Site icon Sanchika

జేన్ రాబర్ట్స్ మూడు కవితలు

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. జేన్ రాబర్ట్స్ రాసిన Home; Miscellaneous; Mother అనే మూడు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1. ఇల్లు

~

ఈ అడవి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది
సుతిమెత్తగా ప్రేమించేదిగా ఉంది
నేనిక్కడొక ఇంటిని నిర్మించాను
నన్నిక్కడ కలుసుకునేందుకు వచ్చేయ్
నిద్రించేందుకు సురక్షితమైనది
ఇప్పుడే ఇక్కడికి వచ్చేయ్

చలి కాచుకునేందుకు వెచ్చని కుంపటి
చక్కని పడక సిద్ధం చేసాను
ఇంటికి, పొదరింటికి రా

నువు నిద్రించి లేచేసరికి
ఉదయమైపోతుంది
నీకో చక్కని తోటని చూపిస్తా

అందరూ ఉన్నారిక్కడ
మేమంతా నీకై ఎదురుచూస్తున్నాం
నీకోసం కొంత స్థలం తయారుగా ఉంచాము

వస్తున్నావా మరి
అయితే.. రా
నా చేయి పట్టుకో!

***

2. కలగలుపు

~

ఈ రోజు రేపు అవుతుంది
వర్తమానం గతం అవుతుంది
ఏదీ లేదు,ప్రతిదీ ఉంటుంది.
ఆది లేదు, అంతమూ లేదు.
పడిపోవడానికి లోతు లేదు, పైకి ఎత్తడానికి ఏమీ లేదు.
ఈ క్షణం మాత్రమే ఉంది,
మిణుకుమిణుకుమనే ఈ కాంతి దేన్నీ వెలిగించదు, కానీ ఓహ్!
ఎంతో ప్రకాశవంతమైన ,
అంతరిక్షంలో రెపరెపలాడే అగ్నికణం
ఒక క్షణపు అనుగ్రహం యొక్క శాశ్వతత్వాన్ని వినియోగిస్తుంది.
ఎందుకంటే
ఈ రోజు రేపు వర్తమానం గతం అంటూ ఏదీ లేదు
అయినా సరే
ప్రతిదీ నిలిచి ఉంటుంది!

***

3. అమ్మ

~

ఆమె పసి గొంతు బిగ్గరగా
మరెంతో స్వేఛ్చగా ఉంటుంది
ఆమె అలవి మాలిన
ఆనందంతోను
కొన్నిసార్లు కోపంతోను
ఆసక్తి ఉత్సాహంతోను అరుస్తుంటుంది

అంతగా శబ్దం చెయ్యడం నాకిష్టం ఉండదు గానీ
నేను చేసేటప్పుడూ అలాగే చేసి ఉంటాను
బహుశ
పుట్టుకతో వచ్చి ఉంటుందది!!

~

మూలం: జేన్ రాబర్ట్స్

తెలుగు సేత: హిమజ


డోరతీ జేన్ రాబర్ట్స్ ఒక అమెరికన్ రచయిత్రి, కవయిత్రి, ఆమె మానసికంగా తనను తాను ‘సేథ్’ అని పిలిచే వ్యక్తిని నడిపించే ఆత్మ మాధ్యమమని పేర్కొన్నది. సేథ్ మెటీరియల్ అని పిలవబడే ఆమె సేథ్ గ్రంథాల ప్రచురణ, పారానార్మల్ దృగ్విషయాల ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా స్థిరపడింది.

 

జేన్ రాబర్ట్స్ న్యూయార్క్‌లోని అల్బానీలో జన్మించింది. న్యూయార్క్‌లోని సరాటోగా స్ప్రింగ్స్‌లో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు, డెల్మెర్ హబ్బెల్ రాబర్ట్స్ మేరీ బర్డో, ఆమె రెండు సంవత్సరాల వయస్సులో విడాకులు తీసుకున్నారు. జేన్ రాబర్ట్స్ తాత, జోసెఫ్ బర్డో, ఆమెతో లోతైన ఆధ్యాత్మిక గుర్తింపును పంచుకున్నారు. తరవాతి కాలంలో ఆమె ఆధ్యాత్మిక రచనలకు అది పునాది అయి ఉంటుంది. జేన్ రాబర్ట్స్ తన 55 యేళ్ళ వయసులో మరణించింది.

Exit mobile version