Site icon Sanchika

పొడుపు కథ

[box type=’note’ fontsize=’16’] శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ కథని ‘పొడుపు కథ’ అనే పేరిట తెలుగులో అందిస్తున్నారు శ్రీ చింతపట్ల సుదర్శన్. [/box]

[dropcap]జ[/dropcap]క్రకోట జమీందార్ కృష్ణగోపాల్ తన యావదాస్తినీ పెద్దకొడుక్కి అప్పగించి దైవభక్తిలో జీవిత శేషాన్ని గడపడానికి కాశీకి వెళ్ళిపోయాడు.

ఆయన కొడుకు విపిన్ విహారి. విపిన్ ఆధునిక చదువు చదివినవాడు. బ్యాచ్‌లర్స్ డిగ్రీ కూడా సంపాదించాడు. ముఖానికి గడ్డమూ కళ్ళజోడుతో వుండే విపిన్ సాధారణంగా ఎవరితోనూ కల్సిపోయేవాడు కాదు. అతని వ్యక్తిగత జీవితం ఎటువంటి కళంకమూ లేనిదే. పొగ తాగేవాడు కాదు. పేకని చేత్తో ముట్టుకోలేదు. పైకి చాలా మెత్తటివాడుగా కనిపించినా విపిన్ స్వభావం అంత సున్నితమైనదేమీ కాదు. అతని స్వభావం అసలైన తత్వం రైతులకి, కౌలుదార్లకి అతి తక్కువ సమయంలోనే అనేక రకాలుగా తెలిసివచ్చింది. తండ్రికి కొడుక్కీ తేడా ఏమిటో అనుభవం అయింది. విపిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు రావల్సిన పైకంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా తగ్గడం సహించేవాడు కాదు, అలాగే ఏ సందర్భంలోనూ రైతులు డబ్బు చెల్లిండానికి ఒక్కరోజు గడువు కూడా యిచ్చేవాడు కాదు.

ఆస్తి అజమాయిషీ మొదలు పెట్టాక అనేకమంది బ్రాహ్మలు ఏ రకమైన శిస్తు చెల్లించకుండా భూములు అనుభవిస్తున్నారని, చెల్లించే కొద్దిమందీ ప్రస్తుత రేట్లకి చాలా తక్కువగా చెల్లిస్తున్నారనీ గుర్తించాడు. విపిన్ తండ్రి శిస్తుల కోసం ఎవ్వరినీ ఇబ్బంది పెట్టేవాడు కాదు. ఎవరైనా డబ్బు జమచేసే విషయంలో అభ్యర్థిస్తే కఠినంగా కాదు అని అనలేకపోయాడు..

తండ్రి వ్యక్తిత్వంలోని బలహీనత తన హయాంలో కొనసాగడానికి వీల్లేదనుకున్నాడు విపిన్ విహారి. తనకు రావలసిన ఆదాయం ఇలా సగానికి సగం తగ్గిపోవడానికి వీల్లేదనుకున్నాడు. తన నిర్ణయానికి సరైన కారణం వున్నదని తనను తను సమాధానపరచుకునేవాడు. తన ఆస్తిని అప్పనంగా అనుభవిస్తూ ఖుషీ చేస్తూ బలిసిపోతున్నవాళ్ళల్లో చాలామంది పనికిరాని వెధవలని, వాళ్ళు దయ చూపడానికి ఎంత మాత్రమూ అర్హులు కాదని భావించాడు. ఇట్లాంటి వాళ్ళ పట్ల ఉదారంగా వుండడం, పోనీలే అని వూరుకోవడం వాళ్ళ బద్ధకాన్ని ప్రోత్సహించడమే అవుతుందనుకున్నాడు. విపిన్ కాఠిన్యానికి యిదొక కారణమయితే మరొకటి ప్రస్తుత జీవన వ్యయం. తన పూర్వీకుల రోజుల్లో కంటే ఈ రోజుల్లో జీవించడం ఖరీదైన విషయం అయింది. అవసరాలు వేగంగా పెరిగిపోతున్నాయి. గతంలోకంటే యిప్పుడు సంపన్నుడుగా జీవించడానికి అయ్యే ఖర్చు నాలుగింతలు పెరిగింది. అందుచేత రెండుచేతులా విచ్చలవిడిగా బహుమానాలు యివ్వడానికి వీలుపడదు. తండ్రి యిదివరలో అలా యిచ్చేసిన వాటిని వీలైనంతవరకు వెనక్కి రాబట్టుకోవటం తన కర్తవ్యం అనుకున్నాడు విపిన్

