[dropcap]“ఏ[/dropcap]వండీ! విన్నారా జగదీష్ మాటలు” కాఫీ ఇస్తూ భర్తని అడిగింది వనజ.
“నేను వినకే కదా నువ్వు చెప్పాలి అనుకుంటున్నావ్.”
“అబ్బబ్బ… మీ ధోరణి మీదే!…. పెళ్ళయి ఇరవై అయిదేళ్ళయినా మీరు మాత్రం కొంచెం అయినా మారలేదు.”
పేపరు చదువుతున్న రాజారావు ఆశ్చర్యంగా వనజ వైపు చూసారు.
“ఏంటలా ఆశ్చర్యపోతున్నారు… అంటే మారిపోయి నా కొంగు పట్టుకొని తిరుగుతున్నాను అనుకుంటున్నారా?”
“ఏమో! తిరుగుతున్నానో లేదో నీకే తెలియాలి.”
“చాల్లెండి!…. నేను సీరియస్‌గా మాట్లాడుతున్నాను.”
ఈసారి పేపర్లో నుండి తప్పదన్నట్లు భార్య వైపు చూసాడు రాజారావు.
“అదేనండి!…. మనం ఈ ఇంటికి ఎన్ని మార్పులు చేయించి ఆధునికంగా చేయించాం. వాడికి, వాడి వైఫ్‌కి ఆఫీసులకి ఈ ఇల్లు దూరం ఆట… వాళ్ళ ఆఫీసులకి దగ్గిరలో ఇల్లు చూసుకుంటున్నారట.”
“ఓహో!… అలాగ… ఇక వాడిని ఆపడం ఎవరితరం కాదు. మన మాట పోకుండా ఉంటుంది… అలాగే వేరే వెళ్ళడానికి అభ్యంతరం చెప్పకు.”
“ఏవండీ!” కోపంగా అంది వనజ.
“వాడి మీద కోపం మధ్యన నా మీద చూపెడతావెందుకు? నేను ఏమన్నాను అని. ”
“ఏం అనలేదు అనుకుంటున్నారా? మీరన్నమాట సూటిగా నా గుండెల్లో గుచ్చుకుపోయింది.”
“నేను అన్నమాటా” ఆశ్చర్యంగా చూసాడు రాజారావు.
“ఇక వాడని ఆపడం ఎవరి తరం కాదు అనలేదూ?”
“అన్నాను.”
“ఇరవై అయిదేళ్ళు పెంచా… పెద్ద ఆఫీసరయ్యాడు. ఇది అంతా మనం వాడి కోసం చేసిన కృషే కదండీ?”
“కాదని ఎవరన్నారు?”
“వాడు కనీసం మాట వరసకి అయినా మనతో చెప్పకుండా తను స్వంతంగా నిర్ణయం తీసుకోవడమేనా? నా మనసు పిండేస్తుందండి” వనజ కళ్ళల్లో నీళ్ళు.
“తప్పదు వనజా! ఏదో ఒక టైములో కొడుకులు కన్న తల్లిదండ్రులు ఈ బాధ అనుభవించక తప్పదు.”
చెళ్ళుమని కొరడాతో కొట్టినట్లు అనిపించింది వనజకి. మారు మాట్లడకుండా కాఫీ కప్పు తీసుకొని వంట ఇంటిలోకి వెళ్ళిపోయింది. తిరిగి పేపరు చదవడంలో లీనమయ్యాడు రాజారావు.
“డాడీ! అమ్మ చెప్పే ఉంటుంది మేము ఇల్లు….”
“లత ఆఫీసుకి దగ్గరిలోనేనా ఇల్లు చూసావు. మంచి పని చేసావు.”
తండ్రి వైపు ఆశ్చర్యంగా చూసాడు జగదీష్.
“అన్నట్లు నీకు నమ్మకం ఉందో లేదో కాని ఒకసారి పంచాంగం చూసి మంచి రోజు నిర్ణయించుకొని మీ ఆవిడతో ఆ ఇంట్లో పాలు పొంగిచండి.”
“డాడీ!” ఈ సారి జగదీష్ మొఖం చిన్నబోయింది.
“ఏంటి బాబు! చెప్పు.”
“నేను లత ఇలా వెళ్ళిపోవడం… మీకు… బాధగా లేదా?”
చిన్నగా నవ్వారయన.
“మాట్లాడండి డాడీ.”
“ఏం మాట్లాడను?”
తండ్రి ప్రవర్తన వింతగా తోచింది ఆయనకు.
“అదే డాడీ మేము వెళుతుంటే బాధగా లేదా?”
“బాధగా ఉండే కదా నేను ఏం మాట్లాడలేకపోతున్నాను.”
జగదీష్‌కి తండ్రి ప్రవర్తన పిచ్చి ఎక్కినంత పని అయింది. అడిగిన వెంటనే వేరే కాపురం వెళ్ళమంటున్నారు…. మళ్ళా బాధతో మాట్లాడలేకపోయాను అంటున్నారు. ఈ రోజు డాడీ ఎందుకిలా బిహేవ్ చేస్తున్నారు.
