[box type=’note’ fontsize=’16’] డబ్బుల సంపాదన కోసం పెడుతున్న పరుగులో జనాలు జారవిడుచుకున్న అపురూపమైన నిధి ఏమిటో వివరిస్తున్నారు సలీం “పోగొట్టుకున్న పెన్నిధి” అనే కల్పికలో. [/box]
[dropcap style=”circle”]ఉ[/dropcap]దయం తొమ్మిది గంటలు.. పాలిథిన్ బ్యాగ్‌లో చుట్టి ఉన్న లంచ్ బాక్స్‌ని ఎడం చేతిలో పట్టుకుని ఫర్లాంగు దూరంలో ఉన్న బస్టాప్ వైపుకు నడుస్తున్నా. నేను రోడ్డుకి ఎడం వైపునే ఉన్నా. అనూహ్యంగా నా ఎడం వైపున్న సూదిబెజ్జం అంత సందులోంచి ఓ స్కూటర్ వాలా సర్రున దూసుకు పోయాడు. నేను కంగా రు పడి కుడివైపుకి గెంతాను. చేతిలో ఉన్న లంచ్ బాక్స్ శబ్దం చేస్తూ కిందపడి కొద్ది దూరం దొర్లి ఆగిపోయింది. స్కూటర్ నడుపుతున్న కుర్రవాడు పది గజాల దూరంలో స్కూటర్ ఆపి వెనక్కి తిరిగి నా వైపు కోపంగా చూశాడు. తన స్కూటర్‌కి కుడివైపున దెబ్బ తగిలిందేమోనని కళ్ళతో తడిమి చూసుకుని మళ్ళా వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ “రోడ్డుమీద నడవడం రాదా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా?” అనేసి వేగంగా ముందుకెళ్ళిపోయాడు. .
కొన్ని క్షణాలవరకూ నేనా షాక్ లోంచి తేరుకోలేకపోయాను. కనికరం కూడా లేకుండా దూసుకెళ్తున్న వాహనాల్ని తప్పించుకుంటూ కిందపడి ఉన్న లంచ్ బాక్స్‌ని అందుకున్నాను. మూత వూడిపోయి, పప్పన్నం పాలిథీన్ బ్యాగ్‌లో కొంత వొలికిపోయింది. బాక్స్ మూతని గట్టిగా బిగించి మళ్ళా నడక సాగించాను. ఆ కుర్రాడి దాష్టీకం గుర్తొచ్చింది. తప్పు తను చేసి పైపెచ్చు నన్ను దబాయిస్తున్నాడు. మనుషుల్లో ఎంత దుర్మార్గం పెరిగిపోయిందో.. ఐనా అంత తొందరెందుకు? మెల్లగా వెళ్ళొచ్చు కదా. ఏం కొంపలు మునిగి పోయాయనో ఆ పరుగు? అస్థిమితం.. మనసు ప్రశాంతంగా ఉంటేగా నింపాదిగా పనులు చేయడానికి…
బస్ ఎక్కాను. ఆఫీస్ సమయం కావడం వల్ల చాలా రద్దీగా ఉంది. వూపిరాడనంతగా మనుషులు క్రిక్కిరిసి ఉన్నారు. నా ముందు ఓ భారీకాయుడు తన సగం పాదం నా కాలిమీద మోపి నిలబడ్డాడు. నొప్పితో ప్రాణం గిలార్చుకుపోయింది. “మాస్టారూ … నా కాలు తొక్కేస్తున్నారు” అంటూ నా కాలిని బలంగా వెనక్కి లాక్కునే ప్రయత్నం చేశాను. అతను కోపంగా నా వైపు చూశాడు. “ఇంత ఇరుకులో బస్సెక్కకపోతే ఏమైంది? పావుగంట ఆగితే మరో బస్ వస్తుందిగా. ఇక్కడ కాళ్ళు పెట్టుకోడానికే స్థలం లేదు. తొక్కకుండా నీ పాదాల్ని నెత్తిమీద పెట్టుకోమంటావా?” అంటూ కసిరాడు.