తన కర్తవ్యం అని భావించినదాన్ని అమలులో పెట్టడానికి విపిన్ ఆట్టే ఆలస్యం చెయ్యలేదు. కఠినమైన నియమాలని పాటించడం మొదలుపెట్టాడు.

మెల్లమెల్లగా తమ చేయి దాటిపోయినవన్నీ వెనక్కి రాసాగినయి. తండ్రి దానం చేసిన వాటిలో యిక కొద్దిపాటి భూములు మాత్రమే మిగిలున్నయి. కాని వాటిని కూడా అవతలివారు శాశ్వతంగా అనుభవించే అవకాశం యికపై లేదని సదరు వ్యక్తులకు అర్థం అయ్యేట్టు చేశాడు.

కౌలుదార్ల కష్టాలు, విన్నపాలు కృష్ణగోపాల్‌కి పోస్టు ద్వారా అందాయి. కొంతమంది ఆయనతో తమ బాధలు చెప్పుకోవడానికి స్వయంగా ఆయన వుండే చోటుకి ప్రయాణమైపోయారు. కృష్ణగోపాల్ కొడుకు ప్రవర్తన పట్ల తన అయిష్టతను తెలుపుతూ ఉత్తరం రాశాడు. బదులుగా విపిన్ విహారి కాలం ఎంతో మారిందని క్రితంలో జమీందార్లు చూపిన ఔదార్యం కారణంగా కౌలుదారు రైతులు ఎన్నో బహుమతులు పొందారని, ఇటీవలి రైత్వారీ చట్టం అట్లా పొందినవన్నీ చట్ట వ్యతిరేకమని అంటున్నదని, జమీందారులు యిప్పుడు తమకు వచ్చే శిస్తులతోనే బ్రతకాలి తప్ప, ఆదాయం పెరిగే మరో మార్గమేదీ లేదని రాశాడు. ఇంతేకాదు మనకు రావలసిన డబ్బు విషయంలో నిక్కచ్చిగా వుండకపోతే ఏమీ మిగలదని, కౌలుదార్లు మనకు అదనంగా ఒరగబెడున్నదీ లేదని అందువల్ల వారికి ఎలాంటి మినహాయింపులు లేవని, వాళ్ళతో సంబంధాలు పూర్తిగా వ్యాపార లావాదేవీలలోనే వుండాలని రాశాడు. ఒకవేళ పూర్వం వలెనే బహుమతులు యివ్వడం కొనసాగితే నాశనమైపోతామని, తమ ఆస్తులను, హోదాను నిలబెట్టుకోవడం అసాధ్యమౌతుందని కూడా రాశాడు.

కాలం యింతలోనే యింత విపరీతంగా మారిపోవడం కృష్ణగోపాల్‌కి చాలా యిబ్బందిగా అనిపించింది. ఈతరం యువతకు తెల్సినట్టు మనకు తెలీదులే అని, పాత పద్ధతులు పనికిరానివి కాబోలు అని గొణుక్కున్నాడు. ఇప్పుడు కనక తను కలగజేసుకుంటే కొడుకు ఆస్తి అజమాయిషీ చెయ్యలేనని, తనని వెనక్కి వచ్చేయమని అంటాడేమోనని, తెంచుకుని వచ్చాక, బతికినన్ని రోజులు దైవ సాన్నిధ్యంలో గడపాలి తప్ప వెనక్కి వెళ్ళిపోవడానికి వీల్లేదని అనుకున్నాడు కృష్ణగోపాల్.

