Site icon Sanchika

పొద్దుపొడుపు

[dropcap]న[/dropcap]డి రాతిరిని సాగనంపి వేకువమ్మ పిలువంగా
తొలి కోడి కూసి నిదుర మగతను మేల్కొల్పగా
ఎగిరంగానే ఏగిల్లు వారాంగా హిమపు దూపమేసినట్టుగా
మంచు ముత్యాల ధార ధాత్రిని ముద్దాడంగా
పచ్చని పసిరికలో పులకరింతలు పుట్టంగా
తరువు లేలేత సొబగులు కనులకింపుగా
చిగురులు తొడిగి చిందులేయంగా
కొమ్మకొమ్మకు జలసుమాలు సరులుగా
సుందర దృశ్యం సూపును కట్టిపడేయంగా
తూరుపు ఇంటిన పొద్దు పొడవంగా
చెదరము అద్ది చందనము నెట్టినట్టుగా
పసిడి భానువులతో భాస్కరుడు ప్రభావించంగా
వెలుగు రేఖల రాశులు నేలను తాకంగా
ఆ తాకిడికి పుడమి ఒళ్ళు విరిచుకోగా
తల్లి పొదుగును నోటితో ముద్దాడుతుండంగా
లేగ దూడ మూతికి పాలనురుగు మీసాలు బెట్టంగా
పెంకుటిల్లు ప్రేమగా రమ్మని పిలువంగా
వాకిలేమో వయ్యారంగా వలపు లొలుకుతుండంగా
కల్లాపి వాన సినకులోసుకొని స్నానమాడంగా
సుద్దతోన సుక్కలు వెట్టి సింగారించంగా
గృహమావరణలోని చెట్ల పూలు పుప్పొడులవగా
సింగిడి వర్ణాలై విచ్చుకుని సుక్కల వరుసను కలపంగా
ముత్యాల ముగ్గు ముచ్చట్లేన్నో జెప్పంగా
వడివడిగా రమ్మంటూ గుమ్మం సుట్టమల్లే పిలువంగా
ఆహ్వానం పలికి అరుగు మంచి,చడ్డలడుగంగా
గడపేమో సుమగంధాల సామ్రాన్నేయగా
పసుపు,కుంకుమతో ముత్తైదువులా బోట్లేట్టుకోగా
తలుపులు తారసపడి సడి చేసి సంగీతాన్ని మోగించంగా
అడుగులును భూదేవి తన తనువున చుంబనాలల్లే మురవంగా
నేల మీద పరిచిన సాప సింహాసనమై అదిష్టిoచమనగా
మట్టి గోడల్లోని అణువణువునా మానవత్వం పరిమలించంగా
పలకరింపుల్లోన అనురాగం యేరులా ఉరకలెత్తంగా
తనువంతా తన్మయత్వం నిండి వరదై పొంగగా
అదొక భూతల స్వర్గమల్లే తోచింది

Exit mobile version