పూచే పూల లోన-12

0
1

[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ఓ తోటలో రెండు రంగుల కమలాన్ని చూసి అబ్బురపడతాడు సుందర్. ఆ పువ్వుని తన సెల్ నుంచి ఫోటో తీసుకుంటాడు. రిసార్టులో తనకి వంట చేసిపెట్టే అతనికి ఆ పువ్వుని చూపిస్తే, దాన్ని కళ్లకద్దుకుంటాడతను. ఎందుకని అని అడిగితే, ఆ పువ్వు దివ్యమైనదని, దాని మందు తాగిన వారికి ఎటువంటి మానసిక జబ్బూ ఉండదని, కొంతమందికి పోయిన జ్ఞాపకశక్తి తిరిగి వస్తుందని చెప్తాడు. ఆలోచిస్తే, సమీర్ గుర్తొస్తాడు సుందర్‍కి. సమీర్ తనకి చెప్పిన అతని గతాన్ని సుందర్ గుర్తు చేసుకుంటాడు. సమీర్ తండ్రి పెంపుడు కుక్కలతో ఆడుకునే విచిత్రమైన ఆట గురించి చెప్తాడు. ఇంటికొచ్చే అపరిచిత యువతల గురించి చెప్తాడు. సమీర్ తన తల్లిని ఆ అమ్మాయిల గురించి, ఆ వ్యవహారం గురించి అడిగితే నీకనవసరం అంటుంది. తనకి అవసరం, చెప్పమంటాడు. అది ఆ కుటుంబంలో తరతరాలుగా వస్తున్న మగవాళ్ళ ఆచారం అంటుంది. నువ్వూ పెద్దవాడివి అవుతున్నావ్, అర్థం చేసుకో అంటుంది. మనం అసలు మనుషులమేనా అని తల్లిని ప్రశ్నిస్తాడు సమీర్. ఆవిడ అక్కడ్నించి వెళ్ళిపోతుంది. రాత్రి నౌకరు ఏవో టాబ్లెట్లు తెచ్చిస్తాడు. ఎందుకని అడిగితే, పెద్దసారు వేసుకోమన్నారని అంటాడు. తనకేమీ జబ్బు లేదనీ, తాను డాక్టరు దగ్గరికి వెళ్ళలేదని అంటాడు సమీర్. అయినా ఆ టాబ్లెట్లు వేసుకోవలసిందే అంటాడు నౌకరు. అమ్మకు తెలుసా అని అడిగితే తెలియదంటాడు నౌకరు. అతన్ని కోప్పడతాడు సమీర్. ఇది తరతరాలుగా వస్తున్న వ్యవహారం అని చెప్తాడు నౌకరు. భయపడక్కరలేదు, ఆరోగ్యం కోసమే అంటాడు. అప్పుడు సమీర్‍కి అర్థమవుతుంది అవెందుకో. వంశ ప్రతిష్ఠ కోసం తప్పదని అంటాడా నౌకరు. బాల్కనీ చివరకు సమీర్‍ని తీసుకువెళ్ళి అక్కడున్న కుక్కలని చూపిస్తాడు. క ట్రెయినర్ వాటి వెనుక భాగంలో ఇంజెక్షన్స్ ఇవ్వడం చూస్తాడు సమీర్. ఆ వ్యవహారం లోని రహస్యమేమిటో నౌకరు సమీర్‍కి వివరిస్తాడు. ఇక చదవండి.]

[dropcap]స[/dropcap]మీర్ కారు నడుపుతూనే చెబుతున్నాడు. “నేనెక్కడి నుంచి వచ్చాను, ఎవరిని? నా నేపథ్యం ఇంత దారుణమా? నేను మనిషిలా ఎందుకు బ్రతకకూడదు? ఇదేనా నా చరిత్ర? ఈ ప్రశ్నలు నన్ను పిచ్చివాడిని చేసాయి.”

“మనిషి మనిషిని కొట్టటం, చంపటం, భూమిని ఆక్రమించటం, ఒక వంశాన్ని నాశనం చేయటం, ఇంతకు మించి మరేదీ ఏ చరిత్రలోనూ నేను చూడలేదు సమీర్ గారూ. మీలో భావుకత ఎక్కువ పాళ్ళున్నట్లుంది. పైగా కళాకారులు. కాకపోతే మీకొక చరిత్ర ఉండడం విశేషం.”