2

ఇక జరగాల్సినవన్నీ జరిగిపోసాగాయి.

విపిన్ విహారి కొన్ని వ్యవహారాల్ని కోర్టుల్లో న్యాయపరంగా, మరికొన్నింటిని కోర్టు బయట న్యాయ విరుద్ధంగా చక్కదిద్దాడు. చాలామంది కౌలు రైతులు అతనంటే భయంతో వణికిపోయేవారు. ఒక్క మీర్జాబీబీ కొడుకు అసీముద్దీన్ మాత్రం విపిన్ విహారికి లొంగలేదు.

ఈ వ్యక్తి పట్ల విపిన్‌కి చాలా కోపం వచ్చింది. తన తండ్రి బ్రాహ్మలకు ఉచితంగా భూములు యివ్వడం అర్థం చేసుకోగలడుకాని ఒక ముస్లింకి కొంత భూమి ఉచితంగా కొంత కౌలుకి ఎందుకు యిచ్చాడో అర్థంకాని చిక్కు ప్రశ్న అయింది. ఎవరూ ఎదిరించని తనను ఒక తక్కువ జాతి ముస్లిం స్త్రీ కొడుకు, పాఠశాలలో ఏదో కొద్దిగా చదవడం రాయడం నేర్చుకున్నవాడు లెక్కపెట్టకపోవడం సహించలేకపోయాడు.

ఆ పేద స్త్రీ తన కష్టాన్ని, దుఃఖాన్ని జమీందారుగారితో విన్నవించుకుని ఉంటుందని, కరుణాసముద్రుడైన జమీందారు ఆమెను కనికరించి భూమిని యిచ్చి ఉంటాడని గుమాస్తాలు విపిన్‌కు వివరించారు. ఈ ఉపకారం విపిన్‌కి శుద్ధ అనవసరం అనిపించింది. గతించిన రోజులనాటి ప్రజల పట్ల అతనికి ఎలాంటి జాలి కలగలేదు. తండ్రి దయతో యిచ్చిన భూముల మీద వాళ్ళు హాయిగా బ్రతికేస్తుండటమేగాక తనను నిర్లక్ష్యం చేస్తున్నారని భావించాడు. సున్నిత మనస్కుడయిన తన తండ్రిని మోసం చేశారని ఆయనకు న్యాయంగా రావలసిన డబ్బు కొట్టేశారని అనుకున్నాడు. అసీముద్దీన్ నుంచి భూమిని రాబట్టాలని నిర్ణయించుకున్నాడు.

అసీముద్దీన్ కూడా మొండి మనిషే. ఎవరికీ తలవంచే రకంకాదు. ప్రాణం పోయినా సరే తన భూమిలోంచి ఒక్క ఇంచికూడా వదులుకునేది లేదని శపథం చేశాడు. దీంతో ఆ ఇద్దరి మధ్య బహిరంగంగా విరోధం మొదలైంది.

అసీముద్దీన్ వితంతువు తల్లి తన కొడుకుని శాంతింపచెయ్యడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ‘జమీందారుతో వైరం మంచిది కాదు’ అన్నది. ‘ఇన్నాళ్ళు మనం వాళ్ళ దయవల్లే బతికాం’ అనీ, ‘జమీందారు తన ఉపకారాన్ని వెనక్కి తీసుకున్నా చేయగలిగిందేమీ లేదని, ఆయన్నే నమ్ముకుని బ్రతకాల్సినవాళ్ళమని’ రకరకాలుగా చెప్పింది. ‘ఆయన కోరినట్టుగా కొంత భూమిని ఆయనకు అప్పగించు బేటా’ అని బ్రతిమాలింది మీర్జాబీబీ.

‘పోవే! నీకేం తెల్సు? ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చకు’ అనేవాడు అసీముద్దీన్.

