పితృ దేవతలు

3
2

[box type=’note’ fontsize=’16’] ఆర్తులను ఆదరించని ఆచారాల కన్నా, మానవత్వం వెయ్యి రెట్లు గొప్పదని చెబుతున్నారు మణి వడ్లమాని “పితృ దేవతలు” కథలో. [/box]

[dropcap]“ఒ[/dropcap]క ఫ్యామిలీ ఫంక్షన్ కోసం ఇండియాకి వెళుతున్నాను శేఖర్. ఎలాగు ఆ సమయంలోనే నాన్నగారి ఆబ్దికం కూడా వస్తుంది. అది ఈ మాటు గోదారొడ్డున పెట్టాలని ఉంది. ఇప్పుడు అన్ని ఆన్‌లైన్‌లో మాట్లాడుకోవచ్చు కాబట్టి, ప్రాబ్లం ఏమి లేదు. గోదారోడ్డుకి వెళ్లి చక్కగా కార్యక్రమం జరిపించుకోవడమే”

“ఓహ్ చాలా మంచి పని చేస్తున్నావు రామం. గోదావరి తీరాన చేస్తే పితృ దేవతలు తృప్తి చెందుతారని మనకో నమ్మకం కదా.”

“అవును”

అక్కడితో ఆ సంభాషణ ముగిసింది.

రామారావుకి శేఖర్ బాగా ఆప్తుడు. ఇద్దరూ ఒకేసారి అమెరికా గడ్డ మీద కాలు పెట్టారు. గత పదిహేను ఏళ్ళగా ఆ స్నేహ బంధం కొనసాగుతోంది. ఇద్దరూ న్యూజెర్సీ లోని సౌత్ రివర్‌లో ఇల్లు కొనుక్కుని ఉంటున్నారు. ఫామిలీస్ కూడా బాగా కలిసిపోయాయి.

***

గోదావరి గట్టున పక్కగా కొంచెము కిందకి మెట్ల మీద కూర్చొని అఖండ గోదావరిని చూస్తున్నాడు రామారావు. నిండుగా పారుతున్న గోదావరిని చూస్తుంటే మనసుకి హాయిగా ఉంది. ఇద్దరు సాధువులు స్నానాలు చేస్తున్నారు. మరో నలుగురు పిల్లలు చేప పిల్లల్లా ఈదుతూ నీళ్ళని పెళ్ళుపెళ్ళు మంటూ శబ్దం చేస్తున్నారు. వాళ్ళ ఆనందం గోదావరిలో వేసే డబ్బులు ఏరుకోవడం కోసం.

అక్కడ దగ్గరలో ఉన్న హోటల్లో నిన్న రాత్రి దిగిన వెంటనే శర్మగారికి ఫోన్ చేసాడు పొద్దున్నే వచ్చేయ్యండి అని చెప్పారు. మంత్రం చదివే బ్రాహ్మలని వారే ఏర్పాటు చేస్తామని అన్నారు. తల్లిదండ్రుల పేర్ల మీద పిండ ప్రదానం చేద్దామని అనుకున్నాడు. అన్నీ రెండు నెలల ముందే అక్కడ నుంచే వివరంగా మాట్లాడుకున్నాడు. పొద్దున్నే రేవు దగ్గరకి రమ్మన్నారు శర్మగారు.

గోదావరిని చూస్తూ మైమర్చిపోయాడు. ఒక్కసారిగా చిన్న నాటి జ్ఞాపకాలు గుప్పున గోదావరి తరగల మీద నుంచి వచ్చే చల్లని గాలిలా ఎగిసి వచ్చాయి.

***

చిన్నతనంలో శీతాకాలం చలి అంటే భలే ఇష్టంగా ఉండేది. మంచులో పరిగెట్టడం, అక్కడున్న పున్నాగ చెట్టు కింద పూవులు కోయడం, ఆ పక్కనే ఉన్న చివరిగా ఉన్న గుడి దగ్గర కూర్చున్న సాధువుని బతిమాలి అతని దగ్గర ఉన్న శంఖం ఊదడం అంటే సరదా!

