పిట్ట

1
2

[dropcap]కా[/dropcap]యం భారాన్ని కాళ్ళమీద మోపి
కాళ్ళను ఏదో ఆధారం మీద ఆన్చి
నలుదిక్కులవైపు నాజూగ్గా చూస్తూ
దూరాన్ని కళ్ళతోనే కొలుస్తుంటావు

అక్కడేదో కనిపించిందనో
ఇక్కడుండి చేసేదేముందనో
ఒక్క ఊపున లేచి, అంతెత్తున ఎగిరి
రెక్కలకింద అంతో ఇంతో గాలిని పోగేసుకుని
ఆకాశం కప్పుకింద ఆయాసం లేకుండా
అంతంత దూరాలకు సాగిపోతుంటావు

ఎక్కడో ఓ పచ్చని కంకి పలకరిస్తే
పరామర్శించి
కాసిన్ని పాలగింజల ఆతిథ్యం
ఆనందంగా స్వీకరిస్తావు
ఏరు ఏదైనా, పేరులేని నీటిదొరువేదైనా
దవ్వున కనిపిస్తే, రివ్వున ఎగిరెళ్ళి
అవీ ఇవీ అనే తేడాలేకుండా
ఓ గుక్కెడు నీళ్ళు, గమ్మున తాగి
నచ్చిన దిక్కుకు హాయిగా ఎగిరిపోతావు

పిడికిలంత పిట్టవే ఐనా
కొండంత ఆత్మవిశ్వాసం నీది
రెక్కల కష్టంతో
రోజును నెమ్మదిగా కరిగిస్తూనే ఉంటావు
కాలం కత్తిగట్టిన వేళ
కరువునైనా కసిదీరా ఎదిరిస్తూనే ఉంటావు

ఈరోజే నాదైనప్పుడు
రేపటికై దాచుకొనేది ఏమీ లేనపుడు
ఎవరిదో దోచుకుని చేసేదేముందిలే
ఎక్కడికో మోసుకుని వెళ్ళేదేముందిలే
అని అనుకుంటుంటావు

గూడెక్కడుందో గుర్తున్న నీకు
పొద్దు వాలిపోతుంటే
చుట్టూ చీకటి ముసురుకుంటుంటే
గూడు గురుతుకొస్తుంందో ఏమో !
ఈ రోజుకిక చాలు అని అనుకుంటూ
ఖాళీ రెక్కల విసుర్లతో
దారి వెతుక్కుంటూ వెనక్కి తిరిగి వచ్చేస్తావు
రేపటి సుప్రభాతానికి రాతిరి తలుపు బిగిస్తూ !!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here