[dropcap]ఫో[/dropcap] ఫో ఫో రాచిలుక
నీవంక నే చూడనిక
చాల్చాల్లే నీ అలుక
నీతో నే వేగలేనింక
కోరి కోరి వలచాను
నిన్ను తలచి వగచాను
అందరినీ వదిలాను
నీ గూటిని చేరాను
నిజము తెలుసుకున్నాను
నేను మోసపోయాను
ఫో ఫో ఫో రాచిలుక
నీ వంక నే చూడనిక
కలలెన్నో కన్నాను
కన్నీరుగ మిగిలాను
ఆదరణను మరిచావు
అందలమెక్కాలన్నావు
కమ్మని సంసారాన్ని నువు
కయ్యాల పాల్జేసావు
చాల్చాల్లే నీ అలుక
నీతో నే వేగలేనింక
ఆడుదాని మనసు
నీకది ఏమని తెలుసు
కోరి వచ్చిన అలుసు
అయ్యానయ్యో కంట్లో నలుసు
మన ప్రేమలు మరిచావు
కసిగా కన్నెర్ర జేసావు
ఫో ఫో ఫో రాచిలుక
నీ వంక నే చూడనిక
మగువకేమి తెలుసు
మగవాని ప్రతివూసు
భరించలేనిదయ్యనే నీ పోరు
అయ్యయ్యో నీ ఉసురు
ప్రేమ నిండిన అరుపులు
కలత నిండిన కన్నెరుపులు
చాల్చాల్లే నీఅలుక
నీతో నే వేగలేనింక
కొమ్మను జేరమన్నావు
కలిసి సాగుదమన్నావు
చేరిన నను మెచ్చేదెవరు
పరిహసించువారే కదా అందరు
నీ యింట సాగేనా నా బ్రతుకు
కారణమేమో నీవే వెతుకు
ఫో ఫో ఫో రాచిలుక
నీ వంక నే చూడనిక
కలిసి బ్రతికేది మనము
కడదాక నిలిచేదీ ఋణము
కానివారితో కయ్యము
మనసున నీవు మ్రోయకుము
కలతలతో అలిసాము
రోషమును వదిలేద్దాము
చాల్చాల్లే నీ అలుక
రా రాదా ఇక నా వంక