భారీకాయుడు కదా… భయమేసింది. మాటకు మాట జవాబిస్తే చొక్కాపట్టుకుని బస్ కిటికీలోంచి బైటికి విసిరేసేలా ఉన్నాడు. నేను ఎక్కాక కదా ఇతనెక్కింది? ఇంత ఇరుకులో బస్సెక్కానని నన్ను దబాయిస్తాడేమిటి? ఎందుకంత కోపం? ఆ చెప్పేదేదో మెల్లగా చెప్పొచ్చుగా. తన స్టాప్‌లో దిగిపోయేవరకు నన్నో శత్రువులా ఉరిమి చూస్తూనే ఉన్నాడు. కుమ్మబోయే ముందు ఎద్దులా బుసలు కొడ్తూనే ఉన్నాడు. ఇంత చిన్న విషయానికే నేను ఆగర్భ శత్రువునైనట్టు… చూపుల్ని పదునైన కత్తుల్లా చేసి, గాయపరుస్తూనే ఉన్నాడు. దిగే ముందు కూడా నా వైపు ‘చంపేస్తానొరేయ్’ అనేలా చూసి మరీ దిగాడు. గమ్యం చేరేలోపల ఎన్ని మరణభయాల్ని జయించాలో మనిషి..
ఆఫీస్‌లో అడుగు పెట్టడం ఆలస్యం నిన్న మిగిలిపోయిన ఫైళ్ళని ముందరేసుకుని కూచున్నాను. పదకొండింటికి బాస్ పిలిచాడు.
“నిన్న అప్పగించిన పని పూర్తయిందా?” మొహాన్ని తుమ్మల్లో పొద్దుగూకేలా పెట్టుకుని అడిగాడు.
“లేదు సార్. ఇంకా సగం ఫైళ్ళు మిగిలిపోయాయి” అన్నాను.
“మీకు చెప్పానా అర్జంటని.. రేపే కమీషనర్ గారితో రివ్యూ ఉందని తెల్సి కూడా ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారు? జీతం తీసుకుంటున్నందుకు పని చేయాలన్న ఇంగితం లేకపోతే ఎలా?” మండిపోతున్నాడు. మాటల్ని నిప్పుకణికల్లా విసుర్తున్నాడు. బాస్ అయినంత మాత్రాన నోటికొచ్చినట్టు తిట్టొచ్చన్న అధికారం ఎవరిచ్చారో వీళ్ళకి?
“పాతిక ఫైళ్ళు సార్… ఆడిట్ వాళ్ళు రాసిన అబ్జెక్షన్ చదివి, అర్థం చేసుకుని, దానికి జవాబు తయారుచేయడానికి చాలా సమయం పడుంది సార్. నిన్న రాత్రి ఏడు వరకు పని చేసి పదమూడు ఫైళ్ళు క్లియర్ చేశాను. మరో పన్నెండు ఈ రోజు పూర్తి చేస్తాను” వినయంగా సమాధానమిచ్చాను.
“అదెంత పనండీ.. నేనయితే గంటలో పూర్తిచేయగలను. మీకెందుకు రెండు రోజులు పడ్తోంది? పని మీద శ్రద్ధ ఉంటేగా… పని సక్రమంగా చేయడంతోటే సరిపోదు మిస్టర్… వేగంగా కూడా చేయాలి. ఇప్పటి అవసరం రోజుకి పది పనులు చక్కబెట్టేవాడు. మీలా ఒక పనిని పదిరోజులు చేసేవాడు కాదు. ఎప్పుడు నేర్చుకుంటారు? తొందరగా వెళ్ళండి. గంటలో ఫైళ్ళన్నీ నా టేబుల్ మీద ఉండాలి” కోపంతో అరిచేటప్పుడు మనుషులెంత అసహ్యంగా కన్పిస్తారో ఎవరైనా వాళ్ళెదురుగా పెద్ద అద్దం పెట్టి చూపిస్తే బావుండు.
