Site icon Sanchika

తెలంగాణ మలితరం కథకులు – కథనరీతులు-6: ప్రేమ వెల్లువలో పోల్కంపల్లి శాంతాదేవి

[box type=’note’ fontsize=’16’] “ప్రేమ వెల్లువలో పోల్కంపల్లి శాంతాదేవి” అనే ఈ వ్యాసంలో పోల్కంపల్లి శాంతాదేవి తొలిదశలో రాసిన కథలను పరిచయం చేస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. తొలినాళ్ళలో కొంత ఆదర్శవాద ధోరణులు కనిపించినా, రాను రాను ఫక్తు ప్రేమ కథలను రకరకాల కోణాలలో రాయడానికే రచయిత్రి ఎక్కువగా ప్రయత్నించారని వివరిస్తున్నారు. [/box]

[dropcap]1[/dropcap]942లో మహబూబ్‌నగర్ జిల్లా, వనపర్తిలో సూగూరి హనుమంతరావు, సీతమ్మ దంపతులకు శాంతాదేవి జన్మించారు. పురిటి బిడ్డగా వున్నప్పుడే వీరి అక్క శ్రీమతి బాలకిష్టమ్మ, బావ వలిపె సంగీతరావు గార్లు ఆమెను తమ కూతురిగా స్వీకరించి పెంచి పెద్ద చేశారు. మెట్రిక్యులేషన్ వరకు చదివించి పెండ్లి కూడా చేశారు. వారి భర్త పోల్కంపల్లి సుదర్శనరావు గారు సాహిత్యాభిమానులే కాకుండా, గణితోపాధ్యాయులుగా పేరు గడించారు.

1962 నుంచే వీరు కథలు రాయటం ప్రారంభించారు. తొలిదశలో వీరి కథలను “ఆంధ్రప్రభ” లాంటి పెద్ద పత్రికలు తిప్పి పంపించినా, నిరుత్సాహపడకుండా వాటిని “ప్రజామత”కు పంపడం, అక్కడ అచ్చు కావడం జరిగేది. అలా వారి మొదటి నవల “పాణిగ్రహణం” కూడా ప్రజామత లోనే సీరియల్‌గా వచ్చింది. “ప్రజామత” ఇచ్చిన ప్రోత్సాహంతో శాంతాదేవి కథా-నవలా రచయిత్రిగా నిలదొక్కుకున్న తర్వాత అన్ని పత్రికలకు రాయడం ప్రారంభించారు. వీరు ఇప్పటిదాకా 70, 80 కథలు, అరవైకి పైగా నవలలు రాశారు. వివాహానికి పూర్వమే కలం పట్టి సూగూరి శాంతాదేవి పేరుతో రచనలు చేసి, వివాహానంతరం పోల్కంపల్లి శాంతాదేవిగా ప్రసిద్ధి చెందారు. వీరి రచనలలో కొన్ని బహుమతులనందుకున్నాయి కూడా. నవలలు కొన్ని కన్నడంలోకి అనువాదమయ్యాయి. వీరి నవల “చండీ ప్రియ” సినిమాగా కూడా విజయవంతమైంది. ‘పుష్యమి’ అనే నవల ‘ఆత్మబంధువు’ పేరుతో టీవీ సీరియల్‌గా ప్రసారమైంది. వీరి రచనలపై యూనివర్సిటీలలో పరిశోధనలు కూడా జరిగాయి. వీరు రచయిత్రిగానే కాకుండా “స్త్రీ చైతన్య స్రవంతి” అనే మహిళాభ్యుదయ సంస్థను స్థాపించి  సమాజ సేవ, సమావేశాలు నిర్వహించారు. దీని ద్వారా రచయిత్రుల సమావేశాలు, హరిజనవాడలో విద్యావ్యాప్తికి కృషి చేయడం, స్త్రీల సమస్యల నివారణాయత్నం, ఆకాశవాణి ద్వారా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేశారు.