“ఏంటి జగదీష్ ఆలోచిస్తున్నావ్? అన్నట్లు మీరు చూసే ఇల్లు అపార్ట్‌మెంటా? ఇండిపెండెంట్ ఇల్లా?”
ఒక్క నిముషం ఏం మాట్లాడలేదు జగదీష్…. “అపార్ట్‌మెంట్ డాడీ, అన్నట్లు చెప్పడం మరిచిపోయాను. లత డాడీ రిటైర్ అయ్యారు కొన్నాళ్ళు లత మమ్మీ, డాడీ వచ్చి మా దగ్గర ఉంటారు.”
“మంచిది. ఈ వయసులో వాళ్ళకి ఏం తోస్తుంది. కాలక్షేపానికి హరీష్ ఉంటాడు… వాళ్ళ ఉన్న ఒక అబ్బాయి స్టేట్స్‌లో ఉన్నాడు.”
ఈసారి జగదీష్‌కి నోట మాట రాలేదు. డాడీ కావాలనే ఇలా బిహేవ్ చేస్తున్నారు ఏమో? ఆధునికమైన లంకంత ఇల్లు… ఇంత చక్కటి ఇల్లు వదిలి అద్దె కొంపకి వెళ్ళిపోతావా? ఇక్కడ నీ ఇష్టాన్నీ, నీ భార్య ఇష్టాన్నీ వ్యతిరేకించే వాళ్ళు, అడ్డు చెప్పేవాళ్ళు లేరు. ఏం తక్కువ అయింది అని వెళ్ళిపోతున్నావు అని డాడీ తప్పకుండా అడుగుతారు అనుకున్నాడు. తను ఏం మాట్లాడాలో రాత్రి అంతా లత ఆలోచించి జవాబు రెడీ చేసింది…. కాని ఇలా మాట్లాడుతున్నారు.
“ఏంటి జగదీష్ ఆలోచనల్లో పడ్డావు… ఎటువంటి ఆలోచనలు మనసులోకి రానివ్వకు…. బోలెడు భవిష్యత్ నీకు ఉంది. లేని పోనివి ఆలోచిస్తే మనసుకి విశ్రాంతి లేకుండా బాధపెట్టిన వాడివి అవుతావు.”
ఒక్క నిముషం ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది.
“లత వేరే కాపురం కోరడంలో తప్పులేదు. ఇక మీ అమ్మ అంటావా తల్లి ప్రేమ!… ఎన్నేళ్ళు వచ్చినా కన్న కొడుకు పసిబిడ్డలాగే తల్లికి కనిపిస్తాడు… అమ్మ బాధపడుతుంది అని…. నాన్నగారు నిన్ను చూడకుండా ఉండలేరు అని ఇవన్నీ ఆలోచించకు… నన్ను అడిగితే ఇవన్నీ పిచ్చి సెంటిమెంట్స్” అన్నాడు.
ఆశ్చర్యంగా తండ్రి వైపు చూసాడు జగదీష్!
వంట ఇంటిలో నుండి వనజ వచ్చింది… కళ్ళు ఎర్రబడి, చింత నిప్పుల్లా ఉన్నాయి.
“జగదీష్! రెండు పూటలా పాలు తాగడం అలవాటు నీకు. వెదవ కాఫీలు అలవాటు చేసుకోకు… కాయగూరలు తేవడం, బజారు పనులు చేయడం బొత్తిగా తెలియదు… వారానికి ఒకసారి కాయగూరలు, మీ నాన్నగారు తెచ్చి మీ ఇంట్లో పడేస్తారులే!… ఇక కిరణా నెలకో సారి తెచ్చి ఇస్తారులే.”
వనజ మాటలు వింటుంటే నిజంగానే రాజారావుకి జాలివేసింది.
“ఏంటి ఆంటీ!… మీరు మీ అబ్బాయి పదేళ్ళ కుర్రవాడిలా మాట్లాడుతున్నారు… హరి స్కూలుకి టైమ్ అవుతుంది తొందరగా టిఫిను చేసేయ్” అని వచ్చినంత వేగంగా రూమ్‌లోకి వెళ్ళిపోయింది లత.
వనజకు ఏం మాట్లాడాలో తెలియక మౌనం వహించింది.
“జగదీష్! మీ నాన్న నిన్ను చూడకుండా ఒక్క రోజు ఉండలేరు. నేను సరేసరి… నిన్నుగాని లతను గాని మేము ఎప్పుడయినా బాధ పెట్టమా? ఆయన పైకి తేలడం లేదు గాని లోలోన బాధపడుతున్నారు. ఈ పాటికి ఆయన చెప్పే ఉంటారు” అని భర్త మొఖంలోకి చూసింది వనజ.
“ఆ… చెప్పాను… చెప్పాను వనజ!…. నువ్వు ఎంత బాధ పడుతున్నావో కూడా చప్పాను” అన్నాడు కంగారుగా.
తండ్రి ప్రవర్తన ఈ సారి జగదీష్‌ని మరీ పిచ్చెక్కించింది.
హరీష్, లత తయారయి హాలులోకి రావడంతో, జగదీష్ కారు తాళాలు తీసి ఇద్దరిని ఎక్కించుకొని కారు స్టార్ట్ చేసాడు.
