Site icon Sanchika

ఉత్కంఠకు లోటులేని ‘పోము’

[Pomu లేదా Exhuma అనే లేటెస్ట్ కొరియన్ సినిమాని సమీక్షిస్తున్నారు వేదాల గీతాచార్య.]

Pomu లేదా Exhuma: చూడదగ్గ కొరియన్ బ్లాక్బస్టర్

[dropcap]కొ[/dropcap]రియన్ సినిమా గమనం సాధారణంగా మన హార్ట్ బీట్ మాదిరి ఉంటుంది. టోంది కూడా. అదో విచిత్రం. ఇలా కొన్నాళ్ళు పైకి లేస్తుంది. ఇంతలో కాస్త దిగుతుంది. మళ్ళా కొన్నాళ్ళు తిరుగులేని విజయాలు. ఇంతలో ఏవో సమస్యలు చుట్టుముడతాయి. 1999, 2000 సంవత్సరాలలో కొరియన్ వేవ్ మొదలై, వారి సినిమాలు జాతీయంగా, అంతర్జాతీయంగా కాసులు కురిపిస్తే 2001, 2002 ల్లో కొంచం వెనుకంజ వేయటం జరిగింది. 2003లో Oldboy అంతర్జాతీయంగా సంచలనాలు సృష్టించి, ప్రేక్షకులను వెర్రెత్తిస్తే, 2004లో కోటా సిస్టమ్ వల్ల లోకల్ సినిమాలు దెబ్బతినే పరిస్థితి దాపురించి ప్రముఖుల హెచ్చరికలు, బాగా ఆడతాయనుకున్న సినిమాలు పరాజయం పాలు కావటం.. ఇలా సాగిపోయింది.

2005 తో అసలు కొరియన్ సినిమాల universal appeal తగ్గిపోతోందా అనిపించే సమయంలో కొన్ని మరపురాని సినిమాలు వచ్చాయి. 2006 నాటికి మహామహులైన ఇద్దరు కొరియన్ superstars రంగం నుంచీ వేరువేరు కారణాల వల్ల వెనక్కి తగ్గారు. అందువల్ల పైకి కనపడే డ్యామేజ్ కన్నా, కనపడని నష్టం ఒకటి జరిగింది. సాధారణంగా చిక్కటి కథా కథనాలు, గొప్ప నటనా పాటవం కలిగిన నటీనటులతో నిండి ఉండే కొరియన్ సినిమాల రాశి పెరిగినా వాసి తగ్గింది. ఆ సూపర్ స్టార్లు చోయ్ మిన్-సిక్, హన్ సక్-క్యు. కమర్షియల్ సినిమాలు, అనవసర హంగులు ఎక్కువై, విమర్శకులు ప్రశంసలు తగ్గటం ప్రారంభమైంది.

అలా మరో మూడేళ్ళు గడిచాక 2010, 2011, 2012, 2013, 2014 లో అటు బాక్సాఫీసు వద్ద అద్భుత విజయాలే కాదు అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందే సినిమాలు పదుల సంఖ్యలో విడుదలయ్యాయి. ఇదే సమయంలో చోయ్ మిన్-సిక్ నటించిన ఐదు అద్భుత చిత్రాలు తిరుగులేని విజయాలు సాధించటమే కాకుండా హాలీవుడ్.. కొరియన్ నటులతో, దర్శకులతో సినిమాలు తీయడం మీద దృష్టి సారించింది. ఆ సాగటం సాగటం 2020లో పారాసైట్ నాలుగు ఆస్కార్లు సాధించటం దాకా వెళ్ళింది.

ఆ తరువాత కొరియన్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకుంటే కరోనా దెబ్బకు కుదేలైంది. ఎలాగో కోలుకుని, పార్క్ చాన్-వుక్ తీసిన డెసిషన్ టు లీవ్ పుణ్యమా అని అంతర్జాతీయ విమర్శకులు మళ్ళీ కొరియన్ సినిమాల మీద దృష్టి పెట్టడం జరిగింది. కానీ 2023లో చెప్పుకోదగ్గ విజయాలు లభించలేదు. ఆస్కార్ ఎత్తుల తరువాత వారి బాట ఎగుడుదిగుడైంది. అటు కమర్షియల్ విజయాలు లేక, ఇటు ప్రపంచ సినిమా రసజ్ఞుల ప్రశంసలు లేక కొరియన్ సినిమా దిక్కుతోచని స్థితిలో ఉంది. కొరియన్ వేవ్ ముగిసిందనే గుసగుసలు కూడా మొదలయ్యాయి.

అలాంటి నేపథ్యంలో సీనియర్ స్టార్‌లే దిక్కయ్యారు. కరోనా తరువాత కమల్, రజనీకాంత్‌లు తమిళ సినిమాలను విక్రమ్, జైలర్ లతో నిలబెట్టినట్లు.