“గంటలోనా?” ఆశ్చర్యంగా అతని వైపు చూస్తూ అన్నాను.
“యస్.. నేను చెప్పిందదే. గంటలోనే… గో” అన్నాడు బిచ్చగాడ్ని విదిలించినట్టు చేత్తో విదిలిస్తూ… మొహం ఎంత వికృతంగా ఉందో..
నా సీట్లోకొచ్చి కూచున్నాను. ఆ చెప్పేదేదో మెల్లగా చెప్పొచ్చుగా. మొహాన్ని నిప్పుల్లో కాలుతున్న తాటికాయలా మాడ్చుకుని చెప్పాలా? రెండు రోజులు పట్టేపనిని ఈయనైతే గంటలో చేసేవాడట. ఎంత అహంకారమో… గంట వద్దు రెండు రోజుల్లో పూర్తి చేయమను, నా పేరు మార్చుకుంటాను. రేపు కదా రివ్యూ… ఎందుకంత తొందర… ఎందుకీ ఆరాటం… నలభై యేళ్ళకే గుండెనొప్పులు రావా మరి.. యుద్ధభూమిలో ఉన్నట్టు, ఏ క్షణంలో ఎవరు కత్తి విసుర్తారో అనేలా భయపడ్తూ, ఎవరో తుపాకీ ఎక్కుపెట్టి కాల్చడానికి వెంటపడితే ప్రాణాలు కాపాడుకోడానికి పిక్కబలం కొద్దీ పరుగెత్తుతున్నట్టు… ఎందుకిలా పని చేస్తారు? ఆఫీసని రణక్షేత్రం ఎందుకనుకుంటారు? నవ్వుతూ కూడా పనులు చేయవచ్చన్న విషయం, మృదువుగా చెప్పి పనులు చేయించుకోవచ్చన్న విషయం వీళ్ళకెప్పుడు అర్థమౌతుందో….
దేన్నో ఎక్కడో పోగొట్టుకుని, అదేమిటో మర్చిపోయి, మరి దేనికోసమో ఎక్కడో ఆరాటంగా వెతుక్కుంటున్న మనుషులు.. పక్కన పరుగెత్తుతున్న వాణ్ణి తోసేసి, కాళ్ళకిందేసి తొక్కేసి… దేనికోసం పరుగు పెడుతున్నారో తెలుసా వీళ్ళకి? జీవితాన్ని ఆస్వాదించడానికి అది అవసరమో కాదో అనే ఆలోచన ఏమైనా ఉందా? ఐనా పిచ్చి పట్టినట్టు పరుగెత్తుతున్న వీళ్ళకి జీవితం గురించి ఆలోచించేంత తీరిక కూడా ఉందా? వీళ్ళు దేనికోసం వెంపర్లాడుతున్నారో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సుఖంగా బతకడానికి అవసరమైన వస్తుసముదాయాన్ని వీలైనంత తక్కువ సమయంలో సమకూర్చుకోవాలన్న ఆరాటం… అందుకవసరమైన డబ్బులు స్వంతం చేసుకోవాలన్న ఆతురత.. ఇంతకూ వీళ్ళు పోగొట్టుకున్నదేదో అర్థం కావడం లేదు. మౌలికమైనదేన్నో కోల్పోయారు. ఆలోచిస్తూనే మధ్యాహ్నం ఒంటిగంటకి పాలిథీన్ బ్యాగ్‌లో ఒలికిపోగా మిగిలిన అన్నంతో లంచ్ అయిందనిపించాను.