వీరు 1962 నుంచి 1975 వరకు రాసిన కథలను అనగా తొలిదశలో రాసిన 17 కథలను ఇప్పుడు పరామర్శిద్దాం. వీరి కథలన్నీ ప్రేమ కథలే. ప్రేమించుకోవడాలు, విడిపోవడాలు, అపార్థాలు తొలగి కలిసిపోవడాలతో ముగుస్తాయి. బాల్యం నుంచి కలసి మెలసి ఉన్న “విశ్వేశ్వరి” పట్ల ప్రేమను పెంచుకున్న రామకృష్ణను – తల్లిదండ్రుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వర్గం ఒకటైనా శాఖ వేరని చెప్పి విశ్వేశ్వరి పెళ్ళికి తిరస్కరిస్తుంది. విశ్వేశ్వరి వివాహం బీద కృష్ణమాచారితో జరగడం, కొన్నాళ్ళకి అతను మరణించడంతో కొడుకును తీసుకుని ఆమె పుట్టింటికి వచ్చేస్తుంది. తల్లి చనిపోయి ఏకాకిగా మారిన రామకృష్ణ పెళ్ళి చేసుకోవడానికి తండ్రి విశ్వేశ్వరి సాయం కోరతాడు. ఆమె మాట తీసివేయలేక రామకృష్ణ మేనకోడలు మహాలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాడు. తర్వాతి కాలంలో విశ్వేశ్వరి కొడుకు మల్లిక్, రామకృష్ణ కూతురు సురేఖ బాల్యం నుంచి అన్యోన్యంగా ఉంటూనే ఎప్పుడూ కీచులాడుకుంటూ వుంటారు. సురేఖకు మంచి సంబంధం రాగా, అది వద్దని మల్లిక్‌ని పెళ్ళి చేసుకుంటానంటుంది. నమ్మకం లేకపోయినా రామకృష్ణ వచ్చి విశ్వేశ్వరిని పిల్లల పెళ్ళి జరిపించమని బతిమాలుతాడు. దానికి విశ్వేశ్వరి అంగీకరించగా, రామకృష్ణ ఆశ్చర్యపోతాడు. అప్పుడు విశ్వేశ్వరి అది కాలధర్మం అని, తాను తన తల్లిదండ్రుల మాటను గౌరవించాననీ, ఇప్పుడు పిల్లల క్షేమం కోసం తన అభిప్రాయాన్ని మార్చుకున్నానని తెలియజేస్తుంది.

ప్రతీక్ష” కథలో అందం, అణకువ కలిగిన శ్యామసుందరిని మోసం చేసి స్థిమితం లేని గోపినాథ్ కిచ్చి పెళ్ళి చేస్తారు. వాడు పెళ్ళయిన మర్నాడే దేశాలు పట్టిపోతాడు. వాడి కోసం నిరీక్షించడంలో 12 ఏళ్ళు గడిచిపోతాయి. 12 ఏళ్ళు దాటినా భర్త రాకపోతే ఆమె వైధవ్యం పాటించాలని కులపెద్దల శాసనం. దాంతో శ్యామసుందరి ఇల్లు విడిచి భర్తను వెతుక్కుంటూ పట్నం వచ్చి, విసిగిపోయి ప్రొఫెసర్ సౌమిత్రి కారు కిందపడి ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుంది. ఆమెని రక్షించిన సౌమిత్రి వాళ్ళింటికి తీసుకువెళతాడు. ఆమె దీనగాథ తెలిసినప్పటికీ, తన మేనకోడలితే పెళ్ళి సంబంధం స్థిరపడినప్పటికీ సౌమిత్రి, శ్యామసుందరి పట్ల తన ప్రేమను అణచుకోలేకపోతాడు. అంతలో బాబాగారి దగ్గర అస్వస్థుడిగా కనిపించిన భర్తను గుర్తించి శ్యామసుందరి అతడ్ని బాగుపరచి నిజం తెలియజేస్తుంది. రేవతి శ్యామసుందరి పట్ల ద్వేషాన్ని పెంచుకుని, మానసికంగా దెబ్బతిని చనిపోతుంది. శ్యామసుందరి భర్తతో వెళ్ళిపోతూ సౌమిత్రి దగ్గర సెలవు తీసుకుందామని వస్తే – నీ కోసం ఎప్పటికీ ఎదురుచూస్తునే ఉంటానంటాడు. భర్తతో వెళ్లిపోతూ ఎప్పటికైనా నీ దగ్గరికి వస్తానని ప్రమాణం చేయడం ఏమిటో అర్థం కాదు. కథ పేరు “ప్రతీక్ష” కాబట్టి అందరికీ మొదటి నుండి చివరిదాకా ఎదురుచూపులు తప్పలేదు.