Industry కష్టంలో ఉన్నప్పుడు సీనియర్ తలకాయలే అక్కరకొచ్చి ఒడ్డున పడేస్తారు.

ఇదింకోసారి నిరూపితమైంది.

కొరియన్ సినిమా గత సంవత్సరం కాస్త వెనకపడింది. 2022లో చూసిన ఎత్తుల తరువాత. ప్రత్యేకించి బాక్సాఫీసు దగ్గర.

ఇక నట సార్వభౌముడు చోయ్ మిన్-సిక్ రంగంలోకి దిగి తిరుగులేని హిట్ ఇచ్చాడు. కానీ వినీ ఎరుగని ఓపెనింగ్ వీకెండ్‌తో సహా!

ఆ సినిమానే Exhuma. 2024 ఫిబ్రవరి 22న విడుదలైన ఈ హారర్ మిస్టరీ త్రిల్లర్ ను కేవలం వారంలోనే 4 మిలియన్ ల టికెట్లు అమ్ముడుపోయి రికార్డులు బద్దలు కొట్టింది. మీరు చదివే సమయానికి ఈ సినిమా ఒక్క కొరియాలోనే 5.2 మిలియన్ల మంది చూసి ఉంటారు (3 మార్చి 2024). చిన్న నంబరే కదా అనిపించ వచ్చు తెలియని వాళ్ళకు. ప్రతి 10 మంది కొరియన్‌లలో ఒకరు చూసినట్లు. అదీ 10 రోజుల్లో. 40 మిలియన్ డాలర్ల వసూళ్ళు. బజట్ కు మూడింతలు లాభం. అంత లాభాలిచ్చిన తెలుగు సినిమాలు (స్టార్ హీరోలవి) ఎన్ని?

మరి అలాంటి సినిమా ఎలా ఉంది? అసలు దేని గురించి? తెలుసుకుందామా?

విచిత్రమేమిటంటే కరోనా తరువాత జనాలను థియేటర్లకు రప్పించిన సినిమా షమనిజమ్ ఆధారంగా వచ్చిన సినిమానే. రాంగ్జాంగ్. ఇప్పుడు ఏడాది స్లంప్ తరువాత నిలబెడుతున్న సినిమా కూడా షమనిజమ్ ఆధారంగానే నడుస్తుంది. మన తెలుగు సినిమా కూడా ఈ మధ్య అలాంటి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తోంది కదా. చేతబడులు, దయ్యాలు, ఆవాహనలు, వదిలించటాలు.. సామ్యం సామ్యం.

హ్వా-రిమ్ అనే పిల్ల షమన్‌కు ఒక లాస్ ఏంజలిస్ లో సెటిలైన కుటుంబం నుంచీ పిలుపొస్తుంది.

పాపా పాపా! మా ఇంట్లో దుష్టశక్తి తిరుగుతున్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కాస్త నువ్వొచ్చి రక్షించు అని.

మరో యువ షమన్ బాంగ్-గిల్ (క్రికెటర్ శుభ్మన్ గిల్‌కు సంబంధం లేదు) తో కలిసి అక్కడికి వెళ్ళి వారింట్లో ఉన్న పసి బిడ్డకు ప్రమాదమున్నదని గ్రహిస్తారు. ఆ కుటుంబ పూర్వీకులకు ఏదో తీరని కోరిక మిగిలి ఉందని, ఆ పూర్వీకులు ఎవరో తెలుసుకుని, వారి సమాధిని గుర్తించి, తవ్వి, వారిని సంతృప్తి పరిస్తే వీరి సమస్యలు తీరతాయని తెలుసుకుంటారు. పోము (అంటే తవ్వబడిన సమాధి) అనే ఈ సినిమా కథ ఇలా మొదలౌతుంది.

ఇదంత సుళువుగా అయ్యే వ్యవహారం కాదు. ఆ సమాధి ఎక్కడ ఉన్నదీ గుర్తించాలి. అది వీరిద్దరి వల్లా కాదు. పైగా ఆ అతీంద్రీయ శక్తి ముందు ఈ పిల్లకాయల శక్తి చాలకపోతే మరిన్ని సమస్యలు వస్తాయి. అందుకోసం వారిద్దరు కిమ్ శాంగ్-డ్యోక్ (చోయ్ మిన్-సిక్అ) అనే Geomancer సహాయం అర్థిస్తారు. నాలుగు దశాబ్దాలుగా ఈ రంగంలో అమిత పరిశోధనలు చేసిన ఆ Geomancer ఆ పూర్వీకుల సమాధి కొరియాలో ఉన్న మారుమూల పల్లెలో ఉందని కనిపెడతాడు (సినిమా అంతా లాస్ ఏంజిల్స్ లో తీస్తే బజట్ పెరగదూ! 😜). అక్కడ ఆ సమాధిని తవ్వాక వీరు అనుకున్నదానికన్నా పెద్ద సమస్యే వచ్చి పడుతుంది.

