[శ్రీ గోపగాని రవీందర్ రచించిన ‘పొద్దు పొద్దున్నే నది తీరంలో..!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]రా[/dropcap]త్రంతా గాఢ నిద్రలో మునిగి
పొద్దు పొద్దున్నే మేల్కొంటున్న
నదిని పలకరించడమంటే
స్నేహితునితో కరచాలనం చేసినట్లు
కాలానికి స్వాగతం చెబుతున్నట్లు
వికసిస్తున్న పూలను ఆహ్వానిస్తున్నట్లు
నెచ్చలికి ప్రేమను బహుకరిస్తున్నట్లు..!
ఇప్పుడా నది ప్రశాంతంగానే ఉండచ్చు
దాని పరుగులోని ఉగ్రరూపమే
కండ్ల ముందు కదలాడుతుంది
పసిబిడ్డకు తల్లి పాలిచ్చినట్లుగా
పంటలకు నీళ్ళనిచ్చే నదీమా తల్లీ
ఆగ్రహంతో పంటలను, ఇళ్ళను
పశుపక్ష్యాదులను, జీవులను ఊడ్చేసిన
ప్రళయ కాల దృశ్యాలే మరువలేనివి
ప్రకృతి రమణీయతకు పట్టుగొమ్మ..!
సుదూర ప్రాంతంలో జన్మించి
వందల కిలోమీటర్లు నడిచొచ్చిన
దాని పాద పద్మాలనే ముద్దాడుదాం
బహుదూరపు బాటసారిలా
చేరాల్సిన గమ్యం కోసం
ఉత్తేజంతో గమనాన్ని సాగిస్తున్నది
ఇక్కడ దానికొక మజిలి మాత్రమే
అనుభవాల సారాన్ని పంచటమే కాదు
సారవంతమైన జలములను
విలువైన కనుకలుగా బహూకరిస్తున్నది..!
తీరంలో వెలిసిన దేవాలయాలతో
చారిత్రక వైభవాన్ని చాటుతున్న వెలుగులతో
సామాన్యుల ఆకలిని తీర్చే అన్నపూర్ణమ్మలా
ఊరు పక్కనే పారుతున్నందుకు
గర్వపడుతూనే గొప్పగా చెప్పుకుంటున్నాను
వందల ఏళ్లుగా దేదీప్యమానంగా
ముందుకు సాగిపోవడమే దానికెరుక
అయినా దానికి విశ్రాంతి లేదు
పొర్లు దండాలు పెట్టినా కానీ
ఓ చూపును సారించి
ముందుకే వడివడిగా పరిగెడుతుంది
నాగరికతకు మూలమైనది నదినే కదా
అందుకే నదికో నమస్కారం..!
దాని తెగువకో నమస్కారం..!!