పురిట్లోనే తల్లి చనిపోతే భానుమతిని చిన్నాన్న, చిన్నమ్మ తెచ్చి అపురూపంగా పెంచుతారు. కొంతకాలానికి గర్భవతైన చిన్నమ్మ కూడా పురిట్లోనే చనిపోతూ పసిగుడ్డు మైనా బాధ్యతను అప్పగిస్తుంది. వ్యాపారంలో దివాళా తీసిన మంచం పట్టిన చిన్నాన్న, చెల్లాయి మైనా సంరక్షణ బాధ్యత వహించి భానుమతి టీచరుగా పనిచేస్తుంటుంది. తనను ఎంతగానో ప్రేమించిన మేనబావ రాజారాం ప్రేమను తిరస్కరిస్తుంది. తన బాధ్యతలను అతడిపై కూడా వేసి వాళ్ళని బిచ్చగాళ్ళలా చేయలేనంటుంది. ఎవరు చెప్పినా, ఎంత చెప్పినా భానుమతి పెళ్ళికి ఒప్పుకోదు. కృతజ్ఞతాభారాన్ని తట్టుకోలేక చిన్నాన్న స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానిస్తాడు. అపోహలు, అపార్థాలు తొలగిపోయి భానుమతి, రాజారాం కలసిపోవడంతో “ఋణవిముక్తి” కథ ముగుస్తుంది.

డిగ్రీ పూర్తి చేసిన మదన్ పై చదువులు చదివే స్తోమత లేదని తెలిసి ఉద్యోగ ప్రయత్నంలో పడతాడు. తండ్రి స్నేహితుడైన రామమోహనరావు అనే కోటీశ్వరుడి సేవాసదనంలో ఉద్యోగంలో చేరుతాడు. అతని కుమార్తె అయిన రోహిన, మదన్ క్లాస్‌మేట్ కావడం, సేవాసదనం పట్ల మదన్ చూపే అంకితభావం వారికి నచ్చడంతో రోహిణిని మదన్‌కిచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు. భర్తను విడిచి సేవాసదనం చేరిన సుజాత పట్ల మదన్ చూపే శ్రద్ధను అపార్థం చేసుకున్న రోహిణి, మదన్‌కు దూరం కావడానికి ప్రయత్నిస్తుంది. చివరికి అపార్థలు తొలగి వారు “తాళిబొట్టు“తో, దంపతులుగా మారడంతో కథ ముగుస్తుంది.

కల్పన ఫోటో చూసి పెళ్ళికొడుకు జిడ్దు మొగం అన్నాడని కల్పన అవమానంతో దహించుకుపోతుంది. అన్నయ్య రఘురాం, అతని స్నేహితుడు చంద్రశేఖర్ వాడికి బుద్ధి చెప్పాలనుకుంటారు. దాంతో కల్పన వేషభాషలను మార్చి ఆధునిక యువతిగా తీర్చిదిద్ది, ఆ పెళ్ళి కొడుకు రవిని స్నేహితుడిగా ఇంటికి పిలిచి కల్పనను పరిచయం చేస్తారు. అలా “ఒకడుగు ముందుకు వేసి చూసిన” కల్పన పట్లా ఆకర్షితుడైన రవికి తాము కట్నం ఇచ్చుకోలేమని, దండల పెళ్ళికి రెడీ అంటేనే పెళ్ళి చేసుకుంటానని కల్పన షరతు పెడుతుంది. అన్నింటికి ఒప్పుకుని రవి పెళ్ళి చేసుకున్న తర్వాత, ఆ జిడ్దు మొగం అమ్మాయే ఈ అమ్మాయి అని చంద్రశేఖర్ తెలపడంతో రవి దిగ్భ్రాంతి చెందుతాడు.

