పొంచి ఉన్న జీవ రసాయనిక ఆయుధాల ప్రమాదం

0
2

[box type=’note’ fontsize=’16’] పొంచి ఉన్న జీవ రసాయనిక ఆయుధాల ప్రమాదం గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]జ[/dropcap]ర్మనీ రక్షణశాఖ ఉక్రెయిన్ మంత్రిత్వశాఖతో కలిసి 2020-21ల నడుమ ‘మెనెంజైటిస్’ వంటి పలు వ్యాధులపై, ఆ వ్యాధులకు కారణమయ్యే వైరస్‍లపై విస్తృతమైన అధ్యయనాలు చేసిందని, అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ సైతం జునోటిక్ వ్యాధులపై పరిశోధనల నిమిత్తం ఇటీవలి కాలంలోనే 1.18 కోట్ల డాలర విలువైన నిధిని ఉక్రెయిన్ సైన్యానికి అందించిందనీ, అంతేకాక, హానికారక సూక్ష్మజీవులను సేకరించి పంపచలసిందిగా సైతం ఉక్రెయిన్‌ని కోరిందనీ సాక్షాత్తు రష్యా సైనికాధికారి జనరల్ ఇగోర్ కెర్లోవ్ ప్రకటించారు. యు.ఎస్.కు చెందిన్ వాల్టర్ రీడ్ పరిశోధనా కేంద్రానికి కరోనా పరీక్షల నిర్ధారణ, నివారణ, చికిత్సల పేరిట ఉక్రెయిన్ లోని ‘స్లావిక్’ తెగల వారి రక్తం, స్పూటమ్ నమూనాలు చేరాయని ఆయన ఆరోపించారు.

అమెరికా రక్షణశాఖ ఒక ప్రైవేటు కంపెనీ భాగస్వామ్యంతో ఉక్రెయిన్‌లోని ప్రయోగశాలల్లో జీవాయుధాల తయారీ కార్యక్రమాలను నిర్వహిస్తోందని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. అటువంటి ప్రయోగశాలలు సుమారు 30 వరకూ ఉంటాయనీ, తమ సైనిక చర్యలలో అవి బయటపడకుండా హడావిడిగా వాటిని నిర్మూలించేసారని రష్యా అంటోంది.

యు.ఎస్.ఎస్.ఆర్.గా ఉన్నప్పుడు – రష్యా పై జీవాయుధాల ప్రయోగాలను నిర్వహిస్తోందని ఆరోపణ ఉండేది. 80లలో ఒక్క రష్యాపై మాత్రమే జీవాయుధాల తయారీ పరిశోధనల ఆరోపణలుండగా క్రమేపీ ఆ సంఖ్య పెరుగుతూ పోయింది. ఉక్రెయిన్‍లో రష్యా పరిశోధనలు నిర్వహించిన ప్రయోగశాలలనే అమెరికా తన ప్రయోగాల నిమిత్తం వాడుకుంటోందని, రష్యా ఆరోపణలు నిరాధారం కావని వాదనలు వినవస్తున్నాయి.

ఉక్రెయిన్‍లో అమెరికా రహస్యంగా జీవాయుధాల తయారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని అమెరికాలోనే ఆరోపణలున్నాయి. ఉక్రెయిన్‍లో జీవశాస్త్ర పరిశోధనలు జరుగుతున్నాయని అయితే ప్రజారోగ్య పరిరక్షణ నిమిత్తం మాత్రమే పరిశోధనల ఫలితాలను వినియోగిస్తున్నామనీ, సంబంధిత పరికరాలు, సమాచారం రష్యా చేతిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామ్నఈ అమెరికా ప్రభుత్వ వర్గాలు గతంలో వివరణ ఇవ్వడం కూడా జరిగింది.

రమారమి మూడున్నర శతాబ్దాల పాటు మశూచి క్రిములు మానవాళిని పట్టి పీడించాయి. 1977లో ఆఖరుసారిగా మశూచి కేసు రికార్డు అయ్యింది. 1980 నాటికి మశూచిని నిర్మూలించినట్టు ప్రకటించడం జరిగింది. అట్లాంటాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ – అమెరికా, కోల్‌సోవోకు చెందిన ‘రష్యన్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ వైరాలజీ అండ్ బయోటెక్నాలజీ – రష్యాలలో ఈ వ్యాధి కారక వైరస్ నమూనాలను భద్రపరిచి ఉంచడం జరిగింది. 1996 మే లో ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్కింగ్ కమిటీ ఆ వైరస్‍ను నిర్మూలించాలని తీర్మానించింది. నకలు క్రిములు లభిస్తున్నాయి కాబట్టి పరిశోధనకు అవరోధం ఉండడని ‘WHO’ అభిప్రాయపడింది. ఏ కారణంగానైనా వ్యాధి తిరిగి విజృంభిస్తే నివారణకు గల దారులను మూసివేయరాదన్న అభిప్రాయాలూ వ్యక్తం కావడంతో వైరస్ నిర్మూలన కార్యక్రమానికి ప్రతిష్ఠంబన ఏర్పడింది. టైఫాయిడ్, ప్లేగ్, ఆంత్రాక్స్ వైరస్‍లు నిర్మూలించబడినట్లుగా ప్రకటించబడి చాలా కాలమయింది. అయినా అడపాదడపా ఆ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. అవేకాక ఎబోలా, జికా వంటి క్రొత్త వ్యాధులు పుట్టుకొచ్చాయి. ప్రపంచాన్ని బెంబేలెత్తించిన ‘కరోనా’ కరాళ నృత్యం మరిచిపోగలిగేది కాదు.

గత మూడు దశాబ్దాలుగా నిర్వహించబడిన ‘జెనోమ్ ప్రాజెక్టు’ల ఫలితంగా ‘డి.ఎన్.ఎ సీక్వెన్సింగ్’ పరిధి విస్తరించిపోయింది. ఫలితంగా డి.ఎన్.ఎ సీక్వెన్స్‌కు సంబంధించిన సమాచారం అతి సులభంగా అందుబాటు అవుతున్నది. ప్రస్తుత పరిస్థితులలో – డి.ఎన్.ఎ. టెక్నాలజీ విపరీతంగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో ప్రత్యేకించి తాము లక్ష్యంగా చేసుకున్న జాతి/తెగ వారిని మాత్రమే తుడిచిపెట్టగల పరిజ్ఞానాన్ని రూపొందించడం ఏమంత కష్టం కాదన్న శాస్త్రజ్ఞుల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోక తప్పదు. 1925లో జరిగిన ‘జెనివా కన్వెన్షన్’లో కుదిరిన ఒప్పందం మే 1928 నుండి అమలులోనికి వచ్చింది. కొంచెం అటూ ఇటూ అయినా నూరు సంవత్సరాల తరువాత కూడా పరిస్థితులు ఏమీ మారలేదంటే ఒడంబడికల కంటే చిత్తశుద్ధి ముఖ్యమన్న సంగతి ఒప్పుకోక తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here