బ్యాంకుకెళ్ళాల్సిన పని గుర్తుకొచ్చింది. దాంతోపాటే నాన్న అడిగిన పుస్తకాల్ని రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ చేయాల్సిన పని కూడా. నాన్నకు సాహిత్యం అంటే మక్కువ ఎక్కువ. నాకూ కథలూ నవలలూ చదవడం ఇష్టం. నేను చదివాక బాగున్నవనుకున్న పుస్తకాల్ని నాన్నకు పంపిస్తుంటాను. గత పక్షం రోజుల్లో చదివిన మూడు నవలలు, ఓ కథా సంపుటి రిజిస్టర్డ్ బుక్ పోస్ట్‌కు సరిపోయేలా నిన్ననే ప్యాక్ చేసి ఆఫీస్‌కు తెచ్చుకున్నాను. పని వత్తిడి వల్ల నిన్న పోస్టాఫీస్ కెళ్ళటం కుదర్లేదు.
ఆఫీసర్ గదిలోకెళ్ళి “ఓ అరగంట పర్మిషన్ కావాలి సార్. బ్యాంక్‌లో పని ఉంది” అన్నాను.
ఆడిట్ అబ్జెక్షన్లకి నేను రాసిచ్చిన సమాధానాలు చదువుతున్న బాస్ తలయెత్తి చిరాగ్గా చూశాడు. మొహం ముటముటలాడించుకుంటూ “సరే. తొందరగా రండి. చాలా పన్లున్నాయి” అన్నాడు. దానికి మూలశంకతో బాధపడేవాడు ముళ్ళకంప మీద కూచున్నట్టు మొహం పెట్టటం అవసరమా? బాస్ అనే భావన లేకుండా ఉద్యోగాలుంటే ఎంత బావుంటుందో… ఎవరికి నిర్దేశించిన పని వాళ్ళు చేసుకుంటూ పోతే సరిపోదా? కొంతమందికి అధికారాలెందుకు కట్టబెడారో? అధికారం చేతిలో ఉండటం వల్లేగా అహంకారాలూ, ఆధిపత్య ధోరణి, కక్ష సాధింపు చర్యలు, ‘నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను చూడు’లాంటి బెదిరింపులు… వగైరా వగైరా.
మొదట పోస్టాఫీస్ కెళ్ళాను. చేతిలో ఉన్న పుస్తకాల కట్టవైపు చూస్తూ ‘ఏం కావాలి’ అన్నట్టు చూసింది లేడీ క్లర్క్. “విజయవాడకి రిజిస్టర్డ్ బుక్ పోస్ట్ చేయాలండీ” అన్నాను.
“ఇక్కడ చేయరు. మీరు జీపీవోకెళ్ళండి” అంది విసుగ్గా మొహం పెట్టి.
“అదేమిటి? ఏ పోస్టాఫీస్‌లో అయినా చేయవచ్చు కదా. చుట్టుపక్కల ప్రజలకు అందుబాటులో ఉండాలనే కదా ఈ బ్రాంచీ పెట్టారు. అందర్నీ జీపీవోకి వెళ్ళమంటే ఎలా కుదుర్తుంది?” అన్నాను.
ఆ బ్రాంచిలో ఇద్దరు ఆడ క్లర్కులు, ఓ మగ క్లర్కుతో పాటు గోడవైపు తిరిగి పని చేసుకుంటున్న యాభై యేళ్ళు పైబడిన వ్యక్తి కూడా ఉన్నాడు. బహుశా అతనే పోస్ట్ మాస్టర్ అనుకుంటా.
“మేము బుక్ పోస్టులు తీసుకోమండి” అంది పక్కనున్న కౌంటర్లో కూచున్న మరొకావిడ. “నేను పియంజికి కంప్లయింట్ చేస్తాను” అన్నాను.
‘మీ ఇష్టం’ అందామె నిర్లిప్తంగా.