చిన్నతనంలో అమ్మ, నాన్నమ్మ కార్తిక స్నానాలు చేయడానికి వెళుతుంటే వాళ్ళతో పాటే కూడా వెళ్ళేవాడు.

నాన్నమ్మ అనేది కూడా “పెద్ద మొగాడు మాకు తోడూ” అంటూ. నిజానికి గోదావరికి దగ్గర గానే ఉండేది ఇల్లు. అందుకే నడుచుకుంటూ వెళ్ళడం జరిగేది. తనతో పాటు గోపిగాడు, వాళ్ళ అమ్మ, వాడి మేనత్త కూడా వచ్చేవారు. వాళ్ళు స్నానాలు కానిచ్చుకొని దీపాలు వెలిగించే వారు. వాళ్ళు తెచ్చుకున్న సామానుకి కాపలా కాసేవాళ్ళు. తల్లి, నాయినమ్మ అక్కడే కూర్చొని దీపాలు వెలిగించి పూజ చేసి, భక్తిగా నీళ్ళలో వదిలేవారు. అప్పుడు నాయినమ్మ పిలిచేది ‘ఒరేయి రాముడు, గోపి రండర్రా రండి. దండం పెట్టుకొండి నీళ్ళలో దిగకుండా’ అని కేకలు వేసేది. వాళ్ళు మటుకు ఇంచుమించు మోకాలి లోతు వరకు వెళ్లి దీపాలు వదిలేవారు. అవి అలా దూరంగా సాగిపోతుంటే అదో అద్భుతం.

నీళ్ళలో దీపాలకి పైన నక్షత్రాలకి మాటలతో అల్లిక అల్లేసి దండచేయడం భలే మధురంగా ఉండేవి ఆ రోజులు. చీకు చింతా లేని బాల్యాన్ని గుర్తుచేసుకుంటుంటే యెంత ఆనందంగా ఉంది. ఇప్పుడు గోపి పెద్ద డాక్టర్, లండన్‌లో ఉంటున్నాడు. ఏడాదిలో రెండు మూడుసార్లు ఈ మెయిలు చేస్తూ ఉంటాడు. తను అంతే, జీవితాలు, జీవనాలు భిన్నం అయిపోయాయి. మళ్ళీ ఆ రోజులు రావు. జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి.

ఇంతలో పక్కగా మాటలు వినిపించే సరికి గతం తాలుకు ఆలోచనల నుంచి బయటపడ్డాడు.

***

ఉదయాన్నే అలవాటు ప్రకారం స్నానం చేసేసాడు. నెమ్మదిగా నడచుకుంటూ వచ్చి అక్కడున్న పావంచాలా మీద కూర్చున్నాడు,

కార్తిక దీపాలు వదలడం కోసం జనాలు బాగానే వస్తున్నారు, అంతే కాదు కాదు ఎక్కడిక్కడి వాళ్ళో వచ్చి పితృ కార్యాలు కూడా చేసుకుంటారు. విదేశాలనుండి తనలాంటి వాళ్ళు ఎందరో రావడం కూడా జరుగుతోంది. అయినా ఈ మధ్య ప్రతి దానికి ప్రచారం అనేది కూడా పరిపాటి అయిపోయింది

పక్కనే ఉన్న పావంచల మీద ఒక పెద్దాయన ఇంకో మరికొందరు వచ్చారు. వాళ్ళు నిత్య కర్మకాండ చేస్తున్నట్లున్నారు. అందులో ఇద్దరు గుండు చేయించుకొని ఉన్నారు. బహుశా తల్లో, తండ్రో మరణించి నట్టున్నారు.