వనజ గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది… కళ్ళ నుండి నీరు ఏక ధాటిగా రాసాగాయ్!
సోఫాలో వెనక్కి జేరబడ్డాడు రాజారావు… ఆయన కళ్ళు మూసుకున్నారు… మరిచిపోదామన్నా మరిచిపోలేని దృశ్యాలు మెదలసాగాయ్!
***
“నాన్నా!… రాజా!… ప్రొద్దున్నే పరీక్ష అన్నావు పెందలాడే పడుకున్నావ్… ఐదవుతుందిలే… మొఖం కడుక్కొని వేడి వేడి పాలు త్రాగితే నిద్దర మత్తు వదులుతుంది.”
తల్లి మాటలతో గభాలున నిద్దుర నుండి లేచాడు. పాలగ్లాసుతో తల్లి ఎదురుగా…
“వంట్లో బాగాలేదు కదమ్మా ఇంత ప్రొద్దున్నే ఎందుకు లేచావ్?”
“ఒక్క మార్కు తక్కువయినా బాధపడిపోతావ్…. నేను పడుకుంటే నీకు మార్కులు ఎలా వస్తాయి రాజా?”
ఆప్యాయంగా తల్లి కళ్ళలోకి చూసి గబగబా వెళ్ళి మొఖం కడుక్కొని పాలు తాగి చదవడానికి కూర్చున్నాడు రాజారావు.
రాజారావు చదువుకున్నంత కాలం సుజాత కొడుకు దగ్గిర వుండి తన వంతు సహాయం చేసేది.
***
“ఇంత ఖరీదుగల ప్యాంట్ షర్టా? వద్దు నాన్నా… ఈ షాపులో బట్టలు చాలా ఖరీదు ఉంటాయి… వేరే షాపులో కొందాం” అన్నాడు రాజారావు.
“రాజా!…. నీకు ఖరీదు విషయం ఎందుకు? ఇంజనీరింగ్ చదువుతున్నావ్!…. అయినా నువ్వు మంచి బట్టలు వేసుకుంటే చూచి ఆనందించేది మేమే కదురా” అంది సుజాత.
***
“రాజాకి హస్టల్ ఫుడ్ పడలేదు… చిక్కి నీరసం అయిపోయాడు. అసలు వాడిని నా వెంట బెట్టుకొని తీసుకువచ్చేద్దాం అనుకున్నాను. కాని ఇంజనీరింగ్ మధ్యలో ఆపడం ఎందుకని ఆలోచిస్తున్నాను” ఊరు నుండి రావడమే బాదగా అన్నాడు రమణారావు.
సుజాత కళ్ళల్లో నీళ్ళు అప్పటికే నిండిపోయాయి. గబగబా గదిలోకి వెళ్ళిపోయింది.
రెండు పెట్టెల నిండా బట్టలు కావలసిన సామానులు సర్దుకొని “ఏవండీ! ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది. నేను ఇక ఒక్కనిముషం ఇక్కడ ఉండలేను. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని వాడికి వండి పెడతాను…. అన్నట్లు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి. లక్ష్మి మంచి పిల్ల. కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే మీకు వంట చేసి పెడుతుంది…. వాడికి శలవులు ఇచ్చినప్పుడల్లా ఇద్దరం వచ్చేస్తాం… వీలయినప్పడల్లా ఆఫీసు శెలవు పెట్టి మీరు వస్తుండండి…” సుజాత మాట్లాడుతుందే కాని కళ్ళల్లో నీళ్ళు నిండి చెంపల మీదగా జారసాగాయి.
రమణారావు మెచ్చుకోలుగా భార్య వైపు చూసాడు.
“నాకీ ఆలోచన రేలేదు. సాయంత్రం నాల్గుగంటలకు బండి ఉంది ఎక్కిస్తాను” అన్నాడు.
***
రాజారావు ఇష్టపడిన అమ్మాయి వనజతో వివాహం అయింది. రమణారావు, సుజాత, పెళ్ళివారి దగ్గిర పైసా కట్నం తీసుకోలేదు. కొడుక్కి కట్నం తీసుకోవడం అంటే కొడుకుని బేరం పెట్టడమే అన్నది వాళ్ళ సిద్ధాంతం!…
***
“ఏవండీ! ఎన్నాళ్ళు ఇలా మీ అమ్మా, నాన్నగారితో కలిసి ఉండడం? వైఫ్ అండ్ హజ్బెండ్ అంటే అర్థం మీకు తెలుసా? వాళ్ళ మధ్య మూడో వ్యక్తి ఉంటే ఆ భార్యాభర్తలకి అండర్‌స్టాడింగ్స్, క్లోజెనెస్ అన్నీ తక్కవ అవుతాయి.”
వజన మాటలు విని రాజారావుకి గుడెల మీద ఎవరో సమ్మెట పోట్లు కొట్టినట్లు అనిపించింది.