ఏమిటా సమస్య? దాన్ని ఎలా అధిగమించారు? Did they remain alive and wear clothes? అన్నది మిగిలిన కథ.

సినిమా కథాంశం చాలా సీరియస్‌గా ఉంటుంది. కొరియన్ చరిత్రలో చాలా బాధాకరమైన సున్నితాంశాలను తడుముతుంది. కాకపోతే స్క్రీన్ ప్లే విషయంలో తడబడింది. సగం వరకూ ఒక హారర్‌లా నడిచిన సినిమా తరువాత యాక్షన్ డ్రామాగా మారుతుంది. భయానక సన్నివేశాల బదులు ఉత్కంఠ రేపే డ్రామా వస్తుంది. సగం సినిమా అయ్యాక ప్రధాన విలన్ మారటం, రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ తెప్పిస్తుంది. దీంతో కథ మీద ఫోకస్ తగ్గి గందరగోళంగా అనిపిస్తుంది. వీటన్నిటికీ కొరియన్ చరిత్రలో జరిగిన రకరకాల సంఘటనలకు ముడి వేయటం కూడా ఆ గందరగోళానికి కారణం.

అయినా సినిమా ఆసాంతం మనం కదలకుండా చూస్తామంటే కారణం నట సార్వభౌముడు చోయ్ మిన్-సిక్ నట విశ్వరూప ప్రదర్శనే. అతనికి ధీటుగా హ్వా-రిమ్ పాత్రలో కిమ్ గో-యూన్ తన హావభావాలతో మన అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటుంది. మిగిలిన నటీనటులు కూడా తమ సత్తా చాటటంతో మనం కూడా అంత గందరగోళం లోనూ సినిమాలో లీనమౌతాము.

దర్శకుడు జాంగ్ జే-హ్యున్ తన పనితనం చూపించిన, ఈ సినిమాను నిలబెట్టింది చోయ్ మిన్-సిక్ స్టార్డమ్ మాత్రమే. స్క్రీన్ ప్లే మీద మరింత దృష్టి పెట్టి ఉంటే మరో అజరామరమైన కొరియన్ సినిమాగా నిలిచేది. సాధారణంగా అతీంద్రీయ శక్తుల గురించి తీసే సినిమాలలో నటించడానికి ఇష్టపడని చోయ్ మిన్-సిక్ ను ఈ సినిమా ఆకర్షించటానికి కారణం ఇందులో ఉన్న చారిత్రక విశేషాలు. కథనంలో కాస్త చేతులు తడబడ్డా దర్శకుడు కొరియన్ షమనిజమ్‌ను, దాని చరిత్రను వీలైనంత సహజంగా చిత్రించాడు.

దిగ్గజ సంగీత దర్శకుడు కిమ్ టే-స్యోంగ్ (ద ఎడ్మిరల్: రోరింగ్ కరంట్స్, వార్ ఆఫ్ ఏరోస్, Extreme జాబ్) తన పనితనాన్ని బాగా చూపిస్తాడు. వివిధ శబ్దాలతో సన్నివేశాలు తగిన మూడ్‌ను క్రియేట్ చేయటంలో విజయం సాధించాడు. కొన్ని చోట్ల సన్నివేశంలో బలం లేకపోయినా శబ్దాలతో మనకు వెన్నులో ఒణుకు పట్టిస్తాడు. ఎన్నో క్లాసిక్స్‌కు పని చేసిన వెటరన్ డీఓపీ లీ మో-గే (The Good The Bad The Weird, A Tale of Two Sisters) సినిమాటోగ్రఫీ ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్టులు కూడా బాగా వచ్చాయి.

ఏవి ఎలా ఉన్నా కేవలం నటనా బలం వల్ల నిలించిందీ సినిమా అనే చెప్పాలి. చాలాకాలం తరువాత కమర్షియల్ సినిమా చేసిన చోయ్ మిన్-సిక్ తన స్టార్డమ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు.

కొరియన్ షమనిజమ్, దాని చరిత్ర మనకు కొత్తగా అనిపిస్తాయి, హారర్ తక్కువైనా ఉత్కంఠకు లోటులేదు. కనుక అవకాశం దొరికినప్పుడు తప్పక చూడదగిన సినిమానే. అటు వైపు విమర్శకులకు అంత నచ్చకపోయినా కొరియన్లకు కూడా బాగా ఎక్కేసింది.

Exit mobile version