Site icon Sanchika

పూచే పూల లోన-11

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[తనుండే రిసార్ట్ సమీపంలో – కొద్ది రోజుల కోసం ఓ ఇంట్లో అద్దెకి దిగిన కృష్ణప్రసాద్ గారితో సుందర్‍కి పరిచయవుతుంది. కృష్ణప్రసాద్ గారు డాక్టరు. రకరకాల ప్రకృతి వైద్యాలలో నిపుణులు. రాజోలు నుండి వచ్చారిక్కడికి. ఓ రోజు ఆ ఇంటి మీదుగా వెళ్తుంటే ఆయన పలకరించి, ఓ తోటలోకి తీసుకువెళ్తారు సుందర్‍ని. గోవాలో ఉన్నన్ని పూలు ఎక్కాడా ఉండవని అంటారు. పూలని చూస్తే ఆనందంగా ఉంటుందని, ఇష్టమైన వాళ్ళ తలలో పెడితే బాగుంటుందని, సున్నితమైన పూలను రాక్షసంగా నలిపేస్తే బాధ కలుగుతుందని అంటారు. కానీ ఓ రకం పువ్వులని అలా నలిపితే, అందులోంచి మందు వస్తుందని, దాన్ని సేవిస్తే మనసుకు బావుంటుందని అంటారు. అంటే ఈ పూలలో మందు ఉందన్న మాట అని అంటాడు సుందర్. సృష్టి యావత్తు ఔషధమేనంటారు కృష్ణప్రసాద్. తరువాత స్థానికంగా గుట్రో అని పిలవబడే పువ్వుని చూపి తన గుణాలను చెప్తారు. ఆ పువ్వుకీ చంద్రోదయానికి సంబంధం ఉందని చెప్తారు. ఆ పూవు పుప్పొడికి నీరసం, డిప్రెషన్‍లను దూరం చేసే శక్తి ఉందని అంటారు. ఆ మొక్క ఆకులకు కూడా ఔషధ గుణం ఉందని చెప్తారు, కానీ ఇంకా పరిశోధన రంగం దానిని అనుమతించలేదని అంటారు. కొద్ది దూరం నడిచాకా, నీటిలో ఉన్న మొక్కలో ఎరుపు, పసుపు పచ్చ – రెండూ సరిగ్గా సగం సగం పంచుకున్న రేకులతో ఒక కమలం కనబడుతుంది. దాని పేరు సాల్కమ్ అని చెబుతారాయన. ‘పూచే పూల లోన ఏముందో ఏమో! గోవాలోని సామూహిక సంస్కృతి ఆ రేకులలో ప్రకాశిస్తోంది! కథలు ఎన్నో ఉంటాయి. ప్రకృతి చరిత్రను తనలో ఇనుమడింపజేసుకుని చరిత్ర ఇది అని తిరిగి మనకే చెబుతోందా అనిపించింది’ అనుకుంటాడు సుందర్. ఇక చదవండి.]

[dropcap]రెం[/dropcap]డు రంగులను చక్కగా విభజించుకుని నీటిలోంచి నవ్వుతున్న ఆ కమలాన్ని చూసి ఆశ్చర్యం వేసింది. ఈ ప్రాంతంలోని వారు పాపం చారిత్రాత్మకంగా ఎన్ని రంగులు పులుముకుని జీవితాన్ని కొనసాగిస్తున్నారో? అవన్నీ ప్రక్కన పెట్టి చక్కగా నవ్వుతారు. పడమటి కోస్తా తీరం కావడంతో సూర్యోదయం కొద్దిగా అలస్యం. వీళ్లూ అలాగే నిదుర లేస్తారు. నాలా తొందరగా నిద్ర లేచి ఏదైనా తినాలనుకుంటే చాలా దూరం వెళ్ళాలి! నా రిసార్ట్‌లో మటుకు నాకు చక్కని వంటవాడున్నాడు. సమయపాలనలో గొప్పవాడు. పట్టుదలతో వడ్డిస్తాడు. అతడికి ఆ కమలం ఫొటో చూపించాను. నా మొబైల్ చూసి దగ్గరగా పట్టుకుని కళ్లకద్దుకున్నాడు. నేను ఉలిక్కిపడ్డాను.