***
“ఎన్నిసార్లు చెప్పాలి మీ అమ్మగారికి? ఇంకా మీరు ఆవిడ కొడుకేనా? మీ ప్రతి పనిలో ఆవిడ తల దూరుస్తారు ఎందుకు? బజారు నుండి ఆవిడ మీకు నైట్ డ్రస్‌లు తేవడం ఏమిటి? ఛ!… ఛ!…” కోపంగా అంది వనజ…
***
“ఏవండీ! ఇప్పుడే చెబుతున్నాను… నేను వాళ్ళతో కలిసి ఉండలేకపోతున్నాను…. ఏంటో… నాకు మీ వాళ్ళు మన ఇద్దరి మధ్య అడ్డుగోడల్లా అనిపిస్తున్నారు.”
వనజ మాటలు విన్న రాజారావు ఆ రోజంతా మంచం మీద నుండి లేవలేకపోయాడు. కొడుకు మంచం మీద నుండి లేవలేకపోవడంతో కంగారు పడిపోయింది సుజాత. తలనొప్పిఅని తప్పించుకోవడానికి రాజారావు అనడంతో ఎన్నో రకాల నూనెలు తల మీద వేసి తల నొక్కుతూ కూర్చుంది సుజాత. తల్లి ప్రేమకు రాజారావు కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
“నీలాంటి అమృత మూర్తి కడుపున నాకెందుకమ్మా జన్మనిచ్చావే” అని మనసులో బాధపడ్డాడు.
***
“వేరే కాపురమా?… స్వంత ఇల్లు… మీరు తప్ప మాకు ఎవరున్నారమ్మా?… మాకు తెలియకుండానే మేము… అదే మీ మామయ్య, నేను నిన్ను బాధపెడితే చెప్పు?” గొంతు పూడుకుపోతుంటే… అంది వనజ.
“లేదత్తయ్యా!…. నేను ఇంకా చదువుకోవలనుకుంటున్నాను. కాలేజి ఇక్కడ నుండి చాలా దురం అవుతుంది. కాలేజి ప్రక్కనే అదే సందులో ఇల్లు దొరికింది.”
“నువ్వు ఇంకా చదువుకోవాలని అనుకోవడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రక్క చదువు, మరో ప్రక్క వంట పనులు ఏం చేసుకోగలవ్? ఇక్కడయితే నువ్వు హాయిగా చదువుకోవచ్చు. అయినా రాజా నిన్ను రోజు ఆపీసుకి వెళ్ళే ముందు ఒక అరగంట ముందు బయలుదేరి స్కూటర్ మీద నిన్ను డ్రాప్ చేస్తాడు అడుగుతాను ఉండు” అని సుజాత కొడుకు దగ్గరకు వెళ్ళబోయింది.
వళ్ళు మండిపోయింది వనజకి.
“ఎన్నాళ్ళత్తయ్యా!… బాధ్యత అనేది తెలియకుండా మీ ఇద్దరి చేతులు క్రింద బ్రతకడం… రేపు ప్రొద్దున్న ఎప్పటికయినా మీరిద్దరూ లేకుండా మేము ఇద్దరం ఉండవలసిన వాళ్ళమే కదా” అంది.
వనజ మాటలకు ఆవిడ షాక్ అయిపోయారు.
***
కొడుకు వేరే కాపురం వెళ్ళిపోవడంతో మంచం పట్టింది సుజాత. రమణరావుకి కొడుకు కళ్ళకి రోజు కనబడకపోవడం పిచ్చెక్కినట్టు ఉంది కాని మగాడు పైకి తేలితే నలుగురు నవ్వుతారు… అంతే కాదు… సుజాత ఇంకా బెంబేలు పడిపోతుంది. తల్లిదండ్రులను అవసాన దశలో కూడ కన్నెత్తి చూడని ఎంతమంది పిల్లలు లేరు? కనీసం వారానికి ఒకసారయినా ఒక అరగంట అయినా వచ్చి తమతో గడిపి వెళుతుంటాడు రాజారావు…
***
వేరే కాపురం వెళ్ళిన దగ్గర నుండి వనజ పుట్టింటి వాళ్ళు తల్లిదండ్రో, చెల్లెల్లు కాని… తమ్ముడుగాని ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు.
వాళ్ళ వాళ్ళను చూడగానే వనజ ఆనందానికి అంతు ఉండదు. వచ్చిన వాళ్ళకి వాళ్ళు కోరినవి కొని వాళ్ళను సంతోషపెట్టి మరి పంపుతుంది. పుట్టింటి వాళ్ళతోటిదే లోకం వనజకి. ఖర్చులకి ఎప్పుడయినా డబ్బు తక్కువ అయితే ఒక్క కొడుకేగా మీరు… ముసలి వాళ్ళు ఇద్దరూ ఏం చేసుకుంటారు అంత డబ్బు అంటుంది.
ఈ ఒక్క విషయంలో వాళ్ళకి ఒక్కడే కొడుకు అన్న విషయం తెలుసు. తక్కిన విషయాల్లో గుర్తు రాదు. వనజ బిహేవియర్ రాజారావుకి చెప్పలేని బాధ… కసి… కోపం. భార్య ఏం చేసినా ఎందుకు చేతకాని వాడిలా ఇలా ఊరుకుంటున్నాడు. ఏమిటి ప్రపంచంలో భర్తలందరూ భార్యల ముందు ఎందుకు చేతకాని దద్దమ్మల్లా తనలాగే నోరు మూసుకొని ఉంటున్నారా…. తను ఎదురు తిరిగి వనజకి బుద్ది వచ్చేట్లు చేయాలి అనుకున్నాడు రాజారావు.
