Site icon Sanchika

రేపు తెలవారుఝామున

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. విక్టర్ హ్యూగో రాసిన Tomorrow At Dawn అనే కవితకి స్వేచ్ఛానువాదం.]

[ప్రమాదంలో మరణించిన కూతురి స్మృతిలో ఈ కవిత హ్యూగో రాసారని అంటారు.]

~

[dropcap]రే[/dropcap]పటి వేకువ ఝామున
పల్లెలు తెలతెలవారుతున్న
తెలిమంచు వేళలో
నేను బయల్దేరతాను
నాకు తెలుసు
మీరంతా నా రాక కోసం వేచి ఉంటారని

చిక్కటి అడవుల్లోంచి
పర్వతాలను
కొండ కోనలను దాటి వెళ్తుంటాను నేను
మీనుంచి ఎక్కువకాలం
దూరంగా ఉండలేను నేను

నా మనస్సులోని ఆలోచనల పైనే
దృష్టి కేంద్రీకరించి నడుస్తాన్నేను
బయటి దృశ్యాలేవీ నా కంటబడనీయను
ఎటువంటి ధ్వనులూ వినరావు నాకు
ఒక్కడినే, ఒంటరిగా
తెలియని దారుల్లో సాగిపోతాను
నా వెన్ను వంపు తిరిగి
నా చేతులు వంకర్లు పొయ్యి
బాధగా విచారంగా
నా వరకు నాకు
రాత్రింబవళ్ళు ఒకేలా ఉన్నాయి

సాయం సంధ్యా సమయపు
లేత బంగారు వర్ణాలు
నా దృష్టినాకర్షించవు
సుదూరాన హర్ఫ్ల్యూర్ వైపు
సాగిపోయే నౌకల వైపు చూపులూ సారించను

నేను తిరిగి రాగానే
అడవి పొదల్లోంచి తీసుకొచ్చిన
ఆకుపచ్చని హోలీ పూలగుచ్ఛాన్ని
నీ సమాధి పైన ఉంచుతాను!!

~

మూలం: విక్టర్ హ్యూగో

తెలుగు సేత: హిమజ


ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత, కవి, చిత్రకారుడు రాజనీతివేత్త విక్టర్ హ్యూగో (1802-1885) అత్యంత ప్రసిద్ధ రచనలు ది హంచ్‌బ్యాక్ ఆఫ్ నోట్రే-డేమ్ (1831) మరియు లెస్ మిజరబుల్స్ (1862) నవలలు. ఫ్రాన్స్‌లో, హ్యూగో లెస్ కాంటెంప్లేషన్స్ (ది కాంటెంప్లేషన్స్) మరియు లా లెజెండ్ డెస్ సియెకిల్స్ (ది లెజెండ్ ఆఫ్ ది ఏజెస్) వంటి కవితా సంకలనాలకు ప్రసిద్ధి చెందాడు.

హ్యూగో  తన జీవితకాలంలో 4,000 కంటే ఎక్కువ చిత్రాలను రూపొందించాడు. మరణశిక్ష ఇంకా బానిసత్వాన్ని రద్దు చేయడం వంటి సామాజిక కారణాల కోసం ప్రచారం చేశాడు.

విక్టర్ హ్యూగో యుక్తవయస్సులో నిబద్ధతతో కూడిన రాజనీతిజ్ఞుడు అయినప్పటికీ, దశాబ్దాలు గడిచేకొద్దీ హ్యూగో యొక్క అభిప్రాయాలు మారాయి మరియు అతను రిపబ్లికనిజం యొక్క ఉద్వేగభరితమైన మద్దతుదారు అయ్యాడు, రాజకీయాల్లో డిప్యూటీ మరియు సెనేటర్‌గా పనిచేశాడు. అతని పని చాలా రాజకీయ మరియు సామాజిక సమస్యలను మరియు అతని కాలంలోని కళాత్మక పోకడలను తాకింది. నిరంకుశత్వానికి అతని వ్యతిరేకత మరియు అతని సాహిత్య స్థాయి అతన్ని జాతీయ హీరోగా స్థాపించింది. హ్యూగో 22 మే 1885న 83 సంవత్సరాల వయస్సులో మరణించాడు. పారిస్‌లోని పాంథియోన్‌లో అతనికి ప్రభుత్వ అంత్యక్రియలు జరిగాయి, దీనికి 2 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు.

Exit mobile version