“నాకు అంతుపట్టనిది మా అమ్మ గురించి. ఆవిడ ఎందుకు నివారించలేదు? ప్రశ్నించలేదు?”

“ఇంత దారుణమైన వ్యవస్థలో అవస్థ పడటం తప్ప ఆవిడ ఏమీ చెయ్యలేదు. వెండితెర మీద బొమ్మ చూపించే ప్రతి వాడూ కాకపోయినా చాలామంది చేసేది వ్యభిచారమే.”

కారు ఆపాడు. ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు.

“నేను చెయ్యలేదు సార్! చెయ్యను కూడా!”

“సారీ! అలా నేననలేదు”

“మీరన్నారని కాదు. డబ్బున్న చోట ఎక్కడా నీతి ఉండదా? నీతిని ప్రోత్సహిస్తే డబ్బు మిగలదా? మరి ఏది ధర్మం? ఏది న్యాయం?”

“మనం ఇప్పుడెక్కడికి వెళుతున్నాం?”

నవ్వాడు సమీర్.

“ధర్మం, న్యాయం అనే వాటిని వదిలిపెట్టి మరెక్కడికో.. ఆశ్చర్యపడకండి!”

ఎన్నో ఒంపులు తిరుగుతూ ఆ రోడ్డు అలా మా ఇద్దరినీ అలరిస్తోంది. ఒక మలుపు దగ్గర ప్రక్కకు తీసుకుని ఆపేసాడు సమీర్.  ఇద్దరం దిగాం. చుట్టూతా అన్నీ చెట్లే. రోడ్డుకు ఆనుకునున్న గట్టు మీదకి ఎక్కాడు.

“ఇలా రండి” అన్నాడు.

ఆయన ప్రక్కనే నిలబడ్డాను. క్రింద ఉన్న లోయ లోకి వేలు చూపించాడు. అక్కడ కొన్ని పెంకుటిళ్ళున్నాయి.

“ఏదో చిన్న పల్లెటూరులా ఉంది”

“అవును. అది వీరమణి ఊరు.”

“వీరమణి? ఆయనెవరు?”

“సుందరం గారూ! ఈ ప్రాంతం వీరులకి పెట్టిన పేరు. ఒక చోట గుమిగూడిన గోవా ప్రజానీకంలో అమితమైన శౌర్య పరాక్రమాలుండేవి. ఆశ్చర్యంగా అనిపించేవి కొన్ని చెబుతాను. ఇటువంటి చిన్న చిన్న గూడెంలలో ఎన్నో దురాక్రమణలు జరిగినా, వీళ్లు ఎదిరించిన తీరుతెన్నులు సామాన్యమైనవి కాదు. ఎందరో రాజులు ఈ విషయంలో మట్టికరిచారు.”

“ఈ వీరమణి కూడా అటువంటి వాడేనా?”

“వీరమణి అనేది కేవలం ఒక పేరు మాత్రమే కాదు. అదొక వంశం. యుద్ధంలో ఆరితేరినవారు. కదంబ రాజులకు చాలా సార్లు సహాయపడ్డారు. ఇప్పుడు చాలా తక్కువ మంది మిగిలున్నారు.”

“ఆ ప్రాంతం చూడవచ్చా?”

“చాలా తేలికైన మార్గం ఉంది.”

“చెప్పండి”

“కాలు జారినట్లు అనుకుని క్రింద పడిపోవడమే! అక్కడికి వెళ్ళిపోతాం. మనకేమీ కాదు”

“ముందర ఒకళ్ళు వెళదాం..”

సమీర్ అక్కర్లేదంటూ సైగ చేసి కారు దగ్గరకు తీసుకుని వచ్చాడు. కారు కదిలింది.

“ఏం చూస్తున్నారు?” అడిగాడు.

“ఇన్ని చెట్ల మధ్యలో ఏదో ఒక చెట్టు ఎందుకలా ఎండిపోయి ఏ ఆకూ లేకుండా ఉంటుందీ అని?”

“తెలియని వాళ్ళు ఏదో దయ్యం ఉంటుందా చెట్టు మీద అనుకుంటారు”

“అలాంటివే విన్నాను నేను”

“అలాంటిదేమీ కాదు. పిడుగు పడ్డప్పుడు అలా జరుగుతుంది. అది వింత కాదు. కాకపోతే నేనూ అలాంటి వాడినే!”