“నాన్నా!… రాజా!…. కోడలు చిన్న పిల్ల…. తెలిసో లెలియకో నీ మనసుకి ఏదైనా కష్టం కలిగించినా… లేనిపోని గొడవలు… మనస్పర్థలు పెట్టుకోను అని మీ నాన్న నా మీద ప్రయాణం చెయ్యి” అని రాజారావు చెయ్యి పట్టుకొని ఆవిడ తల మీద పెట్టుకొంది సుజాత.
“నువ్వు ఎక్కడున్నా… మీరిద్దరూ హ్యాపీగా ఉంటే మేమిద్దరం ఇక్కడ ఉండగలం” అని చెప్పవలసింది ఒక్క మాటలో చెప్పాడు రమణారావు.
మనవడు జగదీష్ పుట్టాడని నాలుగు రోజులు వాడితో గడపాలని అప్పటి వరకు ఓపిక పట్టిన సూజాత, రమణారావు రెండు పెట్టెలు పట్టుకొని రాజారావు ఇంటికి వచ్చారు… ఒక పెట్టి నిండా మనవడి సామాణం. వెండి కంచం…. వెండి మట్టుగిన్ని, వెండి గ్లాసు… బంగారు పులిగోరు గొలుసు మనవడికి బట్టలు, కొడుకు కోడలికి బట్టలు.
అత్తగారు, మామగారు రావడం ఇష్టం లేకపోయినా వాళ్ళు తెచ్చిన వస్తువులు చూసి మాత్రం వనజ ఆనందానికి అంతు లేదు.
వనజ పుట్టింటి వాళ్ళు మథ్య తరగతి వాళ్ళు… వనజ వాళ్ళకి పెట్టవలసిందేకాని వాళ్ళు వనజకి పెట్టేది లేదు.
నాలుగైదు రోజులు వరకు అత్త, మామ ఉండడానికి అభ్యంతరం అనిపించలేదు కాని తరువాత వనజకి భయం పట్టుకొంది.
కొంప దీసి నెలలు ఇక్కడ తిష్ఠ వేయరు కదా పరిష్కారం ఆలోచించింది వనజ.
“అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి కొద్ది రోజులు ఉండాలి అనుకుంటున్నాను అత్తయ్యా” అంది వనజ.
సడన్‌గా ప్రయాణం ఎందుకు పెట్టుకుందో అర్థం కాకపోయినా, “సరే వెళ్ళమ్మా… నువ్వు వచ్చేవరకు రాజా దగ్గర మేము ఉంటాం” అంది సుజాత… అలాగయినా కొడుకు దగ్గర కొద్దిరోజులు గడవచ్చు అని సుజాత.
“ఆయన నాతో వస్తున్నారు… నిన్నే ఆఫీసులో శలవుకి అప్లై చేసాను అన్నరు” అంది.
అప్పుడు అర్థమయింది రాజారావుకి…. భార్య మాములు తెలివైనది కాదు. పవర్ ఇస్తే ప్రపంచానిని పాలించమన్నా పాలించగలదు అని… భార్య ప్రవర్తనకు రోజు రోజుకి భార్య మీద ద్వేషం ఏర్పడుతుంది. కాని తల్లిదండ్రులకిచ్చిన మాట… భర్తగా ఏం చేయలేని తనకే తెలియని బలహీనత. ఒక్కమాటలో చెప్పాలంటే తను…
***
సుజాత, రమణారావులు మనవడికి, కోడలికి, కొడుక్కి విలువైన బహుమతులు తేవడం… రెండు రోజులు వాళ్ళతో గడిపి…. తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేవారు.
భగవంతుడు ఆ సంతోషం కూడా వాళ్ళకి దూరం చేసాడు. సుజాత అనారోగ్యంతో మంచం పట్టింది. వృద్ధాప్యం రమణారావుని కృంగదీసింది. వీటికి తోడు ఉన్న ఒక్క కొడుకు దూరం కావడం కూడ వాళ్ళని ఆ వయసులో బాదించింది.
ఒక రోజు ఇంటికి వెళ్ళిన రాజారావు తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యాడు…. తరువాత వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారని తెలిసి రాజారావు కళ్ళల్లో నీళ్ళు నిండాయి. ఇన్నాళ్ళు తను ఎంత వాజమ్మలా పెళ్ళాం కొంగుపట్టుకొని తిరిగి తల్లిదండ్రుల మనసులో ఎంత అలజడి లేపాడో అర్థం అయింది.