“అదేంటి? కళ్ళకెందుకు అద్దుకున్నావు?”

“ఇది దివ్యమైనది..” చెప్పాడు. “..దీని మందు తాగిన వారికి ఎటువంటి మానసిక జబ్బూ ఉండదు. దీని వలన కొంతమందికి పోయిన జ్ఞాపకశక్తి తిరిగి వస్తుంది.”

“ఛా”

“అవును సార్. అంతే కాదు, అనవసరంగా ప్రతి సారీ ఏదో గుర్తుకొచ్చి బాధపడే వారు పుచ్చుకుంటే అందులోంచి పూర్తిగా బయటకొచ్చేస్తారన్నమాట” అంటూ ప్లేటు తీసుకుని వెళ్ళిపోయాడు.

అంటే రెండు రంగులున్నాయి – స్కిజోఫ్రీనియా అన్నమాట. ఈ జబ్బులో లేనిది ఉన్నట్లు కనిపించడం ఒక అంశం. కొంతమందికి రంగులు కనిపించవు. కొందరికి అన్నీ రంగులే. కొందరికి హంగులు తప్ప మరేమీ కనిపించవు! సమీర్ కూడా ఇలాగే ఊగుతున్నట్లు కనిపించాడు ఈ రంగుల రాట్నంలో..

***

“నేను కొద్దిగా పెద్దవాడిని.. అంటే కాలేజీకి వెళ్ళే వయసు వచ్చాక, నాలో విద్రోహం అనేది ఎక్కువగా ఏర్పడటం ప్రారంభమైంది..”

అతను చెప్పినవి గుర్తుకొస్తున్నాయి.

“..నాన్న లాన్‍లో పెంచుకుంటున్న మూడు కుక్కలతో ఆడుకుంటూ ఉండేవాడు. మూడూ నాలుక బైటకి పెట్టి ఎదురుగా ఆరు అడుగుల దూరంలో కూర్చునుండేవి. ఆయనకు ఆ ఆట ఎందుకు అంత ఇష్టమో తెలీదు. మా ఇంట్లోని నౌకరు చెప్పేవాడు – వాళ్ళ తాత పోర్చుగీస్ వారి దగ్గర నేర్చుకున్నాడట! అదో విచిత్రమైన ఆట. కుడి చెయ్యి ప్రక్కకు పెట్టి చిటికె వేస్తే ఒక కుక్క వచ్చి కాలు నాకి వెళ్ళిపోయేది. చెయ్యి ఆకాశంలో పెట్టి చిటికె వేస్తే మధ్యలో కూర్చున్న కుక్క వచ్చి అటూ ఇటూ దొరలి వెళ్ళేది. ఎడమ చెయ్యి ఆడిస్తే ఇటున్న కుక్క వచ్చి రెండో కాలు నాకి వెళ్ళేది. మూడు చక్కగా ఆర్డర్స్ కోసం నిరీక్షిస్తూ ఉండేవి. గేటు దగ్గర చప్పుడయ్యేది. ఓ కారు లోంచి ఓ కుర్రాడొచ్చి నిలబడేవాడు. నౌకరు ఓ ప్లేటు తెచ్చి అందులో ఓ వైన్ బాటిల్, మిగతా సామగ్రి  అమర్చి అతనికిచ్చేవాడు. అతను వినమ్రంగా తల వంచి మా ఇంటి వెనుక వైపుకు వెళ్ళిపోయేవాడు.

