అమ్మ కవితలు రెండు

0
2

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. ఆల్బర్ట్ జాన్ రాసిన My Mother, క్రిస్టినా రోసెట్టీ రాసిన Sonnets are full of love అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1. నా తల్లి

~

ప్రియాతిప్రియమైన అమ్మా
తొమ్మిది నెలల తొమ్మిది రోజులు
నేను నీ గర్భకుహరంలో గడిపాను
నీ నుంచి నేను జీవితాన్ని పొందాను
నువు నా జీవితానికి వెలుగునిచ్చావు

మా అమ్మ నాకో ప్రపంచపు వింత
నువు నాకిచ్చే బలము భద్రత వలన
నీ ఒడిలో పడుకుంటే
నాకు ఎలాంటి భయాలు ఉండవు
ఓ భగవంతుడా
నేనీ ప్రపంచానికి ఉపయోగపడేలా
నన్ను ఆశీర్వదించు

ప్రాణం ఉండవచ్చు
ప్రాణం పోనూ వచ్చు కానీ
ఎప్పటికీ నేను నా తల్లికి నమస్కరిస్తాను
ఆమె నన్నిలా తీర్చి దిద్దినందుకు
మా అమ్మని నేను ప్రేమిస్తాను

నా ప్రియమైన అమ్మా
నేను నవ్వితే మా అమ్మ నవ్వుతుంది
నేను ఏడిస్తే మా అమ్మ ఏడుస్తుంది

ఏదైనా సరే
ఆమె మాత్రమే ఇవ్వగలదు
అమ్మ మాత్రమే ఇవ్వగలదు
తన కొరకు ఏమీ కోరకుండా
ఇవ్వగలగడం అమ్మకు మాత్రమే చేతనవును!!

~

మూలం: ఆల్బర్ట్ జాన్

తెలుగు సేత: హిమజ

***

2. ప్రేమ నిండిన పద్య పంక్తులు

~

నా పద్యపంక్తులన్నీ ప్రేమతో నిండి ఉన్నాయి
ఇదే నా గ్రంథం
ఎన్నెన్నో పద్యమాలికలను నింపుకున్న గ్రంథం
ఇప్పుడు మరో పద్యమాలిక

నా హృదయపు నిశ్శబ్ద ఆవాసమైన మా అమ్మకు
నా తొలి ప్రేమకు, నా తల్లికి
ఎవరి మోకాళ్ళపై దోగాడి బుడిబుడి నడకలు
ఏ కష్టం లేక నేర్చుకున్నానో
ఎవరి సేవలైతే నా ప్రత్యేక హోదాగా పొందానో
నేను వచ్చి వెళ్ళినపుడల్లా
ఏ అనురాగం వల్ల నేను ప్రేరణ పొందానో
నువు నన్ను బేషరతుగా ప్రేమించడం వల్లనే అమ్మా
నిన్ను అపరిమితంగా ప్రేమిస్తున్నానమ్మా గౌరవనీయమైన నీ పేరుకు పట్టం కట్టడానికే
ఈ అంత్యప్రాసల పుస్తక పుష్పగుచ్చాన్ని
నీకోసం ప్రేమతో రాసానమ్మా

ఎప్పటికీ మసక బారని నీ ప్రేమ వెలుగు
కాలాలకు అతీతంగా
కాలమే లేనిదిగా
నిత్యము సత్యము
శాశ్వతమైనదిగా
మిగిలిన జీవితమంతా
నీ మరణానంతరం కూడా
నేన్నిన్ను ప్రేమిస్తూనే ఉంటానమ్మా
నీ ప్రేమ నాపై సదా ఇలాగే ఉండాలమ్మా !!

~

మూలం: క్రిస్టినా రోసెట్టీ

తెలుగు సేత: హిమజ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here