కిటికి ఊచలు తొలగించ బడ్డాయి! సందేహం లేదు.. ఆ దారి గుండా దొంగ లోపలికొచ్చాడు. టార్చి వెలుగులో ఆమె మెడ నుండి దండ లాగాడు! దెబ్బకు.. గాట్లు పడ్డాయి. దాంతో ఆమె బాధతో అరిచి పెనుగులాడింది! అయినా.. లాభం లేకపోయింది! దొంగ నగతో పారిపోయాడు. ఫలితంగా ఆమె దిమ్మర పోయింది. సో.. జరిగిందదీ!” బంగారమ్మ చెప్పే స్థితిలో లేనందున రంగారావే అంచనా వేసి విషయాన్ని వివరించాడు.

“ఔరా.. దొంగలు..!” అక్కడ గుమి కూడున్న చుట్టాలు జరిగిన దానిపై తలో రకంగా వ్యాఖ్యానించారు.

గీత, అమలలు మైకంలో వున్న వదినకు వల్లమాలిన సపర్యలు చేస్తూ తమ విషయాసక్తిని ప్రదర్శిస్తున్నారు.

విషయం ముదిరి జరగాల్సిన శుభకార్యానికి అడ్డంకైద్దేమో నని రాంబాబు కంగారుగున్నాడు.

“మరి.. మరి..” ఇంతవరకు సాలోచనగా అన్నీ గమనిస్తున్న ఇందిర ఏదో చెప్పబోయింది.

“మధ్యలో నీ సణుగుడేంటీ? అసలే.. అత్తయ్యకు బాగాలేక.. పోతే!” కూతుర్ని ఆక్షేపించి గీత కాబోయే వియ్యపురాలిపై ప్రేమ ఒలక బోసింది.

“ఉండమ్మా గీతా! అమ్మాయిని చెప్పనీయ్‌!” మరదల్ని వారించిన రంగారావు ఇందిర వైపు ప్రోత్సాహంగా చూశాడు.

“అదే.. పెదనాన్నా యిక్కడ.. అత్తయ్య పైట కొంగులో గొలుసు చిక్కుకోనుంది.. చూడండీ!” ఇందిర కళ్ళు మెరుస్తున్నాయి.

ఒక్కసారిగా అందరు.. అటు చూశారు.

నిజమే!

బంగారమ్మ చీర కొంగున.. సన్నగా, మూరెడు పొడువుతో బంగారు గొలుసు వ్రేలాడుతుంది. ఆమె షాక్‌ హడావిడిలో ఎవరూ విషయం గమనించలేదు.

“అరరే.. చెయిన్‌ యిక్కడే వుందిగా!” గీత.. ఆమె వదిన చీర అంచునుండి దాన్ని తప్పించి చేతిలోకి తీసుకుంది.

“అంటే.. నగ పోలేదన్న మాట?” రంగారావు అందరి వైపు చూస్తూ సందేహం వెలిబుచ్చాడు.

“అర్థం కాలేదా.. పెద నాన్నా! దొంగ అత్తయ్య మెడలో గొలుసు లాక్కొని వుడాయించాలనుకున్నాడు! అయితే.. క్షణాల్లో హుషారైన ఆమె గొలుసు లంకించుకొని పెద్ద పెద్దగా అరిచింది! ఈలోగా మన కేకలు.. ఆమె అరుపులతో కలసి హోరెత్తాయి! ఆ హఠాత్‌ పరిణామానికి బెంబేలెత్తిన దొంగ నగ వదిలేసి ఉత్త చేతులతో పారిపోయాడు! కాకుంటే.. ఆ పెనుగులాటలో.. గొలుసు కాస్త అత్తయ్య చీర కొంగులో చిక్కుకుంది! బంగారం పోయిందనే అపోహలో ఆమె షాకైంది! అదీ సంగతి!” ఇందిర వివరించింది.

“ఎస్‌ ఎక్సలెంట్‌ అసెన్‌మెంట్‌! సో.. దటీజ్‌.. ఇందూ!” విషయాన్ని శ్రద్ధగా విన్న రమణ కాబోయే శ్రీమతిని మెచ్చుకున్నాడు.

“థ్యాంక్యూ బావా!” ఇందిర సిగ్గు మొగ్గలేసింది.

చుట్టాలందరూ ఆ ప్రేమ జంటవైపు మురిపంగా చూశారు.

ఎలాగైతేనేం దొంగతనం వలన కలిగిన నికర నష్టం ఏమీ లేదని తేలటంతో అందరు సంతోషించారు. బంగారం దొరికిన సంతోషంలో బంగారమ్మ నిమిషాల్లో తేరుకుంది.

అన్నింటికి అతీతంగా బంగారయ్య పదే పదే బూట్లు చూసుకుంటున్నాడు.

“ఔరా! ముష్టి గొలుసుకే యింత.. ఆగడమా! అప్పటికి.. బంగారమే.. బ్రతుకా.. ఏంటి?” గీత, అమలలు వదిన నిర్వాకంపై చాటుగా నోళ్ళు నొక్కుకున్నారు.

“ఓ.. చిన్న నగ కోసం చెట్టంత మనిషికి.. షాకా? చిత్రంగా.. లేదు! పైగా గావు కేకలతో దొంగనే అదరగొట్టింది గాక.. అపస్మారకంతో మనల్ని కంగారు పెట్టిన మా కాబోయే వియ్యపురాలు నిజంగా ఘనాపాఠే.. బ్రదర్‌!” రాంబాబు, తోడళ్ళుడితో గుసగుసగన్నాడు.

“అది సర్లే.. అలా తన బూట్ల క్షేమమే మొత్తం యింటి క్షేమంగా భావించిన మీ కాబోయే వియ్యంకుడు ఆమెకంటే ఎక్కువే బాబు!” రంగారావు బంగారయ్య బూట్ల వ్యవహారం రాంబాబు చెవిలో ఊదాడు.

“ఓర్నాయనో! అంటే దొందు.. దొందే!” రాంబాబు నోరెళ్ళబెట్టాడు.

ఆ కర్ణి.. ఆ కర్ణి విషయాన్ని ఆమూలాగ్రం తెలుసుకున్న ఒకానొక చుట్టం, “మొత్తానికి పిల్లల ప్రేమాయణంలో పెద్దల పితలాటకం భలే తమాషాగుంది!” అని తను నవ్వుకొని ఎదుటివాళ్లను నవ్వించసాగాడు.

ఆపై నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here