Site icon Sanchika

మేరీ ఆలివర్ రెండు కవితలు

[‘పొయెట్స్ టుగెదర్’ భిన్న కవుల విభిన్న కవిత్వం – అనే సీరిస్‍లో దేశదేశాల కవుల కవితల అనువాదాన్ని అందిస్తున్నారు హిమజ. మేరీ ఆలివర్ రాసిన I worried; A Pretty Song అనే రెండు కవితలకి స్వేచ్ఛానువాదం.]

~

1. నా చింతన

~

నేను అదే పనిగా చింతించాను.
ఉద్యానవనం పెరుగుతుందా,
నదులు సరైన దిశలో ప్రవహిస్తాయా,
భూమి నేను చదువుకున్నట్టే గుండ్రంగా తిరుగుతుందా,
లేకపోతే ఎలా సరిదిద్దాలి?

నేను చేసింది సరైనదేనా,
నేనేమైనా తప్పు చేశానా,
నేను క్షమించబడతానా,
నేను ఇంకా బాగా చేయగలనా?
నేను ఎప్పుడైనా పాడగలనా,
పిచ్చుకలు కూడా పాడుతున్నాయి
నేను పాడలేనా.. ఆ ఆశే లేదా

నేను మాత్రమే నిస్సహాయంగా ఉన్నానా
నా కంటిచూపు మసకబారుతుందా
లేక నేను ఊహల్లో ఉన్నానా,
నాకు వాత సంబంధిత జబ్బులేమైనా వస్తాయా
డిమెన్షియా వంటి మతిమరుపేదైనా వస్తుందా?

చివరకు..
ఆలోచించి ఫలితం లేదని నేను తెలుసుకున్నాను
అంతే,దానిని, అదే ఆ చింతని వదులుకున్నాను .
నా పాత శరీరంతో దోస్తీ మొదలెట్టాను
పొద్దున్నే లేచి అలా బయటకు వెళ్ళి
చక్కగా పాటలు పాడుకున్నాను!!

***

2. అందమైన పాట

~

నిన్ను ప్రేమించడం వల్ల వచ్చే చిక్కుల నుండి
ముగింపు లేదు, తిరిగి వచ్చేదేమీ లేదని
నాకనిపిస్తుంటుంది
సమాధానం లేదు, అందులోంచి బయట పడేదీ లేదు.
ప్రేమించే ఏకైక మార్గం ఏది, ఇది కాదా?
ఇదేమి ఆట స్థలం కాదు, ఇది భూమి,
కొంతకాలమైనా మా స్వర్గం

అందువల్లే నా ప్రపంచం మధ్యలో
మిమ్మల్ని పట్టి ఉంచే నా ఆకస్మిక, నీరసమైన,
చీకటి మానసిక స్థితికి నేను ప్రాధాన్యత ఇచ్చాను.
ఇంకా నా శరీరానికిలా చెప్తున్నాను:
ఇంకా సన్నగా ఎదగమని
నేను నా వేళ్లతో చెప్పానిలా
నాకో అందమైన పాటను రాసివ్వమని
నా హృదయంతో చెప్తున్నా
ఆనందంతో విరుచుకుపడమని!!

~

మూలం: మేరీ ఆలివర్
తెలుగు సేత: హిమజ


Mary Jane Oliver (1935-2019) అమెరికన్ కవయిత్రి. నేషనల్ బుక్ అవార్డ్ ఇంకా పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్న ఒక అమెరికన్ కవి. ఆమె ప్రకృతి నుంచి తన పనికి స్ఫూర్తిని పొందింది. అడవిలో ఒంటరిగా నడవడం జీవితాంతం అలవాటు చేసుకుంది.

 

ఆమె కవిత్వం చిత్తశుద్ధితో కూడిన అద్భుతం. పర్యావరణంతో గాఢమైన అనుబంధం, అలంకారాలు లేని భాష మరియు సరళమైన ఇంకా అద్భుతమైన చిత్రాలతో తన కవిత్వాన్ని అందించింది. 2007లో, ఆమె దేశంలో అత్యధికంగా అమ్ముడైన కవయిత్రిగా ప్రకటించబడింది.

Exit mobile version