ఒకదాని తర్వాత ఒకటిగా తనమీద విపిన్ పెట్టిన కేసులన్నీ ఓడిపోయాడు అసీముద్దీన్. ఓడిపోయే కొద్దీ అతనిలో పట్టుదల పెరిగింది. అందుకోసం తన సర్వస్వాన్నీ ఒడ్డాడు.

ఒకనాడు మధ్యాహ్నం పూట, మీర్జాబీబీ తమ చిన్నతోటలోని పళ్ళు కూరగాయలూ తీసుకుని కొడుక్కి తెలీకుండా విపిన్ విహారి దగ్గరకుపోయింది. అతనివైపు వాత్సల్యంగా చూస్తూ ఎంతో మృదువుగా మాట్లాడిందామె.

‘అల్లా నిన్ను చల్లగా చూడాలి బిడ్డా! అసీమ్‌ని నాశనం చెయ్యకు నాయనా, అది నీకు న్యాయం కాదు. అతన్ని నీ సంరక్షణకు వదిలేస్తున్నాను. నీ చిన్నతమ్ముడిగా భావించు. నీ నీడన బతుకుతున్న వాళ్ళల్లో ఒక్కడిగా వాణ్ణి బతకనియి. వాడి మీద కోపం పెట్టుకోకు బిడ్డా!’ అన్నది.

ఆ ముసలామె తనతో అంత చనువుగా మాట్లాడ్డం విపిన్‌కి ఆగ్రహం తెప్పించింది.

‘ఈ విషయాలు నీకేం తెలుసు. వెళ్ళు వెళ్ళు ఏదైనా చెప్పుకోవాల్సి వుంటే, నీ కొడుకుని నా దగ్గరికి పంపించు’ అన్నాడు విపిన్.

రెండవసారి తనకి ఈ వ్యవహారంలో ఏమీ తెలియదని అనిపించుకుని మీర్జాబీబీ దారి పొడుగునా కన్నీరు కారుస్తూ, అల్లాని నిశ్శబ్దంగా ప్రార్థిస్తూ యింటికి వెళ్ళింది.

3

కోర్టు కేసు దీర్ఘకాలం సాగింది. సివిల్ కోర్టు తర్వాత హైకోర్టు దాకా వెళ్ళింది. చిట్టచివరికి అసీముద్దీన్ హైకోర్టులో పాక్షికంగా విజయం సాధించాడు. ఈవిధంగా పద్దెనిమిది నెలలు గడచిపోయేయి. కానీ యిప్పుడతను సర్వనాశనమైపోయాడు. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. ఇదే అవకాశంగా తీసుకుని ఋణదాతలు అతనికి వ్యతిరేకంగా ‘డిక్రీ’లు తీసుకువచ్చారు. అతనికి మిగిలిన ప్రతి కర్ర పేడూ, రాయీ కూడా వేలం వేయ్యడానికి తేదీ నిర్ణయింపబడింది.

ఆవేళ సోమవారం. వర్షాలకు నీళ్ళు నిండిన చిన్న నది పక్కన ఊరి సంత జరుగుతున్నది. అమ్మకాలూ, కొనడాలూ కొన్ని ఒడ్డున, కొన్ని నీటిలో వున్న పడవల్లో జోరుగా సాగుతున్నాయి. అక్కడంతా గోలగోలగా వుంది. ఆషాఢ మాసం కావడంవల్ల పనసపండ్ల అమ్మకాలు ఎక్కువగా సాగుతున్నాయి. హిల్సా చేపలు కూడా ఎక్కువ సంఖ్యలో సంతకు చేరాయి. ఆకాశం మేఘావృతంగా వున్నది. దుకాణదారులు పెద్ద వాన పడుతుందేమోనన్న భయంతో సరుకు తడవకుండా బొంగుకర్రలు పాతి పైన గుడ్డలు పరిచారు.

