[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. ఫెర్నాండో పెస్సోవా రాసిన If after I die.., As she passes అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]
~
1. ఒక వేళ నా మరణం తరవాత
~
ఒకవేళ, నేను చనిపోయిన తర్వాత, వాళ్ళెవరైనా
నా జీవితచరిత్రను వ్రాయాలనుకుంటే,
దానంత తేలికైనది మరేదీ లేదు.
నాకంటూ కేవలం రెండు తేదీలు ఉన్నాయి –
నా పుట్టిన తేదీ మరొకటి నా మరణపు తేదీ
రెండింటికి మధ్య అన్ని రోజులు నావే.
నన్ను వర్ణించడం ఎంతో సులభం.
నేనొక పిచ్చివాడిలా బతికాను
ఎలాంటి భావోద్వేగాలు లేకుండా
వస్తువులను ఇష్టపడ్డాను.
నాకెప్పుడూ నెరవేర్చుకోలేని కోరికలు లేవు
ఎందుకంటే నేను ఎప్పుడూ గుడ్డివాడిని కాలేదు.
వినడం కూడా నాకు చూడడానికి తోడుగా ఉండేది కాదు.
కంటికి కనిపించేవన్నీ వాస్తవమైనవని
అలాగే
ఒకదానికొకటి భిన్నంగాను ఉన్నాయని
నా అవగాహనలో నాకర్థమయింది
నేను దేన్నైనా కళ్ళతోనే అర్థం చేసుకున్నాను,
ఆలోచనతో కాదు
అర్థం చేసుకోవడం అంటే
మన చుట్టూ ఉన్న వారందరినీ
సమానంగా గుర్తించడమే
ఒకరోజు నాకు చిన్నపిల్లాడికి మల్లే నిద్ర పట్టింది.
కళ్ళు మూసుకుని అలా పడుకున్నాను.
మీకోటి చెప్పాలి,
నేను ప్రకృతి కవిని మాత్రమే!
***
2. ఆమె వెళ్తున్నపుడు..
~
నేను కిటికీ దగ్గర కూర్చున్నప్పుడు,
కురిసే మంచు అస్పష్టంగా కనిపించే
అద్దాల నుంచి
నేను ఆమె ప్రయాణిస్తున్నప్పుడు..
గడిచిపోతున్నప్పుడు.. గడిచేకొద్దీ సుందరమైన
ఆమె చిత్రాలను చూస్తున్నాను.
దుఃఖం నాపై దాని ముసుగును విసిరింది:-
ఈ ప్రపంచంలో నావంటి ఒక అల్పజీవి
ఆకాశంలో మరొక దేవదూత.
నేను కిటికీ వద్ద కూర్చున్నప్పుడు,
కురుస్తున్న మంచు అస్పష్టంగా కనిపించే
అద్దాల ద్వారా
నేను ఆమె రూపాన్ని చూస్తున్నాను,
అది ఇప్పుడు గడిచేది కాదు.. గడిచేది కాదు..!
మూలం: ఫెర్నాండో పెస్సోవా
తెలుగు సేత: హిమజ
ఇంగ్లీషు భాషపై పట్టు ఉండటం మూలాన ఎన్నో ఆంగ్ల గ్రంథాలను ఫ్రెంచ్ లోనికి అనువదించాడు.
పెస్సోవా విజయవంతమైన రచయిత, అతని స్వంత పేరుతో మాత్రమే కాదు, అతను దాదాపు డెబ్బై-ఐదు మంది క్యారెక్టర్లను సృష్టించాడు, వారిలో ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు: అల్బెర్టో కైరో, అల్వారో డి కాంపోస్ మరియు రికార్డో రీస్.
పోర్చుగీస్ భాషలో 20వ శతాబ్దపు గొప్ప కవిగానే కాకుండా, పెస్సోవా ప్రచురణకర్త, అనువాదకుడు కూడా. దక్షిణాఫ్రికాలో పెరిగాడు, అతను ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడగలడు. సాహిత్య విమర్శకుడు మరియు నాన్-ఫిక్షన్ రచయిత. అతను తన జీవితకాలంలో ఒక పుస్తకాన్ని మాత్రమే ప్రచురించాడు.
పెస్సోవా తన 47వ యేట మరణించాడు.