ఇంతలో “రామారావు గారు” అని వినపడింది. పక్కకు తిరిగి చూసాడు. ఈ మెయిలులో శర్మగారి ఫోటో చూడటం వలన ఆయనే అని వెంటనే గుర్తు పట్టాడు. నమస్కారం పెట్టాడు

కావలిసిన సరంజామా అంతా ఆయనే తెచ్చారు.

తెచ్చిన సామాగ్రిని బయటకు తీస్తూ “బాబు నేననేమన్నా ఆలస్యం చేసానా?” అని నెమ్మదిగా అడిగారు.

“అయ్యో లేదండి”

“స్నానం చేసి వస్తారా “

“అలాగేనండి” అంటూ రామారావు వేసుకున్న బట్టలు విప్పి పెట్టి పంచె కట్టుకొని నీళ్ళలో మునిగాడు. మొదటి మునకకు చలి వేసినా రెండవ మునకకి పోయింది. మూడో ములక వేసి వడ్డుకు వచ్చి పంచెను పిండుకొని తువ్వాలను నడుముకి కట్టుకున్నాడు.

శర్మగారు రామరావు చేత కార్యక్రమం ప్రారంభించారు.

ఆయన చెబుతుంటే శ్రద్ధతో చేస్తున్నాడు నిజానికి వ్యక్తిగతంగా, దేవుడు, పునర్జన్మలు, కర్మసిద్దాంతం లాంటి వాటి మీద నమ్మకం లేదు. కాకపోతే కొన్ని కుటుంబపరంగా, సంఘం పరంగా చేయవలసి రావడం, అదీ కాకుండా తండ్రి అన్న మాటలు అతని మనసులో నిలచిపోయాయి. “రామం, నీ నమ్మకాలను సిద్దాంతాలను నేను కాదనను. అలాగే నా నమ్మకం మీద కూడా గౌరవం ఉంచు. రేపు నే పోయాక శ్రద్ధగా, నా శ్రాద్ధం మటుకు పెడుతూ ఉండు” అని చెప్పడంతో వీలయినంత వరకు చేస్తున్నాడు. అందులో ఈ మాటు ఇండియాకి రావడంతో, తండ్రి ఆబ్దికాన్ని గోదావరి తీరంలో పెట్టాలని అనుకున్నాడు.

వండిన అన్న ప్రసాదాన్ని కాకులకి పెట్టమని చెప్పాడు శర్మగారు.

అప్పుడు అడిగాడు రామారావు “ఇవి కాకులకి, గద్దలకి పెట్టే బదులు ఓ మనిషికి పెడితే పుణ్యం రాదా, ఆకలితో అలమటించే అభాగ్యులకు పెట్టకూడదని రాసి లేదు కదా”

“అది ఆచారం కాదు రామం గారు.”

“ఆచారం అనేది మనం ఏర్పాటు చేసుకున్నదే, అది ఇప్పుడు ఇంకోలా మార్చుకుందాము, కొన్ని రోజులకి ఇదే ఆచారమవుతుంది” అంటూ ఆ విస్తరిని అక్కడ ఉన్న కళ్ళు లేని సాధువు ముందు పెట్టి ‘బాబు మీ ముందు ఆకులో భోజనం పెట్టాను తినండి ‘అని చెప్పాడు.

అందుకు అతను నిండు మనసుతో “బాబు పదికాలాలు పిల్లాపాపలతో చల్లగా ఉండాలి” అన్నాడు.

ఇది చూస్తున్న శర్మగారు “మీరు చేసినది మంచి పని. ఆచారాల కన్నా కూడా ఆకలి తీర్చడం చాల గొప్పపని. పైనున్న పితృ దేవతలు కూడా సంతోషిస్తారు” అని ఆయన రామరావు చేసిన పనిని సమర్థించారు.

ఆర్తులను ఆదరించని ఆచారాల కన్నా, మానవత్వం వెయ్యి రెట్లు గొప్పది అనుకున్నాడు రామారావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here