కొద్దిగా చీకటి పడేవరకూ కుక్కులతో ఏవేవో ఆడుకునేవాడు. ఆ తరువాత కారులోంచి ఓ పెద్దవాడు దిగేవాడు. రెండు అత్తరు సీసాలు పెట్టేవాడు. ఈయన ఒకదానిని ఎంచుకునేవాడు. అతను వదిలేసిన దానిని తీసుకుని వెళ్ళిపోయేవాడు. కారు వెళ్ళిపోయేది. ఎన్నడూ చూడని ఓ అమ్మాయి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఈయన ముందు ఒక్క క్షణం ఆగి టోపీ తీసి ముఖం చూపించి, వంగి మర్యాదగా వెళ్లిపోయేది.. వెనుక గదిలోకి!”

***

అమ్మను నిలదీసేవాడిని.

“ఎవరు వీళ్లు?”

“నీకనవసరం”

“నాకవసరం”

“..”

“చెప్పు”

‘ఏం చెప్పాలి? మీ నాన్న ఇష్టం. నువ్వు ఏమన్నా మాట్లాడితే నా మీదొట్టు!”

“ఎలా ఊరుకుంటావు?”

“నీకు తెలియదు. చిన్న పిల్లాడివి. ఈ ఇంట్లో తరతరాలుగా అది మగవాళ్ళ ఆచారం. నువ్వూ పెద్దవాడివి అవుతున్నావు. అర్థం చేస్కో.”

“అంటే? నేనూ రేపు ఇలాగే ఉండాలా?”

“నీ ఇష్టం. ఇప్పుడే చెబుతున్నాను. అలా ఉంటే మటుకు నిన్ను ప్రశ్నించే అధికారం నీ భార్యకుండదు. నువ్వు చేసుకునే అమ్మాయికి ముందరే చెప్పి చేసుకో!”

దూరంగా చర్చ్‌లో గంటలు మ్రోగుతున్నాయి. నేనొక బజారులో అంగడిలో నిలబడ్డ మనిషిలా.. కాదు, పశువులా ఉన్నాను.

“నేను తింటున్నది రైస్ కదూ?”

“టాప్ క్లాస్ రైస్. ఇంకెక్కడా, ఎవరికీ దొరకదు”

“అది కాదు నేనడిగింది”

“మరేమిటి?”

“మనం మనుషులమేనా? అని”

అమ్మ మొహం ఎర్రగా మారింది.

“నేను నీకేమీ తక్కువ చెయ్యలేదు. మీ నాన్నకు ఎక్కువా చేయలేదు”

ఆ మాటలు నాకు ఆ రోజులలో తొందరగా అర్థమయ్యేవి కావు. ఏంటి ఈ ఎక్కువ తక్కువలు?

రాత్రి కుర్రతనం ఏడిపించేది. మేర మీరి నా గదిలోని చివరి కిటికీ తీసి ఆ పెరట్లోని గదిలోకి చూడాలని అనిపించి అక్కడ నిలబడేవాడిని. నౌకరు ఏవో టాబ్లెట్‍లతో వచ్చేవాడు.

“నాకెందుకివి? ఎవరు చెప్పారు?”

“పెద్ద సారు వారు. వేస్కోండి. డాక్టరు చెప్పాడు”

“నాకు జబ్బేమీ లేదే?”

“సార్ చెప్పారు”

“నేను డాక్టరు దగ్గరకు వెళ్లలేదే?”

“అక్కరలేదు. అయినా వేసుకోవాలి”

ప్లేట్లో రెండు తెల్లని టాబ్లెట్లుండేవి.

“వీటి పేరేమిటి?”

“తెలీదు”

“అంటే? అలా ఎలా వేసుకోవాలి? దేని కోసం ఇవి?”

“తెలీదు. సార్ చెప్పారు”

ఆ టాబ్లెట్స్ వాసన చూసేవాడిని. ఏ వాసనా ఉండేది కాదు.

“అమ్మకు తెలుసా?”

