Site icon Sanchika

పొద్దుగాల లేస్తా

[ప్రొఫెసర్ పంజాల నరసయ్య గారు రచించిన ‘పొద్దుగాల లేస్తా’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]పొ[/dropcap]ద్దుగాల లేస్తా
యాప పుల్ల యేసుకునీ
పొలం బాట పడ్త

నాగలి పడత
పొలం దున్నుత
మోట కొడ్త
నీళ్లు తాగిస్త

వరి చేను వాసన
నా ఇంటిది పిలిచినట్టు
తియ్య గుంటది

వాన కురువ కుంటే
ఏడుస్త
వాన కురిస్తే
ఏడుస్తా
పంట కోతకు
వచ్చినప్పుడు

గిట్టుబాటు ధర
రాకుంటే ఏడుస్త
దళారులు దోచుకుంటే
ఏడుస్త

కళ్లు తుడుచు కొని
నాగలి పడత మల్లా
నా పొట్ట కాదు
మీ పొట్ట నింపడానికి

సర్కార్ మాటలు
నమ్ముత
పార్టీల మాటలు
నమ్ముతా

అవి నీటి మీద రాతలు
నేతి బీరకాయలో నెయ్యి
అని తేలినప్పుడు
గుండెలు బాదుకుంట

అంతా రామమయం
నా బతుకంతా బాధామయం
రైతు దేశానికి వెన్నెముక
చిన్నప్పటి నుంచి వింటున్న
దండం పెడత ఆపండి మహాప్రభో

Exit mobile version