విలియం బ్లేక్ మూడు కవితలు

0
2

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. విలియం బ్లేక్ రాసిన What is poetry; Never seek, to tell thy love; A Poison Tree అనే మూడు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1.కవిత్వం అంటే..

~

కవిత్వం అంటే ఏమిటి
ఇసుక రేణువులో
ఈ ప్రపంచాన్ని చూడగలగడం
ఓ అడవిపువ్వులో
స్వర్గాన్ని చూడగలగడం

నీ అరచేతుల దోసిలిలో
అనంతాన్ని పట్టుకోగలగడం

ఒక గంటలో శాశ్వతత్వాన్ని పొందగలగడం!!

***

2. నీ ప్రేమనెపుడూ చెప్పకు

~

నీ ప్రేమను తెలపాలని ఎప్పుడూ అనుకోకు
ఎప్పటికీ చెప్పని ప్రేమ ఒకటి ఉంటుంది
మృదువైన గాలిలా
నిశ్శబ్దంగా అదృశ్యంగా కదులుతుంటుంది

నేను నా ప్రేమ గురించి చెప్పాను
నా ప్రేమను చెప్పాను
ఆమెకు నా హృదయాన్నంతా విప్పి చెప్పాను
వణుకు,చలి, భయంకరమైన భయంతో
ఆహ్హ్..
ఆమె వెళ్ళిపోయింది దూరంగా

ఆమె నానుంచి దూరంగా
వెళ్ళిపోయిన వెంటనే
నిశ్శబ్దంగా, అదృశ్యంగా
ఓ ప్రయాణీకుడు
ఒక నిట్టూర్పుతో
ఆమెని తీసుకెళ్ళిపోయాడు!!

***

బ్లేక్ చిత్రించిన చిత్రపటం

3. విషవృక్షం

~

నా స్నేహితుడిపై కోపంగా ఉంది
అతడికి నా కోపాన్ని చెప్పాను
అంతటితో నా కోపం చల్లారింది

నా శత్రువుపై కోపంగా ఉంది
అతనికేమీ చెప్పలేదు
నా కోపం పెరుగుతూ పోయింది

ఆ కోపానికి నేను భయంతో
పొద్దున్న సాయంత్రం
నా కన్నీటితో నీరు పెట్టాను
నా చిరునవ్వుతో, మృదువైన
మోసపూరిత కుయుక్తులతో
కోపం సూర్యబింబంలా పెరిగిపోయింది

ఎర్రని యాపిల్ కాయవంటి ప్రకాశంతో
నా కోపం రాత్రింబవళ్ళు పెరుగుతూపోయింది
ఆ వెలుగు నా శత్రువు చూడనే చూసాడు
అది నా కోపమేనని అతడికి తెలిసిపోయింది
అంతే..
రాత్రి స్తంభానికి చీకటి ముసుగేసినపుడు
అది నా తోటనుంచి దొంగిలించబడింది

ఉదయాన్నే కింద విస్తరించి ఉన్న
నా శత్రువును చూడడంతోనే
సంబరపడిపోయాను నేను!!

~

మూలం: విలియం బ్లేక్

తెలుగు సేత: హిమజ


విలియం బ్లేక్ (1757-1827) ఆంగ్ల కవి, చిత్రకారుడు, ముద్రణ కర్త. తన జీవితకాలంలో పెద్దగా గుర్తించబడలేదని తెలుస్తుంది.

బ్లేక్ విలక్షణమైన ధృక్కోణాల వలన సమకాలీనులు పిచ్చివాడిగా పరిగణించినప్పటికీ, అతడి తాత్విక, ఆధ్యాత్మిక అంతర్ప్రవాహాల వలన తర్వాతి కాలంలో పాఠకులతో ఎంతగానో గౌరవింపబడ్డాడు. కవిత్వం, దృశ్యకళ చరిత్రలో ఒక ప్రధాన వ్యక్తిగా గుర్తించబడ్డాడు.

జీవిత చరమాంకంలో లండన్ లో నివసించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here