అందరూ ఖాళీగా కూచుని ఉన్నారు. పనేమీ లేదు. “బుక్ పోస్టులు బరువుంటాయి కదా.. వాటిని ఎవరు మోసుకెళ్తారు?” అటు తిరిగి ఏదో రాసుకుంటున్న వ్యక్తి ఇటు తిరిగి అని మళ్ళా తల గోడవైపుకు తిప్పుకున్నాడు.
అప్పుడే ఉత్తరాల్ని పోస్ట్ డబ్బాలో వేయడానికొచ్చిన వ్యక్తి నన్ను చూసి జాలిపడి ఉచిత సలహా ఒకటిచ్చాడు. “పక్కనే కొరియర్ సర్వీస్ ఆఫీసుందిగా మాష్టారూ. అక్కడికెళ్ళండి” అన్నాడు.
కొరియర్ సర్వీస్ వాళ్ళ వ్యాపారం పుంజుకోడానికి కారణమేమిటో అర్థమైంది. పోస్టాఫీసులోని ఉద్యోగుల మొహాల వైపు చూశాను. ఏదో నిరాశ… నిస్పృహ… విలువైన దేన్నో కోల్పోయినట్టు… ఉదాసీనంగా… ఎందుకలా ఉంటారు? మంచి జీతాలే వస్తున్నాయిగా… మొహాలు ఎందుకు కళకళలాడటం లేదు?
బ్యాంకుకెళ్ళాను. పెద్ద క్యూ ఉంది. ఓపిగ్గా నిలబడ్డాను. నా వంతు వచ్చాక పాస్ బుక్‌తో పాటు విత్‌డ్రాయల్ ఫాం అతని ముందుంచాను. ధుమధుమలాడూ వాటిని అందుకుని ‘ఎందుకొచ్చిన తద్దినం ఇది’ అన్నట్టు చూశాడు. అదే నిస్పృహ… అదే నిరాసక్తత… ఏమైంది వీళ్ళందరికి? ఖరీదైన బట్టలు వేసుకుని ఏసీ గదుల్లో ఖరీదైన కుర్చీల్లో కూచుని పని చేసే వీళ్ళ మొహాలు ఎందుకు కళ తప్పాయి?
సాయంత్రం మళ్ళా బస్‌లో కూచుని ఇంటికి తిరిగివెళ్తున్నప్పుడు కూడా దీని గురించే ఆలోచించాను.
ఇంటికెళ్ళగానే రెండేళ్ళ మా పాప నవ్వుతూ “నాన్నొచ్చాడు” అంటూ ముద్దుముద్దుగా పలుకుతూ పరుగెత్తుకుంటూ వచ్చింది. దాని అందమైన మొహంలో మరింత అందంగా విరిసిన నవ్వు… మంచు బిందువుల్లో తడిసిన ముద్ద మందారంలా… ఎంతందమైన నవ్వో… అమాయకమైన, నిష్కల్మషమైన నవ్వు… మనుషులు దేన్ని పోగొట్టుకున్నారో మా పాపను చూశాక అర్థమైంది. స్వచ్ఛమైన నవ్వుని పోగొట్టుకున్నారు. హాయిగా నవ్వటం మర్చిపోయి, డబ్బు వ్యామోహంలో పడి మొహాలనిండా అశాంతిని పులుముకుంటున్నారు… అసహనాన్ని ప్రదర్శిస్తున్నారు.
మనిషి నవ్వితేనేగా మొహంలో జీవకళ విరబూసేది… మనిషికి మాత్రమే దొరికిన అరుదైన వరం కదా నవ్వనేది… అందరూ హాయిగా నవ్వుతూ పలకరిస్తే… మందస్మిత వదనంతో బాధ్యతలు నిర్వర్తిస్తే ఎంత బావుంటుందో కదా… డబ్బుల సంపాదన కోసం పెడుతున్న పరుగులో వీళ్ళు జారవిడుచుకున్న అపురూపమైన నిధి నవ్వు అనే విషయం వీళ్ళకెప్పుడర్థమౌతుందో ఏమో…