“అంటే వింతైన వారా? లేక పిడుగుపడ్డవారా?”

“ఇంతమందిలో, ఇంత చక్కని పకృతితో, ఇంత డబ్బు, పరపతి ఉన్న కుటుంబంలో జన్మించి, అనవసరంగా అలా ఓ ఎండిపోయిన వృక్షంలా మిగిలిపోయాను.”

“మీరు గొప్ప హీరో. ఆ సంగతి మర్చిపోకండి”

“నేను హీరోనే. తెర మీదనే కాదు. నిజ జీవితంలో కూడా. అంత పిడుగు పడ్డా కూడా చెట్టు ఎండిపోయింది కానీ నిటారుగా నిలబడే ఉంది!”

“ఆలోచించాలి”

“అంతే కాదు. మీరు కూడా అలాంటి వాటినే ఎక్కువగా చూస్తున్నారు”

“విలక్షణంగా ఉంది కాబట్టి”

“సమాధానాలు దొరకని ప్రశ్నలు అడిగే ప్రతి వాడూ హీరో కాదు. జరుగుతూ, దిగజారుతూ, జారిపోతున్న వ్యవస్థకు చెప్పు దెబ్బ నా మాటలో ఉంటుంది అని చెప్పేవాడు హీరో.”

“కరెక్ట్”

కారు ఆ గూడెంలోకి వెళ్ళింది. ఇద్దరం లోపలికి నడవటం ప్రారంభించాం. సమీర్ సిగరెట్ ముట్టించి అక్కడ గుబురుగా పెరిగిన తోట దగ్గర ఆగాడు. ఎవరో ఒకళ్లిద్దరు వచ్చి నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోయారు.

“ఈ తోట ఒకప్పుడు ఒక అద్భుతమైన వ్యాయామశాల..” చెప్పాడు. “..ఇక్కడ ఎన్నో కళలను నేర్పేవారు. వీళ్ళ వ్యాయామం సామాన్యంగా ఉండేది కాదు”

జాగ్రత్తగా చూస్తే ఇప్పటికీ ఆ గూడెంలోని మనుషులు నిజంగానే వస్తాదుల్లా ఉన్నారు.

“ఈ ప్రాంతం నుంచే నేను ఉద్యమాన్ని ప్రారంభించాను..” చెప్పాడు. “..మైనింగ్ వ్యవస్థకు విరుద్ధంగా ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసాను. వీళ్లందరూ తమ పేరు చివర వీరమణి అని పెట్టుకుంటారు”

ఆ సిగరెట్ పొగ లోంచి ఆయన స్వగతం తెరలు తెరలుగా తనను తాను ఆవిష్కరించుకుంటోంది..

***

ఇంటి బైట ఎంతో సందడిగా ఉంది. బాల్కనీలోకి సమీర్ తండ్రి వచ్చి నిలబడ్డాడు.

“ఎవరు వీళ్ళు?” అడిగాడు.

గేటు దగ్గిర ఇవతల నిలబడ్డ వాళ్ళు ఇటు తిరిగారు.

గేటు అవతల ఉన్నవాళ్ళు పెడుతున్న కేకలకు ఆకాశం బ్రద్దలవుతోంది.

“రాణోలు సార్” గట్టిగా అరిచారు.

ఈయన కాళ్ళ క్రింద నుండి ఏదో పాము కదిలినట్లయి మనిషి కొద్దిగా కదిలాడు.

“ఏం కావాలి? డబ్బా? మందా?”

“అమ్మాయిలు”

“ఏంటి? మళ్లీ చెప్పు”

“వాళ్ళ గూడెం లోని అమ్మాయిలు”

కొద్దిసేపు నిశ్శబ్దం కమ్ముకుంది. ఆయన లోపలికి వచ్చాడు. ఫోన్ తిప్పాడు.

“హలో”

అటువైపు ఎవరో ఎత్తారు.

“యస్”

“కోపల్‍ను మాట్లాడుతున్నాను.

“తెలుసు”

“ఏంటి?”

“చాలా సార్లు చెప్పాను. రాణోల గూడెం లోని అమ్మాయిల జోలికి వెళ్లవద్దని. మీరు వినలేదు”

“ఒట్టేసి చెబుతున్నాను. వాళ్ల జోలికి వెళ్లలేదు”

“నేను జడ్జిను కాను. ఈ రోజు మీ ఇంటి ముందున్న వాళ్లే న్యాయనిర్ణేతలు.”