“తెలీదు”

“అంటే, వాట్ ఈజ్ దిస్ నాన్సెన్స్? మై గాడ్”

“చిన్నయ్యా”

“చెప్పు”

“ఎవరికీ చెప్పనంటే చెబుతాను”

“చెప్పు. ఫరవాలేదు”

“ఇది తరతరాలుగా వస్తున్న వ్యవహారం”

“ఏమిటా వ్యవహారం?”

“సారుకు ఆయన తండ్రి, ఆయన తండ్రికి ఆయన తండ్రి.. అలా తినిపిస్తూ వచ్చారు. అంచాత భయపడకండి. ఏమీ లేదు. ఆరోగ్యం కోసమే!”

“ఓ. బలానికా?”

“అలాంటిదే”

“అర్థమైంది. ఈ మధ్యనే ఎందుకిస్తున్నారో కూడా అర్థమైంది”

“తీసుకోండి సార్!”

“అక్కడ పెట్టి వెళ్ళిపో”

అతడు వెళ్ళిపోయేవాడు. కానీ కిటికీ బైట కూర్చుని నేను మింగానో, పారేసానో అన్నది గమనిస్తున్నాడని నాకు తెలుసు. నేనే బైటకి వెళ్ళి అడిగాను.

“నేను మింగకపోయినా మింగానని చెప్పవచ్చు కదా?”

“చెప్పవచ్చు”

“మరెందుకిక్కడే?”

“ఎలా చెప్పాలయ్యా?”

“అదేంటి? ఎలాగో అలా చెప్పు. నేనేమీ అనుకోను”

“అయ్యా, మీరు ఈ వంశానికి..”

“అవును. ఉద్ధరించాలి కదా?”

“అందుకు”

“అది పెళ్ళయిన తరువాత కదా?”

అతను కళ్ళల్లో నీళ్ళు పెట్టుకునేవాడు. జాగ్రత్తగా తుడిచేసి నిట్టూర్చేవాడు.

“ఎలా చెప్పాలయ్యా మీకు? నన్ను.. సరే. ఒకలా చెబుతాను. ఇంటారా?”

“చెప్పు”

నడుము మీద చేతులు పెట్టుకున్నాను.

“ఇలా రండి..” అంటూ ఆ బాల్కనీ చివారకి తీసుకెళ్ళాడు.

“అటు చూడండి”, అన్నాడు.

జాగ్రత్తగా చూసాను. ఆ మూడు కుక్కలూ చీకటిలో ఓ చెట్టుకి కట్టేసి ఉన్నాయి. ఇద్దరు ట్రైనర్లు వాటికి ఏవేవో తినిపిస్తున్నారు.

నౌకరు ఏమీ మాట్లాడటం లేదు. నన్ను మాట్లాడవద్దని సైగ చేసాడు. ఇంతలో ఒక ట్రెయినర్ ప్లేట్‍లో మూడు ఇంజక్షెన్స్ తెచ్చి ఒక్కోదానికి వెనుక భాగంలో ఇస్తున్నాడు.

“జబ్బు చేసిందా?” అడిగాను.

మాట్లాడవద్దని చెయ్యి అడ్డం పెట్టాడు. ఆ కుక్కలని నడిపించుకుంటూ వాకిట్లోకి తీసుకుని వెళ్లిపోయారు.

నౌకరు నన్ను నా గదిలోకి తీసుకుని వచ్చి దండం పెట్టాడు.

“చిన్నయ్యా, ఎవరికీ చెప్పనంటే చెబుతాను. నా మీదొట్టు”

“చెప్పు”

“సారువారు లాన్‍లో కూర్చుని ఆడుకుంటారు వీటితో”

“అవును”

“అవి ఆయన కాళ్ళు నాకుతాయి”

“అయితే?”

“..”

“చెప్పు”

“అదే..”

“ఊ.. అర్థం చేసుకోండి. ఆ పనిలో అలసట ఉండనే ఉండదు!”

(ఇంకా ఉంది)

Exit mobile version