సమర్పణ” కథలో వాణిప్రసాద్ డాక్టర్ చదివినా పట్నం వెళ్ళి డబ్బు గడించడం కంటే, పల్లెవాసుల సేవలోనే పరమార్థం వుందనుకుంటాడు. ఆ వూళ్లో అప్పులిచ్చే షావుకారిణి సుమతి దగ్గర, ఆమె స్నేహితురాలైన భాగీరథి తన సవతి కొడుకైన వాణిప్రసాద్ చదువుల కోసం తన ఆస్తిని ఆమెకి వదిలేయాల్సి వస్తుంది. సుమతి కూతురు విమల, వాణిప్రసాద్ పరస్పరం ప్రేమలో పడతారు. విమలను మేనమామ కృష్ణకిచ్చి పెళ్ళి చేయాలనే తలంపు సుమతికి వుంటుంది. ఇష్టం లేని విమలకు బలవంతంగా కృష్ణతో పెళ్ళి చేయబోతే, విమల అక్కడినుంచి పెళ్ళికూతురి వేషంలోనే పారిపోయి వాణిప్రసాద్ ఇంటికి వస్తుంది. పట్నం పోయి పెళ్ళి చేసుకుందాం అని వాణిప్రసాద్‌కు నచ్చజెపుతుండగా, కృష్ణ వచ్చి ప్రేమికులిద్దరిని కలుపుతాడు.

పూజా సుమం” కథలో ప్రఖ్యాత లాయర్ కూతురు అంజన, తన సంగీతం మేష్టారు కృష్ణను ప్రేమించడం తండ్రికి నచ్చదు. ఎం.ఎ. తప్పిన నిరుద్యోగి, దరిద్రుడైన కృష్ణతో తిరగడం సహించలేక వాడ్ని పట్టుకు తెమ్మంటాడు. భయంతో కృష్ణ తన విధవ తల్లిని తీసుకుని ఒక అర్ధరాత్రి ఎక్కడికో పారిపోతాడు. తండ్రి తీసుకువచ్చిన వరుడ్ని అంజన బలవంతంగా పెళ్ళి చేసుకుంటుంది. శోభనం రాత్రి తన ప్రేమ కథ భర్తకి చెప్పి, దూరంగా వెళ్ళిపోయి కృష్ణను వెతుక్కోవాలనుకుంటుంది. కాని భర్త నీలకాంత్ ఎంతో విశాల హృదయంతో ఆమెను ఇంట్లోనే వుండమనీ, ఆమె ఇష్టం లేనిదే ఆమెను తాకననీ, కృష్ణను వెతుక్కొచ్చి పెళ్ళి చేస్తానని ప్రామిస్ చేస్తాడు. పిరికివాడుగా తనను వదిలేసి పారిపోయిన ప్రియుడి కంటే, భార్య మనసు తెలుసుకుని ఆమె ప్రియుడిని వెతికి తెస్తానని పూనుకున్న భర్త గొప్పదనం తెలుసుకున్న అంజన క్రమంగా అతని వైపుకే మొగ్గడం “పూజా సుమం”లో కనిపిస్తుంది. ఇందులో నీలకాంత్ కులభేదం వల్ల పెళ్ళి చేసుకోలేకపోయిన పవన ఉదంతం కూడా వుంది.

