Site icon Sanchika

పిట్టగోడ కథలు-3

[box type=’note’ fontsize=’16’] డాబా పైన పిట్టగోడ మీద కూర్చుంటే ఎన్ని జ్ఞాపకాలో, ఎన్ని కథలో… అంటూ చిన్ననాటి నేస్తాలను, ఊసులను గుర్తు చేసుకుంటున్నారు కవయిత్రి ఈ కవితలో. [/box]

[dropcap]పే[/dropcap]రయ్య తాత బడ్డీ కొట్టు, ఎక్కడని మొదలు పెట్టను
చిన్న ఉప్పు బిస్కెట్లు, న్యూట్రిన్ చాక్లేట్లు మా చిరుతిళ్ళు
ఇంట్లో ఇచ్చిన చిల్లర నేను, రాజు గాడు, సీత, పొట్టి పంకజ పోగేసుకుని
మాక్కావాల్సినవి కలిపి కొనుక్కుని, పంచుకుని తినేవాళ్ళం
తాత ఒక్కోసారి ప్రేమతో కొన్ని ఎక్కుగా ఇచ్చేవాడు
మా మొహంలో సంతోషం ఆయన బోసి నవ్వులో భలే కనిపించేది
సాయంత్రం అయ్యిందంటే పరుగు పందాలే
దోస్తులంతా కలిసి ఊరవతల ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళేవాళ్ళం
ఋతుకాలాన్ని బట్టి ఎవరు ముందుగా సూర్యాస్తమయం చూస్తారో, లేదా చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళని మిగితావాళ్లు మోయాలి
నజీర్ అంకుల్ చెట్టు నుంచి చింతకాయలు రాలగొట్టి ఇవ్వాలి
సంక్రాతి వచ్చిందంటే మాంజా, పతంగీలు అంటూ ఒకటే గోల
కొనుక్కుని ఎగరేసేకంటే, కట్ ఐన పతంగీలు పట్టుకుని ఎగరేస్తేనే మజా
పొడుగాటి సన్నని కర్ర పట్టుకుని చెప్పులు లేకుండా పరిగెడుతూ
ఎంత పెద్ద పతంగి పట్టుకుంటే దోస్తుల్లో అంత పెద్ద దర్పం
రాజు గాడు గుర్తొస్తున్నాడు, స్నేహితులు లేని జీవితం అప్రయోజనం
బాల్యం ఎంత అద్భుతం
సూర్యోదయమంతా సున్నితం
సూర్యాస్తమయమంత లావణ్యం
చంద్రోదయమంత సువర్ణితం
పిట్టగోడపై నా సులోచనాలు అలసి సొలసి పడున్నాయి
జ్ఞాపకాల అలలు చివాలున ఎగిస్తే నా కళ్ళు
మూసుకుని చేతులు చాచి వాటిని హత్తుకోడానికి ఆసన్నమయ్యె!

Exit mobile version