అసీముద్దీన్ సంతలోకి వచ్చాడు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఈ రోజుల్లో అతనికి ఏ దుకాణదారుడు, అప్పు యివ్వడం లేదు. అందుకని వో పెద్ద యిత్తడి పళ్ళాన్ని తీసుకువచ్చాడు, దాన్ని కుదువపెట్టి అవసరమైనవి తీసుకుపోవాలన్న ఆలోచనతో. సాయంత్రం అవుతుంటే, విపిన్ విహారిని అతని ‘ముక్కు’ లాక్కువచ్చింది సంతకి. విపిన్ వెంట లాఠీలు పట్టుకున్న అనుచరులున్నారు. తననక్కడికి లాక్కువచ్చిన వాటి వాసన చూస్తూ నూనె అంగడి ‘ద్వారీ’ దుకాణం ముందు ఆగి వ్యాపారం ఎలా వున్నదో వాకబు చేస్తుంటే కనపడ్డాడు అసీముద్దీన్. విపిన్‌బాబు కనిపించగానే తన్ను తాను నియంత్రించుకోలేకపోయాడు అసీముద్దీన్. తన కర్ర పైకెత్తి పులిలా గర్జిస్తూ విపిన్‌బాబు వైపు పరుగెత్తాడు.

వివిన్ అనుచరులు అతన్ని మధ్యలోనే నిరాయుధుణ్ణి చేసి పోలీసులకప్పగించారు. ఈ సంఘటన పట్ల విపిన్‌బాబు లోలోపల సంతోషించలేదని అనలేం. తను వేటాడదల్చుకున్న క్షుద్ర ప్రాణి తనమీదకే యుద్ధానికి రావడం క్షమించరాని విషయం కదా. విపిన్ సంతోషం పట్టలేక ‘చివరికి దొరికిపోయాడ్రా బద్మాష్’ అనుకున్నాడు. విపిన్‌బాబు ఇంట్లో ఆడవాళ్ళు ‘మోటువాడు ఎంత పనిచేయబోయాడు. సరిగ్గా సమయానికి పట్టుకున్నారు. వాడికి తగిన శిక్షపడుతుంది’ అని కుదుటపడ్డారు.

ఆనాటి సంఘటనను మనసులోంచి తుడిచేసి అందరూ హాయిగా నిద్రపోయారు కాని ఒక నిర్భాగ్యురాలైన వితంతువు ఆ విషాద ఘటనను తలుచుకుని ఎంతో దుఃఖించింది. ఆ రాత్రి ఆమెకు కాళరాత్రే అయింది.

4

నాలుగు రోజుల తర్వాత కేసు డిప్యూటీ మాజిస్ట్రేట్ ముందు విచారణకు వచ్చింది. ఇంతకుముందు జక్రకోట జమీందారు ఎప్పుడూ కోర్టు బోను ఎక్కలేదు. కానీ విపిన్‌బాబుకు సాక్ష్యం చెప్పడానికి ఎటువంటి చింతాలేదు.

పల్లకిలో కోర్టుకి వచ్చాడు విపిన్. ఛాతీ మీద వేలాడే గడియారం వుంది. తలకు పాగా చుట్టుకున్నాడు. మేజిస్ట్రేట్ వేదిక మీద తను కూర్చున్న కుర్చీ పక్కనే కుర్చీలో కూర్చోమని విపిన్‌ని ఆహ్వానించాడు. కోర్టు హాలు ఊపిరి బిగబట్టి నిలబడ్డది. ఎన్నో యేళ్ళుగా ఇంత గొప్ప సంచలనం ఆ కోర్టు చూసి వుండలేదు.

విపిన్‌బాబు సాక్ష్యం చెప్పే సమయం దగ్గరపడున్నప్పుడు, ఒక చప్రాసీ వచ్చి అతని చెవిలో ఏదో గుసగుసగా చెప్పాడు. తీవ్ర అసహనానికి లోనవుతూ మేజిస్ట్రేట్ అనుమతి తీసుకుని బయటకు నడిచాడు.

బయట దూరంగా మర్రిచెట్టు కింద నిలబడి వున్న ముసలి తండ్రిని చూశాడు. కాళ్ళకి చెప్పులు లేవు. అంగవస్త్రం చుట్టుకుని చేతిలో జపమాలతో అక్కడ నిలబడ్డ బక్కపలచటి శరీరం ఏదో ఒక కాంతితో మెరుస్తున్నది. ఆయన ప్రశాంత వదనంలో కారుణ్యం ఉట్టిపడుతున్నది.