“మీరు అలా అనేస్తే ఎలా?”

“వాళ్లకి వాళ్ల అమ్మాయిలను అప్పజెప్పేయండి.”

“సార్..” ఈయనకి చెమట్లు పడుతున్నాయి.

ఇదెక్కడి గోల? లోలోపల అనుకున్నాడు. వేరే అమ్మాయిలను అప్పజెప్పి ఇదిగో మీ వాళ్లే అనటానికి ఇవి పనసకాయలు కావు!

“సార్”

“నేను చెప్పినట్లు చెయ్యండి”

“ఇక్కడ ఎవరూ లేరంటే వినరేం?”

“మీరు ఏదైనా చెయ్యండి. నేనేమీ చెయ్యలేను”

“పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది”

“సార్, ఏ వ్యవస్థా ఎవరి చేతిలో ఉండదు.”

“మై గాడ్! కలిసి ఎన్ని పనులు చెయ్యలేదు మనం?”

“ఈ పని ఒంటరిగా చెయ్యండి”

“థియోడోర్ గారూ! ఇది అన్యాయం. మీరు చెయ్యగలిగి కూడా ఏమీ చెయ్యటం లేదు”

“ఆలోచించండి. ప్రాణాలకు తెగించిన వారు ముందరికి వచ్చినప్పుడు ప్రాణాలను ఇచ్చేందుకు సిద్ధమైన వారు మనకు ముందుకు రావాలి. ఉన్నారా వాళ్లు.. మీరనుకునే వ్యవస్థలో?”

ఫోన్ పెట్టేసాడు. మెట్లు దిగి హాల్లోకి వచ్చాడు.

“సంఘర్ష్ కరప్”, అరుపులు వినిపిస్తున్నాయి. కొద్ది దూరంలో ఇంకా ఎక్కువ జనం పోగవుతున్నారు. గేట్ను తోసేస్తున్నారు. కుక్కలరుస్తున్నాయి.

కోపల్ గేటు దగ్గరకు వచ్చాడు. జాగ్రత్తగా అందరినీ శాంతపరిచాడు. గేటు అవతల ఉన్న రాణోల నాయకుడు ఆకారంలో భీకరంగా ఉన్నాడు. అతను ముందర ఎన్ని గన్నులు పెట్టినా దండగ అని తెలిసిపోతోంది. కళ్ళల్లో రక్తపు చారలు స్పష్టంగా ఉన్నాయి.

“గేటు తెరు”, గర్జించాడు.

“ఇక్కడ అమ్మాయిలెవరూ లేరు”

“కుక్కా! గేటు తెరు”

“మీరు పొరపాటు పడుతున్నారు”

ఇటు చూస్తూనే వెనుకకు చెయ్యి పోనిచ్చి ఎవరో అందిస్తే ఒక గట్టి కర్రను చేతిలోకి తీసుకున్నాడు.

కోపల్ వెనక్కి నాలుగడుగులు వేసాడు.

ఆ మనిషి ఆ కర్రను గట్టిగా నేల మీద నిలిపాడు.

“సంఘర్ష్ కరప్”, గట్టిగా అరిచాడు. అదే మాట అందరూ ప్రతిధ్వనించారు. ఆ కర్ర ఏ చెట్టు నుంచి తయారైందో తెలియదు. తన కుడి చేత్తో అదిమిపెట్టి కోపల్‍ను అదే పనిగా చూస్తున్నాడు. చూస్తుండగానే ఆ కర్ర మీదకి ఇద్దరు మనుషులు నిచ్చెన మీదకి ఎక్కినట్లు ఎక్కారు. ఇతని చేతిలోని కర్ర కొద్దిగా కూడా కదలలేదు. ఆ ఇద్దరూ జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్లు ఆ కర్ర అంచు దాకా పాకారు.

“సంఘర్ష్ కరప్”, అరిచారు. ఒక్క దూకు దూకి గేటు అవతలికి వెళ్లిపోయారు.

“రాణో జా జయ్ జయ్..” జనం అరుస్తున్నారు. కోపల్ వెనక్కి తిరిగి చూసేలోపల ఆయన ఇంటి ముఖద్వారం ఎవరో మూసేసారు..

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here