“అమ్మా!… నాన్నా!…. నాలాంటి కొడుకు అసలు ఈ భూమి మీద ఉండకూడదు. చేసిన తప్పును క్షమించమని అడగడానికి సిగ్గుగా ఉంది. ఇన్నాళ్ళు మీరిద్దరూ అనుభవించిన ఒంటరితనం… భరించలేనిది. కాని ఇప్పటికయినా కొడుకుగా నా కర్తవ్యం నేరవేర్చి… మనిషిగా బ్రతకనివ్వండి… మన ఇంటికి వెళ్ళిపోదాం…వజన, జగదీష్‌ని తీసుకు వచ్చేస్తాను…” ఆవేశంగా మాట్లాడుతున్న కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు రమణారావు…
చిన్నగా నవ్వారయన…. “ముందు ఈ కాగితాలు…. మీ అమ్మ నగలు జాగ్రత్త చెయ్యి… అన్నట్లు రాజా!… మీ అమ్మ, నేను మాలో ఎవరు ముందు పోయినా రెండో మనిషి పోయే వరకు కొంచెం డబ్బు మా పేరున ఉంచుకున్నాం…. రెండో మనిషి కూడ పోయాక ఆ డబ్బు మాకు ఆసరగా నిలిచి, పని చేసినవాళ్ళకి ఇస్తాం….”
“నాన్నా!… రాజా!…. లంకంత ఇల్లు…. తాళం పెడితే పాడవుతుంది. అద్దెకొంపలో ఇంకా మీరెందుకు ఉండడం అన్నట్లు నా నగలు కోడలుకి ఇచ్చేయ్ బంగారం కాసులున్నాయి. అది నా మనవడికి బంగారం మొలత్రాడు చేయించండి అన్నట్లు రాజా… మీ నాన్న గురించే దిగులురా!…. నేను ముందు పోతే మీ నాన్నని మాత్రం అప్పుడప్పుడు వచ్చి చూడడం మరచిపోకురా, ఎందుకంటే ఆయన నిన్ను చూడకుండా ఉండలేరు” ఆయసంతో ఇక మాట్లాడలేకపోయింది సుజాత.
“అమ్మా!” బావురుమన్నాడు రాజారావు. జారవిడుచుకున్న వస్తువు కోసం ఏడుస్తున్న చిన్న పిల్లాడిలా గుండెలు పగిలేలా ఏడ్చాడు రాజరావు.
“అమ్మా!… నాకు ఇంత పెద్ద శిక్ష వేసేరా? అల్లారు ముద్దుగా పెంచారు… ఇంత క్షోభ ఎలా తట్టకోగలనమ్మా చెప్పండి నాన్నా?
తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యంగా కొడుకు వైపు చూసారు.
“చెట్టంత కొడుకుని ఉండగా ఈ ఆశ్రమంలో మీరు ఉండడం ఏమిటి నాన్నా ఈ బాధను నేను భరించలేను” అన్నాడు.
రాజా… కంగారుగా అన్నారయన.
“చూడు రాజా!…. ఈ ఆశ్రమంలో కన్నకొడుకు, కూతుళ్ళు కన్నెత్తి చూడని దురదృష్టవంతులయిన తల్లిదండ్రులు ఉన్నారు. మన ఇంటి ప్రక్కనే ఉన్నా లెక్చరర్ గారిని, భార్యని ఒక రోజు కొడుకులు వాళ్ళతో చెప్పకుండానే ఇక్కడకు తీసుకు వచ్చి పడేసి ఇప్పటి వరకు కన్నెత్తి కూడా కొడకులు చూడలేదట. ఒకొక్క తల్లిదండ్రులది ఒకొక్క వింత కథ… ఆ కథలు వింటుంటే మీ అమ్మ ఏమంటుందో తెలుసా? నా కొడుకు బంగారం అని మురిసిపోతుందిరా! ఆవిడకు బొత్తిగా లోకజ్ఞానం తెలియదు… ఇక్కడకు వచ్చాక అందరి కథలు విన్నాక మీ అమ్మ చాలా సంతోషంగా ఉంది రాజా” చివరి మాటలు అంటున్నప్పుడు రమణారావు కంఠం వణికింది.
నోటమాట రావడం లేదు రాజారావుకి. గొంతు తడారిపోతుంది. గుండెపిండుతున్న బాధ…
“అమ్మా! నాన్నా!….” ఇద్దరి ఒళ్ళో తల పెట్టుకొని రెండు చేతులతో ఇద్దరిని చెరోవైపు పట్టుకొని దుఃఖం తీరేవరకు…. కళ్ళల్లో నీళ్ళు ఇంకె వరకు కళ్ళు మూసుకున్నాడు.
ప్రతీ రోజు ఆఫీసు అయిన వెంటనే తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డలు చూసి ఇంటికి వెళ్ళేవాడు రాజారావు….
***
“ తాతయ్యా!….” అంటూ భూజాన వేసుకున్న బ్యాగ్ సోఫాలోకి విసిరేసి వళ్ళో వాలిపోయాడు హరీష్.
గభాలున గతం నుండి తేరుకున్నాడు రాజారావు… కళ్ళనిండా నీళ్ళు… చప్పున తుడుచుకొని… హరీష్‌ని వళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడే గదిలో నుండి వచ్చిన వనజ భర్త కళ్ళల్లో నీళ్ళు చూసి తను… అత్తారింటిలో… వాళ్ళని ఎంత బాధ పెట్టింది ఒకొక్కటి గుర్తు వచ్చాయి.