విపిన్ బిగుతుగా వున్న పాంటుతో కష్టంగా వంగి, తండ్రి పాదాలకు నుదురు ఆనించాడు. అలా చేస్తున్నప్పుడు తలపాగా వూడి వచ్చి అతని ముక్కును ముద్దు పెట్టుకున్నది. ఛాతీ మీద జేబులో వున్న గడియారం బయటకు వచ్చి గాలిలో ముందుకీ వెనక్కీ వూయలలూగింది. విపిన్ వెంటనే తలపాగా సర్దుకుని, తండ్రిని దగ్గర్లోనే వున్న ప్లీడర్ యింటికి పోదాం అని అర్థించాడు.

‘వద్దు… వద్దు! నేను చెప్పదల్చుకున్నది యిక్కడే చెప్తాను’ అన్నాడు కృష్ణగోపాల్.

జనం ఆసక్తిగా వాళ్ళచుట్టూ మూగారు. విపిన్ నౌకర్లు జనాన్ని వెనక్కి తరమసాగారు.

‘అసీముద్దీన్‍ని విడిపించు. అందుకు ఏంచేయాలో అదంతా చెయ్యి. అతని దగ్గర్నించి నువ్వు తీసుకున్న భూములు తిరిగి యిచ్చేయి’ అన్నాడాయన.

‘దీని కోసం’ ఆశ్చర్యంగా అన్నాడు విపిన్. ‘బెనారస్ నుంచి యింతదూరం వచ్చారా? ఈ జనం మీద ఎందుకింత ప్రత్యేకమైన అభిమానం చూపుతున్నారో తెల్సుకోవచ్చా?’ అన్నాడు విపిన్.

‘తెల్సుకుని యేంచేస్తావు?’

‘మీరు చేసిందంతా అపాత్రదానమే. మీరు దానంగా యిచ్చిన భూములన్నిటినీ తిరిగి తీసేసుకున్నాను. తిరిగి తీసుకున్న భూములు చాలామటుకు బ్రాహ్మలవే. అయినా నన్ను మీరొక్క మాటన్లేదు. ఈ ముస్లిమ్ గురించి మీకెందుకింత పట్టుదల. అంతా జరిగిపోయింది. ఇప్పుడు అసీమ్‌కి వ్యతిరేకంగా వున్న కేసుని రద్దు చేసుకుని వాడి భూములు యిచ్చేస్తే ప్రజలేమంటారు? వాళ్ళకి నేనేం చెప్పాలి?’

కృష్ణగోపాల్ కొద్ది క్షణాలపాటు నిశ్శబ్దంగా వున్నాడు. తర్వాత వొణుకుతున్న వేళ్ళ మధ్య రుద్రాక్షల్ని వేగంగా కదిలిస్తూ దృఢంగా అన్నాడు.

‘నువ్వేం చేశావో, ఎందుకు చేశావో ప్రజలకు చెప్పాల్సిన అవసరం సంజాయిషీ యివ్వాల్సిన పని లేదు. వాళ్ళతో చెప్పాలనుకుంటే చెప్పు. అసీముద్దీన్ నా కొడుకు… నీ సోదరుడు.’

‘ఏమిటీ! ముసల్మాన్ కడుపునా?’ అన్నాడు విపిన్, చేష్టలుడిగి. ‘అవును! అయితేనేం?’ అన్నాడాయన గంభీరంగా. బొమ్మలా నిలబడిపోయిన విపిన్‌కి కాస్సేపటి తర్వాత నోరు పెగిలింది.

‘ఇంటికి రండి నాన్నగారూ, మనం ఈ విషయం తర్వాత మాట్లాడుకుందాం.’