ఇంకో కథలో డాక్టర్ చంద్రశేఖరం రెండవ అబ్బాయి వివాహ సందర్భంలో, ఇంటి పనులలో సహాయం కోసం నర్సు రాజ్యలక్ష్మిని ఇంటికి పిలుస్తాడు. బ్రహ్మచారిగా మిగిలిపోయిన పెద్దకొడుకు ప్రవీణ్, రాజ్యలక్ష్మి మంచితనం, ప్రవర్తన చూసి ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. అతను పెళ్ళి చేసుకుంటానంటే, రాజ్యలక్ష్మి తనలాంటి పతితను చేసుకోవద్దని నిరాకరిస్తుంది. ఆమె గతంతో సంబంధం లేకుండా చేసుకుంటానంటే, తన శీలాన్ని చెరచింది అతని తండ్రేనని చెప్పడంతో దిగ్భ్రాంతి చెందిన ప్రవీణ్ అక్కడ వుండలేక ఫారిన్ వెళ్ళిపోతాడు. ఎవరైనా ఆదర్శ పురుషుడు ముందుకు వస్తే, తన గతాన్ని మరచి, పెళ్ళి చేసుకుని హాయిగా వుండమని “అమ్మకాని అమ్మ“కు చెప్పి వెళ్ళిపోతాడు.

ఇక “పచ్చిక” కథలో యం.యస్.సి. ముగించుకుని ఇంటికి వచ్చిన హరనాథ్‍కు, ఇంట్లో హడావిడిగా చలాకీగా తిరుగుతూ అన్ని పనులు చక్కబెడుతున్న అందమైన పని అమ్మాయి సావిత్రి కనిపిస్తుంది. తన కాలేజీ రోజుల్లో నీలకాంత అనే ఒక భోగం అమ్మాయి కోసం ప్రయత్నించి విఫలం కావడం, ఆ నీలకాంతయే తన ఐడెంటిటీని మరుగుపరుచుకుని సావిత్రిగా తన ఇంట్లో వుందని అనుమానిస్తాడు. ఆచారపరులైన తమలాంటి బ్రాహ్మల ఇంటిలో ఒక వేశ్య కూతురి వంట తినడం, ఆమె సపర్యలు ఊహించలేకపోతాడు. నిజం చెప్పమని ఆమెను ఎంతగా వేధించినా, తానో పేద బడిపంతులు కూతురునని చెబుతుంది. పిల్లి ఎలుకలా సాగే వారి వైరం, పట్టుదల మధ్య రోజు రోజుకు హరనాథ్ ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. హరనాథ్ తండ్రి పక్షవాతం వచ్చి మంచం పడితే సావిత్రి తన సపర్యల ద్వారా ఆ కుటుంబీకుల మనస్సును ఆకట్టుకుంటుంది. ఆ ఇద్దరి మనసులు ఎలా కలిశాయో తెలుసుకోవాలంటే “పచ్చిక” కథ చదవాల్సిందే.

దుర్భర దారిద్ర్యం భరించలేక తండ్రి ఉరి పెట్టుకోవడం, తమ్ముడు ఇంట్లోంచి పారిపోవడంతో శాస్త్రి ఒక బ్రాహ్మల ఇంట్లో వెట్టిచాకిరి చేసి నేర్చుకున్న పౌరోహిత్యంతో, పొలం పనులు చేసుకుంటూ వుంటాడు. అదే వూళ్ళో వడ్డీ వ్యాపారంతో ప్రజలను దోచుకునే రావుగారి కబందహస్తాల్లో శాస్త్రి చిక్కుకుపోతాడు. చిన్నప్పుడు వెళ్ళిపోయిన తమ్ముడు అనంత ఎం.ఎ. పాసయి, ఆ ఊళ్ళో పాఠశాల కోసం చందాల కోసం తిరుగుతూ రావుగారి హేళనకు గురవుతాడు. ఆయన వల్ల తన ఇంటి పరిస్థితి అర్థమవుతుంది. అదే రావుగారి వితంతు కూతురు కౌముది ఎం.ఎ. పాసవుతుంది. ఆమె మేనమామ నళినీ కృష్ణమోహన్ ఆమెను వితంతు వివాహం చేసుకోవాలనే ప్లానులో వుండటం, అతను నమ్మదగిన వ్యక్తి కాదని కౌముది గ్రహిస్తుంది. అనంత పట్ల ఆమె ఆకర్షితురాలవుతుంది. అనంత తన ఇంటి పరిస్థితులు చక్కదిద్దుకుని, కౌముది నొసటన “కుంకుమరేఖ“ను దిద్దడంతో కథ ముగుస్తుంది.

