[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. Billy Collins రచించిన ‘On not finding you at home’ కవితకి స్వేచ్ఛానువాదం.]
~
[dropcap]మా[/dropcap]మూలుగా అయితే
కంకర పరిచిన మట్టి దారిపైనుంచి
నా అడుగుల సవ్వడి వినగానే
ఇంటి ముందటి దర్వాజాలో
నువ్వు ప్రత్యక్షమయ్యేదానివి
ఇవాళ మాత్రం తలుపులు మూసే ఉన్నాయి
కష్టంగా కిటికీలోంచి జాగ్రత్తగా చూస్తే
పొయ్యి వెలిగించిన దాఖలాయే లేదు
భోజనాల బల్ల మీద నీ దువ్వెన
గ్లాసు నీళ్ళల్లో నాలుగు పసుప్పచ్చ పువ్వులు
గది మూలల్లో తారాడుతున్న చీకటి నీడలు
తప్ప మరేమీ కనిపించలేదు
కాస్సేపు ఆ పెద్ద చెట్టు కింద నిలబడి
గాలి వేసే ఈలల్ని, పిట్టల కిచ కిచలని
ఆలకించాను
ఈ గాలి ఈ పక్షులు
సరిహద్దులు దాటినట్టున్న
ముదురాకుపచ్చ అడవులు
అవేవీ నువ్వున్నప్పట్లా లేవు
తెలిసొచ్చింది..
అద్భుతమైన కొన్ని మేఘ శకలాలుగా
మారి నువ్వు పై కప్పులోంచి
అదృశ్యమై ఉంటావు
నేనే- ఇంకా నువ్విక్కడే ఉండి ఉంటావని
అనుకుంటున్నా
కొండవాలు వైపు నేను దిగి వెళ్ళేప్పుడు
చీకటి వేళకి ముందుగా
నువు దాటాల్సి ఉన్న లక్ష్మణ రేఖని
కనీ కనబడకుండా నీ ఇంటి చుట్టూ
గీసి ఉన్న వలయాన్ని
నేనిప్పుడు దాటుతూ నడుస్తున్నాను!!!
~
మూలం: బిల్లీ కొలిన్స్
తెలుగు సేత: హిమజ
‘Literary Lion of the New York Public Library’ గా గుర్తింపు పొందిన కొలిన్స్ 2004 నుండి 2006 వరకు New York State Poet గా వ్యవహరించారు. 2016 లో అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్‌లో సభ్యులుగా చేరారు.
The Rain in Portugal, Whale Day వంటి 12 కి పైగా కవితా సంపుటాలు వెలువరించిన బిల్లీని Favourite Poet of America గా The Wall Street Journal సంబోధించింది.