[dropcap]హిం[/dropcap]దీలో డా. అజయ్ జయమేజయ్ రచించిన ‘నన్హే పంఖ్ – ఊంచీ ఉడాన్’కు తెలుగు అనువాదం ఈ ‘పిట్ట కొంచెం కూత ఘనం’ పుస్తకం. అనువదించినది డా. టి. సి. వసంత.
పుస్తకం పేరు అనువాదంలోనే – అనువాదం మక్కీకి మక్కీ కాదు, పదం ప్రతిబింబించే భావాన్ని అనువదించారని స్పష్టమవుతుంది.
నన్హే పంఖే అంటే లేలేత కోమలమైన రెక్కలు అని అర్థం. ఊంచీ ఉడాన్ అంటే ఎత్తుకు ఎగరడం అని, ఎంతో సాధించింది అన్న అర్థం. ఈ అర్థం కాక, ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనటంలోనే ‘హిందీ’లో భావాన్ని తెలుగు సామెత ఆధారంగా, తెలుగువారికి సులభంగా అర్థమయ్యే రీతిలో అనువాదం సాగిందని అర్థమవుతుంది.
11 కథలున్న ఈ పుస్తకంలో అనువాదం మొత్తం ఈ రకంగా భావాన్ని స్పష్టం చేస్తూ, దాన్ని తెలుగువారికి పరిచయమయిన వాక్యాలు, సామెతలు ద్వారా ప్రకటిస్తూ సాగుతుంది. ఒక స్వతంత్ర సృజనను చదువుతున్న భావనను కలిగిస్తుంది ఇలాంటి అనువాదం. వాక్యాలు కూడా చిన్నవిగా ఉండి తెలుగు నేర్చుకుంటున్న పిల్లలే కాదు, పెద్దలు కూడా సులభంగా చదివే వీలు కలుగుతుంది. చిన్న వాక్యాలు పఠన వేగం పెంచుతాయి. అనువాదం, చక్కని కథలతో పాటు ఈ పుస్తకంలోని రంగురంగుల బొమ్మలు అత్యంత ఆనందం కలిగిస్తాయి. పెద్దలు కూడా బొమ్మలు చూస్తూ ఎంతో ఆనందిస్తారు. పిల్లల సంగతి చెప్పనే అక్కరలేదు. ఇది పిల్లలకు, పెద్దలకు ఆనందం, ఉత్సాహం కలిగించే పుస్తకం. అక్కడక్కడా అచ్చుతప్పులను వదిలేస్తే, ఇటీవలి కాలంలో పిల్లలను అలరించే స్థాయిలో వచ్చి, పెద్దలను కూడా ఆనందింప చేసే ఉత్తమ బాల సాహిత్యం ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
***
రచన: డా. అజయ్ జనమేజయ్
అనువాదం: డా. టి. సి. వసంత
పేజీలు: 88
వెల: ₹ 200
ప్రచురణ: ఎమెస్కో బుక్స్,
ప్రతులకు: అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.