“తనకు జగదీష్, లత బాగా బుద్ది చెప్పారు… తను… ఆనాడు ఎంత అవివేకంగా ప్రవర్తించింది” అనుకొంది.
“డాడీ!…. మీ మనవడు ఈ రోజు చాలా గొప్ప పని చేసాడు. గిన్నీస్ బుక్‌లోకి వాడి పేరు చేరవలసిందే” నవ్వుతూ అన్నాడు జగదీష్.
రాజారావు, వనజ ఆశ్చర్యంగా హరీష్ వైపు చూసారు.
హరీష్ ఏం చేసాడో నా నోటి మీద కాకుండా వాడి నోటి మీద వింటేనే బాగుటుంది. జరిగింది చెప్పడం మొదలు పెట్టాడు జగదీష్.
***
కారు డ్రైవింగ్ చేస్తున్నాడు జగదీష్. మధ్యలో హరీష్ అటువైపు లత కూర్చున్నారు.
“మనం క్రొత్త ఇంటిలోకి వెళ్ళిపోతున్నమా?”
అవును నాన్నా!… అంది సంతోషంగా లత.
“అక్కడెవరెవరు ఉంటారు?”
“మీ డాడీ… నేను… నువ్వు.”
“అంటే మనం ముగ్గురమేనా?”
“అవునురా.”
“మరి తాతయ్య, నాన్నమ్మ?”
“వాళ్ళు అక్కడే ఉంటారు” కొంచెం చిరాగ్గా అంది లత.
“పాపం.”
కొడుకు మాటలకు ఆశ్చర్యపోయాడు జగదీష్.
కావాలని రెట్టించి అడిగాడు “ఎందుకురా పాపం.”
“పాపం అంటే… ఎందుకంటే… తాతయ్య, నాన్నమ్మ వోల్డ్ కదా? ఇంట్లో మనం ఉండం కదా… నేను లేకపోతే తాతయ్య ఎవరితో ఆడుకుంటారు… మీరు లేకపోతే ఎవరితో మాట్లాడుతారు.”
వళ్ళు మండిపోయింది హరీష్ మాటలకు లతకి.
“చాల్లే!…. పెద్ద కబుర్లు… ఈ తెలివి తెటలు చదువులో చూపెట్టు. మొన్న సెకండ్ ర్యాంక్ వచ్చింది.” అంది కోపంగా లత…
తల్లి వైపు కోపం చూసి మూతి ముడుచుకొని కూర్చున్నాడు హరీష్.
డ్రైవింగ్ చేస్తున్న హరీష్ ఎడం చెయ్యి చాచి హరీష్‌ని దగ్గరకు తీసుకోబోయాడు,.
దూరం జరిగి కూర్చున్నాడు హరీష్.
“హరీ?…నేను అలా అన్నాను అని కోపం వచ్చిందా బాబూ!… ఈ సారి ఫస్టుర్యాంక్ నీకే వస్తందిలే” అంది లత
“అబ్బా!… నాకు కోపం రాలేదు మమ్మీ!… ఆలోచిస్తున్నాను. నేను పెద్దవాడిని అయ్యాక… డాడీ లాగే…నిన్ను, డాడీని విడిచిపెట్టి పెద్ద ఇంటిలోకి వెళ్ళిపోతాను కదా? అప్పుడు డాడీ, నువ్వు… నేను లేకుండా ఎలా ఉంటారా అని అనుకుంటున్నాను…. పాపం తాతయ్య, నాన్నమ్మలాగే ఉంటారు కదూ? పాపం!….” అన్నడు గుక్క తిప్పుకోకుండా హరీష్.
ధన్ మని డ్రైవింగ్ చేయడం ఆపి సడన్ బ్రేక్ వేసాడు జగదీష్.
రెండు చేతుల్లో మొఖం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడ్వసాగింది లత.
“లతా! కంట్రోల్ యువల్ సెల్ఫ్! పసి వాడు తెలియక ఏదో అన్నడు. పెద్దవాళ్ళ ప్రభావం పిల్లల మీద ఉంటుంది… అందులోకి వీడు చాలా తెలివైనవాడు.. వాడి మాటలు మనసులో పెట్టుకోకు.”
లత ఏడుపుకి బిక్క చచ్చిపోయాడు హరీష్.
“సారీ మమ్మీ.”
ఒక్క సారి ప్రేమగా హరీష్‌ని దగ్గరకు తీసుకొంది. “లేదండి వాడు అలా అన్నందుకు కాదు నేను ఏడుస్తున్నాది. హరి మనల్ని వదిలి వెళ్ళిపోతాడన్న ఆలోచనే నేను భరించలేకపోతున్నాను… పాపం అత్తయ్య! మామయ్య!… వాళ్ళు నన్ను ఓ కూతురులా చూస్తున్నరు. అయినా నాలో ఇలా వేరు వెళ్ళిపోవాలన్న ఆలోచన ఎందుకు కలిగిందో నాకే తెలియడం లేదు. నా కన్న తల్లిదండ్రులు… నా వాళ్ళ మీద చూపెడుతున్న ప్రేమ వాళ్ళమీద చూపెట్టలేకపోతున్నాను… నాకు తెలియకుండానే నాలో భయంకరమైన మనస్తత్వం ఉంది. అది మీరు పోగొట్టలేకపోయారు. నా కొడుకు నా తప్పుని సూటిగా సరిదిద్దుకునేలా చేసాడు. నేను వెంటనే ఇంటికి వెళ్ళి అత్తయ్యని, మామయ్యని క్షమించమని అడగాలి!” అంది.