‘వద్దు! సంసార జీవితాన్ని త్యజించి దైవ సాన్నిధ్యంలో గడపడానికి విశ్చయించుకున్నవాణ్ణి, మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టలేను. ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వేం చేస్తావన్నది నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను’ అంటూ బలవంతంగా కన్నీళ్ళని ఆపుకుంటూ, కొడుకు తలమీద చేయి వుంచి ఆశీర్వదించి అడుగులు తడబడుతుండగా అక్కణ్ణించి వెళ్ళిపోయాడు కృష్ణగోపాల్.

విపిన్ స్థాణువులా నిలబడిపోయాడు. ఏమనాలో తెలియలేదు. ఏంచేయాలో తెలియలేదు. పాతతరం యొక్క పవిత్రత యిదన్నమాట, చదువుకున్న తన నైతిక ప్రవర్తన తండ్రి ప్రవర్తనకంటే ఎంత మెరుగోననుకుని గర్వపడ్డాడు. మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో గడపకపోవడమే దీనికి కారణం అని నిర్ధారించాడు.

కోర్టుకి తిరిగివచ్చిన విపిన్‌కు ఇద్దరు కానిస్టేబుళ్ళ మధ్య వున్న అసీముద్దీన్ కనిపించాడు. అతడు నీరసంగా, అలసిపోయినట్టుగా వున్నాడు. అతడి పెదాలు ఎండిపోయి వున్నాయి. కాని కళ్ళు మాత్రం ప్రకాశిస్తున్నవి. చిరుగుల మురికి గుడ్డలు కప్పుకుని వున్న వీడు తన తమ్ముడు అనే ఆలోచన వచ్చి వణికిపోయాడు విపిన్,

డిప్యూటీ మేజిస్ట్రేట్, విపిన్ స్నేహితులు అయి వుండటంవల్ల కేసు కొట్టివేయబడింది. అసీముద్దీన్ బయటపడ్డాడు. కొద్దిరోజుల్లోనే తిరిగి పూర్వస్థితికి వచ్చాడు. ఊరి ప్రజలు చాలా ఆశ్చర్యపడ్డారు. ఇదంతా ఎందుకు జరిగిందో అసీముద్దీన్‌కి అర్థంకాలేదు.

కోర్టులో కేసు జరుగుతున్నప్పుడు కృష్ణగోపాల్ వచ్చి వెళ్ళాడన్న వార్త అన్ని దిక్కులకూ పాకింది. జనం ఒకరివైపు ఒకరు నర్మగర్భంగా చూసుకున్నారు. తెలివైన ప్లీడర్లు ఈ మొత్తం వ్యవహారాన్ని వూహించుకున్నారు. వాళ్ళల్లో ఒకడైన రామ్ తరణ్ బాబుకు తను చదువుకోడానికి సహాయం చేసింది, ఈ రోజున ఒక ప్లీడర్‌గా తను జీవించడానికి ఆధారంగా నిలిచింది కృష్ణగోపాలేనని తెలుసు. అతనికి పెద్దమనుషుల నీతి, ధర్మం, భక్తి, నిష్ఠ, విశ్వాసం అనేవన్నీ బూటకమని, వంచన అని అనుమానం ఉండేది. ఇప్పుడది రూఢి అయిపోయింది. ఇలాంటి లోకోపకారుల జీవితాల్ని పరిశోధిస్తే వారి పవిత్రత ఏమిటో తెల్సివస్తుంది అనుకున్నాడు. మంచివాళ్ళు పైకి కనిపించని తపటులు, చెడ్డవాళ్ళు లోపలా బయటా ఒకేరకంగా ఉంటారు. కృష్ణగోపాల్ దయ, జాలి, ఉదారత ఆయన ధరించిన వంచన ముసుగు కనిపించకుండా చేయడానికేనని అర్థం చేసుకున్నాడు. కృతజ్ఞత అనే భావం అతని మనసులోనుంచి చెదిరిపోయింది.

మూలం : రవీంద్రనాథ్ టాగూర్

అనువాదం: చింతపట్ల సుదర్శన్

Exit mobile version