ఇవన్నీ ప్రేమ కథలే. ముందు ఒకర్నొకరు ప్రేమించుకోవటం, అర్థం పర్థం లేని అపోహలు, అపార్థాలతో విడిపోవడాలు, ఎదుటి వ్యక్తి మంచితనాన్ని త్యాగాన్ని గుర్తించి కలిసిపోవడం అనే ఫార్ములాతో ఈ ప్రేమ కథలు కొనసాగుతాయి. విభిన్న సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల ప్రేమ కథలు ఇందులో కనిపిస్తాయి. ఆత్మాభిమానం పేరిట లేనిపోని బాధ్యతలను పైన వేసుకుని త్యాగమూర్తులుగా మిగిలిపోవడానికి ప్రయత్నించే నాయికానాయకులు కనిపిస్తారు. ఇవి ముక్కోణపు ప్రేమ కథలుగా, కొన్నిసార్లు చతురస్ర ప్రేమ కథలుగా కూడా పరిణమిస్తాయి. ప్రేమ విఫలమైతే  మేనమామ లేదా మేనకోడలు సంబంధం రెడీగా ఉండడం విశేషం. తొలినాళ్ళలో కొంత ఆదర్శవాద ధోరణులు కనిపించినా, రాను రాను ఫక్తు ప్రేమ కథలను రకరకాల కోణాలలో రాయడానికే రచయిత్రి ఎక్కువగా ప్రయత్నించారని ఈ కథలని చదివితే అర్థమైపోతుంది.

ప్రభాకర్ ఉద్యోగం పోతే ఇంటికి తిరిగి వస్తాడు. ఉద్యోగం పోయిందని తెలియగానే మేనమామ అంతకుముందే ఒప్పుకున్న తన కూతుర్ని వేరేవాళ్లకు ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఆ సంబంధం వల్ల వచ్చే డబ్బులతో చేయాల్సిన ప్రభాకర్ చెల్లెలి పెళ్ళి తప్పిపోతుంది. ఉద్యోగాల మీద నమ్మకం కోల్పోయిన ప్రభాకర్ కరణం సహాయంతో పొలాలు కౌలుకు తీసుకుని ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేసి, మల్టీ-పర్పస్ ఫాం పెట్టి, తన మిత్రుడు వేణు చెల్లెలు ప్రమీలను తాను పెళ్ళి చేసుకుని, తన చెల్లి పెళ్ళిని వేణుతో జరిపించేస్తాడు. “కృషితో నాస్తి” దుర్భిక్షం అని నిరూపిస్తాడు.

భార్యా ముగ్గురు పిల్లలు కాకుండా రాజారావుకు ముగ్గురు తమ్ముళ్ళను పెంచి ప్రయోజకులను చేయాల్సిన బాధ్యత వుంది. స్త్రీ సహజమైన కోరికలు తీరని అతని భార్య శారద తన కుటుంబమే ముఖ్యమని వాదించి, భర్తకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అనుకోని సంఘటనల వల్ల శారద తన కర్తవ్యాన్ని గుర్తించి భర్తకు సహకరించి అటు తన మరుదులను, ఇటి తన పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. సంసారంలో తల్లి వేరు లాంటిది గృహిణి. ఆమె ఆరోగ్యం మీదా, మనోదారుఢ్యం మీదా ఈ సంసారవృక్షం ఎలా ఆధారపడి వుందో, ఈ కొమ్మలూ రెమ్మలూ చీడను దరి చేరకుండా ఆరోగ్యంగా వుండడం అంతే ముఖ్యం. ఈ సంగతి కుటుంబంలోని ఇతర వ్యక్తులు గుర్తించిన నాడు ఏ కుటుంబంలోనైనా చీలికలు రావు అంటూ రాజారావు ఇచ్చిన నీతి సందేశంతో “ప్రేమించి చూడు” కథ ముగుస్తుంది.

