[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. రాబర్ట్ హేడెన్ రాసిన Those Winter Sundays; Ice Storm అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]
~
1. ఆ చలికాలపు ఆదివారాలు
~
ఆదివారాలు కూడా మా నాన్న
పొద్దు పొద్దున్నే నిదుర లేచేవాడు
నీలి నలుపు తెల తెలవారు ఝామునే
వణికించే చలిలో లేచి ఉన్ని దుస్తులు ధరించే వాడు
వారం రోజుల అవిరామ శ్రమతో
పగుళ్ళు బారి నొప్పి పెట్టే చేతులతో
వెచ్చదనం కోసం నిప్పు రాజేసేవాడు
నేనెప్పుడూ కృతజ్ఞతలు చెప్పలేదాయనకి
నెమ్మదిగా లేచి
చలి శకలాలుగా విచ్ఛిన్నమవడాన్ని
చూస్తుండేవాడిని నేను
గదులన్నీ వెచ్చబడ్డాక
నాన్న నన్ను పిలిచేవాడు
ఆ ఇంటిలోని సుదీర్ఘ కోపతాపాలకు భయపడిపోయి
వెంటనే లేచి బట్టలు వేసుకునేవాడిని
వణికించే శీతగాలుల్లో ఇంటి బయటకు వెళ్ళి
నాకున్న మంచి బూట్లకు పాలిష్ చేసిన నాన్నతో
ఉదాసీనంగా మాట్లాడుతున్నానిపుడు
నాకేం తెలుసు.. నాకేం తెలుసని
ప్రేమ ఎంత కఠినమైనదని
ఒంటరితనాల ప్రేమ గురించి
నిజానికి నాకు ఏమి తెలుసని..
ప్రేమలో దాగిఉన్న బాధ్యత గురించి
నిరపేక్షంగా సేవ చేయడం గురించి
అసలు నాకేం తెలుసని..!!!
***
2. మంచు తుఫాను
~
నిదుర రాదు, ప్రార్థన చేయలేను
డిసెంబర్ తుఫాను మంచుతో కప్పబడిన
మూన్‌స్ట్రక్ చెట్లను చూస్తూ
కిటికీ దగ్గర నిలబడి ఉన్నాను.
మాపుల్ వృక్షమూ, పర్వత ధూళి
పారదర్శకమైన మంచు బరువు కింద వంగి ఉన్నాయి
వాటి పగిలిన కొమ్మలు ఘనీభవించిన
మంచు శిఖరాల మీద పడుతున్నాయి.
చెట్లయితే గత శీతాకాలంలో వలె
వాటి భారాన్ని తట్టుకోగలవు.. మరి నేను..??
నా దైవమా.. ఇంతటి వైపరీత్యాన్ని
నేనెలా భరించగలను..
ప్రకృతి పైనున్న దయ నాపై లేదా నీకు..??
~
మూలం: రాబర్ట్ హేడెన్
తెలుగు సేత: హిమజ
1960ల నాటి బ్లాక్ ఆర్ట్స్ ఉద్యమపు పెరుగుదల, ఆఫ్రో-అమెరికన్ కళాకారుల యవ్వన యుగంలో రాజకీయంగా, భావోద్రేకంతో కూడిన నిరసన కవిత్వం నల్లజాతి ప్రేక్షకులకు విపరీతంగా సమన్వయం చేయబడినప్పుడు, కవిత్వం చేసే పని అతను తనను తాను వర్ణించుకున్న విధానం వల్ల హేడెన్ తత్వశాస్త్రవేత్తగా ఒక రచయితగా స్థిరపడ్డారు.
కవిత్వం ప్రాపంచిక విషయాలతో పాటు, సామాజిక అన్యాయంతో సహా మానవజాతి పంచుకునే సకల అసమానతలను పరిష్కరించాలి అనే ధోరణిలోనే హేడెన్ సాహితీ ప్రయాణం కొనసాగింది.
ఇతని కవిత్వం తరచుగా ఆఫ్రికన్ అమెరికన్ల దుస్థితిని ప్రస్తావించింది, సాధారణంగా అతను ‘హార్ట్-షేప్ ఇన్ ది డస్ట్’ కవితలో చేసినట్లుగా, ప్యారడైజ్ వ్యాలీ స్లమ్‌లోని అతని పూర్వ నివాసాన్ని నేపథ్యంగా ఉపయోగించాడు. తన సాహిత్యంలో ఆఫ్రికన్ మాతృభాషని జానపద ప్రసంగాన్ని ఉపయోగించాడు. రాబర్ట్ హేడెన్ వియత్నాం యుద్ధంపై ఒక సీక్వెన్స్‌తో సహా రాజకీయ కవిత్వాన్ని కూడా రాశాడు.