జగదీష్ చెప్పింది విని రాజారావు, వనజ ఆశ్చర్యపోయారు.
“అత్తయ్యా! అరె… ఒక్క పూటలో అలా నీరసం అయిపోయారు. ఏమిటి మీ అబ్బాయి వేరే వెళ్ళిపోతున్నాడు అని బెంగపెట్టుకన్నట్టున్నారా. మీరు నిశ్చింతగా ఉండండి… మీ అబ్బాయి… మేము మీ దగ్గరే… ఇక్కడ ఉంటాం… మీ మనవడితో మామయ్యగారు…. మీరు హాయిగా కాలం గడపండి…అన్నట్లు రేపటి నుండి ప్రొద్దున్నే లేవకండి… ఇంత పెద్ద వయస్సులో ఇంకా మీరు శ్రమ పడకండి…. నేను ప్రొద్దున్నే లేచి పని చూస్తాను” అంది….
“లతా!… నాపై నువ్వు అభిమానం చూపెట్టకమ్మా… నాకు నువ్వు శిక్ష వేయాలమ్మా… నువ్వు…. మీరు… మీరు… వేపే కాపురం వెళ్ళిపోండి. కన్నెత్తి మా వైపు చూడకండి…. నేను…. మా అత్తయ్య మామయ్యకు చేసిన పనికి… నాకు శిక్ష… పడవలసిందే!… అత్తయ్య, మామయ్య వాళ్ళు మౌనంగా అనుభవించిన బాధకు పదింతలు నేను అనుభవించాలి. అప్పటికి కాని నేను చేసిన పాపానికి నిష్కృతి లేదు” అంది కళ్ళ నుండి ఏకదాటిగా కారుతున్న నీటిని పైట కొంగుతో తుడుచుకుంటూ వనజ.
వనజలో వచ్చిన మార్పుకి రాజారావు ఆశ్చర్యపోయాడు. పాతికేళ్ళు నిండిన తను ఆనాడు వనజ వేరే కాపురం పెడితే అడ్డు చెప్ప లేకపోయాడు… బుద్ధి చెప్పలేకపోయాడు… నిండా ఆరేళ్ళు నిండని హరీష్ అటు తల్లిదండ్రులకు, ఇటు నాన్నమ్మకు బుద్ధి వచ్చేలా చేసాడు అనుకున్నాడు మనసులో రాజారావు.
“అమ్మా!…. నువ్వు ఆనాడు చేసిన తప్పుకి ఇప్పుడు శిక్ష ఎందుకు వేసుకుంటావ్? ఇలా నీలా ఆలోచిస్తే ఎప్పటికి పిల్లలున్న తల్లిదండ్రులకు వాళ్ళ నుండి ఆపేక్ష, అనురాగం, ఆప్యాయతకు బదులు దూరం పెరుగుతూనే ఉంటుంది. ఇక ఆ దూరం తల్లిదండ్రులకు పెంచకుండా మా తరం నుండి మేము కృషి చేస్తాం. కనీసం మమ్ములను చూసి అయినా కొంతమంది కొడుకులు వాళ్ళ తల్లిదండ్రులను అభిమానంగా చూసుకుంటారు ఏమో!…”
“ఇక ముందు కథలు… పాత తరం కథలు రిపీట్ కాకుండా మాలా… నీ కోడలు లతలా, అత్తగారిని, మామగారిని…. తన తల్లిదండ్రులలాగనే చూసుకుంటే మీలాంటి తల్లిదండ్రులకు ఇక కావలసినది ఏముంటుంది అమ్మా” అన్నాడు అభిమానంగా తల్లిముఖంలోకి చూస్తూ జగదీష్.
కొడుకు కోడలు… తమ దగ్గరే…. తమ కళ్ళముందే ఉంటారన్న సంతోషం ఒక ప్రక్క ఉన్నా… మరో ప్రక్క తన అత్తగారికి, మామగారికి తను చేసిన అన్యాయం గుర్తు వచ్చి మనసు పశ్చాత్తపంతో నిండిపోతుంది వనజకి.
“జగదీష్!… మొత్తం మీద నీ కొడుకు ఇంత మందిలో పరివర్తన తెచ్చినందుకు గిన్నీస్ బుక్‌లో ఎక్కవలసిందే” అన్నడు మనవిడిని ముద్దు లాడుతూ రాజారావు.
“గిన్నీస్ బుక్‌లో నా పేరు వస్తుందా? ఎప్పుడు తాతయ్య” అని రాజారావు మొఖం పట్టుకొని సూటిగా కళ్లల్లోకి చూస్తూ అన్నాడు హరీష్
హరీష్ మాటలకు అందరూ ఘొల్లున నవ్వారు.