బావ నిర్లక్ష్యం వల్ల శాంత అక్క హిస్టీరియాకు లోనవుతుంది. శాంత పెళ్ళి చేసి ఆమె పిల్లలతోనే తన లోకం అని సంతృప్తిపడే లోపున ఆమెకు క్షయ వ్యాధి దాపురిస్తుంది. తనను పెంచి పెద్ద చేసిన అక్కాబావలకు ఆధారం కావాల్సిన తను, పెళ్ళి చేసుకుని అత్తారింటికి పోక తప్పదు, వాళ్ళనే వచ్చి తమ దగ్గర వుండిపొమ్మంటే, వాళ్ళ అభిమానం ఒప్పుకోదు. “వచ్చి ఆడపిల్ల పంచనబడి వుండడమా?” అంటారు. దీనికి ఏది పరిష్కారమో తోచదు. ఇది నిజంగా జరిగిన సంఘటన కాబట్టి “కల్పన కాదు” పేరిట కథగా రాశారు.

తెలివైన విద్యార్థిని కమలను చదువు మాన్పించి రాజగోపాల్‌తో పెళ్ళి చేస్తారు. శోభనం గదిలో నన్ను చదివించండని కోరితే భర్త ఒప్పుకోగా, అప్పటివరకు నన్ను ముట్టుకోవద్దని షరతు పెడుతుంది. ఆమె కోసం భర్త ఎంత తాపత్రయపడినా ఆమె పట్టించుకోదు. భర్త ప్రేమను, అత్తగారి ఆదరణను పట్టించుకోకపోగా, ఇంకా పెంకిగా గర్వంగా ప్రవర్తిస్తూ అందర్నీ దూరం చేసుకుంటుంది. భర్త ఒక పరాయి స్త్రీ మోహంలో పడ్డాడని తెలుసుకున్నాక ఆమె తన తప్పును సరిదిద్దుకుంటుంది. ఎంత గొప్ప ‘వజ్రం‘ అయినా ‘బంగారం‘లో ఇమిడితేనే శోభిస్తుందన్న విషయం తెలుసుకుంటుంది. గృహ సంబంధాలలో వస్తున్న మార్పులను, చోటు చేసుకుంటున్న సమస్యలను ఆదర్శవాద ధోరణులతో పరిష్కరించడం ఈ కథల్లో కనిపిస్తుంది.

కులాల్ని బట్టి, జీవితాల్ని బట్టి ఒక వ్యక్తి గురించి అభిప్రాయాలు ఏర్పరుచుకోకూడదు. మనకై మనం ఒక విశాల దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఎవరి కులం పట్ల వారికి అభిమానం వుంటే ఎవరూ ఆక్షేపించరు. కానీ ఆ అభిమానంతో ఇతర కులాలను చిన్నచూపు చూడడం మంచిది కాదు. కులాలను బట్టి వ్యక్తిత్వాలను నిర్ణయించడం కంటే, వ్యక్తిత్వాలను బట్టే కులాలను నిర్ణయించడం ఉత్తమం, లోక కళ్యాణం అనే సందేశం ఇచ్చి “వెలసిన శిఖరాలు” కథలో శ్రీ మాలి అనే బ్రాహ్మణ విద్యార్థి ఎంత చదివినా జన్మ సంస్కారం పోదనీ, దాన్ని బట్టే అతడి కులాన్ని గుర్తించవచ్చని తన నలుగురు శూద్ర స్నేహితులతో వాదిస్తుంటాడు. అతని అహంకారాన్ని భరించలేక వాళ్ళు ఒక భోగం స్త్రీని బ్రాహ్మణ యువతిగా వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగేలా చేస్తారు.  ఆ అమ్మాయి శ్రీ మాలి బామ్మను, శ్రీ మాలి ని తన ప్రవర్తనతో మెప్పించేయగా, ఆమెను పెళ్ళి చేసుకోడానికి శ్రీ మాలి సిద్ధపడతాడు. అప్పుడు  మిత్రబృందం వచ్చి శ్రీ మాలి కి అసలు విషయం తెలియజేసినా శ్రీ మాలి పట్టుదలతో ఆ అమ్మాయినే పెళ్ళి చేసుకుని, తన విశాల హృదయాన్ని తెలియజేస్తాడు.

మనిషికి ఒక వయసు వచ్చాక, గృహస్థుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత సమాజం అంటే అతిగా భయం ఏర్పడుతుంది. కట్టడులకు తప్పనిసరిగా లొంగిపోతూ వుంటాడు. సంఘ వ్యతిరేకంగా ఏది చేయాలన్నా ముందుకు రాలేడు. అతనికి వయసొచ్చిన ఆడపిల్ల గుండెల మీద కుంపటి అవుతుంది. ఆడపిల్లను ఒకరింటికి పంపడమనేది బకాసురుడితో చేసుకున్న ఒప్పందం లాంటిది. గుండెల మీద కుంపటి తొలగించుకోవడానికి “బకాసురుడి విందు” అవుతున్నాడు కన్యాదాత. బకుడి సంహారానికి భీముడు పుట్టవలసింది యువతరంలోనే. అది ఎప్పుడో తెలియదు.

నిధి” కథలో పాత ఇంటిని కొన్న యజమానికి అతని కొడుకులకు ఆ ఇంట్లో నిధి ఉందని ఒక మంత్రగాడు తెలపడంతో అది నమ్మిన యజమాని కొడుకులు ఒక అర్ధరాత్రి ఇల్లంతా తవ్వుకుని, గోతులమయం చేసుకుని, మితిమీరిన శ్రమతో ఆరోగ్యాలు నాశనం చేసుకుంటారు. రచయిత్రి ఈ కథ చెప్పేనాటికి వాళ్ళ సంసారం చితికిపోయి, ముగ్గురు అన్నదమ్ములు తలో దారి పట్టడం, ఇంటి స్థానంలో మొండి గోడలు నిలవడం జరుగుతుంది. దెయ్యాన్ని వదలగొట్టినా, అక్క ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే వుంటుంది. సంఘంలో పాతుకుపోతున్న మూఢనమ్మకాలను వ్యంగ్యంగా విమర్శించిన ధోరణి ఇందులో కనిపిస్తుంది.

ఇందులో “వెలసిన శిఖరాలు” కథ కుల దురహంకారాన్ని, “బకాసురుడి విందు” కథ వరకట్న దురాచారాన్ని తెలియజేసినా అవి సినిమాటిక్ పద్ధతులలోనే కొనసాగాయి. “నిధి” కథ నిజంగానే జరిగిన సంఘటన కాబట్టి కొంత సహజత్వాన్ని సంతరించుకుంది.

ఇవి 1962 నుంచి 1995 వరకు పోల్కంపల్లి శాంతాదేవి రాసిన కథలు. అప్పటి వారి చైతన్యాన్ని, ఆలోచనాధోరణిని ఈ కథలు తెలియజేస్తాయి. తొలినాళ్ళలో వారు కథలను ఎలా రాశారో ఇప్పటికీ అదే విధానంలో రాసుకుంటూ పోవడం వారి ప్రత్యేకత. ఎక్కువగా చదువుకోలేకపోవడం, బయటి ప్రపంచంతో సరియైన సంబంధాలు లేకపోవడం వలన వారి ఆలోచనా ధోరణి విస్తరించలేకపోయింది. అందుకని ఎక్కువ ప్రయాస పడకుండా తమకు తోచిన విషయాలను, తమకు నచ్చిన విధంగా రాసుకుంటూ పోతున్నారు. వారి కథలను గతంలో ఉజ్జ్వల పబ్లిషర్స్, కర్నూలు వారు “సమర్పణ”, “ప్రత్యక్ష” అనే రెండు సంపుటాలుగా ప్రచురించారు. ఇంకొక పుస్తకాన్ని “కుంకుమ రేఖ” పేర జయంతి పబ్లికేషన్స్, విజయవాడ వారు ప్రచురించారు. తరువాత “మరణం అంచున మందహాసం” (2010), “గుర్తుకొస్తున్నాయి” (2012) కథా సంకలనాల్ను వెలువరించారు. ఆసక్తి వున్నవారు వెతికి చదువుకోవచ్చు.

Exit mobile version